‘‘ఒంటరి మహిళ జీవన పోరాటం ఇతరులకు సులభంగా అర్థం కాదు’’
ABN , First Publish Date - 2023-06-26T01:16:10+05:30 IST
సీనియర్ రచయిత్రి భండారు విజయది విప్లవోద్యమ నేపథ్యం. సాహిత్య విమర్శకురాలు పి. జ్యోతిది మానవవాద దృక్పథం. భిన్న రాజకీయ భావజాలాలు కలిగిన వీరిద్దరిని స్త్రీవాదం కలిపింది...
భండారు విజయ, పి. జ్యోతి : పలకరింపు
సీనియర్ రచయిత్రి భండారు విజయది విప్లవోద్యమ నేపథ్యం. సాహిత్య విమర్శకురాలు పి. జ్యోతిది మానవవాద దృక్పథం. భిన్న రాజకీయ భావజాలాలు కలిగిన వీరిద్దరిని స్త్రీవాదం కలిపింది. అదే ఒంటరి మహిళల జీవనగాథలతో ‘స్వయం సిద్ధ’ కథాసంకలనాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది. ఒంటరి మహిళల జీవన పోరాటాన్ని ఇదివరకు చాలామంది రచయితలు అక్షరబద్ధం చేసినా, ఓ సంకలనంగా తీసుకురావడం ఇదే మొదలు అంటూ సి. మృణాళిని లాంటి సాహితీ విమర్శకులు ఈ ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ నేపథ్యంలో ‘స్వయం సిద్ధ’ సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతిలతో సంభాషణ:
మీ ఇద్దరి సంపాదకత్వంలో వచ్చిన ‘స్వయం సిద్ధ’ కథా సంకలనం గురించి చెప్పండి?
ఒంటరి మహిళల జీవన గాథలను విభిన్న కోణాలలో ఆవిష్కరించిన నలభై కథల సమాహారమే ‘స్వయం సిద్ధ’. స్త్రీ అనుభవిస్తున్న లేదా అనుభవించిన వేదనను స్త్రీనే ఆవిష్కరించగలదు కనుక, పూర్తిగా రచయిత్రులతోనే ఈ సంకలనం తీసుకొచ్చాం. అందులోనూ మొదటిసారి కథ రాసినవాళ్లే ఎక్కువ. కొన్ని కథల్లో శైలి పరంగా తడబాటు ఉన్నా, ప్రతి కథలో నిజాయితీ కనిపిస్తుంది. కల్పితం పాళ్లు చాలా తక్కువ. పైగా చాలామంది వాళ్ల కథలను వాళ్లే రాసుకున్నారు. అందుకు బోలెడంత ధైర్యం కావాలి కదా! ఇందులోని కథలన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉండబట్టే చాలామంది మనసును తాకాయి. సాధారణంగా ఒంటరి స్త్రీలను బాధితురాలిగానో, లేదంటే నిస్సహాయురాలిగానో, తెలివి హీనురాలిగానో, ఆధిపత్య ధోరణి అవలంబిస్తున్న విలన్‌గానో పితృస్వామిక సమాజం చిత్రీకరిస్తుంది. ఈ ఆధిపత్య భావజాలాన్ని బద్ధలు కొట్టడమే కాదు, అంతకు మించి ఒంటరి మహిళలను ఆత్మగౌరవంతో జీవించే వ్యక్తులుగా ఈ సమాజం ఎందుకు చూడదు అనే ప్రశ్నను ‘స్వయం సిద్ధ’ పాఠకుల ముందు ఉంచుతుంది. తద్వారా ఆలోచింపచేస్తుంది.
ఈ సంకలనం తీసుకురావడానికి ప్రధాన ప్రేరణ?
ఒంటరిగా జీవించాలనుకున్న ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లెన్నో! ఆమె జీవన పోరాటం ఇతరులకు సులభంగా అర్థం కాదు. సమాజంతో పాటు బంధు మిత్రులు, కుటుంబం చూపే వివక్ష, అణచివేతలు... ఇవన్నీ ఒక్కోసారి వారిని తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెడతాయి. ఓ పురుషుడి తోడు అవసరం అనుకునేలా పరిస్థితులు సృష్టించబడతాయి. ఇలా తన ఉనికిని కాపాడుకోవడానికి ఒంటరి స్త్రీ ప్రతిక్షణం సంఘర్షణ పడుతుంటుంది. ఆమె మాటను వినాలన్న ఆసక్తి కూడా ఎవ్వరికీ ఎండదు. ఎందుకంటే, ఆమె నోరు తెరిస్తే ఎక్కడ తమ గురించి వినాల్సి వస్తుందేమోననే భయం అవతలివాళ్లది. సాధారణ వ్యక్తుల మాట అటుంచి, ప్రగతిశీల భావజాలం కలిగిన చాలామంది మగవాళ్లలోనూ ఒంటరి మహిళలపట్ల ఓ చులకనా భావం ఉండటం గమనించాం. ఈ పరిస్థితుల్లో ఒంటరి మహిళలపై జరుగుతున్న వివక్ష, అణచివేతలపై నిజాయితీగా చర్చ జరగాలి. వాళ్లు అనుభవించే శారీరక, మానసిక క్షోభ ఒంటరి మహిళలను ఎంతగా అచేతనులుగా చేస్తుందో తెలియచేయాలి అనుకున్నాం. మేమిద్దరమూ కూడా వ్యక్తిగతంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాం. ఆ ఇబ్బందులన్నింటినీ మేమూ ఎదుర్కొన్నాం. తద్వారా ఒంటరి మహిళల జీవిత యదార్థ, వ్యధాపూరిత గాథల మూలాలను, వాటిల్లో అంతఃపొరలను ‘స్వయం సిద్ధ’ కథాసంకలనం ద్వారా విప్పి చెప్పే ప్రయత్నం చేశాం.
ఈ సంకలనం ఇతివృత్తమైన ‘ఒంటరి మహిళ’ను మీరు ఏ విధంగా నిర్వచించుకున్నారు?
వివాహ వ్యవస్థలో హింసల వల్ల బయటకు వచ్చిన వారుంటారు. కుటుంబం కోసం త్యాగం చేస్తూ వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయే ఆడవాళ్ల అంతులేని కథలుంటాయి. కొందరు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేక ఒంటరిగా ఉండాలనుకుంటారు. మరికొం దరు భర్త మరణానంతరం ఒంటరితనం అనుభవిస్తుండవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో వివాహ బంధం నుంచి బలవంతంగా బయటకు నెట్టివేయబడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో స్త్రీలు తమ అవసరార్థం వివాహబంధాల నుంచి బయటపడాలనే నిర్ణయానికి రావచ్చు. అంత మాత్రాన ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు ఆమె ఏకాంతానికి ఆటంకాలు కల్పించాలని చూసే పరిస్థితులు బాధాకరం.
కథల ఎంపిక ప్రక్రియ గురించి వివరించండి?
ఈ కథాసంకలనం తీసుకురావడానికి మాకు ఏడాదిన్నర పట్టింది. కొంతమంది రచయిత్రులకు మేమే సబ్జెక్టు ఇచ్చాం. మొదట రావడానికి 62 కథలు వరకు వచ్చాయి. అయితే, అందులో ఒంటరి మహిళల పట్ల సానుభూతిని ప్రకటించడం లేదంటే బాధితురాలిగా చిత్రించడం లాంటి కథలను కొన్నింటిని తిరస్కరించాం. సంకలనం ప్రధాన ఉద్దేశానికి కాస్తంత భిన్నంగా ఉన్న కథలను ఎడిటింగ్ చేయాడానికి రచయిత్రులు అంగీకరించకపోవడంతో, మరికొన్నింటిని వెనక్కి పంపించాం. చివరిగా ఎంపిక చేసిన నలభై కథలనూ మేము చాలావరకు మా కాన్సెప్టుకు తగినట్టు ఎడిటింగ్ చేశాం. అందుకు రచయిత్రులు అంగీకరించడం గొప్పవిషయం. వాళ్లందరి సమష్టి తోడ్పాటుతో ఆదివాసీ, దళిత, మైనార్టీ, ట్రాన్స్‌జెండర్ లాంటి అన్నీ సమూహాలు, శ్రామిక, సంపన్న వర్గాలకు చెందిన ఒంటరి మహిళల కథలను ఇందులో జోడించగలిగాం. అయితే, రాజకీయ, కళా రంగాల నుంచి కథలు రాలేదు. ఎల్జీబీటీ సెక్షన్ ప్రాతినిధ్యం కూడా లేకపోవడం కూడా ఒక వెలితిగా భావిస్తున్నాం.
ప్రతి విషయంలో ఇరువురం చర్చించుకున్నాం. కొన్నికథల ముగింపు సినిమాటిక్‌గాను లేదంటే వాస్తవదూరంగాను ఉన్నప్పుడు, వాటిని ఎలా ముగించాలనే విషయం మీద కొన్నిరోజుల తరబడి ఇరువురం సంభాషించకున్నాం. మా రాజకీయ దృక్పథాలు డామినేట్ చేయకుండా, కథాపరంగా ప్రజాస్వామిక విలువలను ప్రతిఫలింప చేసేలా ఇద్దరం కూడా సమష్టిగా పనిచేశాం. భినాభిప్రాయాలు తలెత్తినప్పుడు, చర్చ ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చాం.
ఈ కథసంకలనం మీద సాహిత్యలోకం నుంచి ఎలాంటి స్పందన వస్తోంది.?
చాలామంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పురుషుల నుంచి అభినందనలు పెద్దఎత్తున రావడం ఆనందంగా ఉంది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్లు ఎంఫిల్ పరిశోధనకు ‘స్వయంసిద్ధ’ను తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు మమ్మల్సి కలిసి మరీ కాపీలు తీసుకున్నారు. మంచి ఆదరణ లభిస్తోంది.
ఇంటర్వ్యూ: సాంత్వన్