ఈ చేతనావర్త కవి ఓ మానవతా మూర్తి

ABN , First Publish Date - 2023-05-22T04:32:55+05:30 IST

తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా మొలిచిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి సుప్రసిద్ధులు. మృదుస్వభావి, స్నేహశీలి, అంతకు మించి గొప్ప మానవతావాది..

ఈ చేతనావర్త కవి ఓ మానవతా మూర్తి

తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా మొలిచిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి సుప్రసిద్ధులు. మృదుస్వభావి, స్నేహశీలి, అంతకు మించి గొప్ప మానవతావాది. తన ఇల్లునే ఓ సాహితి వేదికగా మలిచి కాళోజీ నేతృత్వంలో నడిచిన ‘మిత్ర మండలి’ లాంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలకు ఊపిరి పోసినవాడు. కాళోజీ, అంపశయ్య, వరవరరావు, బిరుదురాజు రామరాజు, పేర్వారం జగన్నాథం, నాగిళ్ళ రామశాస్త్రి, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, ప్రొఫెసర్‌ లక్ష్మణ మూర్తి, పానుగంటి విశ్వనాథం, గంటా రామిరెడ్డి మొదలైన వారి సన్నిహితుడు, వరంగల్లు జిల్లా సాహితీ మిత్రులందరికీ మిత్రుడు. సాహిత్య కారులు ఆయనను వే.న. రెడ్డిగా పిలిచేవారు. స్నేహితులు వేనన్న, నరసన్న అని పిలిచేవారు.

వేణు ముద్దుల నరసింహారెడ్డి జనగాం జిల్లా, చిల్పూర్‌ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో 9 జూన్‌ 1939లో వేణు ముద్దల వెంకటరెడ్డి, మధురమ్మలకు జన్మించారు. ఈయన పుట్టిన పద్దెనిమిదవ రోజుకే తల్లి బాలింత రోగంతో మరణించింది. తల్లి ప్రేమకు దూరమైన వే.న.రెడ్డిని పెద్దమ్మ (మధురమ్మ అక్క) మల్లారం తీసుకెళ్లి తన పాలు ఇచ్చి సాకింది. పాలు మరిచిన నరసింహారెడ్డిని మేనమామలు ఉప్పరపల్లి తీసుకెళ్లారు. పెరిగి పెద్దవాడు అవుతున్న వే.న. రెడ్డిని నానమ్మ తాతయ్యలు తమతో తీసుకువెళ్లి హనుమ కొండ, నక్కల గుట్టలో, ఇట్లో ఉంచి చదివించారు. వే.న.రెడ్డి, కుమారుపల్లి, లష్కర్‌ బజార్లలోని మర్కజి స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. డిగ్రీ హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో, ఎం.ఏ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1963లో సుధేష్ణతో పెండ్లి జరిగింది. ఇద్దరు కూతుర్లు మాధవి, రాధికలు జన్మించారు. 1962లో నిజాం కళాశాలలో ఒక సంవత్సరం లెక్చరరుగా పని చేసిన తర్వాత 1963 నుండి 1973 వరకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ హన్మకొండలో రూ.250 జీతానికి అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టాడు. జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. కుటుంబ భారమంతా తానే భుజాన వేసుకు న్నాడు. అంతేకాదు అనేకమంది మిత్రులకు, విద్యార్థులకు ఫీజులు కట్టి మధ్యలో చదువు ఆగిపోకుండా చేశాడు. ఆయన సహాయం పొందని మిత్రుడు లేడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.

కుటుంబ బాధ్యతలు ఒకవైపు, సాహిత్య బాధ్యతలు మరోవైపు. నిత్యం ఆయన ఇల్లు ఏదో ఒక సాహిత్య కార్యక్రమానికి వేదిక అయ్యేది. చదువు నిమిత్తం హన్మకొండకు వచ్చే వారికి ఆశ్రయమిచ్చేది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం ఓ సత్రాన్ని తలపించేది. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఖండ వల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘పాలకురికి సోమనాథుని కృతులు- పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వందలాది తాళపత్ర గ్రంథాలను, ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెచ్చారు. ఆరోగ్యం సహకరించకున్నా వాటిని నిశితంగా పరిశీలించి యూనివర్సిటీకి 2200 పేజీల చేతి ప్రతుల సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. కాని ఏ కారణం చేతనో ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాను 1974లో మరణానంతరం ప్రకటించింది.

వే.న.రెడ్డి తన 34 ఏండ్ల వయస్సులోనే గుండె సంబంధిత సమస్యతో జనవరి 27, 1973నాడు ఈ లోకాన్ని వీడారు. ఆయన మరణవార్త మిత్రులకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కాళోజీ, వరవరరావు లాంటి మిత్రులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కాళోజీ వే.న.రెడ్డి మరణం తట్టుకోలేక తన బాధనంతా ‘కరిగే వెన్నముద్ద’ పేరుతో ఓ కవితగా రాశారు:

‘‘తాపసియైు కైతగమారిన రసికుడు

దారిని తీర్చుచు నడిచిన పథకుడు

వ్యక్తిత్వం కోల్పోని సాంఘికుడు

ఆయాసము పడనట్టి సాధకుడు

మిత్రుడు లేడు మండలి మిగిలెను

మిగిలిరి అందరు వగచుట మిగిలెను

స్నేహము ముగిసెను ప్రమిదలు మిగిలెను

నేస్తము లేడను దుఃఖము మిగిలెను’’

- ఇది కాళోజీ ‘నా గొడవ’ కవితా సంకలనంలో ముద్రితమైంది. వే.న.రెడ్డి ‘సవిత’ పేరుతో ఓ పత్రిక నడపాలని రిజిస్టర్‌ చేశాడు. కాని ఆ కోరికనెరవేరకుండానే వెళ్లిపోయాడు. మిత్రుడైన వరవరరావు ‘సృజన’ పత్రికకు మాత్రం వే.న. రెడ్డినే మొదట అన్ని తానై ప్రచురించాడు.

ప్రగతివాద కవి మార్క్సిస్టు కానక్కర లేదని, అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు, ఉత్తమ కవిత్వానికి ప్రేరణ అని నమ్మిన చేతనావర్త కవులు వరంగల్లు వేదికగా 1967లో ‘చేతనా వర్తం’ పేరుతో ఓ కవితా సంకలనం తెచ్చారు. ఈ సంకలనంలో వేణుముద్దల నరసింహారెడ్డి సమకాలీన సమాజంలోని లోపాలను కొన్నింటిని వ్యంగ్యంగా కవిత్వీకరించాడు.

‘‘నేస్తం:

ఇక్కడంతా క్షామం

నాయకులు నానా గడ్డి కరుస్తున్నారు

పశువులు మేతలేక చస్తున్నవి.

వాళ్లు మా నేతలు

వర్తమానం తీరు తెలిపే గీతలు

వాళ్లు సందేహ దేహులు మందేహులు

అవి ఎంగిలి ఊహలు పులుముకున్న మొహాలు’’

- అంటూ ఆనాటి సంఘపు అవినీతి వ్రణాలకు ఒక్కొక్కటిగా శస్త్ర చికిత్స చేశాడు.

‘‘గతం నాస్తి కాదు నేస్తం

అనుభవాల ఆస్తి’’ అంటూ గతం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలియజేస్తాడు.

ఆయన మరణానంతరం తన కవితలన్ని పోగేసి మొత్తంగా ‘సవిత’ పేరుతో సాందీపని పబ్లికేషన్స్‌ సంస్థ ప్రచురించింది. వే.న.రెడ్డి సిద్ధాంత గ్రంథం ‘పాలకురికి సోమనాథుని కృతులు-పరిశీలన’, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్లు వారు ముద్రించారు.

జన ధర్మ పత్రికలో వే.న.రెడ్డి కథ ‘అంగుళి మాల కథ’ ప్రచు రించబడింది. అంగుళి మాల అనేవాడు మనుషులను దోచుకొని, చంపి, వారి చేతివేళ్లు నరికి మెడలో దండగా వేసుకునే వాడు. ఆ అంగుళి మాల, బుద్ధుడి బోధనలను విని సాధుస్వభావిగా మారిన వృత్తాంతం ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. అదే పేరుతో గేయం కూడా రాసినట్లు తెలియ వస్తున్నది.

1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగిన సందర్భంలో వే.న. రెడ్డి సంపాదకత్వంలో... దేశ కీర్తిని కొనియాడుతూ ‘సమర గీత’ కవితా సంకలనం వెలువ రించారు. 1966తో పాకిస్థాన్‌ యుద్ధం వచ్చినపుడు ‘సమర భారతి’ అనే మరో కవితా సంకలనానికి సంకలన కర్తగా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని నింపుతూ, వే.న.రెడ్డి ఆధ్వర్యంలో మూడవ కవితా సంకలనం ‘సమర పథే బంగ్లా’ వెలువడింది.

‘ప్రజాస్వామ్య శబరి’ కర్త అనుముల కృష్ణమూర్తి గురించి కొన్ని కంద పద్యాలు కూడ రాసినట్లుగా వే.న. రెడ్డి మిత్రుల ద్వారా తెలుస్తున్నది.

‘‘ఇంటినే దిద్దుకోలేనివాడు

ఇంటర్నేషనలిష్టు కాలేడు’’

‘‘పచ్చని, ఎఱ్ఱని కామెర్ల వాడు

ప్రజా హృదయ మెరుగనివాడు’’

‘‘ఆత్మను అమ్ముకున్న వాడు

అమ్మను అమ్ముకున్నట్టే’’ లాంటి వే.న.రెడ్డి మాటలు ఆదర్శాలై గోడలకు నినాదాలై నిలిచాయి.

‘‘ఎప్పుడూ చాలని దుప్పటే కప్పుకుంటారు

కలల్ని తింటారు కష్టాల్ని కంటారు

వాళ్లు ఫైళ్లకు కట్టిన ప్రాణంలేని పల్చటి తాళ్లు

కోరలూ కొండ్లూ పెరికేసిన పాములూ తేళ్లు

జరుగుబాటు గాత్రం తప్ప

తిరుగుబాటు సూత్రం తెలియనివారు

వాళ్లు గవర్నమెంటు ఉద్యోగులు యోగులు

బానిసలుగా ఉంటామని

అగ్రిమెంట్‌ వ్రాసి ఇంక్రిమెంటుకు తపస్సు చేస్తున్నారు’’ - అంటూ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిని తెలియజేశారు.

వే.న.రెడ్డి తన సిద్ధాంత గ్రంథంలో రూఢి పరిచిన విషయాల ఆధారంగానే సోమన తెలంగాణవాడన్న వాదన నిలబడింది. ఆయన సాహిత్య సేవకు గాను, మరణానంతరం ‘సోమనాథ కళా పీఠం’ పాలకుర్తివారు 1998లో భార్య సుధేష్ణకు అవార్డు నిచ్చి సత్కరించారు. ఆయన గుర్తుగా నాగిళ్ళ రామశాస్త్రి, అంప శయ్య నవీన్‌ మొదలైన ఆయన మిత్రులు కాకతీయ విశ్వవిద్యా లయంలో ఎమ్మే తెలుగు చదివే విద్యార్థులకు ఆధునిక కవిత్వంలో (ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి) వే.న.రెడ్డి పేరుతో ప్రతి సంవత్సరం గోల్డ్‌ మెడల్‌ ప్రదానం చేస్తున్నారు. సాహితి కృషీవలుడైన ఈ వే.న. రెడ్డి సాహిత్యంపై మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

జీడి రమేష్‌

96527 56516

Updated Date - 2023-05-22T04:40:30+05:30 IST