ఏం సాధించావని ఈ దశాబ్ది ఉత్సవాలు?

ABN , First Publish Date - 2023-06-03T02:05:46+05:30 IST

తొమ్మిదేళ్ల పాలనలో ఏ రంగం బాగుపడింది? ఏ వర్గం లాభపడింది? ఎవరి ప్రయోజనాల కోసం నీ సర్కారు సాగిలపడింది?

ఏం సాధించావని ఈ దశాబ్ది ఉత్సవాలు?

తొమ్మిదేళ్ల పాలనలో ఏ రంగం బాగుపడింది? ఏ వర్గం లాభపడింది? ఎవరి ప్రయోజనాల కోసం నీ సర్కారు సాగిలపడింది? అన్నం పెట్టే అన్నదాత అరిగోస తీరిందా? పిల్లల కోసం రెక్కలుముక్కలు చేసుకునే తల్లిదండ్రుల కష్టం తీరిందా? నీ కుటుంబం తప్ప ఏ కుటుంబం సంతోషంగా ఉంది? నీ ఇంట్లో తప్ప ఏ ఇంట్లో ఉద్యోగాలచ్చినయ్‌? ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పైసలన్నీ ఎటుపోయినై? రూ. ఐదులక్షల కోట్ల అప్పులు ఎట్లైనై? సర్కారు నౌకరీ ఉన్నోళ్లకు కూడా అప్పులు చేసే దుస్థితి ఎందుకు దాపురించింది? దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలు ఎన్ని ఉన్నయ్‌? వాళ్లకు నువ్వు ఇస్తున్నదెంత? అసలు ఉద్యమంలో అంతమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తేనే కదా.. తెలంగాణ వచ్చింది. మరి, ఇన్నేళ్లల్లో ఎప్పుడైనా ఆ అమరులను తలుచుకున్నవా? వాళ్ల కుటుంబాల గోస తెలుసుకున్నవా? అమరవీరుల సమాధులపై పునాదులు కట్టుకుని నిర్మించుకున్న ప్రగతి ఇదేనా? తొమ్మిదేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టావని ఈ ‘దశాబ్ది ఉత్సవాలు’ నిర్వహిస్తున్నావ్‌ కేసీఆర్‌?

తెలంగాణ వస్తే.. తమ జీవితాలు బాగుపడతాయని, తమ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఉద్యమంలో ముందుకురికిన నిరుద్యోగ యువత బతుకులు ఎట్లున్నయో చూసినవా? ఎన్నో పోస్టులకు ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, పెట్టిన పోటీ పరీక్షల పేపర్లు లీక్‌ చేస్తే.. చేసేది లేక నువ్వంటున్న ఈ బంగారు తెలంగాణలో ఎంతమంది యువతీయువకులు ఉసురు తీసుకున్నరో తెలియదా? తొమ్మిదేళ్ల కాలంలో ఇస్తానన్న పోస్టులు ఎన్ని.. ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? నెలకు రూ.మూడువేల నిరుద్యోగ భృతి ఇస్తానని నువ్వే చెప్పినవ్‌. ఎక్కడిచ్చినవ్‌? ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి రాక ఉన్నత చదువులు చదివిన యువత ఉపాధి పనులు చేసుకునే పరిస్థితికి తెచ్చినవ్‌.

రాష్ట్రంలో ఒక్క రైతుబంధు పేరు చెప్పి రైతన్నను ముప్పతిప్పలు పెడుతున్నరు. అకాల వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న కలిపి ఐదు లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఎకరానికి 10వేల నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఇప్పటివరకు పైసలివ్వడం అటుంచి, నష్టపరిహారం లెక్కలు కూడా తేల్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్‌ బీమా పథకాన్నీ అమలుచేయడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలూ ఇవ్వడం లేదు. యూరియాపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ మినహా తెలంగాణలో సబ్సిడీలన్నీ ఎత్తేశారు. రాష్ట్రం సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ది నేషన్‌గా ఆవిర్భవించిందని కేసీఆర్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడం లేదు.

‘దశాబ్ది’ ఉత్సవాలంటూ సీఎం కేసీఆర్‌ తమ సర్కారు డబ్బాకొట్టుకోవడమే తప్ప రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన అమరులు, ఉద్యమకారులకు గర్వకారణం ఏమున్నది? రైతులకు రుణమాఫీ లేదు. కౌలు రైతుల పట్టింపే లేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. ఆసరా పెన్షన్లకూ కొర్రీలు పెడుతున్నరు. కుటుంబంలో ఒకరికే పెన్షన్‌ అని చెప్పే కేసీఆర్‌, తన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులు ఎట్లా తీసుకున్నడు. దళితబంధు పేరు చెప్పి అధికార ప్రజాప్రతినిధులు, నాయకులు రాబందుల్లా దోచుకుంటున్నరు. నచ్చినవారికే పథకం అమలు చేస్తున్నరు. నిరుద్యోగులను ఎలాగూ పట్టించుకోని సర్కారు ఇక విద్యార్థుల గురించైనా ఆలోచిస్తుందా అంటే అదీ కనిపించదు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ఇవ్వరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సరైన చదువు, సౌకర్యాలు లేవు. కార్పొరేషన్ల పరిస్థితి మరీ దారుణం. ఏళ్లకేళ్లుగా నిధులు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు కనీసం స్వయం ఉపాధికైనా రుణాలు ఇవ్వాలని యువత ప్రాధేయపడుతున్నా పట్టించుకోరు.

అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనుల పరిస్థితి మరీ దారుణం. వారికి ఇస్తామన్న 10శాతం రిజర్వేషన్ ముచ్చట లేదు. పోడు భూముల పట్టాలనూ ఇప్పటికీ చేతికివ్వలేదు. పేరుకే సర్కారు ఉద్యోగులు, వారికి నెలనెలా సమయానికి వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేదు. సకాలంలో వేతనం అందక ఈఎంఐలకు ఫైన్‌లు కట్టుకోవాల్సిన దుస్థితి. ఖజానా ఖాళీ చేయడమే కాకుండా సింగరేణి బొగ్గు పైసలు, ఆర్టీసీ బస్సుల డబ్బులనూ కేసీఆర్‌ సర్కారు తినేస్తోంది. ఇంటింటికీ నీళ్లు ఇస్తామంటూ మిషన్‌ భగీరథ గురించి డబ్బా కొట్టే సర్కారు ఎన్ని ఇళ్లకు, ఊళ్లకూ ఇప్పటికీ నీళ్లు రావడం లేదో లెక్కలు చెప్పదు. ఇంటింటికీ నీళ్లు ఇస్తుందో లేదో తెలియదు కానీ.. ప్రతి గల్లీకీ బెల్టుదుకాణం పెట్టించి మద్యాన్ని మాత్రం తాగిస్తోంది. పైసల కోసం ప్రజలను వ్యసనాల బారిన పడేస్తున్న ఏకైక సర్కారు కేసీఆర్‌దే. పేదోడికి గుంట భూమి ఇవ్వని సర్కార్‌, అయినవారికి మాత్రం ప్రభుత్వ భూములన్నీ అప్పనంగా అప్పగిస్తోంది.

తెలంగాణ అంటే... తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి, అణచివేతను ఎదిరించి, ప్రాణాలకు సైతం తెగించి నిలబడిన నేల కాదా? అలాంటి గడ్డపై ఉద్యమాలు చేయొద్దని నిర్బంధం పెట్టడం ఏంటి? ప్రశ్నించే గొంతులను నొక్కడమేంటి? స్వరాష్ట్రంలో మనోడే చేస్తున్న అన్యాయం, అక్రమాలపై ఎదురు తిరిగితే జైళ్లకు పంపిస్తావా? అమరుల త్యాగాలను సమాధి చేసి, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి సాగిస్తున్న నీ ఇష్టారాజ్యంలో జరిపేవి ‘దశాబ్ది’ ఉత్సవాలా? అసలు ఏం సాధించినందుకు ఈ ఉత్సవాలు చేస్తున్నవని ప్రజలు అడుగుతున్నరు... సమాధానం చెప్పు కేసీఆర్‌.

బండి సంజయ్ కుమార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2023-06-03T02:05:53+05:30 IST