పాతశకానికి ముగింపు టాగూరు వచన కవిత్వం

ABN , First Publish Date - 2023-09-18T00:31:44+05:30 IST

పద్యం తరువాతే వచన కవిత్వం వచ్చినా, పద్యం ఆవరణకి ఆవల, దాని స్థానం అది తొందరలోనే నిలుపుకుంది. 1930 ప్రాంతంలో బెంగాలీలో వచనకవిత్వాన్ని వ్యాప్తిచేయడానికి, దాని ప్రాధాన్యతల్ని విస్మరించకుండా...

పాతశకానికి ముగింపు టాగూరు వచన కవిత్వం

పద్యం తరువాతే వచన కవిత్వం వచ్చినా, పద్యం ఆవరణకి ఆవల, దాని స్థానం అది తొందరలోనే నిలుపుకుంది. 1930 ప్రాంతంలో బెంగాలీలో వచనకవిత్వాన్ని వ్యాప్తిచేయడానికి, దాని ప్రాధాన్యతల్ని విస్మరించకుండా, టాగూరు అందులో అనేక సర్దుబాట్లు చేసారు. అవి అతనికంటే ఇతరులకే ఎక్కువ లాభించాయి. బహుశా అతను కొత్త శకానికి ప్రారంభంలా కంటే, పాత శకానికి ముగింపుగా కూడా ఆ పని చేసారు. కవిత్వ రూపంలో ఈ మార్పు బహుశా మారుతున్న కాలంలో నోరులేని ప్రజలకు దగ్గరయేందుకు పనికొస్తుందనే భావించారు. అంతవరకూ ఉపేక్షించి స్పృశించని లేదా తనను తప్పించుకున్న అనేక విషయాలను వ్యక్తపరిచేందుకు ఇది సరి అయిన మాధ్యమం కూడా అవుతుందని అనుకున్నారు. ఆ విధంగా జీవితానికీ కవిత్వానికీ మధ్య ఉన్న మూలాలకు దగ్గరయే అవకాశం ఉంటుందని విశ్వసించారు.

టాగూరు అనువాదాలు చాలావరకు వచన కవితలే అయినా, ఆశ్చర్యంగా అతని స్వీయ బెంగాలీ కవితలు మాత్రం ఛందోబద్ధమైనవి. వాటిల్లో సిద్ధహస్తుడు అతను. వచన కవిత్వం వైపు అతను మొగ్గడానికి కారణం, ‘గీతాంజలి’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందడం, అందులోని వచన కవిత్వం అంగీకరించబడటం. ‘గీతాంజలి’కి నోబెల్‌ బహుమతి రాకముందు, ఆ తరువాత అతని కవిత్వంలో వచనకవిత్వపు మార్పు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక ప్రయోగం లాంటి ఈ మార్పు అతనిని అనేక విమర్శల పాలు చేసింది. కొత్త యుగానికి ఈ మార్పు అవసరాన్ని నొక్కి చెబుతూ, టాగూరు తన ఉపన్యాసలలోను, వ్యాసాలలోనూ, ఈ మార్పుని సమర్థించుకుంటూ రాయవలసి వచ్చింది. దానికి సమర్థనగా ‘పునశ్చ’ వచన కవిత్వ సంకలనానికి ముందుమాట కూడా రాశారు. 70ఏళ్ల ప్రాయంలో టాగూరు ఈ వచనకవిత్వ ప్రయోగం ఆశ్చర్యంగా యువకవులనే ఎక్కువగా ఆకర్షించి, వారిలో ఆసక్తిని రేకెత్తించింది.

‘పునశ్చ’ ముందుమాటలో వచన కవిత్వం లోకి తానొచ్చిన నేపథ్యాన్ని ఇలా చెప్పుకున్నారు టాగూరు - ‘‘గీతాంజలి గీతాల్ని ఆంగ్ల గద్యంలోకి అనువదించాను. ఆ అనువాదం కావ్య శ్రేణిలో ఎన్నదగింది అయింది. అప్పుడే నా మనస్సులో ఒక ప్రశ్న మొలకెత్తింది. పద్యఛందస్సులో ప్రస్ఫుటమయే పదాలసవ్వడిని పక్కకు నెట్టి, ఆంగ్లంలోలా బెంగాలీ గద్యంలోకి కవిత్వ మాధుర్యాన్ని తీసుకు రావడం సాధ్యమేనా అని. మరెవ్వరూ ప్రయత్నించకపోయే సరికి, నాకు నేనుగానేముందు ప్రయత్నించాను. ‘లిపికా’ (లేఖనం- 1922లో వచ్చిన కథనాత్మక కవితల సంకలనం)లో కొన్ని ఉన్నాయి. అయితే ముద్రించినపుడు వాక్యాల్లా పద్యాల్ని ఖండించడం జరగలేదు. బహుశా అప్పుడు నాలోని అధైర్యమే అందుకు కారణం కావచ్చు. ఆ రాతలు కావ్యపరిధిలోకి వచ్చినా, భాషా బాహుళ్యం మూలంగా ఆశించిన ఫలితం రాలేదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంది. ఛందస్సు బంధనాల్ని ఛేదించటం మాత్రమే గద్య కావ్యంలో సరిపొదు, పద్యకావ్యంలో భాషలోనూ, అభివ్యక్తిరీతిలోనూ, ఒక విధమైన అలంకరణ-మర్యాదల మేలిముసుగు వేసుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో, దానిని కూడా తొలగించినపుడు మాత్రమే గద్యం స్వతంత్రంగా సహజంగా మనగలుగుతుంది.’’

మొట్టమొదటిసారిగా వచన కవిత్వ రూపంలో రాసిన 50 కవితలున్న ‘పునశ్చ’ పుస్తకం 1932లో ప్రచురించబడింది. ఎక్కువగా సామాజిక సమస్యలు, జీవన్మరణ విషయాల్ని టాగూరు అందులో స్పృశించారు. టాగూరు తన చివరి పదేళ్ల జీవిత అధ్యాయంలో వచన కవిత్వాన్ని బెంగాలీ సాహిత్యంలో ముఖ్యమైన కవిత్వ మాధ్యమంగా రాబోయే తరాలకు అందించారు. వచనకవిత్వ పద్ధతిలో టాగూర్‌వి నాలుగు కవిత్వ సంకలనాలు వచ్చాయి: పునశ్చ (1932), శేష్‌ సప్తక్‌ (1935), పత్రపుత్‌ (1935), శ్యామలి (1936). ఒక ప్రక్రియ నుంచి మరో ప్రక్రియకు దారితీసిన మధ్యాంతరకాలం అది. బహుశా అతని ముందరి, తరువాతి కవిత్వాల మధ్య కనిపించని లంకెగా కూడా ఈ వచనకవిత్వ ప్రక్రియ వచ్చిందనుకోవచ్చు. ఈ సంకలనాల్లోని కవితలు 1932-1936 మధ్య అతని అనారోగ్య అనుభవాలు, సంక్షోభాలతో నిండి ఉంటాయి. కళాకారుడి జీవితంలో సంక్షోభం ఒక్కోమారు తన కళకు లబ్ధి చేకూరుస్తుందేమో. అలా ఆ దశలో సమాజం, రాజకీయాలు, యుద్ధం, నోరెత్తని ప్రాంత ప్రజల అవగాహనతో, ఒక కొత్త లోచూపుకు దగ్గరయారు టాగూరు. పై సంకలనాల్లోని కవితల శకలాలుకొన్ని--

‘‘ఎన్నో క్షణికాల కోపం, చిరాకూ, భయాలూ/ ఈ నాశరీరం చానాళ్లుగా మోసుకొస్తోంది/ కోరికల చెత్తాచెదార కల్మషం, ఆత్మ స్వేచ్ఛని మురికితో కప్పుతోంది’’

‘‘నా దుఃఖ సమయంలో, నా కవితలకు చెబుతాను - నన్ను అవమానించొద్దని/ అందరిదీకాని ఆ దుఃఖాన్నీ మనుషలందరి ముందూ ప్రదర్శించొద్దని/ చీకటిలో నీ బాహ్యరూపాన్ని దాచుకోవద్దని లేదా తలుపుల గడియపెట్టేసుకో వద్దని

‘‘ఈ గొప్ప ప్రపంచం నా ఒక్కరిదే కాదు. అసంఖ్యాకులది. జనులందరిముందూ నన్ను సిగ్గుపరచొద్దు/ వారి ముందు నా నష్టం, నా బాధ/ ఒక సూక్ష్మ బిందువు లాంటిది

‘‘ఈ దుఃఖం నాది కాదని తొందరతొందరగా నేను మరచిపోయాకే, నేను దాని విశ్వజనీన రూపాన్ని చూస్తాను, అనాదిగా వస్తున్న మానవ యాతన వరదవెల్లువని నేను చూడగలుగుతాను

‘‘ఆ విస్తారతలో నా వైయక్తిక దుఃఖాలు వాటికవే కోల్పోయి/ నా ఏకైక ఏడుపులో వేల స్వరాలు మిళితమై విశాల ప్రపంచ రాగంగా మారనీ’’


జీవితపు చివరి దశలో వచ్చిన టాగూరు కవితలు స్వేచ్ఛతో ఉండి పరిణతి చెందినవే ఎక్కువ. మొదటిది, అతని ఈ కొత్త ధోరణి చాలా వరకు తొలినాళ్ల శైలీ దృక్పథాల సారాంశంగానే అనిపిస్తుంది. మౌలిక నిర్మాణ కల్పనా వ్యూహం ముందటిలానే ఉంటుంది. ఒక విధంగా అది వెనకటి సూక్ష్మాకార సంగ్రహం. భవిష్యత్‌ ఆకాంక్షగా కనిపిస్తుంది. రెండవది అతని అనుభవాలు, అసామాన్యమైన ప్రయోగాలతో చిత్రితమై ఉంటాయి. వ్యత్యాసం ఏమన్నా ఉంటే అది ఛందస్సు వాడుకలో విముఖత్వం మాత్రమే. వచనానికి అలంకార ముసుగులు వేయాల్సిన పనిలేకపోవడంతో అది కవిత్వ పరిధిని పెంచుతుందని బహుశా టాగూరు తొందరగానే గ్రహించగలిగారు. ఒక్కోమారు అతని వచనకవితలు అతని వచనానికి పొడిగింపో, లేదా కవిత్వానికి పొడిగింపో కూడా తెలియనట్టు ఉంటాయి.

ఈ వచన కవిత్వ ప్రయోగానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతకాలం, కవికి గాని పాఠకుడికి గాని అదొక సరదానో, లేదా కవికి దొరికిన తీరికా, పెరుగుతున్న వయస్సు మూలంగా క్షీణిసున్న శక్తి కారణంగానో, లేదా గంభీరమైన నవీకరణ ఫలితంగా వస్తున్న అప్రధానోత్పత్తో తెలియలేదు. అనుకరించే వాళ్ల మూలంగా ఈ కొత్త ప్రక్రియకు అధికసంఖ్యాకుల సమర్థన లబించి, ఈ ప్రక్రియ సాహిత్యంలో మరొక భాగంగా నిలదొక్కుకుంది. బెంగాలీ సాహిత్యానికి వచనకవిత్వ ప్రక్రియను టాగూరే తీసుకొచ్చినా, తానే తరువాత దానికి దూరమయారు. ఈ వచన కవిత్వరూపాన్ని టాగూరు వదులుకొన్నా, వాటి ఛాయలు మాత్రం చివరివరకూ కొనసాగాయి. అయితే అతనిది వృథా ప్రయాస కాలేదు. అది పెరుగుతున్న అవసరాలకు పనికొచ్చింది. కవిత్వ రూపం విషయంలో మార్పు మాత్రమే కాకుండా, కవిత్వం ముందుకు తీసుకుపోయేందుకు కూడా అది అవసరం అయింది.

అస్పష్టంగానే టాగూరు ఈ ప్రక్రియలోకి అడుగుపెట్టినా, మార్పు ఒక పరివర్తనగా వచ్చింది. ఏదైనా ఒక నికార్సయిన ప్రేరణ వచ్చినపుడు మాత్రం, తన పాత పద్ధతికే మరలిపోయేవారు. కొత్త పద్ధతికి కావాలని మారడానికి ఇష్టపడే వారు కాదు. ఏది తనకు రసికమైన ఆనందాన్ని ఇస్తుందో దానిని ఎన్నుకునే స్వేచ్ఛ తనకు ఉంది కదా అని సమర్థించుకునే వారు. యువకవులు మాత్రం ఆయన నుంచి అందిపుచ్చుకున్న వచన కవిత్వాన్ని సరికొత్త దారులు తొక్కించారు.

పద్యానికీ వచనానికీ మధ్య వంతెనలా వచన కవిత్వం వచ్చింది. టాగూరు- వచన కవిత్వాన్ని ఉద్దేశించి ‘పునశ్చ’లోని ‘కొపాయ్‌’ (శాంతినికేతన్‌ దగ్గరి చిన్నయేరు) కవితలో ఇలా అంటారు: ‘‘ఆమె సంభాషణ పండితుల భాష కాదు/ వినయపూర్వక గృహ సంభాషణం/ నేలా నదితో, ఆమెకూ లయకూ ఉన్న సర్వసామాన్య సంబంధం’’- అని. అయితే వచనకవిత్వంతో తీసుకురావాలనుకున్న మార్పు కోసమే ‘పునశ్చ’ కవిత్వ సంకలనంతో, ఆ కొత్త ప్రక్రియని ప్రారంభించారు. కానీ ఆ అశ అతనికి అంతగా నెరవేరలేదు. బహుశా ఆ మార్పు కోసం చివరివరకూ టాగూరు ప్రయత్నించ లేదు, లేదా అతను కోరుకున్న మార్పుకోసం సరైన విధంగా ప్రయత్నమూ కొనసాగించలేదు.

అందరి కవుల లానే టాగూరు కూడా తన పాఠకుల నుండి ప్రతిక్రియకోసం ఎదురు చూసే వారు. మరీ ముఖ్యంగా తోటి కవులు, కవిత్వ ప్రేమికుల దగ్గర నుండి. వచ్చిన ప్రతికూల విమర్శలమూలంగా, వెనక్కి తగ్గినా, కవిత్వానికి భాష సహజంగా, స్వచ్ఛంగా ఉండి, తెచ్చిపెట్టు కున్నది కాకపోతే చాలని సంతృప్తిపడేవారు. ‘నవజాతక్‌’ పుస్తకం ముందుమాటలో తనే చెప్పుకున్నారు, ‘‘నాకు తెలియకుండానే నా కవిత్వ రుతువు మారుతూ ఉంటుంది’’ అని. కవిత్వంలో గాలి మారినప్పుడల్లా కవికి తెలియకుండా అనేక విధాలుగా దాని స్వభావంలో మార్పు జరగడం సహజం - అని.

టాగూరు కవి మాత్రమే కాదు. కవుల కవి. అతను ఆధునిక భారత సాహిత్య నిర్మాత మాత్రమే కాదు, అతనిది ఆధునికమైన మనస్సు కూడా. ఆశ్చర్యంగా కవితల కంటే పాటలే ఎక్కువ రాసారు. ఇతర సాహిత్య ప్రక్రియలకంటే తన పాటలు తప్పకుండా నిలిచిపోతాయని, అతనికి కూడా బాగా తెలుసు. రాసిన 4500 కవితల్లో, దాదాపు 2200 పాటలే, మిగతావి సంగీత బాణీలు కూర్చని పాటలు, స్వయంగా తాను గానం చేసినవీ ఉన్నాయి. రవీంద్ర సంగీత్‌ పేరుమీద అవి బెంగాలీ సంగీతానికి ఒక కొత్త జోడింపుగా నిలిచిపోయాయి. మొదటి కవిత పదిహేనేళ్ల ప్రాయంలో రాస్తే, చివరి కవిత మరణశయ్య మీద ఉండి చెబుతూ రాయించారు.

ఈ వచనకవిత్వ ప్రక్రియ బెంగాలీలోకి వచ్చిన ముప్పయి ఏళ్ల తరువాతే తెలుగులోకి వచ్చినా, తెలుగు సాహిత్యలోకం కూడా అంతగా దానిని మొదట్లో స్వాగతించలేదు. కానీ రానురాను పద్యం రాసే వారికంటే వచనకవిత్వం రాయడం వైపే మక్కువ ఎక్కువవుతూ వచ్చింది, తెలుగులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా.

ముకుంద రామారావు

99083 47273

Updated Date - 2023-09-18T00:31:44+05:30 IST