మళ్లీ మళ్లీ వాళ్లేనా? మార్చిచూద్దాం!!

ABN , First Publish Date - 2023-08-31T04:17:06+05:30 IST

నూటికి ఎనభైమంది భారతీయులు నరేంద్రమోదీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని ‘ప్యూ రీసర్చి సెంటర్’ చేసిన సర్వేలో తేలింది. ఇంకో పదిరోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు...

మళ్లీ మళ్లీ వాళ్లేనా? మార్చిచూద్దాం!!

నూటికి ఎనభైమంది భారతీయులు నరేంద్రమోదీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని ‘ప్యూ రీసర్చి సెంటర్’ చేసిన సర్వేలో తేలింది. ఇంకో పదిరోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతుండగా, ఈ సత్యం బయటపడడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా భారత్ అంటే నూటికి నలభై ఆరుమందికి సదభిప్రాయం ఉన్నదని కూడా ‘ప్యూ’ కనుగొన్నది. ఇటువంటి సర్వేలు ఏవో శాస్త్ర ప్రమాణాల ప్రకారమే చేస్తారు కానీ, ప్రపంచంలోని 24 దేశాల్లో మాత్రమే, సుమారు 31 వేల మంది వయోజనుల నుంచి మాత్రమే అభిప్రాయాలు తీసుకున్నారు, అది కూడా ఐదారునెలల కిందట! భారత్‌లోని 2600 మంది కూడా అందులో ఉన్నారని తెలుసుకోవడం అవసరం. ‘ప్యూ’ ప్రకారం, ఈ అభిప్రాయదాతలందరూ వివిధ దేశాల్లోని మొత్తం జనాభాకు ప్రతినిధులే అయి ఉంటారు.

సమస్య ఎక్కడంటే, భారత్‌లో నిజంగా నూటికి 80 మంది మద్దతుదారులైనప్పటికీ, వారు ఆయనను గెలిపించే ఓటర్లు కాలేరు. దేశంలో నేరుగా దేశాధినేతను ఎన్నుకునే వ్యవస్థ లేదు కాబట్టి, ఓటర్లు తమ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను మాత్రమే ఎన్నుకోగలరు. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ సమీకరణాలపై పైచేయి కాగలిగిన జాతీయ ప్రభావాలు అసాధ్యమేమీ కావు కానీ, ప్రస్తుతం దేశంలో వాటికి పెద్దగా ఆస్కారం లేదు. మోదీ ఎన్నికల ప్రచారాంశాలలో ‘బయట పల్లకి మోత’ ఒక ముఖ్యమైన అంశం కాబట్టి, సమయోచితంగా ఈ సర్వే విడుదల అయివుంటుంది. మన అంతర్జాతీయ ఖ్యాతిలో కూడా గమనింపు చేయదగ్గ విశేషాలున్నాయి. అందులో ఒకటి, భారత్‌ను ఇష్టపడే ప్రజలు నూటికి 70 శాతం ఉన్న దేశం, ఇజ్రాయిల్!

పదవీకాలాల మధ్యలో అభిప్రాయసేకరణలు, రేటింగులు ఇవ్వడం ప‌శ్చిమదేశాలలో ఎక్కువ జరిగేవి. ఇప్పుడు మనదేశంలోనూ మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాలు వచ్చాక, రాజకీయ పోరాటాలు ఎన్నికల సమయంలో మాత్రమే కాక, నిరంతరం సాగుతున్నాయి. ఒకరి మీద ఒకరు పై చేయి కావాలనే ఆత్రుతలో దృశ్యమాధ్యమాలలో, సోషల్ మీడియాలో గొంతులు, కలాలు రెచ్చిపోతున్నాయి. తెలంగాణతో సహా అయిదు అసెంబ్లీలకు విధిగా జరగవలసిన ఎన్నికలు మాత్రమే కాక, సాధారణ ఎన్నికలు, వాటితో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ డిసెంబర్‌లోనే నిర్వహిస్తారని ఊహాగానాలు బలపడుతున్న సమయంలో రాజకీయ వాతావరణాన్ని అనుక్షణం కొత్తగా అంచనా వేయవలసి వస్తుంది. మోదీ, ఆయన పార్టీ దేశం మొత్తం మీద, అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి పై చేయిగా కనిపిస్తున్న మాట నిజం. అయితే, రాజకీయ పరిణామాల స్థితితో పాటు, గతిని కూడా అర్థం చేసుకుని మాత్రమే, రేపటి గురించి మాట్లాడగలం.


మూడోసారి కూడా తాను ప్రధాని అవుతానని మోదీ ఏ మొహమాటం లేకుండా చెబుతున్నారు. మూడోసారి గెలిచి తీరతామని కెసిఆర్ అంటున్నారు. రెండోసారి కూడా గెలవకపోతానా అని జగన్ ధీమా ప్రదర్శిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాలలో ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? అభిప్రాయ సేకరణ కోసం మీడియావారో, సర్వే సంస్థల వారో వచ్చినప్పుడు చెప్పినవి పోలింగ్ రోజు దాకా స్థిరంగా కొనసాగుతాయా? పార్టీ అధికారిక జాబితాలో ప్రకటించిన పేర్లే బిఫారమ్ లిస్టులో ఉంటాయో లేదో అనుమానంగా ఉంటే, ఓటర్లు మాత్రం ఒకే మాట మీద ఉంటారా? ఉండనక్కరలేదు, నిర్ణయం తీసుకోవడానికి తమను సన్నద్ధం చేసుకుంటూ ఉండాలి, తగిన సమాచారంతో, విచక్షణతో!

ప్రజాస్వామ్యం సారాంశం అంతా ఎన్నికల ప్రక్రియ మాత్రమే కావడం విషాదం. ప్రజాస్వామ్యం అన్నది సమాజం సకలరంగాల నిర్వహణలో, మానవ చర్యల్లో, అభివృద్ధిలో, విలువల్లో ఉండాలి. పోలింగ్ బూతులో రహస్యంగా మీట నొక్కిన ఓటరు అప్పటి తన రాజకీయ అభిమతాన్నే కాదు, అనంతరం అయిదేళ్ల కాలం దాకా తన తరఫున సర్వాధికారాలనీ కట్టబెడుతున్నాడు. ఓటు వేయడం ద్వారా తామేమి చేస్తున్నారో, ఏమి పొందబోతున్నారో, ఏమి కోల్పోబోతున్నారో, ఓటు పొందిన వ్యక్తికి కలిగే లాభమేమిటో తెలుసుకోకుండానే అత్యధికులు ఓటు వేస్తున్నారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యదేశాలలో కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. భావోద్వేగాల ఆధారంగా కొందరు, నిర్లిప్తతతో కొందరు, అజ్ఞానంతో మరి కొందరు తప్పుడు ఎంపికలే చేసుకుంటున్నారు. పదేళ్ల కిందట ఇదే ‘ప్యూ’ చేసిన ఒక సర్వేలో 57 దేశాల్లో 92 శాతం మంది అభిప్రాయదాతలు ప్రజాస్వామ్యమే ఉత్తమవ్యవస్థ అని గట్టిగా చెప్పారు. అదే సమయంలో ఆయా దేశాలలో జరిగిన వేరే అధ్యయనాలలో చట్టాలు, నియమాలు, ప్రజాస్వామ్యం వంటివి పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరించే నాయకుడు కావాలని అధికులు అభిప్రాయపడ్డారు. ఆ రెండు ఆకాంక్షల మధ్య వైరుధ్యం ఉన్నదని కూడా ఆ ప్రజాస్వామ్యవాదులకు తెలియదు.

కేవలం ఎన్నికలు ఒక్కటే ప్రజాస్వామ్యానికి పూచీ పడలేవని చెబుతూ, తత్వవేత్త రూసో ఏమన్నాడంటే, ‘‘ఇంగ్లండు ప్రజలు తాము స్వేచ్ఛగా ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు, అది కూడా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాత్రమే. ఒకసారి ఎన్నికలైపోయి, కొత్త పార్లమెంటు ఎన్నిక కాగానే, వాళ్లు తిరిగి సంకెళ్లలో మిగిలిపోతారు.’’ మన పరిస్థితి కూడా దాదాపు అంతే, ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్ల దగ్గరికి పార్టీలు, అభ్యర్థులు వస్తారు. కాబోయే ఏలికలకు కావలసినదేదో తన దగ్గర ఉన్నదని ఓటరు మురిసిపోయేది కూడా అప్పుడే. అంతకుమించి, గెలిచిన ప్రజాప్రతినిధులతో ఓటరుకు సంబంధం ఏమీ లేదు. పదవీకాలం పూర్తి అయ్యేదాకా ఆగకుండా, మధ్యలో కూడా ‘రీకాల్’ చేసే సదుపాయం ఉండాలని ఒకప్పుడు మేధావులు మాట్లాడుతూ ఉండేవారు. మధ్యలో వెనక్కి రప్పించడం కాదు కదా, జీవితకాలాల పాటు పాలకులు తిష్ఠ వేసే కాలం వచ్చింది ఇప్పుడు!

ఎన్నికలు ఎంత డబ్బుతో ముడిపడి ఉంటాయో, ఓటు వేసే నిర్ణయం ఎంతగా కుల, మత, కుటుంబ పెత్తనాల మీద ఆధారపడి ఉంటుందో తెలిసి కూడా, స్వతంత్రంగా ఓటు వేయాలని ఆశించగలమా? సార్వజనీన ఓటింగ్ అన్నది సాముదాయిక నిర్ణయాలను ప్రతిఫలించే వ్యక్తిగత ఎంపిక. రాజకీయ చైతన్యం పెరిగే కొద్దీ, వ్యక్తిగతమైన, కమ్యూనిటీపరమైన ప్రయోజనాలను విస్తృత రాజకీయ వాతావరణంతో కలిపి ఆలోచించగలగడం అలవడితే, అమాయకపు ఓటర్లే ప్రభావశాలురు అవుతారు. రాజ్యాంగ విలువలను, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నిబద్ధతతో విశ్వసించేవారు స్వేచ్ఛాయుత ఓటింగ్‌ను, చైతన్యపూర్వక ఓటింగ్‌ను ప్రచారం చేయాలి.

ఎన్నికలకు ఎన్నికలకు నడుమ రాజకీయాలలో, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కూడా ఎన్నికలే ప్రజాస్వామ్యం అన్న దురభిప్రాయాన్ని తగ్గిస్తుంది. నిరంతరం ప్రజాప్రతినిధులను, అధికారులను జవాబుదారీగా నిలబెట్టే చైతన్యం ప్రజలలో ఉంటే, వివిధ రాజకీయపక్షాల విధానాలను, వైఖరులను కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవన్నీ దీర్ఘకాలిక లక్ష్యాలు, కర్తవ్యాలు. మరి ఈ ఏడాది చివరిలో, ఆ పైన నాలుగైదు నెలలలో జమిలిగానో, విడివిడిగానో ఎదురు కానున్న ‘జడ్జిమెంట్ డే’ సందర్భంలో ప్రజలు ఏమి చేయాలి?


ఎన్నికల సమయంలో మాత్రమే సంకెళ్లు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతారు కాబట్టి, ఓటు ఒక్కటే వారి దగ్గర ఉన్న తురుఫు ముక్క కాబట్టి, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేసిన ప్రతిసారీ విజేతను మార్చగలిగే అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడూ ఒకరికే ఎందుకు ఓటు వేయాలి? మూడుసార్లు, రెండు సార్లు ఎవరినైనా ఎందుకు గెలిపించాలి? గెలుపు మీద గెలుపు దొరుకుతున్న కొద్దీ, పాలకుల బలుపు మరింత పెరగడం తప్ప జరుగుతున్నదేమిటి? అనుకూల ఓటు కాదు, తిరస్కార ఓటు వేయడంలో ప్రజలకు తమ శక్తి ఎంతో తెలిసివస్తుంది. వంతుల వారీగా మాత్రమే అవకాశాలు ఇస్తూ ఉంటే, పార్టీలు కొంతైనా ఒళ్లు దగ్గరపెట్టుకుంటాయి. తరచు ఎన్నికలు జరిగితే అభివృద్ధి ఆగిపోతుంది, కొనసాగింపు ఉండదు, వంటి రొడ్డకొట్టుడు మాటలు వింటుంటాము. జనం నియంత్రణ బలంగా ఉంటే, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. ప్రజల ముందు ఏలికలు బలహీనంగానే ఉండాలి. పదే పదే ఎన్నికల గొడవ లేకుండా, దీర్ఘకాలం వర్తించే ఓటు ముద్ర కావాలని పాలకులు కోరుకుంటుంటారు. తరచు ఎన్నికలు రావడం, ఒకటి రెండుపార్టీలు కాకుండా, అనేక పార్టీలు రంగంలో ఉండడం, ఏ ఒక్కపార్టీకి తిరుగులేని మెజారిటీ రాకపోవడం, ప్రజాస్వామ్యం క్రియాశీలంగా ఉండడానికి దోహదపడతాయి. పాలక రాజకీయ నాయకులకు అసౌకర్యంగా ఉన్నదని, ప్రజలు తమకు ఉండే వెసులుబాటును ఎందుకు కోల్పోవాలి? బ్రహ్మరథం పట్టి, నెత్తికి ఎక్కించుకున్న ప్రతి పాలకుడూ, పాలకురాలూ, జనం మీదనే సవారీచేశారు. నల్లచట్టాలను, ఉక్కుపాదాలను ప్రయోగించారు, అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని, మంచిరోజుల పేరుతో దుర్దినాలను మోసుకువచ్చారు.

ప్రజలు మెచ్చి ఒన్స్‌మోర్ అనడం వేరు. అటువంటి ఆదరణ పొందే అర్హత ఉన్న పార్టీలేవీ లేవు. ప్రజలను మభ్యపెట్టి, ద్వేషాలను ఆవేశకావేశాలను పోషించి, మాయ చేయడమే తప్ప, పనిచేసి మెప్పించిన ప్రభుత్వమేదీ? అసంతృప్తి ఉన్నా, అందలం ఎక్కించవలసి వచ్చే పరిస్థితిని నివారించాలి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు దఫాలు పాలించింది. ఈసారి మరొకరికి అవకాశం ఇస్తే తప్పేమిటి? తెలంగాణలో రాష్ట్రావతరణ తరువాత రెండుదఫాలు కెసిఆర్ పాలించారు. చూద్దాం మరొకరు వస్తే ఇంకెంత గొప్పపాలన దొరుకుతుందో? ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడ్డారని ఓటు వేస్తే, ఇంకోసారి వేస్తే ఒట్టు అనే పరిస్థితి జగన్ తెచ్చుకున్నారు. మార్చి చూస్తే మంచే కదా జరిగేది?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-08-31T04:17:06+05:30 IST