ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి

ABN , First Publish Date - 2023-05-31T22:22:15+05:30 IST

నానాటికీ సత్తుపల్లి పట్టణం విస్తరిస్తోంది. సింగరేణి గనుల ఏర్పాటుతో మరింత విస్తృతమవుతోంది. ఫలితంగా ఖాళీ స్థలాలనేవీ కన్పించడం లేదు. ఉన్న స్థలాలు కూడా ఎక్కడో పట్టణానికి దూరంగా ఉన్నాయి.

ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి
హిందూ స్మశాన వాటిక

సత్తుపల్లి, మే 31: నానాటికీ సత్తుపల్లి పట్టణం విస్తరిస్తోంది. సింగరేణి గనుల ఏర్పాటుతో మరింత విస్తృతమవుతోంది. ఫలితంగా ఖాళీ స్థలాలనేవీ కన్పించడం లేదు. ఉన్న స్థలాలు కూడా ఎక్కడో పట్టణానికి దూరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఎవరైనా కన్నమూస్తే ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించే వారు. దీనిపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలుండేవి కావు. కానీ పట్టణం విస్తృతమయ్యాక ఖాళీ స్థలాలు అనేవీ కన్పించడంలేదు. పైగా శ్మశాన వాటికలు నిర్మించినప్పటికీ మృతదేహాల దహనానికి చెక్కలు(కర్రపుల్లలు) కొరత ఉంది. ఈక్రమంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు వచ్చిన ఆలోచన గ్యాస్‌ క్రిమటోరి యం(ఫర్నేస్‌). కానీ, సత్తుపల్లిలో దీని ఏర్పాటు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది.

అభ్యంతరాలతో నిలిచిపోయింది

సత్తుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు గానూ ప్రతిపాదించిన గ్యాస్‌ క్రిమటోరియం (ఫర్నేస్‌) జిల్లా అధికారుల అభ్యంతరాలతో నిలిచిపోయింది. శ్మశానవాటికలో గ్యాస్‌ క్రిమటోరియం భవనం నిర్మాణానికి రూ.30లక్షలు, వైకుంఠ మహాప్రస్థానం, బోరు, పైప్‌ లైన్‌ నిర్మాణం, టాయ్‌లెట్స్‌, షవర్స్‌ నిర్మాణానికి రూ.13లక్షలు, గ్యాస్‌ క్రిమటోరియం పరికరాలు అమర్చేందుకు రూ.35లక్షలతో అఽధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2018లో పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారు. పనులు పంచాయతీరాజ్‌ ఇంజనీరియంగ్‌ శాఖ పర్యవేక్షణలో జరగాలని ఆదేశిం చారు. దీనికి సంబంధించి 2016-17లో అప్పటి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సత్తుపల్లి హిందూ శ్మశానవాటిక అభివృద్దికి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.43లక్షలు కేటా యించారు. టెండర్లు పూర్తి కాగా, గ్యాస్‌ క్రిమటోరియం కోసం డిజైన్‌ చేసిన భవన నిర్మాణం పూర్తయింది. కానీ భవనంలో గ్యాస్‌ క్రిమటోరియానికి సంబంధించిన పరికరాలు అమర్చక పోవటంతో నిరుపయోగంగా మారింది. రెండేళ్ల పాటు కరోనా కారణంగా పనులు సాగకపో వటం ఇందుకు మరొక కారణం.

అధికారుల అభ్యంతరాలు...

జిల్లా అధికారుల పర్యటన సందర్భంగా శ్మశానవాటికలో గ్యాస్‌ క్రిమటోరియం నిర్మిం చొద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దానికి బదులుగా విద్యుత్‌ క్రిమటోరియం (ఫర్నేస్‌) నిర్మించాలని సూచించారు. దీంతో ఇటు గ్యాస్‌ క్రిమటోరియం పనులు సాగక, మరో పక్క విద్యుత్‌ క్రిమటోరియం మంజూరు కాక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. విద్యుత్‌ క్రిమటోరియం నిర్మాణానికి రూ.కోటికిపైగా ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అం టున్నారు. అయినా విద్యుత్‌తో ఏర్పాటు చేసే క్రిమటోరియం సక్రమమైన ఫలితాలు రావటం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఖమ్మంలో కూడా విద్యుత్‌తో మృతదేహాల దహనం సక్రమంగా జరగకపోవటం వల్లే ఇబ్బందులు న్నాయని వారు చెబుతున్నారు.

గ్యాస్‌ స్థానంలోప్రతిపాదనలు: కమిషనర్‌

కట్టెపుల్లలను మండించటం ద్వారా వచ్చే గ్యాస్‌ ఆధారంగా నిర్మించాలనేది ముందుగా ప్రతిపాదన అని సత్తుపల్లి మునిసిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు. కానీ దాని స్థానంలో విద్యుత్‌ క్రిమటోరియం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు సూచించటంతో గ్యాస్‌ పరికరాలు అమర్చలేదన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆమె వివరించారు.

Updated Date - 2023-05-31T22:22:15+05:30 IST