సంచార వాదానికి దివిటీ పట్టిన కథలు

ABN , First Publish Date - 2023-03-20T02:37:03+05:30 IST

‘కారణాలు, స్వేచ్ఛ సహజంగా లభించవు. అవి చారిత్రక విజయాలు’ (Reasons and freedom do not come naturally. They are historical achievements) అంటాడు ప్రఖ్యాత జర్మన్‌ తత్వవేత్త ఫెడ్రిక్‌ హెగెల్‌. ఆధునిక గతి తార్కిక భావనకు పునాది వేసిన ఈయన..

సంచార వాదానికి దివిటీ పట్టిన కథలు

‘కారణాలు, స్వేచ్ఛ సహజంగా లభించవు. అవి చారిత్రక విజయాలు’ (Reasons and freedom do not come naturally. They are historical achievements) అంటాడు ప్రఖ్యాత జర్మన్‌ తత్వవేత్త ఫెడ్రిక్‌ హెగెల్‌. ఆధునిక గతి తార్కిక భావనకు పునాది వేసిన ఈయన రచనలలో భావవాదం, జడవాదంపై నిరసన వ్యక్తం చేశాడు. హెగెల్‌ను కార్ల్‌ మార్క్స్‌ తన గురువుగా భావించాడు. హెగెల్‌ చెప్పినట్టు సాహిత్యం నిరంతర మార్పులకు లోనయ్యేది. భావవాది కానిది. తెలంగాణ ప్రాంతం గత అర్ధశతాబ్ద కాలంగా ప్రపంచస్థాయి అస్తిత్వ ఉద్యమాలకు కేంద్రబిందు వైంది. ఇక్కడి ప్రజలు ఉద్యమించడానికి కారణాలు, స్వేచ్ఛ సహజంగా లభించలేదు. రాజకీయ, సాంఘీక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భాషాపర కారణాలు, ఉద్యమాలు సంభవించాయి.

స్వేచ్ఛ కారణంతో నిజాం వ్యతిరేకపోరాటం, స్వీయపాలన, ఆత్మ గౌరవం వంటి రాజకీయ కారణాలతో ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాలు, ఆర్థిక పరమైన అసమానతల కారణాలతో అభ్యుదయ, విప్లవ, వామపక్ష పోరాటాలు, ఉద్యమాలు, సామాజిక అసమానతల కారణంగా దళిత, మైనారిటి, బహుజన, స్త్రీవాద ఉద్యమాలు సంభవించాయి. ఇవన్నీ ఇక్కడ జీవించే ప్రజల సమస్యలు. వాటి పరిష్కారానికి ఉద్యమించిన కారణాలు. కవులు, రచయితలు సాహిత్య ఉద్యమాల ద్వారా ప్రజలను నడిపించడంలో, ప్రభుత్వాలను ఆలోచింపజేసే విధంగా రచనలు చేస్తూ వచ్చారు. ఇది ఈ నేలకున్న సాహితీ గొప్పదనం. ఇక్కడ నుండి బలమైన ప్రాపంచిక దృక్పథంతో సాహిత్యోద్యమాలు వచ్చినా, ఇక్కడ మంచి సాహిత్యం లేదనే అపవాదును వలస సాహిత్యకారులు ప్రచారంలోపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో సాహిత్యోద్యమం మరింత అడుగు వర్గాలను చేరినట్టు ‘గంగెద్దు’ కథల ద్వారా అర్థమవుతుంది.

సంచారులు ఈ దేశపు మొదటి అక్షర జ్ఞానులు. వారినుండి అగ్ర వర్ణాలు బలవంతంగా భూమిని లాక్కోవడంతో వారు ఆశ్రితులుగా, భిక్షగాళ్ళుగా మారి సంచారులయ్యారు. అగ్రవర్ణాలు వారి దగ్గరున్న కథలు, గేయాలు, కళలు దొంగిలించి, తమవిగా చరిత్రలో రికార్డు చేసుకున్నారు. మేధావులుగా చెలామణీ అయ్యారు. సమాజాన్ని కులాల పేరుమీద విభజన చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తరువాత అడుగు, బడుగు, బలహీన వర్గాలను తొక్కిపెడుతూ, వారికి భూమి, చదువు, అధికారం, సామాజిక హోదా లభించకుండా సామాజిక కట్టు బాట్లను రూపొందించారు. వారి ఐక్యమత్యాన్ని విడదీయడానికి ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ కట్టుబాట్లు, ఎత్తుగడలకు వ్యతిరే కంగా దళిత, బహుజన వర్గాల ఐక్యత, సంక్షేమమే పరమావధిగా బసవేశ్వర్‌, జ్యోతీరావు పూలే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, నారాయణ గురు, కబీర్‌, బిర్సాముండా, గాడ్గీ బాబా, డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరామ్‌ వంటివారు కృషిచేశారు.

వారి దారిలో నవీన సామాజిక సెద్ధాంతిక దృక్పథం కలిగిన కథా రచయితగా శీలం భద్రయ్య కన్పిస్తున్నాడు. తన మొదటి కథాసంపుటి ‘లొట్టపీసు పూలు’ శీర్షికతో వచ్చిన కథలలో అస్పృశ్యత, అణిచివేత ప్రధానంగా ఉంది. శీలం భద్రయ్య రెండో కథల సంపుటి ‘గంగెద్దు’. ఈ కథలు అణచివేతకు ఎదురుతిరిగిన ధిక్కారాన్ని ప్రదర్శించిన కథలు. దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీవాద ఉద్యమాలకు కొనసాగింపుగా సంచారవాదానికి, దారికి దివిటీపట్టిన కథలు. సాంప్రదాయ కట్టుబాట్లు తెంచుకుని భూమి, చదువు, అధి కారంకోసం ధిక్కారాన్ని ప్రదర్శించిన బహుజనపోరాటమే ఈ ‘గంగెద్దు’ కథలలో కన్పిస్తుంది.

ఈ సంపుటిలో ‘గంగెద్దు’ కథ గంగెద్దుల వారి సంచార జీవితాన్ని పట్టిచూపిన కథ. కథలో శివుడు తండ్రి గట్టయ్య ప్రమాదవశాత్తు గంగెద్దునాడించే సమయంలో చని పోతాడు. ఊరిపెద్ద కరణం పంతులు గట్టయ్య చనిపోయాక గంగెద్దునూ, ఊరి భూములన్నీ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఊరంతా అతని మాటకు గంగెద్దులా తల ఊపే బాపతులా ఉంటుంది. ఉపాధి, ఉద్యోగాలులేని నేటి యువతకు ప్రతినిధిగా శివుడు, నియంతలా మారిన నేటి రాజకీయనాయకులకు ప్రతీకగా ఊరిపెద్ద కరణం పంతులు కనబడుతారు. కథలో భూమికి ప్రతీకగా ‘గంగెద్దు’ కన్పిస్తుంది. ప్రతీకా త్మకంగా చెప్పిన ఈ కథలో గంగెద్దుపోరాటం వలన అంతిమంగా సంచారులకు భూమి, స్థిరజీవనం లభిస్తుంది. హెగెల్‌ చెప్పినట్టు ఇది సహజంగా లభించలేదు. భూమి మనిషికి ఉపాధి మాత్రమే కాదు, మనిషికి ‘తావు’. నిజాం అధికారానికి ఎదురు నిలిచి పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి ‘తావు’ కథలో గిరిజన మహిళ శాంతమ్మ పాత్రలో కన్పిస్తుంది. రజాకార్ల దురాగతాలు ముస్లింలపై కూడా జరిగాయని పట్టిచూపే కథ ‘కాగడ’. ఈ కథలో మైబెల్లి పాత్ర పాఠకుల హృద యాల్లో అచిరకాలం నిలిచిపోయే పాత్ర. గతంలో రచయితలు హిందూ ముస్లింల ఐక్యతను గురించిన కథలు రాశారు. కానీ సమాజంలో అడుగునున్న దళిత, దూదేకుల సమ జీవన, శ్రమ సామరస్యాన్ని చెప్పిన మొదటి కథ ‘పాకీజ’. చాలా కాలంగా పారిశుధ్ధ్య కార్మికులుగా మేతరి, రెల్లి, దళితులు పనిజేస్తున్నారు. వాళ్ళు ఇంకా అదే వృత్తిలో కొనసా గడానికి కారణమెవరన్నది నాగరిక సమాజం ఆలోచించాలి. అధికారం దక్కగానే కాపాడుకోవడానికి చేసే నీచ ప్రయత్నాలను ఎండగట్టిన కథ ‘కుర్చీ’. గొప్ప శిల్ప నైపుణ్యానికి ఈ కథ ఉదాహరణ. అధికారం దక్కగానే దళిత, బహుజన ఉద్యోగులను వేధించే నాయకుల గురించి హాస్యస్పోరకంగా చెప్పిన కథ ‘భయం’. ఆ ఉద్యోగుల మానసిక స్థితిని హృద్యంగా అంతస్రవంతి శిల్ప నైపుణ్యంతో చెప్పిన ‘అద్దం’. అడుగు జీవితాలలో సామాజిక హోదా భద్రత కరువుకు ప్రబల సాక్ష్యం ‘బ్యాడ్‌ టచ్‌’ కథ. రాజ్యాంగం విలువలు, మహిళా సాధికారతను మరిచి అప్రకటిత మనుస్మృతి అమలు చేస్తున్న పాలనా విధానాల ప్రభా వంతో సమాజంలో అంతరాలను సృష్టిస్తున్నారు. మహిళకు తగిన గౌరవం, భద్రత కల్పించడం లేదు. ఈ విషయాన్ని ‘పరువు’ కథలో చక్కగా చిత్రించాడు.

‘‘స్వతంత్య్రంగా జీవించగలిగి బానిస భావాలున్న వ్యక్తి కంటే, స్వతంత్య్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు’’ అంటారు అంబేద్కర్‌. ఆయనను ప్రపంచ మేధావిగా మార్చింది చదువు. అందుకే ఆయన రాజ్యాంగంలో చదువును ప్రాథమిక హక్కుగా చేర్చాడు. పాలకుల నిర్ణయాలు, ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానం వలన విద్య పేదవానికి అందని ద్రాక్షయింది. ‘గంగెద్దు’ సంపుటిలో అంబేద్కరిజాన్ని, చదువు గొప్పదనాన్ని పట్టి చూపిన కథ ‘గంట’. ఈ కథలో గ్రామీణ పేదలకు అనారోగ్యం, వారి పిల్లలకు ఆకలిని చిత్రించింది. అప్పులు తీర్చుకోవడం కోసం పనిగంట, ఆకలి తీర్చుకోవడం కోసం గుడిగంటలో బందీ అయిన ఊరి బాల్యాన్ని బడిగంటతో ముడి పెట్టి కథకు చక్కని ముగింపునిచ్చాడు. అడుగు వర్గాల ఎదుగుదలకు చదువు ముఖ్యమనే అంబేద్కర్‌ భావన రచయితలో బలంగా ఉన్నట్టుంది.

తెలంగాణ తెలుగు నిండైన భాష. నిర్మాణ పరంగా ఇక్కడి భాషా వైవిధ్యం గొప్పది. అందుకే వ్యాపార, వాణిజ్యాలలో తెలంగాణ భాషకు అగ్రపీఠం వేస్తున్నారు. భాషపరంగా వస్తున్న మార్పులను, గొప్పద నాన్ని విశ్వవిద్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశోధించి రికార్డు చేయాలి. రాష్ట్ర సాధనోద్యమన్ని సాహితీవేత్తలే ముందుండి నడిపించారు. సాహితీ అవార్డులు, పీఠాల నియామకాలలో దక్షిణ తెలంగాణపై వివక్ష ఉంది. స్కూల్‌ స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు భాషాపరంగా సరైన అకడమిక్‌ స్థాయి భాషా నిర్మాణం జరగడం లేదు. అధికారానికి దగ్గరగానున్న వారి పెత్తనంతో వారు చెప్పిందే తెలంగాణ భాషగా చెలామణి అవుతుంది. నేటి సాహిత్యంలో వలసవాదం, ఉత్తర తెలం గాణ పెత్తనం, ముఠాలు, కోటరీలు, ఒక రాజకీయపార్టీకి వత్తాసు పలకడం, అవార్డుల పిచ్చి ప్రధాన సమస్యలుగా మారిపోయాయి. ప్రజాపోరాటాన్ని, బాధలను రాయడం మరిచిపోయారు. వారికి బానిస పత్రికాధిపతులు, అధికార వ్యామోహం కలిగిన నేతలు తోడయ్యారు. సాహిత్యం విశాలమైనది. రాజకీయం అందులో ఒక భాగం మాత్రమే. సాహిత్యకారులు ఏకంగా పార్టీ కార్యకర్తల్లా పనిజేస్తున్నారు.

శీలం భద్రయ్య విద్యావంతుడు. తెలుగు అధ్యాపకుడు. కథ, కవిత్వంలో ‘యాసనే’ శ్వాసగా బతుకుతున్నవాడు. తెలంగాణ భాష, వస్తువు, శిల్పం, రచనా సౌందర్యాన్ని ఇనుమడించి కథలు రాస్తు న్నాడు. బోయ జంగయ్య తరువాత కథామెరుపును దక్షిణంవైపు మళ్ళించాడు. తీరాంధ్ర, రాయలసీమ మాండలిక కథకు ధీటుగా తెలంగాణ కథను పండిస్తున్నాడు. అండ్ల దుర్గం, ఇండ్ల దుర్గంగాళ్ళ గందరగోళం వదిలి ‘గంగెద్దు’ కథల్లాంటి సాహితీ సాల్లు దున్ని, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే మరో సాహితీ ఉద్యమం మొదల యింది. ఈ కారణంతో అటువైపు అడుగులేద్దాం కలిసిరండ్రీ...

వేముల ఎల్లయ్య

9440002659

Updated Date - 2023-03-20T02:43:02+05:30 IST