Share News

ఇజ్రాయిల్ ఇక తగ్గాలి

ABN , First Publish Date - 2023-10-17T01:30:09+05:30 IST

వారం రోజుల నుంచి జరిగిన ఘటనల్లో ఎవరి తప్పు ఎంత అన్న పండిత చర్చ తరువాత చేయవచ్చును. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో ప్రస్తుత ఘట్టం మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కానీ, వారం రోజుల కిందట...

ఇజ్రాయిల్ ఇక తగ్గాలి

వారం రోజుల నుంచి జరిగిన ఘటనల్లో ఎవరి తప్పు ఎంత అన్న పండిత చర్చ తరువాత చేయవచ్చును. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో ప్రస్తుత ఘట్టం మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కానీ, వారం రోజుల కిందట మొదలై, ఇంతింతై పెరిగి, మరి కొన్ని గంటల్లో ప్రళయంలా విరుచుకుపడబోతున్న మానవీయ ఉత్పాతాన్ని నిరోధించడం ఎట్లా అన్నది ఇప్పుడు కలవరపడవలసిన ప్రశ్న. గాజా ఉత్తర ప్రాంతం నుంచి పదిలక్షల మందికి పైగా దక్షిణానికి తరిమివేయడం దాదాపుగా జరిగిపోయింది. హమాస్ మిలిటెంట్లు, కదలలేకపోయి చిక్కుకుపోయిన అభాగ్యులు మాత్రం ఇజ్రాయిల్ కొత్త రణరంగంగా నిర్వచించిన ప్రాంతంలో ఆకాశదాడులను, భూతల విధ్వంసాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి సంగతేమిటి, వృద్ధుల పరిస్థితేమిటి అని ఐక్యరాజ్యసమితి నాలుగురోజులుగా గుండెలు బాదుకుంటూనే ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్తనాదాలు చేస్తూనే ఉంది. పారిపోవడానికి రెండువరసల దారులు వదిలివేస్తున్నామని, తొందరగా తరలిపోవాలని చెప్పిన ఇజ్రాయిల్, ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్నవారి మీద కూడా గురిచూసి విమానదాడులు చేస్తున్నది. మొదట దాడిచేసినందుకు హమాస్ దోషి అయింది. తరువాత కొన్ని రెట్ల బీభత్సం సృష్టిస్తూ ఇజ్రాయిల్ మాత్రం ఆత్మరక్షణ హక్కుదారయింది. హమాస్ దాడుల్లో 1300 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించగా, ఇజ్రాయిల్ ప్రతిదాడులకు ఇప్పటిదాకా 2700 మంది బలి అయ్యారు. కుప్పకూలిన గాజా భవనాల కింద ఇంకా వెయ్యి మంది దాకా చనిపోయో, చిక్కుకుపోయో ఉంటారని భావిస్తున్నారు.

బాధితురాలిగా కనిపించిన ఇజ్రాయిల్, సమర్థకుల దృష్టిలో కూడా దౌర్జన్యవాదిగా మారడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఇజ్రాయిల్‌ను సమర్థించిన పెద్దపెద్ద దేశాలు కూడా ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నాయి. హమాస్ దాడులు జరిగిన వెంటనే ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించిన భారత ప్రధాని కూడా, ఇప్పుడు, యుద్ధం మంచిది కాదని, ఏ దాడులైనా వాంఛనీయం కాదని అంటున్నారు. ప్రతీకారం తీర్చుకున్నావు కదా, ఇక చాలులే, విరమించు అన్న ధోరణిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా హితవు చెబుతున్నారు. ఇరాన్ నేరుగా రంగంలోకి దిగుతుందా, దాని అండతో లెబనాన్ నుంచి హిజ్బుల్లా దాడులకు తెగబడుతుందా, కిక్కిరిసిపోయిన దక్షిణ గాజా నుంచి పాలస్తీనా శరణార్థులు పెద్ద సంఖ్యలో ఈజిప్టుకో, సముద్రం మీద నుంచి యూరోపియన్ దేశాలకో తరలి వెడితే ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏమిటి, హమాస్ దెబ్బకు నిలుపుదల జరిగిన సౌదీ, ఇజ్రాయిల్ ఒప్పందానికి ఇప్పట్లో తిరిగి కదలిక సాధ్యమా? ఇట్లా అనేక ప్రశ్నలు ముసురుకున్న ఈ సంక్షోభం, దీర్ఘకాలం కొనసాగితే నష్టపోయే శక్తులు అనేకం. ఇంకా రెండు పెద్ద దేశాలు గుంభనంగా వేచి చూస్తున్నాయి. ఇజ్రాయిల్ సంఘీభావ తీర్మానాన్ని భద్రతామండలిలో అడ్డుకున్న రష్యా, పోరునష్టం పొందులాభం అంటూ సూక్తులు చెబుతున్న చైనా, పరిస్థితి విషమిస్తే ఇవే వైఖరులతో ఉంటాయని లేదు. ఇదే అదనుగా మధ్యధరాలోకి తన విమాన వాహక నౌకను ప్రవేశపెట్టి, జబ్బలు చరుచుకున్న అమెరికా, అవసరం పడితే నిజంగా చేయిచేసుకుంటుందని నమ్మకమేమీ లేదు.

సొంత నేల నుంచి వెలియై కాందిశీకులుగా పాలస్తీనియన్లు చేయవలసివచ్చిన పోరాటం, అంతర్జాతీయ ఒప్పందాల తరువాత కూడా పాలస్తీనా ప్రభుత్వానికి స్వతంత్రత, సార్వభౌమత్వం అందకపోవడం, వీలయినచోట్లలో, వీలయిన వేళల్లో పాలస్తీనా పౌరులను ఉక్కుపాదం కింద అణచిపెట్టడం, ఇదంతా దశాబ్దాలుగా సాగుతున్న హింస. ఈ భయానక నేపథ్యంలో ఇప్పుడు, ఒక సన్నటి నిలువు ఇరుకు భూభాగంలో, దట్టంగా వెలిసిన బహుళ అంతస్థుల భవనాలలో, కిక్కిరిసి జీవిస్తున్న సాధారణ ప్రజలను తరమడం, రాకెట్లతో, విమానాలతో వేటాడడం, ఎంతటి ఘోరం? హమాస్ అంటే అది ఒక మిలిటెంట్ సంస్థ. అది పాల్పడిన దౌర్జన్యం క్షమార్హమేమీ కాదు నిజమే. కానీ, అటువైపు ఉన్నది ప్రభుత్వం కదా? దానికి పద్ధతీ పాడూ ఉండాలి కదా? ఇంట్లోనో బయటో ఎవరికో ఒకరికి జవాబుదారీగా ఉండాలి కదా? అమాయకులను చంపడం ఉగ్రవాదం అయితే, ఇజ్రాయిల్ రెట్టింపు ఉగ్రవాదే కదా?

పంటిబిగువున ఈ బాధను భరించమని పాలస్తీనియన్లను, ఉద్రిక్తతల మధ్య ఆందోళన చెందుతున్న ఇజ్రాయిల్ పౌరులను కోరడం తప్ప చేయగలిగిందేమీ లేదు. భౌగోళిక రాజకీయాలలోని సంక్లిష్టతలే, ఈ హింస దీర్ఘకాలం సాగకుండా నిరోధిస్తాయయని ఆశించాలి. నాగరికతకు, ప్రజాస్వామ్యానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే గొప్ప గొప్ప దేశాలు, గాజా మీద భూతల యుద్ధం జరగకుండా నిరోధించి తమ పరువు కాపాడుకోవాలి. ఉభయ పక్షాలలో ఇన్ని వేల మంది అమాయకులు ప్రాణార్పణ చేసినందుకు, పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే దిశగా అడుగులు పడాలి. పాలస్తీనా, ఇజ్రాయిల్ భూభాగాల పునర్విభజన జరిగి, రెండు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యాలుగా ప్రపంచపటం మీద నిలిచే రోజు కోసం నిరీక్షించాలి.

Updated Date - 2023-10-17T01:30:09+05:30 IST