Share News

ఆరు గ్యారంటీలు...వడివడిగా అడుగులు!

ABN , Publish Date - Dec 28 , 2023 | 02:15 AM

ఏ దేశ‌మైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు, ర‌వాణా సౌక‌ర్యం బాగా ఉండాలి. ఇవి రెండూ బాగున్నప్పుడే కావాల్సిన అభివృద్ధిని సాధించ‌వ‌చ్చు. ఇదే కాకుండా మ‌హిళ‌లు...

ఆరు గ్యారంటీలు...వడివడిగా అడుగులు!

ఏ దేశ‌మైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు, ర‌వాణా సౌక‌ర్యం బాగా ఉండాలి. ఇవి రెండూ బాగున్నప్పుడే కావాల్సిన అభివృద్ధిని సాధించ‌వ‌చ్చు. ఇదే కాకుండా మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో రాణించడం కూడా ముఖ్యం. మ‌హిళా సాధికార‌త‌తోనే అభివృద్ధి సాధ్యం అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ రెండింటీలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఆర్టీసీ బ‌స్సుల‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అనే వాగ్దానం చేసింది. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలు మేనిఫెస్టోల‌లో అనేక అంశాల‌ను చేర్చ‌డం, ప్ర‌చార స‌మ‌యంలో హామీలు ఇవ్వ‌డం చూస్తుంటాం. కానీ ఇచ్చిన హామీని ప్ర‌భుత్వం వ‌చ్చిన వారంలోపే అమ‌లు చేయ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం. ఇదే కాకుండా, ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి తొలి సంత‌కాన్ని కూడా ఆరు గ్యారంటీల హామీల‌పైనే చేయ‌డం ప్ర‌జా పాల‌న‌లో తొలి అడుగుగా చెప్పుకోవ‌చ్చు. హామీలు ఇవ్వ‌డం కాదు, వాటిని అమ‌లు చేస్తామ‌నే సందేశాన్ని ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఇచ్చారని అర్ధం చేసుకోవ‌చ్చు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ కూట‌మే కావ‌చ్చు. కానీ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అదే కాంగ్రెస్‌కు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారం మాత్రం దొర‌క‌లేదు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సార‌ధ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఇచ్చిన హామీల‌లో ఆర్టీసీ‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కాన్ని రూ.5ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచడం... వీటిని అమలు చేశారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 6 గ్యారంటీల అమ‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుంద‌న్నది స్ప‌ష్టం. సీఎంగా రేవంత్‌రెడ్డి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స‌మా వేశంలోనూ ప్ర‌భుత్వ పాల‌నాంశాల‌తో పాటు 6 గ్యారంటీల అమ‌లు గురించే చ‌ర్చించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌జా పాల‌న‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు, మార్పుల దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తూ పోతుంది. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ఏమిటి, వాటి ప‌రిష్కారానికి ప్ర‌భుత్వమూ అధికార యంత్రాంగమూ చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు ఏమిటన్న అంశాల‌ను తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న వ‌స్తున్నది. ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి ప్ర‌భుత్వ విభాగాల వారీగా ఉన్న‌త‌ అధికారులు అందుబాటులో ఉంటూ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న అర్జీల‌ను వారంలో రెండు రోజుల చొప్పున స్వీక‌రిస్తూనే ఉన్నారు. స్వీక‌రించిన ప్రతి ద‌ర‌ఖాస్తుకు శాఖ‌ల వారీగా చేప‌ట్టాల్సిన ప‌నులు, తీర్చాల్సిన స‌మ‌స్య‌ల వారీగా ఒక సిటిజ‌న్ చార్ట్ ప్ర‌కారం ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తెస్తే ప్ర‌జాపాల‌న ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు వ‌రాలుగా మారే అవ‌కాశం ఉంటుంది. ఇదే ప్ర‌జావాణిని గ్రామ స్థాయి నుంచి కూడా ఫిర్యాదుల‌ను స్వీక‌రించే ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను కూడా అందుబాటులోకి తెస్తే ప్ర‌జ‌ల‌కు కొంత భారం త‌గ్గే అవ‌కాశం కూడా ఉంటుంది.

ప్ర‌జా పాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తిం చేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ అభ‌య‌హ‌స్తం గ్యారంటీల అమ‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబ‌రు 28 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు అభ‌య‌హ‌స్తంలోని 6 గ్యారంటీల‌కు అర్హులైన ల‌బ్ధిదారుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆరు గ్యారంటీల‌లో ఉన్న అన్ని ర‌కాల ప‌థ‌కాలు ఒకే ద‌ర‌ఖాస్తుపై రాసి ఇచ్చే స‌దుపాయాన్ని క‌ల్పించారు. కేవ‌లం ఆధార్ కార్డు ఉంటే చాలు, రేష‌న్ కార్డు లేకున్నా కూడా ఫర్వాలేదంటూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టిం చ‌డంతో అర్హులంద‌రికీ ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ల‌భించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణంలో ఉన్న అర్హులైన‌ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ద‌ర‌ఖాస్తు స్వీక‌రించేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా జ‌రిగిపోయాయి.

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న మొద‌లైంది. 6 గ్యారంటీల అమ‌లుకు వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ 6 గ్యారెంటీల అమ‌లు సాధ్యాసాధ్యాల మీదే చ‌ర్చ జ‌రుగుతుంది. ‘మహాలక్ష్మి’లో భాగ‌ంగా రాష్ట్రవ్యాప్తంగా మహి‌‍ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం, గృహజ్యోతి కింద‌ ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, చేయూత కింద పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం, ఇందిరమ్మ ఇళ్ల కింద‌ ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం, యువ వికాసం కింద‌ విద్యార్థులకు రూ.5లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు, త‌దిత‌ర హామీలున్నాయి. వీటిలో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, 200 యూనిట్ల క‌రెంటు ఉచితం. వీటి గురించి ఒకసారి ప‌రిశీలిస్తే ఈ రెండూ కూడా అర్హులైన వారికి అందాల్సిందే. ఆర్టీసీ ఛార్జీ కిలోమీట‌రు పైస పెంచినా, విద్యుత్తుకు యూనిట్‌కు రూపాయి పెంచినా ప్ర‌జ‌లు రోడ్లు ఎక్కి ఆందోళ‌న‌లు చేసిన‌ సంద‌ర్భాల‌ను మ‌నం చూశాం. అంటే ఇవి రెండూ కూడా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలుగానే భావించాలి.

ఆరు గ్యారంటీల అమ‌లు ప్ర‌భుత్వానికి భారంగా మారుతుంద‌నే చ‌ర్చ ఉంది. ప్ర‌జా సంక్షేమాన్ని చేప‌ట్టాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌దే. ఇవ్వ‌న్నీ కూడా అర్హులైన ప్ర‌జ‌ల కోస‌మే. ఆడీ కారున్న మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో తిరిగే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా. ఇంట్లో నాలుగు ఏసీలుంటే 200 యూనిట్ల ప‌థ‌కానికి అర్హులు కాదు. ఇళ్లు లేని పేద‌ల‌కు గృహాలు నిర్మించి ఇవ్వాల్సింది ప్ర‌భుత్వ బాధ్య‌తే. తెలంగాణ కోసం ఉద్య‌మం చేసిన ఉద్య‌మ‌కారుల‌ను సైతం ఆదుకోవాల్సింది కూడా ప్ర‌భుత్వ‌మే. రైతుల‌ను, కౌలు రైతుల‌ను, వ్య‌వ‌సాయ కూలీల‌ను సైతం ఆదుకునేందుకు రైతు భ‌రోసాను ప్ర‌క‌టించింది. అన్ని ర‌కాల అర్హ‌తలు ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త చదువుల‌కు రూ.ల‌క్ష‌ల్లో ఉన్న కాలేజీ ఫీజుల‌కు ఏడాదికి కేవలం రూ.35వేలు మాత్రమే ఇస్తోంది. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థులపై ఫీజుల భారం ప‌డుతూంది. విద్యా భ‌రోసా కార్డుతో ఈ వ‌ర్గాలకు నాణ్య‌మైన ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం ల‌భించ‌నుంది.

ప్ర‌భుత్వాలు, పాల‌కులు వారి సొంత ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేని ఎన్నో ర‌కాల ప‌నులను చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్టు ప‌నుల‌తో నేటికి కూడా ఫ‌లాలు అందిన ప‌రిస్థితి లేదు. కానీ ఈ ఆరు గ్యారంటీలనేవి ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా ఫ‌లితం వ‌చ్చి ల‌బ్ధి జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు. అభివృద్ధి పేరుతో ఎన్నో ర‌కాల సంస్థ‌ల‌కు భూముల‌ను, ఎన్నో ర‌కాల స‌బ్సిడీల‌ను, వివిధ రకాల రాయితీల‌ను క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వం కొంత భార‌మైనా భ‌రిస్తానంటూ స‌బ్సిడీలు, రాయితీలు, ఇళ్ల స్థ‌లాలు ఇస్తానంటే ఓర్వ‌లేక‌పోతున్నారు. ప్ర‌భుత్వాలు, పాలకులు ఉంది ప్ర‌జ‌ల కోస‌మే క‌దా. ఆ ప్ర‌జ‌లు వేసిన ఓట్ల‌తోనే ఏర్పాటైన ప్ర‌భుత్వ‌మే క‌దా. అదే ప్ర‌జ‌ల కోసం వారు ఎంచుకున్న ప‌ద్ద‌తుల్లో ల‌బ్ధి చేకూరుస్తానంటే వ్యతిరేకించ‌డం ఎంతవ‌ర‌కు సమంజసం? ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుతూ అభివృద్ధి చెందుతారంటే అంద‌రూ కూడా హ‌ర్షించ‌దగిన విష‌య‌మే. నిజ‌మైన అర్హుల‌ను ఎంపిక చేసి, వారికే అవస‌ర‌మైన ప‌థ‌కాలు అందేలా చూస్తే ఆశించిన ఫ‌లితాలు ద‌క్కుతాయి.

డా. ఎన్‌.యాద‌గిరిరావు

అద‌న‌పు క‌మిష‌న‌ర్‌, జీహెచ్ఎంసీ, హైద‌రాబాద్‌

Updated Date - Dec 28 , 2023 | 02:15 AM