తొలి సంకేతాలు...!

ABN , First Publish Date - 2023-10-12T02:18:02+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసి, 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసిన నాలుగేళ్ళకు జరిగిన ఎన్నికలు కనుక, లద్దాఖ్‌లో మొన్న వెలువడిన ఫలితాలకు...

తొలి సంకేతాలు...!

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసి, 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసిన నాలుగేళ్ళకు జరిగిన ఎన్నికలు కనుక, లద్దాఖ్‌లో మొన్న వెలువడిన ఫలితాలకు ప్రాధాన్యం ఉంది. ‘లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌–కార్గిల్‌’ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌–కాంగ్రెస్‌ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం ముప్పైస్థానాల్లో నామినేటెడ్‌ స్థానాలు నాలుగు పోగా, మిగతా 26లో 22 సీట్లు ఈ కూటమి దక్కించుకుంది. లద్దాఖ్‌ను ప్రజాభీష్టం మేరకు కేంద్రపాలిత ప్రాంతం చేశామని చెప్పుకున్న భారతీయ జనతాపార్టీకి కేవలం రెండుస్థానాలు దక్కాయి. పైగా, ఇక్కడ ఆ పార్టీకి ఒక లోక్‌సభ ఎంపీ కూడా ఉన్నారు. కేంద్రప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన నిర్ణయం మీద జనం ఆగ్రహంతో ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని విజయం సాధించిన కూటమి అంటోంది.

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాతే లద్దాఖ్‌ అభివృద్ధికి నోచుకుందని వాదనతో బీజేపీ ఎన్నికల ప్రచారం సాగిస్తే, ఆర్టికల్‌ 370 రద్దుతో ఈ ప్రాంత ప్రజలు వనరులు, ఉద్యోగాలమీద తమ హక్కు వదులుకోవాల్సి వచ్చిందంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌–కాంగ్రెస్‌ కూటమి ప్రచారం చేసింది. ప్రజలు ఈ కూటమి వాదనకే ఎక్కువ విలువిచ్చారా అన్నది అటుంచితే, ఎన్నికల ప్రచారంలోకి అనేకమంది కేంద్రమంత్రులను దించి, కనీసం పదిస్థానాలైనా రాకపోతాయా అనుకున్న బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అనుకున్నన్ని గెలిచివుంటే ముస్లిం మెజారిటీ ఉన్న కార్గిల్‌ ప్రాంతంలోకి కూడా అది విస్తరించినట్టు అయ్యేది. ముస్లిం ఆధిక్యత ఉన్న కార్గిల్‌, బౌద్ధులు అధికంగా ఉన్న ఇతర జిల్లాలతో కూడిన లద్దాఖ్‌లో ఈ పరిణామం బీజేపీకి ఎదురుదెబ్బే కాదు, ‘ఇండియా’ కూటమికి చెప్పుకోదగ్గ విజయం కూడా. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధి రీత్యా పోయినవారు కూడా వచ్చి మరీ ఓట్లు వేసినందున, ౭8శాతం పోలింగ్‌ నమోదుకావడంతో పాటు, స్థానికులు ఈ ఎన్నికలను ఎంత తీవ్రంగా తీసుకున్నారో, ముస్లింలు–బౌద్ధులు, షియా–సున్నీ వంటి విభజనరేఖలు కూడా ఎలా అధిగమించారో ఈ ఫలితాలు తెలియచెబుతున్నాయి.

తమ భూమి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సంస్కృతి, పర్యావరణం పరిరక్షించేందుకు వీలుగా రాజ్యాంగంలోని ఆరవషెడ్యూల్‌ లో భాగంగా తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలంటూ నాలుగేళ్ళుగా బౌద్ధులు, ముస్లింలు కలసి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. తమను తిరిగి జమ్మూకశ్మీర్‌లో కలిపివేయమన్న, లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రస్థాయి కల్పించాలన్న ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్ల విస్తరణ, విద్యాసంస్థల ఏర్పాటు వంటి బీజేపీ అభివృద్ధి ఎజెండా ఈ ప్రాంత ప్రజలను ఆకర్షించలేదని అర్థం. స్థానిక అవసరాలు, ఆకాంక్షలతో పాటు అనేక అంశాలు ఈ ఎన్నికల్లో పనిచేసినప్పటికీ నాలుగేళ్ళనాటి నిర్ణయాలు, అనంతర పరిస్థితులను కూడా ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద చర్యతో సహా, అనేక ఘటనలు, ఉగ్రవాదుల చొరబాట్లు లోయలో పరిస్థితులు పెద్దగా మారలేదన్న విషయాన్ని తెలియచెబుతున్నాయి. భారీ బందోబస్తుతో, బాగా వడగట్టిన పరిస్థితుల మధ్య జి20 సదస్సు విజయవంతం కావడం వేరు, సాధారణ ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం క్షేత్రస్థాయిలో ఏర్పడటం వేరు. ఐదేళ్ళుగా కేంద్రపాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటూ అనాదిగా చెబుతున్నమాటనే మొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ మరోమారు వినిపించారు. డీ లిమిటేషన్‌ ప్రక్రియ ముగిసి, రెండు పర్యాయాలు ఓటరు జాబితా సవరణలు జరిగిన తరువాత కూడా అసెంబ్లీని పునరుద్ధరించే విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తున్నదో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. సుప్రీంకోర్టులో సైతం ఎన్నికల నిర్వహణకు హామీ ఇచ్చి, ఉగ్రవాదం నశించిపోయిందని అంటున్నప్పుడు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ చేతిలో ఉన్న పాలనను ప్రజలకు అప్పగించడంలో ఇంత జాప్యం ఎందుకో అర్థంకాదు.

Updated Date - 2023-10-12T02:18:02+05:30 IST