ఇంకా కంచికి చేరని పోతన జీవిత కథ!

ABN , First Publish Date - 2023-03-27T01:06:01+05:30 IST

ఈనాటికీ సంస్కృతాంధ్ర మహాకవి బమ్మెర పోతనా మాత్యుడి సమగ్ర జీవితావిష్కారం కాలేదంటే ఆశ్చర్యం కలగుతుంది. పోతన జీవితంలోని ప్రతి అంశమూ వివాదాస్పదమే. బమ్మెర పోతన ‘బమ్మెర’ వాడా, ‘బొమ్మర’ వాడా నుంచి...

ఇంకా కంచికి చేరని పోతన జీవిత కథ!

ఈనాటికీ సంస్కృతాంధ్ర మహాకవి బమ్మెర పోతనా మాత్యుడి సమగ్ర జీవితావిష్కారం కాలేదంటే ఆశ్చర్యం కలగుతుంది. పోతన జీవితంలోని ప్రతి అంశమూ వివాదాస్పదమే. బమ్మెర పోతన ‘బమ్మెర’ వాడా, ‘బొమ్మర’ వాడా నుంచి మొదలైన వివాదాలు, ఆయనే రాశారని చెబుతున్న ‘నారాయణ శతకం’ ‘వీరభద్ర విజయం’, ‘భోగినీ దండకం’ చుట్టూ తిరిగి, పోతన తన జీవితం చివరివరకు ఏకశిలానగరం/ ఓరుగల్లు/ వోరుగల్లు లోనే గడిపాడా, లేదా అన్న అంశం దాకా కొనసాగాయి. దేనికీ స్పష్టమైన సమాధానం లేదు. ఎవరికి వారే తాము చేసిన పరిశోధన ఆధారంగా సమస్యలన్నీ ‘సమసిపోయాయి’, ఇక ఎటువంటి వివాదాలు లేవని చెప్పుకుంటారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బమ్మెర పోతనా మాత్యుని జీవిత సంగ్రహావిష్కారం చేసే ప్రయత్నంలో వెలువడిన రెండు ప్రముఖ గ్రంథాలను ప్రస్తావించడం అవసరం: ఒకటి, ‘పోతన మహాకవి- సర్వతోముఖ పాండి త్యము’ (2016); రెండవది, ‘బమ్మెర పోతనామాత్యుని భోగినీ దండకము’ (2018). మొదటిది రాసినవారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు గరిమెళ్ళ అచ్యుత సత్యశేషగిరి సోమయాజిశర్మ, రెండవది రాసిన వారు కూడ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు సంగనభట్ల నరసయ్య. గరిమెళ్ళ వారు పోతన సాహిత్య కాలాన్ని, ముఖ్యంగా పోతన భాగవత రచనా కాలాన్ని ఆవిష్కరించడానికి పోతనకు ముందు, తర్వాత వచ్చిన సాహిత్యాన్ని శోధన చేసి కొంత వరకు కొన్ని పరిష్కారాలు, ఆవిష్కారాలు చేశారు. సంగన భట్లవారు చరిత్ర శోధన చేసి కొన్ని ఆవిష్కారాలు చేశారు. ఇరువురు స్వతంత్రంగా పోతనామాత్యుని స్వగ్రామం ‘బమ్మెర’ అని, పోతన భాగవత రచన ‘ఏకశిలా నగరం’ (వరంగల్లు/ ఓరుగల్లు/ యోరుగల్లు)లోనే ఆరంభించారని అంగీకరించారు. అంతేకాక ఇరువురు పోతననే ‘భోగినీ దండకము’ రాశాడని, పోతన భాగవత రచనా కాలం 1450కి ముందే జరిగిందని అంగీకరించారు.

స్థూలంగా అంగీకరించిన ఈ విషయాలు తప్ప మిగతా వేవి ఎక్కడా కలవవు. ఈ క్రమంలో ఇరువురు (గరిమెళ్ళ వారు ఆంధ్రా నుంచి, సంగనభట్ల వారు ధర్మపురి నుంచి) ఎక్కువగా విభేదించింది, విమర్శిం చింది వావిలికొలను సుబ్బారావుగారిని, వారి గ్రంథాలను. ‘ఆంధ్ర వాల్మీకి’గా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బా రావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యధాతథంగా తెలుగులోనికి అనువదించిన తొలి మహాకవి, సంస్కృ తాంధ్ర పండితుడు. ఈ అంశంలో మొత్తం నేపథ్యం ఏమిటో తెలుసుకోవడానికి వావిలికొలను సుబ్బారావు రాసిన గ్రంథాలను సేకరించి పరిశీలించాను. ఈ గ్రంథాల్లో ముఖ్యమైనవి ‘బమ్మెర పోతరాజు విజయం’ (బ.పో.వి. 1919), ‘పోతన నికేతనచర్చ’ (పో.ని.చ. 1920) ‘ఆంధ్ర వాల్మీకి జీవిత చరిత్ర’ (1981). ఇవిగాక వానమామలై వరదాచార్యులు రాసిన ‘పోతన చరిత్ర’ (1996), సి.పి. బ్రౌన్‌ అకాడమీ వేసిన ‘బమ్మెర పోతనపై విమర్శనా వ్యాసాలు’ (2020)... వీటన్నింటినీ పరిశీలనగా చదివితే గరిమెళ్ల, సంగనభట్ల పోతన సమగ్ర జీవితావిష్కారానికి ఎన్నో ఆమడల దూరంలోనే ఆగిపోయారన్నది వాస్తవం.

గత రెండు శతాబ్దాలలో పోతన సమగ్ర జీవితావి ష్కార ప్రయత్నంలో పాల్గొన్న పండితులు, సాహిత్య శోధకులు, చరిత్రకారులు ఒక వర్గం కోస్తా నుంచి, మరో వర్గం రాయలసీమ నుంచి పరస్పర ఖండన మండనాలకు, వాద ప్రతివాదనలకు దిగారు. సంగనభట్ల నరసయ్య ధర్మపురి నుంచి తొలిసారిగా ఈ వివాదంలోకి దూకి తన వంతు వాదనలు వినిపించారు. అయితే ఈ ప్రయత్నంలో సంగనభట్ల చెప్పుకొనట్లుగా ఆయనేమీ నూతన వాదాలను ప్రవేశ పెట్టలేదు. గతంలో ‘ఓరుగల్లు’ (వరంగల్‌) వాదం వినిపించిన ఉత్తరాంధ్ర కవుల, రచయితల, చరిత్రకారుల పరిశీలనలనే పునరుద్ఘాటించారు. కాకపోతే ‘రాచకొండ రాజవంశం’ భేతాళ నాయకుడు (1225-53), ‘రసార్ణవ సుధాకరం తెల్పిన వంశం వృక్షం’ను తీసుకుని మూడవ సింగ భూపాలుడికి కూడా ‘సర్వజ్ఞుడని’ బిరుదు వంశా నుగతంగా వచ్చిందని, పోతన ఆతని కాలం వాడని, శ్రీనాథుడు రెండవ సింగభూపాలుడి తరం వాడని, ఆతనికి కూడా ‘సర్వజ్ఞ’ బిరుదు ఉండిందని పేర్కొన్నారు. ఈ రాచరికాలు, వంశ వృక్షాలు ప్రాథమిక ఆధారంగా పోతన ‘బమ్మెర’ వాడేనని, భాగవతం ‘ఏకశిలా నగరం’ అని అప్పట్లో పిలిచేది నేటి వరంగల్‌/ ఓరుగల్లునని చెప్పుకొ చ్చారు. అయితే గరిమెళ్ళవారు ఈ విషయంలో సంగన భట్ల వారితో ఏకీభవించినా, శ్రీనాథుడు, పోతన సమకాలీ నులేనని నిర్ధారణ చేశారు.

ఇక్కడ విషయం ఏమిటంటే వావిలికొలను వారు పోతన స్వస్థలం ‘బమ్మెర’ కాదని, ఆయన ఏకశిలా నగరం/ ఓరుగల్లు/ వరంగల్‌/ యోరుగల్లు వారు కాదని కాని ఏనాడూ, ఎక్కడా వితండవాదం చేయలేదు. నిజానికి సంగనభట్లవారు వావిలికొలనువారి రచనలను ఏవీ పూర్తిగా చదివినట్లు లేదు. చదివితే ‘‘భోగనీ దండక కర్తత్వం, రాచ కొండ రాజ్యం గురించి ఒంటిమిట్ట వారు ఏమీ మాట్లాడ లేదు’’ (పుట:39) అని రాసేవారు కాదు. వావిలికొలను సుబ్బారావు ‘బమ్మెర పోతరాజు విజయం’ పుస్తకం చదివితే అనేక విషయాల్లో సంగనభట్ల నరసయ్య వావిలికొలను వారిని తప్పుగా అర్థం చేసికొన్న సంగతి ఇట్టే అర్థమవుతుంది. అంతేగాదు వావిలికొలను సుబ్బారావు ‘నారాయణ శతకం’ ‘వీరభద్ర విజయం’ ‘భోగినీ దండకం’ మూడూ పోతన కృతం కాదని సమూలంగా ఖండించారు. ఇందుకు ఆయన తీసుకున్న ఉపపత్తులు త్రోసి రాజనలేనివి. అంతేగాదు ‘రాచకొండ రాజ్యం’ గురించి కూడా క్షుణ్ణంగా చర్చ జరిపారు (బ.పో.వి. పుటలు :19, 39, 42, 43).

నిజానికి ‘బమ్మెర’ ‘బొమ్మర’ వివాదం తల ఎత్తింది జయంతి రామయ్య పంతులు గారి ఉత్తరం వలననే. ‘బమ్మెర’ పేరు గల గ్రామం ఏదీ వరంగల్‌ దగ్గర లేదు. ‘బొమ్మర’ అనే గ్రామం ఉంది. ‘బమ్మెర’నే తర్వాతి కాలంలో ‘బొమ్మర’ అయి ఉండవచ్చునని జయంతి రామయ్య పంతులు తన లేఖలో/ వ్యాసంలో ఒక ఊహగా పేర్కొ న్నారే తప్ప అదే ‘బమ్మెర’ అని నిర్ధారించలేదు. అలాగే రామచంద్రుడు సాక్షాత్కారమైన నదిని పోతన ‘గంగ’ అని అన్నాడే గాని ‘భగీరథి’ అని గాని, ‘గోదావరి’ అని గాని పేర్కొనలేదు. గంగయినా, గోదావరైనా రెండూ వరంగల్‌కు చాలా దూరంలో ఉన్నాయి. అయితే ఒంటిమిట్టకు ఇంకా దూరం. ఇలాంటి విషయంలో జయంతి రామయ్య పంతులు పాము చావకుండా, బడితె విరగకుండా కాసేపు అటు, కాసేపు ఇటు మ్రొగ్గువచ్చేలా రాసిన వ్యాసం అది. పోతన స్వస్థలం ‘బమ్మెర’ అనటానికి జయంతి రామయ్య పంతులు సేకరించిన మూలాల్లో ‘బమ్మెర’కు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న గూడూరులో నివసించే పాలడుగు లక్ష్మా రావు ఇచ్చిన లేఖ ఒకటి. ఈ లేఖలో లక్ష్మారావు పోతన వంశీయులైన నెల్లుట్లవారి గురించి చెప్పడమేగాక, శ్రీనా థుడు, పోతనల మధ్య జరిగిన ‘మంత్ర శక్తి ప్రదర్శన’ ప్రస్తావన కూడ చేశారు. శ్రీనాథుడు, పోతన మధ్య 50ఏళ్ల తేడా ఉందని వాదించే సంగనభట్లవారు జయంతి రామయ్య పంతులు ప్రామాణికంగా తీసుకున్న పాలడుగు లక్ష్మారావు లేఖ మొత్తం విషయాన్ని అంగీకరిస్తారా లేక తను అనుకుంటున్న దానికి దగ్గరగా ఉన్నదాన్నే అంగీకరిస్తారా అన్న ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది (పో.ని.చ.పుట:11). నిజానికి జయంతి రామయ్య పంతులు గాని, కందు కూరు వీరేశ లింగం పంతులు గాని, గురజాడ శ్రీరామ మూర్తి గాని పోతన మహాకవి సమగ్ర జీవితావిష్కార ప్రయత్నంలో అనేక లొసుగులతో, ఊహాలతోనున్న ఒకరి వాదాలను మరియొకరు ఆలంబనగా చేసుకొని తమకు తోచినది రాశారే గాని ఇదిమిత్థంగా తేల్చింది ఏమీ లేదు. ఆ లొసుగులనే వావిలికొలను సుబ్బారావు భాషాపరంగా, చరిత్రపరంగా, సాహిత్యపరంగా త్రిప్పిగొట్టారు.

‘‘స్వయంగా ఒంటిమిట్ట వెళ్ళి అక్కడ పోతన వంటూ చూపిన వాటిని, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి వ్యాసము లను చూశాను. వారు చెప్పిన, చూపిన సాక్ష్యాలు ఆధారా లుగా చెల్లవు’’ అని సంగనభట్ల రాశారు. ఈ వాక్యాలు నరసయ్య గారి రచనలకు కూడా అంతే వర్తిస్తుంది. అంతేగాక ఏకశిలా నగరంలో రామాలయం, వైష్ణవా లయం ఎక్కడుందన్న ప్రశ్నకు కూడ జవాబు దొరకదు. వల్లభరాయుడు రాసిన ‘క్రీడాభిరామం’లో ఓరుగంటిలో శివాలయాలు తప్ప వైష్ణవాలయాలు లేవు. గరిమెళ్ళ వారు పోతన జనన కాలం విషయమై భాగవత పీఠకారులు నిర్దేశించిన 1372-1450 మధ్య కాలాన్నే అంగీకరించారు. వావిలికొలను సుబ్బారావు పోతన జననం 1378లో అని, నాచన సోమన ఆయనకు ముందువాడని రాశారు. అంతే కాదు నాచన సోమన బుక్కరాయల నుంచి జమ్ముల మడుగు తాలుకాలోని బుక్క పట్టణమగ్రహారాన్ని 1370లో గ్రహించాడని, నాచన సోమన 1400 వరకు జీవించి ఉన్నాడని గూడ రాశారు. ఈ విషయంలో నరసయ్యగారి (పుట:29) లెక్కకు, వావిలికొలను సుబ్బారావుగారి లెక్కకు స్వల్ప తేడా ఉంది. వావిలికొలను వారు కూడ పోతన కవితాలిలో నాచన సోమనకు దగ్గర ఉన్నాడని, సింగన్నకు కాదని వాదించారు.

హరిహర బుక్కరాయలు కడపలో ఒంటిమిట్ట సమీపంలో రఘునాయకస్వామి గుడిని జాతికి 1410-1420 మధ్య అంకితమిచ్చినట్లుగా కడప జిల్లా మాన్యు వల్‌లో ఉంది. పోతనకు సమకాలికు డైన యయ్యల తిప్పరాజు రఘువీర శతకంలో ఒంటిమిట్ట రఘునాయకుడి ప్రస్తావన ఉంది. అందువలన పోతనకు పూర్వం కడపలో దేవాలయాలు లేవు, నాడక్కడ నాగరికత లేదు, నాడక్కడ కవులు లేరన్న ఓరుగంటి వాదనలు పూర్తిగా పరాస్తం (బొ.పొ.లి.పుట 43).

మరో విషయం- ‘కూటమి’ ప్రస్తావన. సంగనభట్ల నరసయ్య గారు ఒంటిమిట్ట భక్తపోతన సమాజం వారు ‘కూటమి’గా అనేక తప్పుడు వాదాలు, వాటికి సాక్ష్యాలు సృష్టించారు అని పేర్కొన్నారు. నిజానికి కోస్తా సాహితీ చరిత్ర కారులు, పండితులే కూటమిగా ఏర్పడి ఎన్నో అభూత కల్పనలు చేశారని, ‘నారాయణ శతకం’ కృతిని పోతనకు అంటగట్టడం అందులో భాగమేనని వావిలికొలను సుబ్బారావు సాక్ష్యాధారాలతో నిరూపించారు. అలా ప్రారంభమయిన ‘కూటమి’ పదాన్ని తిరిగి ‘ఒంటిమిట్ట’ వారిపై ప్రయోగించే ప్రయత్నం తప్ప వావిలికొలను వారు చేసిన నిరూపణకు నేటికీ బదులు లేదు. (బ.పో.వి : పుట 50-51). తమషా ఏమిటంటే భాగవతంలోని స్కంధాంతములో ఉండే గద్యంతో యథాతథంగా శతకాంతం చూపుతారు. ‘‘ఇది శ్రీపర మేశ్వర కరుణాక్ష కృత కలితా చిత్ర, కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య, పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున సర్వమును సంపూర్ణము’’ అనే గద్యం అది. నిజానికి శతకాంతాలలో ఇలాంటి గద్యాంతం సంప్రదాయం ఆనాడు లేదు. అయినా ఈ గద్యంతానికి, భాగవత పద్యాంతానికి పోలిక పెట్టి రెండునూ పోతన రచనలే అని వంగురు సుబ్బారావు గారు, వడ్డాది సుబ్బారావు గార్లు ప్రకటించారు. నిజానికి ఇది ‘కూట సృష్టి’ అవటానికి కారణం ‘నారాయణ శతకం’ అన్ని ముద్రణలలో ఈ గద్యాంతం లేకపోవడం, పెద్దిభోట్ల వీరయ్య పంతులు గారు త్వరత్వరగా ముద్రించిన రెండు కాపీలలోనే ఇది ఉండటం. ఇందుకు సాహిత్య పరిషత్తు భాండాగారంలోని కాపీలే ప్రబల నిదర్శనము. ఒక్కటే విషయం ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసింది. పోతన వంశీకులు స్మార్తులు, శివభక్తులు. వైష్ణవులు గాని, వీర వైష్ణవులు గాని, విశిష్టాద్వైతులు గాని, వీరశైవులు గాని కారు. ‘‘అటువంటి పోతన ‘నారాయణశతకం’తో వైష్ణవుడై, ‘వీరభద్ర విజయం’లో శైవుడై, ఆరాధ్యుడై, భోగినీ దండకములో శృంగార వైష్ణవుడై, చివరకు భాగవతములో ‘అద్వైతి’ అయి, ఇన్ని రకములుగా ఒక బ్రాహ్మణ పండితుణ్ణి అన్ని మతాలలో ముంచి తేల్చిన కోస్తా సాహిత్యకారులు, పండితులు, ఓరుగంటివాదులు ఎంత విజ్ఞులో కదా?’’ అని ఎద్దేవా చేస్తారు వావిలికొలను వారు.

నిజానికి పోతన రచన శైలి, అలంకారములు, ప్రాసలు ఆయన తర్వాత ఎక్కువగా రాయలసీమ కవుల రచనల్లోనే ఎక్కువ కనిపిస్తుందని గరిమెళ్ళ వారు సోదాహరణంగా నిరూపించారు. పోతన రచన శైలి, అలంకారములు, ప్రాసలు ఆయన తర్వాత తెలంగాణా కవుల రచనలలో ఎక్కువ కనిపిస్తుందని ఎవరూ సోదాహరణంగా నిరూ పించ లేదు. అందువల్లనే వానమామలై వరదాచార్యులు గారు ‘పోతన చరిత్ర’లో మధ్యే మార్గంగా బమ్మెర వాడైన పోతన భాగవత రచన కాలానికి ఒంటిమిట్ట వచ్చి ఉంటారని సర్క్యుమెస్టెన్షియల్‌గా ప్రతిపాదించారు. సర్క్యు మెస్టెన్షియల్‌ ఉపపత్తులు పామాణిక పరిశోధన సూత్రాల ప్రకారం తప్పు కాదు. పోతన సమగ్ర జీవితానికి సంబం ధించి కొన్ని విషయాలు పరిష్కారం అయినప్పుడు, మధ్యే మార్గంలో ఓరుగల్లువాదులు, ఒంటిమిట్ట వాదులు రాగద్వేషాలకు అతీతంగా కూర్చుని ఒక పోతన సమగ్ర జీవిత పరిష్కారం సూచించవచ్చు.

కొప్పరపు నారాయణమూర్తి

Updated Date - 2023-03-27T01:06:01+05:30 IST