Share News

నవాజ్‌ పునరాగమనం

ABN , First Publish Date - 2023-10-26T01:10:13+05:30 IST

మూడుసార్లు పాకిస్థాన్‌ను ఏలిన నవాజ్‌ షరీఫ్‌ రాబోయే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లండన్‌ నుంచి నాలుగేళ్ళ తరువాత ఇటీవలే వెనక్కువచ్చారు. లాహోర్‌లో ఆయన తొలి బహిరంగ సభకు...

నవాజ్‌ పునరాగమనం

మూడుసార్లు పాకిస్థాన్‌ను ఏలిన నవాజ్‌ షరీఫ్‌ రాబోయే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లండన్‌ నుంచి నాలుగేళ్ళ తరువాత ఇటీవలే వెనక్కువచ్చారు. లాహోర్‌లో ఆయన తొలి బహిరంగ సభకు జనం విపరీతంగా వచ్చారు. అయితే, నవాజ్‌ కేవలం ఆవాజ్‌ మాత్రమేనని, ఆయన రాక పాకిస్థాన్‌ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చబోదని, ఇమ్రాన్‌ ఖాన్‌ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షరీఫ్‌ ఈ సభలో భారతదేశానికి సంబంధించిన ప్రస్తావనలు కూడా చేశారు. పొరుగుదేశాలతో ఘర్షణ పెట్టుకున్న ఏ దేశమూ బాగుపడదని, కశ్మీర్‌ సహా చాలా అంశాల్లో సుహృద్భావపూర్వకమైన చర్చలతో గౌరవప్రదమైన పరిష్కారాన్ని సాధించుకోవాలన్నారు. ఇటీవలే ఆయన భారతదేశం తన చంద్రయానంలో విజయం సాధించడాన్ని, మరోపక్క పాకిస్థాన్‌ అప్పులకోసం విదేశాల్లో తిరగడాన్ని సరిపోల్చుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన ఏలుబడిలో ఎంతో ఎదిగిన పాకిస్థాన్‌ ఇప్పుడు దిగజారిపోయిందని చెప్పడానికి తప్ప, భారతదేశాన్ని మోతాదుకు మించి మెచ్చుకుంటే రాజకీయంగా ఉపకరించదని ఆయనకు తెలియకపోదు.

రెండు అవినీతి కేసుల్లో శిక్షపడి, ఓ నాలుగువారాలు జైల్లో ఉన్న తరువాత, చికిత్స పేరిట లండన్‌లోనే ఉండిపోయిన నవాజ్‌ షరీఫ్‌కు ఇప్పుడు స్వదేశానికి తిరిగిరాగానే బెయిల్‌ లభించింది. 2017లో ఆయన సైన్యం ఆగ్రహానికి గురై పదవీచ్యుతుడైన తరువాత, మరుసటి ఏడాది సైన్యం ఆశీస్సులతో ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైన్యం ఆగ్రహాన్ని, అమెరికా నిరాదరణను చవిచూస్తున్న ఇమ్రాన్‌ను వెనక్కునెట్టి తాను అధికారంలోకి రావాలన్నది ఆయన ప్రయత్నం. ఆయనకు సైన్యం ఆశీస్సులున్న విషయాన్ని ఆయన పునరాగమనం మరింత స్పష్టం చేస్తున్నది. జర్దారీలు, షరీఫ్‌లు చేయీచేయీ కలిపి ఇమ్రాన్‌ను కూలదోయడం నుంచి నవాజ్‌ సోదరుడు షాబాజ్‌ మొన్నటివరకూ ప్రధానిగా ఉండటం వరకూ, ఆ తరువాత నవాజ్‌ షరీఫ్‌ సూచించిన వ్యక్తే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగడం వెనుకా సైన్యం అభీష్టం లేదని అనుకోలేం. నాయకులు, సైనికులు ఎన్ని వ్యూహాలు రచించినా సామాన్యులు ఏమనుకుంటున్నారన్నది జనవరిలో జరగబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఇమ్రాన్‌కు అత్యధిక ప్రజాబలం ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వందలాది కేసులతో ఇమ్రాన్‌ను సాధ్యమైనంత ఎక్కువకాలం జైల్లోనే ఉంచేందుకు సైన్యం ప్రయత్నిస్తున్నది. ఇమ్రాన్‌, షరీఫ్‌ ఇద్దరూ అధికారం కోసం సైన్యంతో రాజీపడ్డవారే, దానితో పోరాడినవారే.

2014లో నరేంద్ర మోదీ తొలి ప్రమాణస్వీకారోత్సవానికి షరీఫ్‌ హాజరుకావడం, మరుసటి ఏడాది రష్యాలో జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా వేరుగా భేటీకావడం, ఆ సంయుక్త ప్రకటనలో కశ్మీర్‌ ప్రస్తావన లేకపోవడం వంటి పరిణామాలు సైన్యానికి ఏమాత్రం రుచించలేదు. పైగా, అదే ఏడాది డిసెంబరులో మోదీ అఫ్ఘానిస్థాన్‌నుంచి తిరిగి వస్తూ మధ్యలో హఠాత్తుగా లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌ ఇంటికెళ్ళి మరీ ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పివచ్చారు. భారతదేశ ప్రధాని పాకిస్థాన్‌ సందర్శించడం పదేళ్ళ తరువాత ఇదే మొదటిది. ఈ పరిణామాల తరువాత, వివిధ ఉగ్రవాదసంస్థలకు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పించడం ప్రాంతీయస్థాయిలోనూ, అంతర్జాతీయంగానూ దేశం పరువుతీస్తోందని, తీవ్రనష్టం చేకూరుస్తున్నదని, సదరు సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ సైన్యానికి షరీఫ్‌ చీవాట్లు పెట్టారంటూ డాన్‌ పత్రిక కథనం వెలుగుచూసింది. ఈ ‘డాన్‌ లీక్స్‌’ తరువాత కొద్దినెలల్లోనే షరీఫ్‌ పదవీచ్యుతుడై విదేశాలు పట్టిపోవాల్సివచ్చింది.

భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనుకున్న షరీఫ్‌కు అడుగడుగునా అడ్డంపడి, పదవినుంచి దించేసిన సైన్యం ఇప్పుడు షరీఫ్‌ తిరిగిరావడానికి ఎలా అనుమతించిందన్నది ప్రశ్న. రేపు షరీఫ్‌ అధికారంలోకి వచ్చినా గతంలో మాదిరిగానే ఉంటారన్న నమ్మకమేమీ లేదు. కానీ, సైన్యం మీద బహిరంగ యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల్లో దాని ప్రతిష్ఠను దిగజార్చి, వారిని ఎగదోసిన ఇమ్రాన్‌ఖాన్‌ కంటే, పెట్టిన కష్టాలన్నీ మౌనంగా భరించి, ఇప్పుడు మళ్ళీ రాజీకి వచ్చిన నవాజ్‌ షరీఫ్‌ ఉత్తమమని సైన్యం భావించినట్టు ఉంది. ఇమ్రాన్‌ను దెబ్బతీయగలిగే ఆయుధంగా షరీఫ్‌ ఏ మేరకు ఉపకరిస్తారో చూడాలి.

Updated Date - 2023-10-26T01:10:13+05:30 IST