ట్యాగ్‌ లైన్‌

ABN , First Publish Date - 2023-03-20T02:34:35+05:30 IST

పచ్చికలల ముద్ద బతుకారా రాసుకుని వేడినిట్టూర్పుల ఆవిరితో ఒంటిని కడుక్కుంటుంది ఓ బంధం నైలాన్‌ పువ్వుల నవ్వుల వెలుగుని...

ట్యాగ్‌ లైన్‌

పచ్చికలల ముద్ద

బతుకారా రాసుకుని

వేడినిట్టూర్పుల ఆవిరితో

ఒంటిని కడుక్కుంటుంది ఓ బంధం

నైలాన్‌ పువ్వుల నవ్వుల వెలుగుని

గడియారం ముల్లుకి తగిలించి

కాలం ఉచ్ఛ్వా నిశ్వాసల భాష నేర్చుకుంటుంది

ఎన్నెన్నో కథల్ని కతికిన అదేకాలం

ఏరోజుకారోజు కొత్తమార్పుల కూడలిలో

నివ్వెరపోయి నిలబడుతుంది

అచ్చం మనిషిలా

ఇక్కడ ఒకరికొకరు ఏమీకారు

అయినా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్‌

కలిసున్నన్నినాళ్ళు కలిసుంటారు

కోరికల ఏరు దాటాక

కలల్ని తగలేసి

చెరో రిలేషన్‌ కోసం

తలోదిక్కుకి ఎగిరిపోతారు

ఒకరిమీద ఒకరికున్న నమ్మకాల లేమి

ఒంటిబంధాన్ని మాత్రం బలపరుస్తుంది

ఒకానొక ప్రేమరాహిత్యం

బతుకు బాల్కనీ గోడమీద అలంకరించిన

బోన్సాయ్‌ మొక్కలా

కుండీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది

నేను చచ్చిపోతే నీకు సంబంధం లేదు

నువ్వు పగిలిపోతే నాకు సంబంధం లేదని

ఆడామగ కోఎగ్జిస్టెన్స్‌ డిక్షనరీ ప్రకారం

వివాహపు అర్థం వింత తంతని

విజువలైజ్‌ చేయబడుతుంది

లివింగ్‌ రిలేషన్‌ అన్న ట్యాగ్‌లైన్‌తో

కన్నపేగు కంటికి కనిపించదు

కనిపెంచిన ఏ కలలరాగమూ

మనసుకి వినిపించదు

కట్టుతెంచుకున్న దాహానికి

కటికుప్పునీరు ఎంత తాగితే ఏం లాభం

దాహం తీరని దాహానికి

బతుకంతా వయసు పొంగుదే

ఎలా అవుతుంది

తప్పదుకాక తప్పని

ఒక వార్ధక్యం వొంపు దగ్గర

వాత్సల్యపు తులసినీళ్ళు

ఒక్క చుక్కైనా గుటకెయ్యాల్సిందే!

నిన్ను కనిపెంచింది కానీ

నువ్వు కనిపెంచింది కానీ

నిన్ను కనిపెట్టుకుని వున్నది కానీ

ఏదైనా... ఒక్క బంధం!

నీకోసం నువ్వు అట్టిపెట్టుకోవాల్సిందే!

బంగార్రాజు కంఠ

85003 50464

Updated Date - 2023-03-20T02:34:35+05:30 IST