‘ఇండియా’పై మోదీ మైండ్ గేమ్!

ABN , First Publish Date - 2023-09-07T03:12:08+05:30 IST

జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం వేయి కాళ్లతో వేయి చేతులతో ముంచుకువస్తున్నప్పుడు, కళ్లూ చెవులూ మాత్రమే కాదు మనసూ బుద్ధీ కూడా విప్పార్చి ఉండాలి. ప్రతి డప్పు మోతకూ వీరంగం వేయకూడదు.

‘ఇండియా’పై మోదీ మైండ్ గేమ్!

జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం వేయి కాళ్లతో వేయి చేతులతో ముంచుకువస్తున్నప్పుడు, కళ్లూ చెవులూ మాత్రమే కాదు మనసూ బుద్ధీ కూడా విప్పార్చి ఉండాలి. ప్రతి డప్పు మోతకూ వీరంగం వేయకూడదు. ప్రతి సవాల్‌కీ పెడబొబ్బలు పెట్టకూడదు. ప్రతి చక్కిలిగిలికీ పగలబడి నవ్వకూడదు. గిల్లినప్పుడల్లా గండమోరలతో ఏడ్వకూడదు.

ఏమవుతుంది, ఇండియాను పక్కకు పడేసి, భారత్ అనే పిలిచారనుకోండి, కానివ్వండి. ప్రతిపక్ష కూటమికి కూడా అదే పేరు పెట్టుకోండి. చూద్దాం అప్పుడేం చేస్తారో? పోనీ, మీరు అధికారంలోకి వచ్చాక మళ్లీ మార్చుకోండి. పైగా అదేమీ కొత్తది కాదు కదా, ఇంగ్లీషులో ఇండియా అని రాసినచోటల్లా, హిందీలో భారత్ అనీ, తెలుగులో భారతదేశం అనీ రాస్తున్నాము కదా, ఇప్పుడు భారత్ అని రాస్తే, హిందీ రుద్దుడు జరిగిపోతుందని తప్ప పెద్దగా నష్టం ఏమీ లేదు. లోకం కొన్ని శతాబ్దాల దాకా ఎట్లాగూ, ఇండియా అనే సంబోధిస్తుంది. దక్షిణ ‌భారతం విషయానికి వస్తే, ‍సింధు నది పేరిట వచ్చిన ‘ఇండియా’ కానీ, భరతుడో భరతమునో పేరిట వచ్చిన ‘భారత్’ కానీ స్థానికంగా వర్తించేవి కావు. పర్షియన్లు పిలిచిన ‘హిందుస్థాన్’ కూడా ఉత్తరభారతానికే పరిమితం. దేశం పేరు వాడుకలో మారిస్తే, ఎట్లా గుండెలు బాదుకుంటారో చూద్దామనే కదా, వాళ్లు జీ20 ఆహ్వానాల్లో గిల్లిచూసింది! పేరు మార్చగానే, కొంప మునిగిపోయినట్టు, హాహాకారాలు, ఖండనమండనలు, విశ్లేషణలు, పేరుమార్పుకు అయ్యే లెక్కలు.. ఇవన్నీ అవసరమా? కార్టూన్లంటారా, అవి మాత్రం అవసరమే, కార్టూనిస్టులొక్కరే గిల్లికజ్జాలవారికి తొడపాశాలు పెట్టింది!

రానున్న నెలల్లో ఇటువంటి మాయలేళ్లు చాలా సంచరిస్తాయి, ఉన్నట్టుండి పెద్దగా అరిచి బెదురు పుట్టిస్తాయి. బంగారు తళుకులతో ప్రలోభానికో ప్రతిస్పందనకో ప్రేరేపిస్తాయి. చర్చ చేయవద్దని కాదు. ఏమిచేసినా ఆలోచించి చేయాలి. చర్చల స్టీరింగ్‌ను ప్రతిపక్ష కూటమి తన చేతిలో పెట్టుకోవాలి. అధికారపక్షంతో తలపడుతూనే, దాని ఆరితేరినతనం నుంచి నేర్చుకోవాలి. నరేంద్రమోదీ చూడండి, అనవసరంగా భారత్ ఇండియా మీద మాట్లాడకండి, ఉదయనిధి స్టాలిన్ సంగతేమిటో చూడండి అన్నారు. ఆయనకు అభిప్రాయాల మోహరింపు కావాలి. అందుకు పనికివచ్చే రచ్చ ఏదో గుర్తించి, కేంద్రమంత్రులకు ఆ పని పురమాయించారు.

దేశం పేరు చర్చను కొంచెం తక్కువ చేసినట్టు కనిపించినా, వచ్చే ప్రత్యేక సమావేశాల్లో అందుకోసం, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ఉండదని చెప్పలేము. అదానీ మీద మరో దుమారం రాగానే, జనం దాన్ని పట్టించుకోకుండా ఒక కనికట్టు పరిచినట్టు, ప్రత్యేక సమావేశాల వార్త వచ్చింది. దానితో పాటు ‘జమిలి’ ఊహా వచ్చింది. బీసీ వర్గీకరణ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఇట్లా అనంతమైన ఊహాగానాలు ముందుకు వచ్చాయి. సొంతంగా గెలవడానికి సానుకూలత తగ్గిపోతోందని, పోయినసారిలాగే ఏదో చివరినిమిషం బ్రహ్మాస్త్రం అవసరపడుతుందని ఒక ప్రచారం అయితే బలంగానే ఉన్నది. అందుకే, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఏదో దిమ్మతిరిగిపోయే చర్య తీసుకుంటుందని బిజెపి మీద మీడియాకు, జనానికి కూడా నమ్మకం. కొత్తగా పేరు మార్పు సంచలనం. ఇవేవీ కాకుండా ప్రత్యేక సమావేశాలు తుస్సుమనిపోవచ్చు. ఏది జరిగినా జరగకపోయినా ఒక ప్రయోజనం నెరవేరింది, అదానీ ఊసు మీడియాలో పెద్దగా లేదు.

రెండు వివాదాల్లోనూ తమకు ఉపయోగపడే తగవును తమ పూర్వానుభవం నుంచి మోదీ గుర్తించగలిగారు, బాగానే ఉంది. కానీ, పాచికలు విసరగానే ప్రతిపక్షాలు తబ్బిబ్బు అవుతున్నంతగా, ప్రజలు కావడం లేదు. చీలికలు, సమీకరణలు వంటి వ్యూహాలకు ఈ మధ్య వారి స్పందన గోరువెచ్చగా మారిపోయింది. ఐకమత్యంగా ఉండి తీరతాం అని కొన్ని చోట్ల ద్వేషవాదులను ఎదిరించి వ్యవహరిస్తున్నారు కూడా. ఉదయనిధి స్టాలిన్ మాటలు కలకలం సృష్టించిన మాట నిజమే కానీ, సంవాదం ఏకపక్షంగా లేదు. సాధారణంగా, సామాజిక మాధ్యమాలలో ఇటువంటి అంశాలకు స్పందనలు తీవ్రశ్రుతిలో ఒకే వైపు మొగ్గుతుంటాయి. కానీ, సనాతన వివాదంలో పరిస్థితి అట్లా లేదు. తన వాదనకు మద్దతుగా రాష్ట్రపతి ముర్ము విషయంలో కేంద్రం వివక్ష చూపిందన్న ఆరోపణను స్టాలిన్ ప్రస్తావించారు. సనాతనం అంటే ఏమిటో చరిత్రలోకి తవ్వే పని కాకుండా, వాస్తవాల ఆధారంగా బాధ్యతగా వాదనలు చేయండి అని మోదీ తన సహచరులకు చెప్పారు. పార్లమెంటు భవనం ప్రారంభానికి ముర్మును పిలవకపోవడం వంటి అంశాల మీద ఖండనలు విసరండి అని ఆయన భావం కావచ్చు. చరిత్రలోకి వెడితే అప్రియమైన వాస్తవాలు తారసపడతాయని ఆయన అనుకున్నారేమో? భారతీయ సమాజంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ప్రాబల్యాన్ని, అది అనేక రంగాలలో స్థాయిలలో వ్యక్తమయ్యే తీరును ఎవరైనా ఎట్లా నిరాకరించగలరు? అది చరిత్ర మాత్రమే కాదు కదా? వర్తమానం కూడా! దాదాపుగా ఉదయనిధి స్టాలిన్ ఆ మాటలన్న వారాంతంలోనే ప్రధాని మోదీ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన ఆశ ప్రకటించారు. 2047 నాటికి భారతదేశంలో కులతత్వానికి మతతత్వానికి స్థానం లేకుండా పోతుందన్నారు. సనాతనమన్న మాట వాడడం వివాదం అయింది కానీ, ఉదయనిధి ఉద్దేశించింది కూడా ప్రధాని చెప్పిన ఆదర్శమే కదా? కులతత్వం, మతతత్వం తొలగిపోవడమే కదా? అంతా అద్భుతంగా ఉన్నప్పుడు, కుల వివక్ష పోవడానికి అమృతకాలం ముగిసేదాకా గడువు ఎందుకు?

సనాతనధర్మం అనే దాన్ని నిర్వచించి, దానికి తాము ప్రతినిధులమని భావించేవారు చేయవలసిందేమిటంటే, ఉదయనిధి వంటి వారు చెబుతున్నట్టుగా అసమానత, వివక్ష తమ ‘ధర్మం’లో భాగం కాదని, తాము వాటిని వ్యతిరేకిస్తామని, సంస్కరణను తాము కోరుకుంటామని చెప్పడం. నిర్మూలన అవసరం లేకుండా సంస్కరణతో సనాతనత్వం భారతీయ సమాజానికి పనికివస్తుందని నిరూపించడం. అట్లా చేయడం కానీ, ఆ కోవలో వాదించడం కానీ అవతలివాదాన్ని పూర్వపక్షం చేయగలవు కానీ, తలకు వెలలు కట్టడం, ప్రాణాలు తీస్తామని ఆవేశపడడం వల్ల ప్రయోజనం ఏముంది? పోనీ, చాపకిందనీరులాగా వ్యాపింపజేస్తున్న కొన్ని ప్రతిపాదనలను ధైర్యంగా ప్రచారంలో పెట్టగలగాలి. ‘‘ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశమే, మునుపు భారతీయ సమాజంలో సమానత్వం ఉండేది, స్త్రీలకు సమానత్వం ఉండేది, సతీ సహగమనం ఉండేది కాదు, బాల్యవివాహాలు ఉండేవి కావు. అవన్నీ ముస్లిముల దండయాత్రల తరువాతే మొదలయ్యాయి. బ్రిటిష్ వారు వచ్చిన తరువాతే కులవివక్ష మొదలయింది, అందువల్ల సనాతన ధర్మం అంటే సోషలిజమే!’’ ఈ ప్రతిపాదనలను జనం నిజమే అని నమ్మారనుకోండి, ఇక భారతీయ గతానికి సంబంధించిన పెద్ద సమస్య పరిష్కారమయినట్టే.

ప్రజలలో చైతన్యం పెరుగుతోందో, సహనం తగ్గిపోతోందో కానీ గాలి మారుతోంది. అయినప్పటికీ, ఇటువంటి చర్చలు కత్తిమీద సాము వంటివి. జనంలో విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉన్న సామాజిక మాధ్యమాలను, సాంప్రదాయిక మాధ్యమాలను తమ కనుసన్నలలో సంచరింపజేయగలిగినవారికి, ఎప్పటికప్పుడు కొత్త వాదనలను రేకెత్తించడం సులువు. ముందుకు వచ్చిన వాదనలకు సమాధానం ఇవ్వడం కాకుండా, తామే వాదనలను రంగంలోకి దించగలిగిన యుక్తిని, శక్తిని జాతీయ ప్రతిపక్షాలు పెంచుకోవాలి. ధరల నియంత్రణ, నిరుద్యోగం, ఆర్థికంగా నిరుత్సాహకర పరిస్థితులు వంటివి ప్రభుత్వం నీళ్లు నమలవలసివచ్చే అంశాలు. తమకు అనుకూలమైన రంగంలోకి యుద్ధాన్ని లాక్కురావాలి కాని, ప్రతికూలమైన మైదానంలోకి తామే ఆకర్షితులు కాగూడదు. రాజ్యాంగంలో నుంచి తొలగించో, తొలగించకుండానో ‘ఇండియా’ వాడుకను తగ్గించాలనుకోవడం వెనుక, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి భయం ఉన్నదన్నది స్పష్టం. అది బలమైన జనాభిప్రాయంగా కూడా వ్యక్తమవుతోంది. డిసెంబర్‌లో జరగవలసిన ఎన్నికల ప్రభావం సాధారణ ఎన్నికల మీద పడకుండా పాక్షికంగానైనా జమిలి ఎన్నికలు జరపాలనుకోవడం, తరిగిపోతున్న కేంద్రప్రభుత్వ జనాదరణను సూచిస్తోంది. చెప్పుకున్న లక్ష్యానికి అనుగుణంగా బిజెపికి ముఖాముఖి పోటీ ఇవ్వగలిగితే, 2024 దేశచరిత్రలో అత్యవసరమైన మలుపుగా మారుతుంది. ఆ మలుపును నిరోధించగలిగే ప్రతికూలతలు కూడా బలంగానే ఉన్నాయి.

ప్రత్యర్థి ఏమి చేస్తాడో అన్న కుతూహలం, ఉత్కంఠ సహజమే. కానీ ఏమి చేస్తాడోనన్న భయం ఉండడం ఇటువైపు బలహీనతను తెలియజేస్తుంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటున్న మాటే మళ్లీ చెప్పుకోవాలి. యుద్ధం మొదలుకాకముందే ఎదుటివారి శక్తికి సమ్మోహితులయ్యే మేధాక్రీడలో చిక్కుకుపోగూడదు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-09-07T03:15:53+05:30 IST