మానవ సారాంశ శోధకుడు
ABN , First Publish Date - 2023-06-26T01:23:13+05:30 IST
‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’ అనే రూపక వాక్యం (metaphorical sentence) తెలుగు కథాచరిత్రలో మరుపు రానిది. సముద్రం ఒక మేధావి జీవితకాలపు జ్ఞానసంపదకి ప్రతీక. ఆ జ్ఞాన సము పార్జనలో...
‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’ అనే రూపక వాక్యం (metaphorical sentence) తెలుగు కథాచరిత్రలో మరుపు రానిది. సముద్రం ఒక మేధావి జీవితకాలపు జ్ఞానసంపదకి ప్రతీక. ఆ జ్ఞాన సము పార్జనలో అంతర్మథనాన్ని, ఆచరణలో ఘర్షణని ఒక చిన్న వాక్యంలో ఇమడ్చటం ఎంత కష్టం? అర్థవంతమైన ఈ వాక్యం కోసం ఎన్ని రాత్రుల్ని ఆ కవి, కథకుడు దగ్ధం చేసి ఉంటాడు? జీవితకాలమంతా తపించి సముపార్జించిన జ్ఞానానికి కొనసాగింపు లేక ఆవేదన చెందే మేధావి ఆంతరిక సంక్షోభాన్ని ఆవిష్కరించిన కథ పాపినేని శివశంకర్ రచించిన ‘సముద్రం’. ఈ కథలో ఆ మేధావి (వనమాలి) తానుగా తన ఆవేదనను వ్యక్తీకరించడు. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న వనమాలికి అతని స్నేహితుడు గతాన్ని గుర్తు చేసే క్రమంలో అతను ఎలాంటి మథనానికి గురయ్యాడో పాఠకుడికి అర్థమ వుతుంది. అలా కథను నడపడానికి రచయిత మధ్యమ పురుష కథనాన్ని (సెకండ్ పర్సన్ నెరేషన్‌ను) ఎన్నుకున్నాడు. బహుశా తెలుగులో సిసలైన మధ్యమ పురుష కథనంతో వచ్చిన కథల్లో ఇది ప్రముఖమైంది. చాలా కష్టమైన కథనం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కథనశిల్పం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఆ సెకండ్ పర్సన్‌కి కథలో, కథతో సంబంధం ఉండాలి. అతనికి, ఫస్ట్ పర్సన్‌కి ఉండే సంబంధం అంతర్గతంగా స్థాపించబడాలి. ఈ సంబంధాన్ని స్థాపించటంలో రచయిత చూపించిన నైపుణ్యం, నూతనత్వం ఆ కథనంతోనే ఆగిపోలేదు. మొత్తం కథాసూత్రం, సారం ఆ ప్రశ్నలోనే ఇమడ్చబడ్డాయి.
రచయిత శివశంకర్‌లోని బహుముఖీనతకు, విస్తృత జ్ఞానసంపదకు ఈ కథ చక్కని తార్కాణం. ఒకే కథలో అనేకాంశాల్ని స్పృశించటం, మాంత్రికస్పర్శతో వాటిని కథలో అంతర్భాగం చెయ్యటం ఇక్కడి ప్రత్యేకత. ఈ లక్షణం శివశంకర్ అనేక కథల్లోనూ ఉంది.I am large. I contain multitudes అంటాడు Walt Whitman. అట్లాగే పాపినేని కథలు ఏక ముఖాలు కావు, బహు ముఖాలు (multifaceted). ఉదాహరణకి ‘చింతల తోపు’ కథలో ఆటపాటల బాల్యం, వానాకాలం చదువులు, పర్యావరణం, గ్రామీణ సామూహికత, వ్యవసాయంలో ఆటుపోట్లు, రైతుల ఆత్మహత్యలు ఇట్లా చాలా విషయాలు పాత్ర వహిస్తాయి. ఏదీ మరొక దాన్ని డామినేట్ చెయ్యదు. ‘సందడి’ కథలో అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలతో పరిచయం ఏర్పడుతుంది. ఇలా కథ చెప్పే క్రమంలో కథ చెబుతూనే కొంత జ్ఞానమూ పంచటం పాపినేని కథల ప్రత్యేకత. కథావస్తువులో ప్రధాన స్రవంతికి భంగం లేకుండా అనేక ఇతర అంశాలకు సంబంధించిన రచయిత సంచిత జ్ఞానం ఇమిడి ఉంటుంది. ‘మిత్ అండ్ రియాలిటీ’ కథలో ‘లోకంలో ప్రతిదీ మారుతుంది’ అని చెప్పిన బుద్ధుడి బోధ, వైష్ణవంలో ముఖ్యులైన ఆళ్వారుల పరిచయం, ఆషాఢ మాసాన ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకయ్యిందో వివరణ, దేవాలయాల మీద శృంగార భంగిమలపై చర్చ, వడ్డమాను ఊరి పేరుకు కారణాలు, ఆపైన రాజా వెంకటాద్రి నాయుడి చరిత్ర ఉంటాయి. ఈ alongside knowledge వల్ల కథ చదవక ముందు పాఠకుడు, కథ చదివిన తరువాత పాఠకుడు భిన్నులవుతారు.
శివశంకర్ ఉత్తమ పురుష కథనాలు (ఫస్ట్ పెర్సన్ నెరేషన్స్) ప్రత్యేకమైనవి. అట్లా సాగిన ఒక తలపుల స్రవంతి ‘గబ్బిలం’ కథ. కోవిడ్ 19 విరుచుకుపడిన వేళ లాక్‌డౌన్‌లో ఏకాకి మానసిక స్థితి కథాంశం. ఎంతో బిగువుగా, ప్రతీకాత్మకంగా, తాత్త్వికంగా సాగిన ఈ కథలో రచయిత ఎక్కడా ప్రత్యక్షంగా కోవిడ్ గురించి ప్రస్తావించడు. అసలా మాటే ఉండదు. పిల్లల ఆఖరి చూపుకు కూడా నోచుకోకుండా దాటిపోతున్న ప్రాణాలు, దిక్కూ మొక్కూ లేని మరణాలు, ఆపద వేళ జారిపోయే ఆత్మీయతలు, ఒంటరి గదుల్లో భయంతో సహజీవనం చేసిన పరిస్థితులు - వీటినన్నింటినీ కథలో స్పృశించిన రచయిత ప్రకృతితో సహజీవనం ఇటువంటి విపత్తుల నుంచి బయటపడవేస్తుందన్న జ్ఞానాన్ని నేర్పని చదువుల పట్ల పరోక్షంగా అపనమ్మకం ప్రకటిస్తాడు.
వ్యక్తిగా, రచయితగా శివశంకర్ నాగరిక జీవితంలో మనిషి పొందుతున్నదేమిటి? పోగొట్టుకుంటున్నదేమిటి? అన్న ప్రశ్నల్ని వేసుకొని, బాహ్యాంతరాల్ని శోధిస్తూ వెతుకులాడ తాడు. ఆ శోధనలో అతనికి ఉపనిషత్‌కారులు మొదలు బుద్ధుడు, మార్క్స్, ఎరిక్ ఫ్రామ్ లాంటివాళ్లు సాయపడ్డారు. ‘ఇప్పటి నా పేరు అన్వేషి’ అని ‘రజనీగంధ’లో ప్రకటించుకున్న ఈ రచయిత తన కథల్లో చేసింది మానవ సారాంశ అన్వేషణే.
నగరజీవితంలో సహజ స్వేచ్ఛను కోల్పోయి, సామూహిక ఏకాంతంలో సగం సగంగానే వ్యక్తమౌతూ, సంతృప్తి లోపించిన ద్రవాధునిక మానవుడి సమస్యల మూలాన్ని శోధిస్తాడు రచయిత. మనిషిని జీవనభీతి నుంచి బయట పడవేసి, లోపలి వెలితిని పూరించే అంశాలను అన్వేషిస్తాడు. మనిషి తననుండి తాను విముక్తమై, సాటివాళ్లలో, ప్రకృతిలో సహజ సుందరంగా విప్పారే మార్గాన్ని సూచిస్తాడు.
‘ఏది చెప్పాలో అది చెప్పగూడదు’ అనే paradox శివ శంకర్ రచనాసూత్రం. అంటే చెప్పాల్సింది వాచ్యంగా కాక కళాత్మకంగా మరుగుపరిచి చెప్పాలని కవి హృదయం. అందుకాయనకు సింబాలిజమ్, మాజిక్ రియలిజమ్, సర్రియలిజమ్, చైతన్యస్రవంతి, అబ్సర్డిటీ, వస్తు ధ్వని (వ్యంగ్యం) మొదలైనవి సాధనాలు. ‘లోయలూ శిఖరాలూ’, ‘సముద్రం’, ‘యశ్వంతి’, ‘పిరమిడ్’, ‘కొండచిలువ’, ‘గబ్బిలం’ ఈ కథలన్నీ ప్రతీకాత్మకంగా అంతరార్థాలతో సాగుతాయి. ‘పారిపోయిన కల’, ‘తుప్పు! తుప్పు!!’ కథల్లో అబ్సర్డ్ టెక్నిక్. ఏ వాదాల్లోకీ కుదించలేని పాపినేని కథల్లో వర్తమాన వాస్తవికత నివ్వెరపరుస్తుంది. పాపినేని కథల్లో సాధారణంగా రెండు తలాలు ఉంటాయి. ఒక తలంలో సాధారణార్థం అందుతుంటే, మరో తలంలో విశేషార్థం ఆలోచింపజేస్తుంది. ఒకటి- వాస్తవికత, రెండు- అంతర్ వాస్తవికత. ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని అభిమానించే పాపినేనికి ఈ నిర్వహణ సామర్థ్యం అబ్బటం సహజమే అనుకుంటాను.
వస్తువు లోనూ, ట్రీట్‌మెంట్ లోనూ ఏ కథా మరొక దానిలా ఉండదు. ప్రతిదీ కళాత్మకంగా ఉంటుంది. అందులో ఆద్యంతాల ఐక్యత ఒక విశేషం. ‘‘ఆకలీ శ్రీకర్ ఒకేసారి నిద్ర లేచారు’’ అనే వాక్యంతో మొదలైన కథ (‘సజీవ నిర్జీవం’) ‘‘అతను నిద్రపోయాడు, ఆకలికి నిద్ర లేదు’’ అనే తుది వాక్యంతో అనుసంధానమౌతుంది. ‘‘చక్రవర్తుల బతుకే అంత’’ అనే వాక్యం (‘మిథ్యాజీవితం’) ‘‘చక్రవర్తుల మరణమే అంత’’ అనే చివరి వాక్యంతో ఏకమవుతుంది. ఇక వాచ్యత లేని మరుగుదనం, సారవంతమైన సంభాషణా క్లుప్తత ఆకర్షి స్తాయి. మొదట కవియైు, తర్వాత కథకుడై, కథకీ కవిత్వానికీ శత్రువైరుధ్యమేమీ లేదని తెలిసిన పాపినేని కవితల్లో కథనాత్మకత, కథల్లో కవితాత్మకత ముచ్చట గొల్పుతాయి. అదే సమయాన కవిత్వం కథని, కథ కవిత్వాన్నీ మీరిపోని జాగ్రత్త కూడా ఉంటుంది.
‘‘కదిలే హృదయమున్నవాడు కన్నతల్లిని మర్చిపోడు. మా ఊరు నా కన్నతల్లి’’, ‘‘బాధలు ప్రపంచమంతటా ఉన్నాయి. హృదయాలు మాత్రం కొందరికే ఉన్నాయి’’, ‘‘చుక్కల రాత్రి. నీలాకాశం మిలమిలలాడుతోంది. ఆకాశం సాక్షిగా సముద్ర కెరటాలు వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. ఒడ్డు నిర్మానుష్యంగా ఉంది. కఠిన పాదాల కింద నలిగిపోయిన ఇసక చల్లగాలిలో గాయాల్ని నిమురుకుంటోంది’’ - ఇటువంటి కవితాత్మక వర్ణనలు; ‘‘చీకటి కొండలాంటి హాస్పిటల్‌లో ఆ వేళలోను ఎలుకల్లా అటు ఇటు హడావుడిగా తిరుగుతున్న డాక్టర్లు, నర్సులు’’, ‘‘ఎప్పుడూ అలల మధ్య తెల్ల కలువలా కనపడే మహేంద్ర బెడ్‌మీద వాడిపోయి, వాలిపోయి ఉన్నాడు’’ - ఇటువంటి ఉపమలతో కథనం సౌందర్యవంతమవుతుంది. ‘‘కళ్లున్నందుకు కన్నీళ్లు తప్పవు. కలలూ తప్పవు. ఏ కళ్లు ఎటువంటి కలలు గంటాయో సందర్భం నిర్ణయిస్తుంది’’, ‘‘దుఃఖాలన్నీ ఒక్కటేనా? దుఃఖగానాలన్నీ సమానమేనా?’’, ‘‘కలల్లో పీడకలలూ ఉంటాయి. పసిడి కలలూ ఉంటాయి. ఒకటి జీవనభీతికి సంకేతమైతే మరొకటి జీవనకాంక్షకి సంకేతం’’ - ఇటువంటి వాక్యాలు కేవలం కథా సూచనకే పరిమితమైనవి కావు. అనుభవసారాన్ని నింపుకొని సామెతల్లా కలకాలం నిలవగలిగిన భావనిధులు.
ఉత్తమ కథలు చరిత్రలోని ఖాళీలను పూరిస్తాయని చెప్పే శివశంకర్ తన కథల్లో ఆ విజయవంతమైన ప్రయత్నమే చేశాడు. ప్రపంచాన్ని సరికొత్తగా, సొంత కన్నుల్తో చూడగల అష్టభుజాకార ముఖం కోసం అన్వేషణ; నాగరిక ప్రపంచంలో పూర్తిగా వ్యక్తం కాలేక తనలోకి తాను ముడుచుకుపోతున్న మానవుడి గురించిన ఆవేదన; ఊళ్లనీ, దేశాన్నీ ముంచెత్తే అదృశ్య నీలనది గురించిన ఆందోళన; తన రూపాన్ని, సౌందర్యాన్ని పోగొట్టుకుంటున్న మాతృభాష గురించిన ఆవేదన; జానెడు పొట్టకి జగమంతా దిగమింగేంత ఆకలి ఎందుకో తెలియని ఆరాటం; సమాజ హింసకు బలౌతున్న దీనుల గురించిన దిగులు; మనుషుల మనస్సులు బండబారిన, కాలం గాని కాలంలో వారందరినీ ఒక్కచోటుకు చేర్చే తుపాను కోసం ఎదురుచూపు; How much land does a man need అనే ఆలోచన; విశ్వ విపణిలో తప్పిపోయిన సంస్కృతి కోసం వెతుకులాట; నిరంతరం మార్పుకు గురవుతున్న భాష, సమాజం, సంస్కృతుల గురించిన అవగాహన ఈ కథలన్నిటా పరచుకొని ఉంది. అది అందుకొని ఏది ఎట్లా ఉండాలో నిర్ణయించుకోవలసిన బాధ్యత పాఠకులది.
‘‘నా కథల్లో చదువరి కొన్నిటిని ఊహించుకోవాలి. కొన్నిటిని తనే అందుకోవాలి. అవేమిటో ఆలోచించాలి. నిదానంగా ఆస్వాదించాలి,’’ అని చెప్పే పాపినేని తన కథావరణంలో పాఠకుడికి విహార స్వేచ్ఛను కల్పిస్తాడు. అన్నట్టు పాత్రలకి కూడా. ‘‘పాత్రలకి జీవం పోసి, ఒకానొక రేవులో కల్లోల జీవన సందర్భంలోకి జొరబెట్టి, వాటి స్వయం నిర్ణయాధికారానికి వాటిని వదిలిపెట్టి చూస్తుండటమే ఉత్తమ రచయిత పని’’ అంటాడు. అందువల్ల పాపినేని కథల్లో పాత్రలు రచయిత చేతుల్లో కీలుబొమ్మల్లా కాక, తమ సారాంశం తాము రూపొందించుకుంటూ సాగుతాయి.
సమస్యలు, వాదాలు, విశేష సంఘటనల్ని చిత్రించే కథల్లో ఆ సందర్భం ముగిసినాక మన మనస్సులో మెదిలేవి, మిగిలేవి కొన్నే. శివశంకర్ కథలు ఇదింతే, ఇట్లాగే, ఇదే దారి అని నిర్దేశించవు. ఆయనే అన్నట్టు ‘‘కథాంతాన రచయిత విశ్రమిస్తాడు. పాఠకుడు వివేచిస్తాడు’’. ఆ సందర్భాలు ముగిసినాక కూడా ఆ కథలు ఆలోచింపజేస్తాయి. ఏదో ఒక జీవిత మర్మాన్ని విడమరిచి చెపుతూనే ఉంటాయి. ఆ విధంగా కాలాతిక్రమణ చేస్తాయి.
నల్లపనేని విజయలక్ష్మి
97016 67350