ఎస్పీ బాలు చిరకాల వాంఛ తీరేనా?

ABN , First Publish Date - 2023-06-03T01:53:57+05:30 IST

నెల్లూరు టౌన్ హాల్‌లో తొలుత నాటక వేషాలతో మొదలైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం, ప్రపంచంలోనే అద్భుత గాయకుడిగా పేరుపొందే దాకా సాగింది.

ఎస్పీ బాలు చిరకాల వాంఛ తీరేనా?

నెల్లూరు టౌన్ హాల్‌లో తొలుత నాటక వేషాలతో మొదలైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం, ప్రపంచంలోనే అద్భుత గాయకుడిగా పేరుపొందే దాకా సాగింది. పదమూడు భాషల్లో దాదాపుగా 45 వేల పాటలు పాడిన బాలు అర్ధంతరంగా వెళ్లిపోయినా, భారతీయ సంగీత విద్వాంసుల మనోఫలకంపై నిద్రిస్తున్న అసామాన్య గాయకుడు బాలు. జూన్‌ 4న ఎస్పీ బాలు జయంతి సందర్భంగానైనా ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఎస్పీ బాలు నెల్లూరు నగరంలో తాను అనుకున్నవన్నీ సాధించుకుంటూ వచ్చారు. తన తండ్రిగారి విగ్రహం నెల్లూరులో నెలకొల్పాలని సంకల్పించి, దానిని నెరవేర్చుకున్నారు. తల్లిదండ్రులతో తాను నివసించిన ఆవాసాన్ని ఒక వేద పాఠశాలగా, సంగీత పాఠశాలగా చూసుకోవాలనే ఒక సదాశయంతో కోట్ల రూపాయల విలువచేసే ఆ భవనాన్ని కంచి కామకోటి పీఠానికి ఉచితంగా అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో సాధించుకున్న ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన కాంస్య విగ్రహం నెలకొల్పాలని అనుకున్నారు. అది కార్యరూపం దాల్చినట్టే దాల్చి చివరి క్షణంలో జారిపోవడం, వారికి తీరని కోరికగా మిగిలిపోయింది.

ఆ సమయంలో ఉపసభాపతిగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వారి సహకారంతో తిక్కన విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయడానికి ఎస్పీ బాలు విశేష కృషి చేశారు. మహాభారతంలో 15 పర్వాలు 15,901 పద్యాలు రచించిన తిక్కన విగ్రహం నెల్లూరులో లేకపోవడం చాలా లోటుగా ఉందని అనేక సభల్లో బాలు ప్రస్తావించారు. అన్ని జిల్లాలలో విశ్వవిద్యాలయాలకు అక్కడి పండితులు పేర్లు పెట్టినప్పటికీ, నెల్లూరులో తిక్కన పేరు పెట్టకపోవడం పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తపరుస్తూనే వచ్చారు. అలాంటి వేదనతోనే నెల్లూరులో కాంస్య విగ్రహాన్ని ఏర్పరచాలని, అనేక కార్యక్రమ ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ ఆ విగ్రహ ఏర్పాటుకు నడుం బిగించారు. తిక్కన విగ్రహ ఆవిష్కరణతో పాటు తెలుగు మహోత్సవం పేరుతో భాషా పండగలను ఏర్పాటుచేయడానికి కూడా అప్పట్లో ఆయన విశేష కృషి చేశారు. విగ్రహం ఎలా నిర్మించాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎలా ప్రాంగణాన్ని శోభయానమానంగా అలంకరించాలని ఒక పథకాన్ని కూడా స్వయంగా ఆయన రూపొందించుకుని అప్పటి కలెక్టర్ ముత్యాల రాజుకు అందజేశారు. మండలి బుద్ధప్రసాద్ కూడా కార్యాచరణకు రంగం సిద్ధం చేశారు.

అయితే సరిగ్గా ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఎన్నికల సమయం రావడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తిక్కన విగ్రహ ప్రతిష్ఠాపనను పట్టించుకోకపోవడంతో ఆ కాంస్య విగ్రహం ఇప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక పాఠశాలలో చీకటి గదిలో బూజు పట్టి అలాగే ఉండిపోయింది. ఆలనా పాలనా లేకుండా మహాకవి తిక్కన విగ్రహం చీకటి గదిలో బందిఖానలో ఉన్నట్టయింది. కానీ ఎస్పీ బాలు చిరకాల వాంఛపై అధికారులు ఎన్నికల తరువాత, బాలు మరణానంతరం స్పందించినా అటు పిమ్మట ఆ మాట మరచిపోయారు. జిల్లా అధికారులు మారుతున్నప్పటికీ వారందరి దృష్టికీ బాలు అభిమానులు ఈ విగ్రహ ఏర్పాటు విషయాన్ని తీసుకెళ్లినా కూడా నాలుగేళ్లుగా మంత్రులుగానీ, అధికారులు గానీ దృష్టి సారించలేదు. దీంతో బాలుకు తీరని కోరికగానే తిక్కన విగ్రహ ఏర్పాటు మిగిలిపోయిందని యావత్తు తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విగ్రహం ఏర్పాటు అనుకున్న తర్వాతనే 100 అడుగుల జాతీయ జెండా స్థూపాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత మహాత్ముని విగ్రహాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఆవిష్కరించారు. కానీ తిక్కన విగ్రహానికి మాత్రం రాజకీయ రంగు పులిమి ఇప్పటికీ చీకటి గదికే పరిమితం చేశారు. ఈ విగ్రహ ఏర్పాటు బాలు కోరికే కాకుండా యావత్తు తెలుగు భాషాభిమానులు, సంగీత అభిమానుల కోరిక. ఇప్పటికయినా తిక్కన కాంస్య విగ్రహాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈతకోట సుబ్బారావు

Updated Date - 2023-06-03T01:53:57+05:30 IST