సభలో విద్వేష విషం!

ABN , First Publish Date - 2023-09-26T02:31:57+05:30 IST

పార్లమెంటులో అధికార, విపక్షసభ్యులు పరస్పరం తీవ్రమైన నిందలూ, ఘాటైన విమర్శలు చేసుకోవడం ఉన్నదే కానీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎంపీ డానిష్‌ అలీని ఉద్దేశించి...

సభలో విద్వేష విషం!

పార్లమెంటులో అధికార, విపక్షసభ్యులు పరస్పరం తీవ్రమైన నిందలూ, ఘాటైన విమర్శలు చేసుకోవడం ఉన్నదే కానీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎంపీ డానిష్‌ అలీని ఉద్దేశించి, బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరీ చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు దేశచరిత్రలో ఎన్నడూ విననివి, కననివి. ఆయన నోటనుంచి వెలువడిన, రెట్టించిన ఆ మాటలు విన్న తరువాత, అవి పొరపాటునో, ఎదుటివారి వాదనను వమ్ముచేసే నిమిత్తం కేవలం ఆగ్రహావేశాలతో చేసినవి కావని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ పదజాలం ఇటీవలి కాలంలో పనిగట్టుకొని ఒక వర్గాన్ని అవమానించేందుకు, అనుమానించేందుకు, దుష్టులుగా చిత్రీకరించేందుకు ఆయన పార్టీ ప్రాచుర్యంలోకి తెస్తున్నదే కనుక, తోటి పార్లమెంటు సభ్యుడు ఆ వర్గానికి చెందినవాడు కావడంతో సదరు బీజేపీ సభ్యుడు వాటిని ఇప్పుడు నేరుగా చట్టసభలోనే ప్రయోగించాడు. ఈ విద్వేషపూరిత, దారుణ, అశ్లీలపదజాలం ఆ సమయంలో సభాపతిగా వ్యవహరిస్తున్న కేరళకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడికి కూడా అర్థంకాలేదు. విపక్ష సభ్యుల ప్రవర్తనలు, వ్యాఖ్యల విషయంలో ఎంతో కఠినంగా ఉంటూ, సభాసాంప్రదాయాలను, గౌరవాన్ని పరిరక్షించేందుకు వారి మైకులు కట్‌చేస్తూ, క్షణాల్లో సస్పెండ్‌ చేసే స్పీకర్‌ ఓంబిర్లా బిధూరీ విషయంలో మాత్రం ‘ఇటువంటివి పునరావృతమైతే ఊరుకోనని’ హెచ్చరిక చేసి వదిలేశారు. పార్టీ అధిష్ఠానం నోటీసులకు పరిమితం కావడం, నాలుగురోజులైనా పార్టీపరంగా బిధూరీ మీద చర్యలేమీ లేకపోవడం గమనించినప్పుడు పెద్దలంతా లోలోపల మురిసిపోతున్నారనే అనుకోవాలి.

సభలో గందరగోళం మధ్య తనకు ఆ వ్యాఖ్యలు వినబడనే లేదని ఓ మంత్రిగారు సమర్థించుకుంటున్నారు. అసలు వినబడనప్పుడు, అర్థమే కానప్పుడు బిధూరీ పక్కన కూచున్న ఆ ఇద్దరు మంత్రులకు ఎందుకంత నవ్వొచ్చిందో, అంతగా ఎలా ఆస్వాదించగలిగారో తెలియదు. ఇక, బిధూరీ వ్యాఖ్యల కారణంగా విపక్షసభ్యుల మనోభిప్రాయాలు దెబ్బతిన్న పక్షంలో అంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ ఎంతో దీర్ఘం తీస్తూ చేసిన ప్రకటన కూడా ఆయనకు ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కించిత్తు బాధకలిగించలేదనే చెబుతున్నాయి. ఈ పదేళ్ళకాలంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు వింటూ, వారిపై మూకదాడులు చూస్తున్నప్పుడల్లా దానినే ప్రజలు పతాకస్థాయి అనుకుంటూ వచ్చారు. కానీ, పాలకులను అంచనావేయడంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. సమాజంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ, టీవీ చర్చల్లోనూ రేగుతున్న విద్వేషం ఇప్పుడు నిండుసభలో ప్రతిఫలించింది అంతే. ఇది ఒక సభ్యుడు మరో సభ్యుడిమీద ఆగ్రహంతో చేసిన వ్యాఖ్య కాదని, దాని లక్ష్యం విస్తృతమైనదని తెలుసుకుంటే, మతవిద్వేషంతో, వ్యక్తిత్వహననంతో దట్టించి ఉన్న ఆ మాటలమీద , డానిష్‌ ఆవేదనగా రాసిన లేఖ మీద స్పీకర్‌ స్పందన సరిగా అర్థమవుతుంది. ముస్లిం వ్యతిరేకత ఉన్నతస్థానాల్లో కూడా ఒక సర్వసాధారణ, ఆమోదనీయమైన విషయంగా మారిపోతున్నదని తెలుస్తుంది. ఇప్పుడు బిధూరీ నిండుసభలో ఈ మాటలన్నందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కానీ, ఇంతకు మించిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలను మనం బీజేపీ నాయకుల నోట ప్రజాక్షేత్రంలో అనునిత్యం వింటూనే ఉన్నాం.

ఏబీవీపీ నాయకుడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదిగివచ్చిన క్రమంలో బిధూరీ చేసిన వివాదాస్పదవ్యాఖ్యలన్నింటినీ మీడియా ఏకరువుపెడుతున్నది. నిండుసభలో ఆయన మహిళా ఎంపీలను సైతం అవమానించిన సందర్భాలున్నాయి. ఇటలీలో పెళ్ళయిన ఐదారునెలలకే మనుమలను కూడా ఎత్తుకోవచ్చునంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇక, ముస్లింలను ఉగ్రవాదులుగా, వారి రక్షకులుగా అభివర్ణిస్తూ బహిరంగ ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలకు అడ్డేలేదు. అతడిని ఇంతచక్కగా పెంచిపోషించినవారు ఇప్పుడు ఏవో కొన్ని మాటలు సభలోకి తెచ్చినందుకు బహిష్కరణ శిక్షలు వేస్తారనుకోవడం భ్రమ. పైగా ఆయన హోం, రక్షణ మంత్రులకు సన్నిహితుడని, ఓడినచోటే మళ్ళీ టిక్కెట్‌ సంపాదించగల సమర్థుడని అంటారు.

ఒక విషయంలో మాత్రం బిధూరీ ఈ దేశప్రజల్లో కాస్తోకూస్తో మిగిలివున్న భ్రమలని చెరిపేశారు. కొత్తపార్లమెంటు భవనంలో విలువలు, సంప్రదాయాలు ఎంత చక్కగా అమలుకాబోతున్నాయో తొలిరోజునే తేల్చేశారు. విద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఏ మాత్రం సహించకండి అంటూ సుప్రీంకోర్టు కిందికోర్టులను, పోలీసులను ఆదేశించినా, కొత్తగా పేరుమార్చుకున్న ‘భారతీయ న్యాయసంహితలో’ మాటవరుసకు మూడేళ్ళ కఠినశిక్షలు ఉన్నా, పాలకులే స్వయంగా పెంచి పోషిస్తున్న విద్వేషం సర్వత్రా వ్యాపిస్తూ ఇప్పుడు అధికారికంగా చట్టసభల్లోనే ప్రతిధ్వనించింది.

Updated Date - 2023-09-26T02:31:57+05:30 IST