భరోసానివ్వని బీఎస్పీ ‘బహుజన రాజ్య’ భావన!

ABN , First Publish Date - 2023-06-03T02:00:59+05:30 IST

దేశంలో 1980 దశకం నుంచి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు అధికారం చేపట్టాయి, మరికొన్ని అధికారం కోసం నిరంతరం పోరాడుతున్నాయి.

భరోసానివ్వని బీఎస్పీ ‘బహుజన రాజ్య’ భావన!

దేశంలో 1980 దశకం నుంచి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు అధికారం చేపట్టాయి, మరికొన్ని అధికారం కోసం నిరంతరం పోరాడుతున్నాయి. ఇంకొన్ని కేవలం నమూనాలుగా మిగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ కొన్ని దఫాలు అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీలకు సవాలుగా నిలబడినప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో దాని ప్రభావం అంతగా లేదు. కొంతకాలం తర్వాత జాతీయ హోదాను కోల్పోయింది, అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసుకుంది.

దశాబ్ద కాలానికి పైగా బీఎస్పీ ప్రధాన నాయకత్వం రాజకీయ, సామాజిక పరమైన అంశాలు వేటిపైనా పెదవి విప్పలేదు. బీజేపీ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. దళితులు, మైనారిటీ ప్రజల జీవన విధానాలు సంక్షోభంలో పడ్డాయి. భారత రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ముప్పు ఉందని యావద్దేశమూ గగ్గోలు పెడుతున్నది. అయినప్పటికీ మాయావతి రాజకీయం రామ్ మందిర్ చుట్టూనే తిరిగింది. మొన్నటి హైదరాబాద్ బహిరంగ సభలో బీజేపీ పేరును ఉచ్చరించకుండా, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ సాగిన ఆమె ఉపన్యాసాన్ని బట్టి ఆమె అంతరంగం ఏమిటో అర్థమవుతుంది. సెక్యులర్ ముసుగులో హిందూత్వని ప్రమోట్ చేసే మాయావతి ద్వంద నీతి స్పష్టం. గతంలో కూడా అధికారమే పరమావధిగా బీజేపీతో కలిసి ఆమె అధికారాన్ని పంచుకున్నారు. బీఎస్పీ గుర్తు అయిన ఏనుగు హిందూ దేవుడు విఘ్నేశ్వరుడే అనే ప్రకటన చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఘనకార్యాలకు కొదవ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అణగారికమైన హైందవ వ్యవస్థ కట్టుబాట్లపై నిరంతరం ఉద్యమించిన అంబేడ్కర్, కన్షీరాం విధానాలను ముందుకు తీసుకువెళ్లటంలో మాయావతి పూర్తిగా విఫలమయ్యారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రం కావాల్సిన బీఎస్పీ ఒక విఫల నమూనాగా మిగిలిపోయింది.

తెలంగాణలో ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీ ఇక్కడి బహుజన రాజకీయాల్లో నూతన శకాన్ని ప్రారంభించింది. ఇది గత నాయకత్వాలకు భిన్నమైనదని ఒప్పుకోక తప్పదు. కానీ పార్టీలో ఏకస్వామ్య పోకడ ఎక్కువ కనిపిస్తున్నది. ప్రత్యామ్నాయ నాయకులను పార్టీ తయారు చేయలేకపోతున్నది. దళితుల్లో వర్గీకరణ ఉద్యమంతో ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని తగ్గించటానికి ప్రయత్నాలు జరగటం లేదు. దళితులకు, బీసీ కులాలకు మధ్య ఉన్న భూ సమస్యల వంటి సున్నితమైన అంశాలను పార్టీలో చర్చకు తీసుకురావటం లేదు. సమస్యల పరిష్కారానికి ఒక తాత్విక దృష్టితో ముందుకుపోనంత వరకు ఈ ప్రయత్నం బహుజన రాజ్య స్థాపనకు ఉపయోగపడదు. బహుజన రాజ్యం అనే భావనను ప్రచారంలో ఉంచుతున్నారే తప్ప, సామాన్య ప్రజల్లో ఒక భరోసాని కలిగించే దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. గత మునుగోడు ఎన్నికలనే తీసుకుంటే– మెజారిటీ జనాభా కలిగిన బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపినప్పటికీ డిపాజిట్ కరువైన కఠోర అనుభవం ఉంది. ఒక పక్క బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలమైన సైద్ధాంతిక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాయి. కానీ బీఎస్పీ మాత్రం నాయకత్వాన్ని ఒక సమీకృత పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నది.

బహుజన రాజ్యం అనే మాట వినటానికి బాగున్నది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు కులాలుగాను, సంస్కృతీ సంప్రదాయాల పేరుతోను నిట్టనిలువుగా చీలివున్న సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ఫార్ములా అవసరం. పార్టీలో సామాజికపరమైన చర్చలు అవసరం. ఇవేమీ లేకుండా ప్రజల్ని రాజకీయంగా ఎలా సమీకరిస్తారు? ఇంత ఖరీదైన రాజకీయాల్లో వారిని ఓటు బ్యాంకు రాజకీయాలవైపు ఎలా మళ్లిస్తారు? ఇవే కీలకమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు బహుజన శిబిరం నుంచి జవాబు దొరకదు. బహుజన ఉద్యమాన్ని సైద్ధాంతికంగా బలోపేతం చేయకుండా, బహుజన రాజ్య స్థాపన కోసం ఎంత కృషి చేసినప్పటికీ సరైన రాజకీయ మార్పులు కనబడవు. దేశంలో కొన్ని పార్టీలు ఇలాగే విఫలమయ్యాయి. అందులో అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ కూడా ఒకటి. ఈ వ్యవస్థలో ఎన్నో రుగ్మతలకు కులమే కారణం అయినప్పుడు– సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై పౌరసమాజంలోని మేధావులతో భావజాలపరమైన చర్చలు జరిపి ముందుకు వెళ్లనంతవరకు బహుజన రాజ్యం అనే ఆశయం కాగితాలకే పరిమితం అవుతుంది. మౌలికంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఎన్నో ఉన్నప్పటికీ బీఎస్పీ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ‘రాజ్యాధికారం’ అనే భ్రమలోనే ఉన్నారు. సమిష్టి కృషి లేకుండా ఒక వర్గం ఓట్లతో రాజ్యాధికారానికి రాలేమనే వాస్తవాన్ని గ్రహించాలి. బహుజనవాదాన్ని సామాజిక కోణంలో చూడకుండా రాజ్యాధికారానికే కుదించి ఇదే ప్రధాన ఎజెండా అనే సంకుచిత అర్థంలో చూస్తున్నారు. బహుజనవాదాన్ని ప్రజాస్వామీకరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసంబద్ధ రాజకీయమే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత అనేది ప్రధాన బహుజన సిద్ధాంతం. బహుజన సుఖాయా బహుజన హితాయా అనే దాని అర్థాన్ని పూర్తిగా మార్చి, బహుజన సంస్కృతి మొత్తాన్ని బ్రాహ్మిణీకరణ చేసినప్పుడు ఏ రకమైన బహుజన రాజ్యాధికారాన్ని తీసుకువస్తారు?

– సునీల్ నీరడి, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Updated Date - 2023-06-03T02:00:59+05:30 IST