హిందూ నాస్తికులు హిందువులు కారా?

ABN , First Publish Date - 2023-01-12T00:28:40+05:30 IST

తక్కిన సబ్జెక్టుల టీచర్లు తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోవడం, అరుదుగా ఎప్పుడన్నా, విరామం చిక్కితే అవీ ఇవీ మాట్లాడడం చేసేవారు కానీ, తెలుగు ఉపాధ్యాయులు మాత్రం పాఠంతో పాటు, లోకంలో ఉన్న సంగతులన్నీ మాట్లాడుతూ ఉండేవారు.

హిందూ నాస్తికులు హిందువులు కారా?

తక్కిన సబ్జెక్టుల టీచర్లు తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోవడం, అరుదుగా ఎప్పుడన్నా, విరామం చిక్కితే అవీ ఇవీ మాట్లాడడం చేసేవారు కానీ, తెలుగు ఉపాధ్యాయులు మాత్రం పాఠంతో పాటు, లోకంలో ఉన్న సంగతులన్నీ మాట్లాడుతూ ఉండేవారు. పదోతరగతిలో మాకు తెలుగు చెప్పిన గురువుకు, పిల్లలకు చదువు అబ్బకపోవడం గురించి ఎంత నిరసన ఉండేదో, రాను రాను జనం చెడిపోవడం మీద, సమాజం దిగజారిపోవడం మీద అంత నిష్ఠూరం ఉండేది. ఎరువుల తిండి తిని పౌరుషాలు లేకుండా పోతున్నాయని, భార్యాదాసులు అయిపోతున్నారని, రోడ్ల మీద తల్లులు కులాసాగా నడుస్తుంటే, తండ్రులు పిల్లల్ని మోసుకుని వెడుతున్నారని నిరసనగా అనేవారు. మనలో మాట అంటూ ఒక రహస్యం కూడా ఆయన మాకు చెప్పారు. చంద్రమండలం మీదికి వెళ్లి వచ్చానని అమెరికా వాడు చెబుతున్నాడు కానీ, అది అబద్ధం, ఈ భూమి మీదనే ఏదో ఒకచోటికి వాలిపోయి, అదే చందమామ అని బుకాయిస్తున్నాడట. ఆయన పాఠాలు బాగా చెప్పేవారు. అక్కడ చదువుకున్నవారిలో తరువాతి కాలంలో కొందరు మంచి భర్తలూ మరి కొందరు చెడ్డ భర్తలూ అయి ఉంటారు. చాలా మంది ఇంకా ఎరువుల తిండే తింటూ ఉంటారు. వాళ్లల్లో ఒక్కరు కూడా చంద్రుడి మీదకు అమెరికా వాడు వెళ్లలేదనే వాదనను నమ్ముతూ ఉండరు. పైగా, రేపు భారతీయ వ్యోమగాములు కూడా వెడతారని నూటికి నూరుపాళ్ళూ నమ్ముతూ ఉంటారు.

తల్లిదండ్రులు అయినా, టీచర్లు అయినా పిల్లలను పోతపోయరు. క్లాసు రూంలో ఎవరో చెప్పారని విద్యార్థులు నాస్తికులు అయిపోరు, భక్తులూ కారు. చరిత్రా, వర్తమానమూ కలిసి తీర్చిదిద్దితే వ్యక్తులు రూపొందుతారు. చైతన్యశీలురైన వ్యక్తులు తరగతి గదుల్లోనే కాదు, అనేక సామాజిక వేదికల మీద సహేతుకమైన సత్యాలను బోధిస్తూనే ఉంటారు. పాత కొత్త భావాల ఘర్షణ, వడబోత, సమన్వయం ఒక నిరంతర ప్రక్రియ.

కాలేజీ స్థాయిలో మనోరంజకంగా బోధన చేసే లెక్చరర్ ఉండేవారు. పాఠంతో పాటు, పాఠాల విరామంలో కూడా కమ్యూనిస్టు సంగతులు, నాస్తికం కూడా బాగా చెప్పేవారు. ఒకసారి ఆయనకు విద్యార్థుల నుంచి ఒక ప్రశ్న ఎదురయింది. ‘‘దేవుణ్ణి నమ్మకపోతే ఏ మతం కిందికి వస్తాము? ఎట్లా చెప్పుకోవాలి, రాసుకోవాలి?’’ ఆయనేమన్నారంటే, ‘‘వేరే ఏ మతంలోనూ నాస్తికుడుగా ఉండే అవకాశం లేదు, హిందూ మతంలో మాత్రమే నాస్తికుడిగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, నేనైతే హిందువుగానే చెప్పుకుంటాను.’’ ఆయనే కాదు, తక్కిన అధ్యాపకుల్లో కూడా ఒకరిద్దరు నాస్తికులు ఉండేవారు, అనేకులు భక్తులూ ఆస్తికులై ఉండేవారు. అందరూ ఒకే రకం కాదు. కొందరు యథాలాపంగా, కొందరు నిష్ఠగా, మరికొందరు చాదస్తంగా రకరకాల స్థాయిల్లో ఆస్తికత్వం కలిగి ఉండేవారు. వాళ్లు పాఠాలు చెప్పినా, కబుర్లు చెప్పినా వాళ్ల భావాలు అందులో కలగలసే ఉండేవి. కానీ, తమ భావాలను వ్యాప్తి చేయాలని నాస్తికులకున్నంత పట్టింపు, ఆస్తికులకు ఉండదు. అందుకు కారణం క్లిష్టమైనదేమీ కాదు. ఆస్తికులు కావడానికి ప్రయత్నం అక్కరలేదు. సమాజం, కుటుంబం, పరిసరాలు, పాఠశాల కూడా అందుకు నేపథ్య రచన చేస్తాయి. వీటన్నిటిని విదిలించుకుని, కొత్త భావాలను స్వీకరించడం పెద్ద ప్రక్రియ.

ప్రత్యక్షంగా బోధన, అభ్యసనం అన్నవి, ఎంతో సన్నిహితమైన చర్యలు. గీసిన గిరుల మధ్య సంభాషణలు జరగవు. పాఠ్యపుస్తకాల పరిధులలోనే ఉపాధ్యాయులు మాట్లాడలేరు. భావాలను, అభిప్రాయాలను పక్కనబెట్టి బోధనలు ఉండవు. అదే విధంగా, చదవవలసిన చదువులన్ని కూడా ఒకే కోవలో ఉండవు, పరస్పర భిన్నమైన విషయాలు, వైవిధ్యం కలిగిన విషయాలు చదువుల్లో భాగంగా ఉంటాయి. చదువు అన్నది విశ్వాసాన్ని నేర్పడానికి కాదు, వివేచనను ఇవ్వడానికి. తర్కం, వాదం, ఖండన, సమర్థన, విశ్లేషణ, అన్వయం ఇవన్నీ లేకపోతే చదువే లేదు. ప్రహ్లాదుడిని చండామార్కుల వారికి అప్పగించిన హిరణ్యకశ్యపుడు కూడా ‘కరికులమ్’ ఏదీ నిర్దేశించలేదు. ‘చదువనివాడజ్ఞుండగు జదివిన సదసద్వివేక చతురత గలుగున్‌ జదువగ వలయును జనులకు’ అన్నాడు.

సదసద్వివేకం ఎట్లా కలుగుతుంది? స్కూళ్లలో, ఐఐటి ఆధారిత విద్య మింగేయకపోతే, వక్తృత్వ పోటీలు పెడతారు, ఒకే అంశం మీద అనుకూలంగానో వ్యతిరేకంగానో విద్యార్థులు మాట్లాడాలి. సొంత అభిప్రాయాలతో పనిలేదు. వాదించే తర్కించే సామర్థ్యం ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. కత్తి గొప్పదా కలం గొప్పదా; విద్య గొప్పదా ధనం గొప్పదా వంటి అంశాలు పోటీలో ఉండేవి. ప్రశ్న అంటే భయపడడం, చర్చ అంటే అపచారం అనుకోవడం, ప్రతికూల భావం ఎదురయితే బెంబేలు పడడం నాలుగైదు దశాబ్దాల కిందట లేదు. మొన్నమొన్నటి దాకా కూడా లేదు.

అప్పట్లో చదువుల బోధనల అధికార పరిధులు బడుల దగ్గర నుంచి సాధారణ విశ్వవిద్యాలయాల దాకా, మహా అయితే, హెడ్ మాస్టర్ దగ్గర నుంచి విద్యామంత్రుల దాకా ఉండేవి. జ్ఞానరంగంలో అత్యున్నత ప్రాధికార సంస్థ వాట్సాప్ యూనివర్సిటీ అప్పటికి ఏర్పడలేదు. తరగతి గదిపై నిఘా పెట్టి, టీచర్లను దండించే కింకరులు ఇంకా అవతరించలేదు. విద్య, వివేకం, జ్ఞానం, హేతువు మొదలైన పదాలు ఎప్పుడూ విననివారికి, సంస్కృతి, సంస్కారం తలకిందులుగా తప్ప అర్థం కానివారికి, చదువుల తల్లిపై మనోభావాల కొరడాలు ఝళిపించగలిగే ధైర్యం, తెగింపు సమకూరిన కాలం ఇప్పుడు వచ్చింది మరి!

ఇంతకూ, మా అధ్యాపకుడు చెప్పినట్టు నాస్తికులు హిందువులా కాదా? హిందువులు ఆస్తికులు కావాలని ఎక్కడ ఉన్నది? హైందవమనో, వైదికమనో చెప్పే ప్రాచీన భారతీయ దర్శనాలు ఆరింటిలో ఒక్కటి మాత్రమే నూటికి నూరుపాళ్లు ఆస్తికమని, తక్కినవన్నీ తరతమ భేదాలతో వేదప్రామాణ్యాన్నో, దైవభావననో అంగీకరించేవి కావని తెలుసునా? వైదిక మతానికి వెలుపల, బౌద్ధ జైన ఆజీవక చార్వాక మతాలు పూర్తి నాస్తికమైనవనీ, అవి ఈ దేశంలోనే పుట్టాయని ‘బెత్తందార్ల’కు ఎందుకు అర్థంకాదు? హిందూమతం ఒక జీవనవిధానం అని వాదించేవారు, సాంఖ్యులను, వైశేషికులను, చార్వాకులను తమలో భాగమని భావించరా? తాము ఎప్పుడూ తప్పుపట్టే ‘అబ్రహమిక్’ మతాల మాదిరిగా హిందూమతాన్ని కూడా ఏకశిలాసదృశంగా, ఒకే కోవలో, ఒకే మతగ్రంథంతో, ఒకే దైవంతో తీర్చిదిద్దాలనుకుంటున్నారా? చివరకు సావర్కర్ నిర్వచనాల ప్రకారం కూడా, నాస్తికులు, నాస్తికమతాల వారు భారతీయులే అవుతారన్న అవగాహన ఉన్నదా? హిందూమతానికి నాస్తికుల నుంచి ప్రమాదం ఉన్నదన్న వాదన, ప్రచారం, భయంలో సహేతుకత ఉన్నదా? శైవం, వైష్ణవం మతాలుగా ఉన్నప్పుడు, ఇద్దరూ దేవుడి ఉనికిని అంగీకరించేవారు కాబట్టి, ఒకరి దేవుడిని మరొకరు దూషించేవారు. మరి నాస్తికులు దేవుడి ఉనికినే విశ్వసించనివారు. లేని దేవుడిని నాస్తికుడు ఎట్లా దూషిస్తాడు?

ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉన్నది దైవభావన కాబట్టి, బడా దేవతలైనా, చిన్న దేవతలైనా హేళన చేయడం, అవమానపరచడం చేయకూడదు. పరిధులు దాటిన విమర్శ దేవుళ్లకు కాక, ఆ దేవుళ్ల భక్తులకు అవమానకరంగా ఉంటుంది. వైజ్ఞానిక విషయాలను చెప్పడానికి విశృంఖల వ్యక్తీకరణలు అవసరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛతో సహా ఏ స్వేచ్ఛ అయినా, పరస్పర గౌరవ భావనకు అతీతమైనవి కావు. దాడులు చేసేవారికి భయపడి కాదు, ఈ దేశంలోని అసంఖ్యాకులైన దైవవిశ్వాసుల మీద గౌరవంతో, బాధ్యతతో కూడిన ప్రచారం చేయాలి. అదే సమయంలో నాస్తికుల భావ వ్యక్తీకరణ శైలికి, వారి మీద దాడులకు సంబంధం ఉన్నదని అనుకోనక్కరలేదు. తీవ్రత కాదు, మౌలిక భావమే సమస్య.

ఇతర ధోరణుల నుంచి ఏవైనా అప్రియమైనటువంటి మాటలు, విమర్శలు ఎదురైతే, పట్టించుకోకుండా వదిలేయడం గతంలో ఒక పద్ధతిగా ఉండేది. ఇతరుల భావాలను కూడా అనుమతించే సంస్కారం అది. చరిత్రలోని కొన్ని కాలాల్లో అటువంటి సహనం ఉండేది కాదు, రక్తపాతాలు జరిగేవి, రానురాను మానవసమాజాలు వైవిధ్యంలో జీవించగలిగే పురోగతి సాధించాయి. తిరిగి అసహనం జడలు విప్పుతున్నది. ఇప్పుడు మాటలలో సున్నితపు తూనికలు అవసరమవుతున్నాయి. సామాజిక ప్రయోజనం ఆశించేవారు, ప్రాప్తకాలజ్ఞతను కూడా అలవరచుకోవలసిన సమయం ఇది.

హేతువాది, నాస్తికుడు, వామపక్షవాది, ఉదారవాది, వీరందరూ ఇదే వరుసలోనో, మరో వరుసలోనో ‘ఉరికించి ఉరికించి కొట్టే’ మూకదాడులకో, ఊరేగించి ముక్కు నేలకు రాయించే ప్రాయశ్చిత్తానికో లక్ష్యం అవుతారు. పరిణామాలు అదే దారిలో సాగుతున్నాయి. సాంస్కృతిక కొరడాలు పట్టుకున్న గుంపులలోని వ్యక్తుల మీద కూడా జాలి కలుగుతోంది. వారేమి చేయుచున్నారో వారికి నిజంగా తెలియదు. వారికి సనాతనం గురించి, ధర్మం గురించి, జ్ఞానం గురించి కూడా, పాపం, ఏమీ తెలియదు.

భారతీయ తార్కికత, ఆధ్యాత్మికత గురించి మాట్లాడేవారు, మొదట, రుగ్వేదంలోని నాసదీయ సూక్తాన్ని మననం చేసుకోవాలి. ‘‘ఇంతకీ, ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చిందో, ఎట్లా జరిగిందో ఎవరు చెప్పగలరు? సృష్టి జరిగిన తరువాతనే కదా దేవుళ్లు అవతరించింది, మరి సృష్టి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఈ సృష్టికి మూలం సృష్టికర్త అయితే, అతను దీన్ని రూపొందించాడా లేదా, అత్యున్నత స్వర్గం నుంచి దీన్నంతా చూసే సృష్టికర్తకు అసలు ఇదంతా తెలుసునా, తెలియదా?’’ భారతదేశపు అతి గొప్ప తాత్వికులలో ఒకరయిన గౌతమ బుద్ధుడు ‘కాలామసుత్త’లో చేసిన హితబోధను కూడా గుర్తుపెట్టుకోవాలి. ‘‘ఇది పరంపరాగతమని, ఎవరో చెప్పుకుంటున్నారని, లేఖనాల్లో ఉందని, మనసుకు అనిపించిందని, చెబుతున్నవాడు మనవాడని, సమర్థుడని దేని మంచిచెడ్డలను కూడా నమ్మకు, నీకు నీవై ప్రతిదానిని పరిశీలించు, వివేచించు, నిర్ధారణ చేసుకో’’.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-01-12T00:28:40+05:30 IST