ఇదీ, మన సంస్కారం!
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:42 AM
‘సరస్వతీ, మీరు అక్కడే ఉన్నారా, మా అక్కవాళ్ళు వస్తున్నారు’. మిత్రుడు ఒకాయన నాకు ఫోన్ చేసారు. అయన అడిగింది మా చేనేత సంత గురించి. కొన్నిరోజుల క్రితం చెప్పారు...
‘సరస్వతీ, మీరు అక్కడే ఉన్నారా, మా అక్కవాళ్ళు వస్తున్నారు’. మిత్రుడు ఒకాయన నాకు ఫోన్ చేసారు. అయన అడిగింది మా చేనేత సంత గురించి. కొన్నిరోజుల క్రితం చెప్పారు, ‘మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లికి పెట్టుడు చీరలు కావాలిట, చేనేత తీస్కోండిని చెప్పాను, మీ నెంబర్ ఇస్తాను’ అన్నారు. సరే అని ఆవిడతో మాట్లాడాను. ‘మాకు 2000 రూపాయలలో పట్టు చీర కావాలి. గద్వాల్ వెళ్దామనుకుంటున్నాం’ అన్నారావిడ. రెండువేలలో మీకు గద్వాల్ పట్టు చీరలు దొరకవు, మీ ప్రయాణం వృధా అవుతుంది. 2500–-3000 పెడితే మంగళగిరిలో ఉంటాయి, వేరే రకాలు కాటన్లో మంచివి ఉంటాయి 1000–-2000 మధ్యలో. మీరు మా చేనేత సంతకి రండి అన్ని రకాలూ చూడవచ్చు’ అన్నాను. అలా ఆవిడ, వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చారు. కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంక బేరాలు మొదలు. ‘ఇక్కడ తగ్గింపు ఉండదండి. అందరూ సరైన ధరలే ఇస్తారు. ఇవే బయట ప్రముఖ షాపుల్లో, ఆన్‌లైన్‌లో కనీసం డబల్ రేట్ చేసి అమ్ముతారు. ఇక్కడ మీరు డిస్కౌంట్లు అడిగితే వాళ్లకి గిట్టుబాటు అవ్వదు’ చెప్పాను నేను.
యాభై చీరలు కావాలి అని వేంకటగిరి వీవర్‌తో చెప్పారు. అసలే కొవిడ్ తర్వాత అమ్మకాలు తగ్గినాయి, ఇప్పుడు ఎలక్షన్ దెబ్బతో వచ్చే వినియోగదారులు కూడా రావటం లేదు, ఒకేమారు యాభై చీరలు అమ్ముడవుతాయి కదా అని ఆ వీవర్ 2800 రూపాయల చీరకి మూడువందలు తగ్గిస్తానని అన్నాడు. ఆవిడ ఒప్పుకోలేదు. ఇంకో రెండు వందలు తగ్గించే దాకా ఊరుకోలేదు, వదల్లేదు. తీరా బేరం కుదిరాక యాభై చీరలు వద్దు, ఇరవై చాలన్నారట. ‘మరి అప్పుడైనా ఆ ధరకి ఇయ్యటం కుదరదు అనాల్సింది కదా!’ అన్నాను నేను. ‘ఇంక మనం ధర మాట్లాడాక, మళ్ళీ ఎట్లా కాదనటం’ అన్నాడు నాగేంద్ర. మిగతా స్టాల్స్ వద్దా ఇంతే. ‘మాకు గద్వాల్‌లో ఒక షాప్‌లో పదిహేనువందలకే ఇచ్చారు, పోయినసారి తీస్కున్నాం’ అన్నారావిడ. ‘అవి ఇమిటేషన్లు! మిల్లుల్లో, పవర్ లూంలో చేసినవి. చేనేత డిజైన్లు కాపీకొట్టి మెషిన్లతో తయారు చేసి, చేనేత అని అమ్మేస్తున్నారు. అది చూసి, అసలు చేనేత తయారీదారుల వద్దకి వచ్చి కొనుగోలుదారులు బేరాలు ఆడతారు, కాదంటే కొనటం లేదు. ఇదే చేనేతకి తగిలిన పెద్దదెబ్బ. ఒక్క పవర్ లూమ్‌వల్ల కనీసం 50 మందికి ఉపాధి పోతుంది. జెట్ లూమ్‌తో ఏకంగా వందలమంది రోడ్డున పడుతున్నారు. కొత్తకోటలో అయితే మొత్తం మగ్గాలు మూతపడ్డాయి. అక్కడి చేనేత కళాకారులు ధాబాల్లో వెయిటర్లుగా పని చేస్తున్నారు. మీరు చేనేత కొంటే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి, వాళ్ళని బతికించిన పుణ్యం కూడా దక్కుతుంది మీకు’ అని కాస్తంత వివరంగానే నచ్చచెప్పాను నేను. అయినా సరే, వాళ్ళ పట్టు వాళ్ళదే.
‘మీకు అందరూ ప్రొడక్షన్ కాస్ట్‌కే ఇచ్చారు’ అన్నాను. ‘గుడ్’ అన్నారావిడ. ‘గుడ్ కాదండి, చేనేత అవసానదశలో ఉంది. ప్రభుత్వాలు కూడా పవర్ లూమ్‌ని ప్రోత్సహిస్తున్నాయి. పాలిస్టర్ బట్టలు కొని మనం సూరత్ మిల్లు ఓనర్లని, రిలయన్స్ అంబానీని బతికిస్తున్నాం. పాలిస్టర్ బట్టలతో పర్యావరణం నాశనం అవుతోంది, మన ఆరోగ్యం దెబ్బతింటోంది. అది మీరు గ్రహించి, చేనేత వాళ్ళని ప్రోత్సహించాలి’ అన్నాను. అయినా రాయి కదా ఎట్లా కరుగుతుంది? మాటల్లో తెలిసింది ఆవిడ తాసిల్దార్‌గా చేసి రిటైర్ అయ్యారట. అబ్బాయి పెళ్లి అమెరికాలో చేశారు. ఇక్కడ రిసెప్షన్. వచ్చిన చుట్టాలకి పెట్టటానికి ఈ చీరలు. ‘మా వాళ్ళ దగ్గిర ఇన్ని బేరాలు ఆడుతున్నారు, డబ్బులు లేవని గవర్నమెంట్ మీ జీతాలో, పెన్షన్లో తగ్గిస్తే, మీరు ఒప్పుకునే వారా?’ అని గట్టిగా అడగాలనిపించింది కానీ అడగలేకపోయాను, తెలిసిన వాళ్ళ చుట్టాలు కావడంతో. పవర్ లూమ్ వల్ల జరుగుతున్న నష్టం గురించి చెప్తున్నప్పుడు ఆవిడ భర్త ఓ మాటన్నారు. మెషిన్‌తో తయారయినవి అయితే మాత్రం తక్కువ ధరకి వస్తున్నప్పుడు తీసుకుంటే ఏమవుతుందని. ఏమీ కాదు, కొన్ని లక్షల కుటుంబాల బతుకులు బండలవుతాయి అంతే. వాళ్ళ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అతని ఉద్యోగం పొతే, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి?
మా సంతలో 74 ఏళ్ల బాలమ్మ తను చేసిన తాటాకు బుట్టలు అమ్ముతారు. ఆవిడ జీవనాధారం అదే. ఒకావిడ వచ్చి 600 రూపాయల బుట్ట 500కి ఇయ్యమని అడిగిందిట. ఇవ్వలేను అన్నారు బాలమ్మ. అయినా, వాదించి, విసిగించి, ఆఖరికి మూడు బుట్టలకి 1500 చేతిలో పెట్టి తీసుకొని పోయిందామె. ‘మీకు గిట్టుబాటు కాదని గట్టిగా చెప్పాల్సింది’ అన్నాను నేను. ‘చెప్పాను మేడం, అయినా వినలేదు, పైగా వాదులాట పెట్టుకుంది. అందరూ నా వైపే చూస్తుండటంతో ఇబ్బందిగా అనిపించింది. చేసేది లేక ఇచ్చేశాను’ అన్నారు బాలమ్మ. ఆ వయసులో, తన చేతి కష్టంతో బతుకుతున్న ఒక సాటి మహిళని అట్లా మోసం చెయ్యాలని ఆమెకి ఎట్లా అనిపించిందో మరి. ఫెమినిస్ట్ మిత్రులు ఏమంటారో!
కొంత సమయం తర్వాత ఇంకో ఆసామి ఆదివాసీల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ స్టాల్‌కి వచ్చి, వాళ్లు తయారు చేసిన హెర్బల్ ఆయిల్ ఎంత అని అడిగాడు. ‘140’ అన్నాడు అమ్మేటాయన. ‘120కి ఇస్తావా’ అని అడుగుతున్నాడు ఆ ఆసామి. అది శ్రీశైలం అడవుల్లోనుంచి మూలికలు తెచ్చి, శుద్ధి చేసి తయారు చేసిన నూనె. సీసా ఖరీదు, లేబిల్ ఖరీదు, హైదరాబాద్‌కు బస్సు చార్జీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకుని, కాస్తంత లాభం చేసుకొని ఇళ్ళు గడపాలి. చేనేత బతుకులూ అంతే. నూలు ధర ఏటా పెరుగుతోంది, రంగుల ఖర్చు, రవాణా చార్జీలూ పెరుగుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు జీఎస్టీ కూడా కట్టాలి. కాపాడాల్సిన ప్రభుత్వాలు పవర్ లూంని, పోలీ వస్త్రాలని ప్రోత్సహిస్తున్నాయి. వచ్చిన పనిని వదులుకోలేక, ఒకరి వద్ద దేహి అని చేయిచాచలేక, కేవలం వినియోగదారుల సహకారంతో మాత్రమే ఇంకా కుంటి నడక నడుస్తూ, మినుకు, మినుకు మంటూ బతుకుతోంది చేనేత. ప్రపంచంలోనే అతి పురాతనమైన వస్త్ర సంస్కృతి మనది. ఎంత గొప్ప సంస్కృతో అని గుండెలు బాదుకునే మనం ఆ సంస్కృతిని నిర్మించిన చేతి వృత్తుల వారిని చూడగానే ఎందుకో చులకన భావం. షాపింగ్ మాల్స్‌లో గుర్తుకురాని బేరాలూ ధైర్యాలూ వీళ్ళని చూడగానే వస్తాయి. ఎందుకంటే, సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేని నీచ సంస్కృతి మనది.
సరస్వతి కవుల