Bala Srinivasamurthy: సహృదయ గురువు

ABN , First Publish Date - 2023-09-04T03:13:09+05:30 IST

సాహితీవేత్తలలో శ్రోతలను ఆకర్షించే రెండు వర్గాల వారుంటారు. ఒకరు వ్యాఖ్యాతలు, మరొకరు చమత్కారులు. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి రెండు వర్గాలకూ చెందుతారు. తెలుగు రాష్ర్టాలలో, ఆయనకు ఆహ్వానం అందిన సభలోనో, సమావేశంలోనో తేనె చుక్కల్లాంటి ఆయన వాక్యాల రుచి చూడనివారు లేరంటే అతిశయోక్తికాదు.

Bala Srinivasamurthy: సహృదయ గురువు

సాహితీవేత్తలలో శ్రోతలను ఆకర్షించే రెండు వర్గాల వారుంటారు. ఒకరు వ్యాఖ్యాతలు, మరొకరు చమత్కారులు. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి రెండు వర్గాలకూ చెందుతారు. తెలుగు రాష్ర్టాలలో, ఆయనకు ఆహ్వానం అందిన సభలోనో, సమావేశంలోనో తేనె చుక్కల్లాంటి ఆయన వాక్యాల రుచి చూడనివారు లేరంటే అతిశయోక్తికాదు. విద్యార్థుల నుండి ఉద్దండ పండితుల దాకా ఆయనను ఇష్టపడు తారు. జ్ఞానపీఠ సాహితీ శిఖరం సినారె వీరిని ‘బాలా’ అని ముద్దుగా పిలిచేవారు. సినారె అన్నా, ఆయన కవిత్వమన్నా వీరికి అమితమైన అభిమానం. ముఖ్యంగా విశ్వంభరను ఆయన ఎన్నోసార్లు చదివానని, ఎంత చదవినా దాని రుచి తరిగిపోదని మాతో అనేవారు. ఒక సందర్భంలో- ‘‘మనం కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఆస్వాదించాలి, దాశరథి రంగాచార్య జనపదాన్ని అనుభవించాలి, సినారె విశ్వంభరను ఆవాహనం చేసుకోవాలి’’ అన్నారు.

మాట్లాడితే శ్రీనివాసమూర్తి సార్‌ లాగానే మాట్లాడాలి, పాఠం చెప్పితే మూర్తి సార్‌ లాగానే చెప్పాలన్నంతగా ఆయన మాట, పాఠం విద్యార్థుల మనసుల్లో ముద్రవేసు కున్నాయి. ప్రకృతిపై ఎవరైనా భావ కవిత్వం రాస్తే ‘‘అది కొత్తబట్టలు వేసుకున్న వసంత ఋతువులాగా ఉండాలి/ పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్తున్న ఈ కాలపు కొత్త పెళ్లికూతురు నవ్వులా ఉండాలి’’ అనేవారు.


‘‘ప్రసంగం అంటే కొత్త మామిడి తొక్కు రుచిలా ఉండాలి, పాత చింతపండు పచ్చడిలా కాదు’’ అన్నది ఆయన మాటే. ఇలా ఆయన నోటి వెంట ఏ మాట వచ్చినా దాని అంతర్లీన భావం అందరిని ఆకర్షించేది. విశ్వనాథ సత్యనారాయణ నవ్య సంప్రదాయ ధోరణి వీరిని బాగా ఆకర్షించింది. ఆ నవ్య సంప్రదాయ కోవలోనే విమర్శను కొనసాగించిన కోవెల సప్రసన్నాచార్య గారిని సాహిత్యంలో తండ్రిగా భావించి గౌరవించారు.

బాల శ్రీనివాసమూర్తి వాక్పటిమకు కారణం ఆయనను ప్రభావితం చేసిన దాశరథి రంగాచార్య నవల ‘జనపదం’. ఈ నవలను ఆయన తన పదవ తరగతిలోనే చదివి దాని ప్రభావానికి తీవ్రంగా గురయ్యారు. రంగాచార్య గురించి, హైదరాబాద్‌లో జరిగిన 32వ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో మాట్లాడుతూ, ‘‘రంగాచార్య అప్పటికే రెండు నవలలు రాశారు, వాటిలో ఒకటి ‘చిల్లర దేవుళ్లు’, మరొకటి ‘మోదుగుపూలు’. అప్పటికే మా బాల్యంలో ‘చిల్లర దేవుళ్ళు’ నవల సినిమాగా కూడా వచ్చింది, ‘మోదుగుపూలు’ నవల నేనప్పటికి చదవలేదు, జనపదం నవలను అదే పనిగా మూడు సార్లు చదివా’’ అన్నారు.

ఒక సినిమా కథానాయకుడికి, ఒక క్రికెట్‌ ఆటగాడికి అభిమానులుండడం సహజం, కానీ ఒక అధ్యాపకుడికి కూడా అభిమానులుండడం విశేషం. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సినారె, విశ్వనాథ, ఎండ్లూరి సుధాకర్‌ గార్ల వరుసలో చేరే మరో అభిమాన అధ్యాపకులు గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి.

(సెప్టెంబర్‌ 5న బాల శ్రీనివాసమూర్తి జయంతి)

-ఘనపురం సుదర్శన్‌

- 90004 70542

Updated Date - 2023-09-04T03:13:09+05:30 IST