Share News

శతవర్ష సుందరం

ABN , First Publish Date - 2023-11-18T02:25:45+05:30 IST

తెలుగు సాహిత్యలోకంలో అన్ని ప్రక్రియలలో సాహిత్య సృష్టి చేసిన ధృవతార శ్రీ సోమసుందర్. అభ్యాస ప్రతిభావ్యుత్పత్తులు అపారంగా ఉన్న కొద్దిమంది సాహితీవేత్తలలో వీరొకరు.

శతవర్ష సుందరం

తెలుగు సాహిత్యలోకంలో అన్ని ప్రక్రియలలో సాహిత్య సృష్టి చేసిన ధృవతార శ్రీ సోమసుందర్. అభ్యాస ప్రతిభావ్యుత్పత్తులు అపారంగా ఉన్న కొద్దిమంది సాహితీవేత్తలలో వీరొకరు. ఎనిమిది దశాబ్దాలకు పైగా రచయితగా, కవిగా, విమర్శకునిగా, అనువాదకునిగా, వక్తగా ఒక అరుదైన ప్రతిభను, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని సాధించి ఆంధ్ర సాహిత్య విహాయసంలో విశృంఖల విహారం చేసిన శేముషీ దురంధరులు శ్రీ సోమసుందర్.

తొలిదశలో ఛందోబద్ధంగా వ్రాసినా, వేంకట పార్వతీశ కవులు, కృష్ణశాస్త్రి వంటి కవుల కవితా ధోరణికి ఆకర్షితులైనా, తర్వాత కొత్త తెన్నులు వెతుక్కున్నది వీరి పెన్ను. వచన కవిత తన మార్గంగా ఎంచుకుని అభ్యుదయ కవితా మార్గంలో అడుగుపెట్టేరు. తదాది సామ్యవాద చింతనతో సామాన్యుడు సాహిత్యము వీరి తాత్త్విక భూమిక అయి, ఆ నిబద్ధత జీవితాంతము కొనసాగింది.

అభ్యుదయ సాహిత్యంలో ఆజానుబాహువు, విమర్శలో నిర్మొహమాటి, అనువాదకునిగా అరుదైన కలం, చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు, చేపట్టి కృతకృత్యుడు కానిదీ లేదు. వ్యక్తిగతంగా సర్వతంత్ర స్వతంత్రుడు. ఆర్థికంగా స్థితిపరుడు కనుక ఉద్యోగించే అవసరం రాలేదు. అది ఆంధ్ర సాహిత్య ప్రపంచానికొక అనుకోని వరమైంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో భావకవిత తెలుగునేల నాలుగుచెరగులా అల్లుకుంటున్న సమయంలో 1924 నవంబరు 18న శంఖవరంలో కాళ్ళకూరి సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించారు. నాల్గవ యేట పినతల్లికి దత్తుడుగా వెళ్ళటంతో ఆవంత్స వారయ్యారు. 1928లో పిఠాపురం వచ్చారు. పిఠాపురం కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్‌లో క్రియాశీలంగా పనిచేశారు. 1942 అక్టోబర్‌లో కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యత్వం స్వీకరించి 1954 వరకు కొనసాగేరు. తర్వాత పార్టీని వదలిపెట్టి సాహిత్యమే నా సర్వస్వం అన్న నిశ్చయానికి వచ్చారు. పినతల్లి కంఠస్థం చేయించిన కృష్ణశతకం, ఆ తర్వాత పోతన భాగవతం చదివించటంతో తెలుగు కవితతో మొదటి పరిచయం అయిందని చెప్పుకున్నారు.

ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాల్లో లోతైన అవగాహన కల వీరు విమర్శ పైనా దృష్టి సారించారు. కృష్ణశాస్త్రి, శేషేంద్ర, తిలక్, నారాయణబాబు, అనిసెట్టి వంటి కవులపై వ్యాఖ్యానాత్మక విమర్శా గ్రంథాలు ప్రకటించారు. ఇట్టి వ్యాఖ్యానాత్మక విమర్శలకు ఒక వరవడి ప్రారంభించి ప్రాచుర్యం కల్పించింది వీరే. వీటికి అమృతవర్షిణి, రుధిర జ్యోతిర్దర్శనం, నారాయణ చక్రం, శేషేంద్ర జాలం, నూరుశరత్తులు, అగ్నివీణను ఆలపించిన అణుసంగీతం వంటి పేర్లు పెట్టేరు. స్వీయ రచనలైన దీర్ఘకవితలకు పెట్టిన పేర్లు ప్రాగ్వదనం, క్షితిజ రేఖలు, అరిచే లోయలు, పశ్చిమ విష్కంభం, నా కరాలు గోదావరి శీకరాలు, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్స్, ఆమ్రపర్ణి ఇలా భావస్పోరకంగా కవితాత్మకంగా ఉంటాయి. వశ్యవాక్కు, శబ్ద ప్రభుత గల కవి రాస్తే వచనం కూడా రసరమ్య గీతంలా ఉంటుంది. ఈ రమ్యత పై గ్రంథాలలో చూడవచ్చు.

సోమసుందర్ గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వజ్రాయుధం గురించి చెప్పనిదే సంపూర్ణం కాదు. దొడ్డి కొమరయ్య హత్య, నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ సాయుధ పోరాటం వీరిని తీవ్రంగా కదిలించి వేశాయి. యువకవి హృదయంలోంచి అక్షర రూపంగా వచ్చిన విప్లవం వజ్రాయుధం. 1945 మార్చ్‌లో విడుదలయింది రాంషా ప్రకాశకుడుగా. దీన్ని తెలంగాణా పోరాట జ్యోతి, శ్రామిక జననాయకులు రావి నారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు.

‘ఖబడ్దార్ ఖబడ్దార్ నిజాం పాదుషాహే/ బానిసత్వ విముక్తికై/ రాక్షసత్వ నాశముకై/ హిందూ ముస్లిమ్ పీడిత శ్రమ జీవులు ఏకమైరి/ కోట్ల కోట్ల బానిసలను పీల్చి కూల్చి నిర్మించిన నీ రాక్షస సింహాసనం కదుల్తోంది.. అంటూ చివరగా ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు, ఒక నెత్తురు బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు... అని ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. తెలంగాణ గ్రామాల, హైదరాబాదు ఓల్డ్ సిటీ గోడల మీద కనిపించిన నినాదమిది. ఆ సమయంలోనే సాయుధ పోరాటంలో పాల్గొనాలని మీ దగ్గర కొచ్చాను అని చండ్ర రాజేశ్వరరావు గారితో అంటే, తుపాకులు పేల్చే వాళ్ళు చాలామంది ఉన్నారిక్కడ, నువ్వు కవిత్వం రాసుకో చాలు అన్నారట! తెలంగాణా వేర్పాటువాదాన్ని ఏ శషభిషలు లేకుండా అంగీకరించారు. ఈ ఉద్యమాన్ని సాహిత్య సాంస్కృతిక ఉద్యమం, రాజకీయ ఉద్యమం అని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో మొదటి దానికి స్పష్టత, నిజాయితి ఉంటుంది. రాజకీయంలో ఎవరి భావాలు వారికుంటాయి అని వివరణ కూడా యిచ్చారు.

సన్మానాల బిరుదుల ధ్యాస అసలు లేదు, అవన్నీ ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలు, ‘సోమ సుందర్’ అన్న పంచాక్షరి నా పేరే నా బిరుదు అన్న ధిషణాహంకారి! అయినా కొన్ని పురస్కారాలు వీరిని వరించాయి. మద్రాసు రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, గురజాడ స్మారక అవార్డు, 2008లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి వారిచ్చిన కళారత్న, ఎన్‌టీఆర్ జాతీయ పురస్కారం, లోక్‌నాయక్ పురస్కారం అందుకున్నారు.

వీరు సంగీత పరిజ్ఞాన మున్నవారని, భారతీయ సంగీతవేత్తల జీవన రేఖలు ‘హంసధ్వని’ అనే సంకలనం వెలువరించారని, పసిడి రధం పేరుతో బాల గేయాలు రాశారని, యథావాక్కుల శ్రీనాథ సూరి అనే కలం పేరుతో కొన్ని విమర్శా వ్యాసాలు (ముఖ్యంగా కొడవటిగంటి వారిపై) రాశారని చాలా మందికి తెలియని విషయాలు. 1968లో ప్రారంభించి 1975 వరకు ‘కళాకేళీ’ పేరుతో సాహిత్య పత్రికను నడిపారు.

తెలుగు సాహిత్యానికి తన వంతు సేవగా డా. ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్‌ 2001లో స్థాపించి తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో విశేష కృషి చేసిన వారికి పురస్కారాలు అందచేశారు. నిరంతర అధ్యయన శీలి అయిన వీరికి రవీంద్రుని ‘వేర్‌ ద మైండ్‌ ఈజ్‌ వితౌట్‌ ఫియర్‌’ అన్నమాట జీవితాంతం ప్రేరణ అంటారు. నేను రాస్తున్న క్షణాలు నేను బతుకుతున్న క్షణాలు అని ఒక చోట చెప్పుకున్నారు.

నిరంతర కవితా యాత్ర చేస్తూనే జీవ యాత్ర చాలించారు. కళాకేళీ (పిఠాపురంలో వీరి మేడ) ఖాళీ చేసి 2016 ఆగస్ట్‌ 12న, ఒక వెన్నెల రాత్రి చెట్టునుంచి పారిజాతం రాలినంత నిశ్శబ్దంగా రంగరాయ వైద్య కళాశాల మార్చురీకి మారిపోయారు. అక్షరమైన అక్షరాలు ఆగామి తరాలకు మిగిల్చిపోయారు. జయంతి తే రస సిద్ధాః కవీశ్వరాః...

ప్రసాదవర్మ కామఋషి

(నేడు సోమసుందర్ శతజయంతి)

Updated Date - 2023-11-18T02:25:46+05:30 IST