లిబియా విషాదం

ABN , First Publish Date - 2023-09-15T00:40:51+05:30 IST

మధ్యధరా సముద్రంలో పుట్టిన డేనియల్‌ తుఫాను లిబియాను తాకే ముందు గ్రీస్‌ దేశాన్ని కూడా కుదిపేసింది. అక్కడ కూడా ఎంతోకొంత విధ్వంసం జరిగింది కానీ...

లిబియా విషాదం

మధ్యధరా సముద్రంలో పుట్టిన డేనియల్‌ తుఫాను లిబియాను తాకే ముందు గ్రీస్‌ దేశాన్ని కూడా కుదిపేసింది. అక్కడ కూడా ఎంతోకొంత విధ్వంసం జరిగింది కానీ, మరణాల సంఖ్య మాత్రం 20లోపే. కానీ, ఈ తుఫాను కారణంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో మరణించినవారి సంఖ్యే పాతికవేలవరకూ ఉండవచ్చునని అంచనా. లక్ష జనాభా ఉన్న ఈ నగరాన్ని సగం తుడిచిపెట్టేసి, గాఢనిద్రలో, ప్రమాదాన్ని ఏ మాత్రం ఊహించనిస్థితిలో ఉన్న యావత్‌ కుటుంబాలను కాళ్ళకిందనేలతో సహా సముద్రంలోకి ఈడ్చుకుపోయిన మహా విషాదం ఇది.

నడి వీధుల్లో వేలాది మృతదేహాలు పోగుబడి ఉండగానే, వరదకారణంగా సముద్రంలోకి కొట్టుకుపోయిన వేలాదిశవాలు క్రమంగా తీరానికి కొట్టుకువస్తున్నాయి. మృతుల సంఖ్య విషయంలో ఎప్పటికప్పుడు అంచనాలను తారుమారుచేస్తూ సముద్రతీరం శవాలగుట్టగా తయారవుతోంది. తుర్కియే, అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్‌, ఖతార్‌ ఇత్యాది దేశాలనుంచి వచ్చిన సహాయక బృందాలు చేతనైనంత సాయం చేస్తున్నాయి కానీ, రహదారులతో సహా సమస్తవ్యవస్థలు నాశనమైనస్థితిలో సహాయకచర్యలకు పరిమితులు తప్పవు. వందలాది మృతదేహాలను గుర్తించే, భద్రపరిచే అవకాశం లేక, సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు మీడియాలో చూస్తున్నాం. నిండామునిగిన నగరంలో, మృతదేహాలు రోజుల తరబడి నీటిలో ఉన్నప్పుడు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా తీవ్రమైనదే.


తూర్పు లిబియాలో డేనియల్‌ ప్రభావంతో అనేక నగరాలు, వందలాది గ్రామాలు దెబ్బతిన్నాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కొన్ని నగరాలు చుట్టూనీటితో ద్వీపాల్లాగా కనిపిస్తున్నాయి. కానీ, తీరప్రాంత నగరం డెర్నా చవిచూసిన ఈ మహావిషాదానికి ప్రజాక్షేమం పట్టని పాలకులే ప్రధాన కారణం. 1970లో నిర్మించిన, పాతికేళ్ళుగా కనీస నిర్వహణ కూడా లేని రెండు చిన్న డ్యామ్‌లు కలసికట్టుగా వేలాదిమంది ప్రాణాలు తీశాయి. అధికవర్షాలతో మొదట ఎగువభాగంలోని డ్యామ్‌ కుప్పకూలి భారీ నీటిప్రవాహం ఒక్కసారిగా వచ్చిపడటంతో దిగువున ఉన్న మరో చిన్నడ్యామ్‌ మీద మరింత ఒత్తిడి పెరిగింది. అప్పటికే నిండుగా ఉన్న ఈ డ్యామ్‌ మీదపడిన ఆ భారాన్ని తట్టుకోలేక పతనమైంది. దీనితో, ముప్పైమిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు సముద్రంలోకి పోతూపోతూ ఈ తీరప్రాంత నగరాన్ని 23 అడుగుల ఎత్తున ముంచేసింది. పెద్దపెద్ద భవనాలు సైతం నామరూపాలు లేకుండా పోయాయంటే నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉన్నదో అంచనావేయవచ్చు.

లిబియా పాలకుడు కల్నల్‌ గడాఫీని అమితక్రూరుడుగా, ప్రపంచ శత్రువుగా చిత్రీకరించి, అతడికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను, తిరుగుబాట్లను ప్రత్యక్ష, పరోక్షంగా ప్రోత్సహించి మొత్తానికి అంతం చేయగలిగింది నాటో. ఆ తరువాత అధికారదాహం, ధనదాహం తప్ప ప్రజలపట్ల బాధ్యతలేని రెండుపక్షాలు దేశాన్ని పంచుకున్నాయి. పశ్చిమాన ట్రిపోలీ కేంద్రంగా పరిపాలన సాగిస్తున్న నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాన్ని మిగతా ప్రపంచమంతా అధికారికంగా గుర్తిస్తే, ఫ్రాన్స్‌ ఆశీస్సులు బలంగా ఉన్న లిబియన్‌ నేషనల్‌ ఆర్మీ ఏలుబడిలో తూర్పులిబియా ఉన్నది. వీటి మధ్య సయోధ్య సాధించే పేరిట ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒక విఫలయత్నం సుదీర్ఘకాలంగా సాగుతోంది. దేశాన్ని పంచుకున్న రెండు పక్షాలు కొంత జాప్యం తరువాత అయినా, ఇప్పుడు కలసికట్టుగా ఈ కష్టకాలాన్ని దాటాలని అనుకున్నందువల్ల, సహాయకచర్యలు వేగం పుంజుకున్నాయని అంటున్నారు. బ్రిటన్‌, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఐక్యరాజ్యసమితి కూడా ఇతోధికంగా సాయం అందించడానికి ముందుకు వచ్చినందున లిబియా కాస్తంత ఒడ్డునపడవచ్చు. కానీ, వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు, సహాయక వ్యవస్థల నిర్మాణం మీద ఏ మాత్రం శ్రద్ధలేని, ప్రజల ప్రాణాలపై పట్టింపులేని పాలకుల అధీనంలో ఉన్నందున లిబియా తీవ్ర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. గడాఫీపై ఉన్న ప్రజాగ్రహాన్ని ఉపయోగించుకోవడం, తిరుగుబాట్లను ప్రోత్సహించడం మీద అగ్రదేశాలకు ఉన్న ఆసక్తి, ఆ తరువాత ఆ దేశాన్ని ఒక్కటిగా, బలంగా నిలబెట్టే విషయంలో లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధానకారణం.

Updated Date - 2023-09-15T00:40:51+05:30 IST