Share News

చెరిగిపోతున్న చరిత్ర

ABN , First Publish Date - 2023-10-28T04:30:13+05:30 IST

ఇండియా–భారత్‌ వివాదం మళ్ళీ తెరమీదకు వచ్చింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) తన పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ అన్న పదాన్నే ఉపయోగించాలంటూ...

చెరిగిపోతున్న చరిత్ర

ఇండియా–భారత్‌ వివాదం మళ్ళీ తెరమీదకు వచ్చింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) తన పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ అన్న పదాన్నే ఉపయోగించాలంటూ సదరు సంస్థ నియమించిన కమిటీ ఒకటి సూచించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎన్సీఈఆర్టీ తన చరిత్ర పుస్తకాల్లో హిందూ రాజుల విజయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటూ చరిత్ర పాఠ్యాంశాల్లో వివిధ మార్పుచేర్పులను ఈ కమిటీ ప్రతిపాదించిందట. విమర్శలు రేగడంతో, ఒక ఫోకస్‌ గ్రూప్‌ చేసిన ప్రతిపాదనల విషయంలో ఇంత ఆందోళన అవసరం లేదని, ఇంకా తుదినిర్ణయం జరగనప్పుడు ఆగమేఘాలమీద స్పందించాల్సిన అవసరం కూడా లేదని సదరు సంస్థ డైరక్టర్‌ ఓ ప్రకటన కూడా చేశారు. ఇండియా స్థానంలో కేవలం భారత్‌ అని మాత్రమే వాడాలంటూ ప్రొఫెసర్‌ సి.ఐ. ఐసాక్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఏకకంఠంతో చేసిన ఈ ప్రతిపాదన తుదినివేదికలో చేరలేదన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇటువంటి ప్రతిపాదనలు, ప్రయత్నాలు ఒక క్రమపద్ధతిలో నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నది నిర్వివాదాంశం. సబ్‌ కమిటీలు, కమిటీలకు సభ్యులుగా ఉంటున్నవారినుంచి ఇటీవల ఏకంగా కొన్ని పాఠాలు ఎత్తివేయడం వరకూ ఎన్సీఈఆర్టీ వ్యూహాత్మకంగా నడుస్తున్న విషయం కాదనలేనిది.

ప్రొఫెసర్‌ ఐసాక్‌ ఆరెస్సెస్‌ మనిషని కొందరు విమర్శిస్తే, మధ్యలో ఆరెస్సెస్‌ను ఎందుకు లాగుతారు, పిల్లలు ఏ పాఠాలు చదవాలో అది నిర్ణయిస్తుందా? అని ఆయన ప్రశ్నిస్తారు. దేశం పేరు ఏవిధంగా ఉండాలో నిర్ణయించడానికి తనకు నిర్దిష్టమైన చారిత్రక ఆధారాలున్నాయంటూ ఆయన ఏడువేల సంవత్సరాలుగా ‘భారత్‌’ అనే మాటే వాడుకలో ఉందనీ, ఈస్టిండియా కంపెనీ ప్రవేశంతోనే అది ఇండియాగా మారిపోయిందని వాదిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వివిధ నగరాలు, పట్టణాలు, ప్రాంతాలకు బ్రిటిష్‌కాలం నాటి పేర్లు తీసివేసి, మనపేర్లు పెట్టుకుంటే లేని తప్పు, ఇప్పుడు భారత్‌ని ఖరారుచేయడంలో ఎందుకన్నది ఆయన ప్రశ్న. ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ అధినాయకులనుంచి ఇటీవలికాలంలో చాలా విన్నాం. ఇందుకు ప్రతిగా, ఇండియా అన్నమాట పుట్టుపూర్వోత్తరాలను మెగస్తనీస్‌ నుంచి ఏకరువుపెడుతూ దానికి ఎన్నివందలేళ్ళ చరిత్ర ఉన్నదో, మిగతా ప్రపంచానికి కూడా సుపరిచితమైన ఈ మాటను ఎందుకు మార్చకూడదో వాదిస్తున్నవారు కూడా ఉన్నారు. ఏ మాట పురాతనమైందన్న వివాదాన్ని అటుంచితే, ఇండియా దటీజ్‌ భారత్‌ అని భారతరాజ్యాంగం విస్పష్టంగా పేర్కొన్నప్పుడు, కేవలం భారత్‌ను మాత్రమే వినియోగించాలంటూ ఎన్సీఈఆర్టీ వంటి ఒక ప్రభుత్వ ఉన్నత సంస్థకు ఈ ప్రొఫెసర్‌ ఏకపక్షంగా ఎలా సూచించారో అర్థంకాదు. అది ప్రతిపాదనే కావచ్చును కానీ, రాజ్యాంగసవరణతో ముడిపడిన అంశమని ఆయనకు తెలియదనుకోలేం.

విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరుపెట్టుకోవడం ఈ యుద్ధం ఆరంభమైన విషయం తెలిసిందే. ఆ సంక్షిప్తనామం రాజకీయంగా విపక్షాలకు ఉపకరిస్తుందన్న భయం అధికారపక్షంలో మొదలైంది. ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలను దునుమాడుతూ ఇండియా అన్నమాట ఈస్టిండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాలోనూ ఉన్నదంటూ విపక్షాలను ఉగ్రసంస్థలతో సరిపోల్చారు. ఆ తరువాత, ఇంకా చాలదనుకున్నారేమో, ఇండియా పేరు కనిపించకుండా, వినిపించకుండా అధికారపార్టీనుంచి విశేష ప్రయత్నాలు ఆరంభమైనాయి. జీ20 సదస్సు సందర్భంలో వివిధదేశాధినేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వానంలోనూ, ప్రధాని ఇండోనేషియా పర్యటనలో నేమ్‌ప్లేట్‌లోనూ భారత్‌ అనేమాట దర్శనమిచ్చింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణతో ఇండియా పేరు చెరిపేస్తారన్న వ్యాఖ్యలు కూడా అప్పట్లో వినపడ్డాయి. కానీ, అటువంటి సాహసానికి పోకుండా, అధికారపక్షం అంతర్లీనంగా తన విశేష ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని ఎన్సీఈఆర్టీ ఉదంతం రుజువుచేస్తున్నది.

ఆరెస్సెస్‌తో తనకు ఏమాత్రం అనుబంధం లేదని ఐసాక్‌ చెబుతున్నప్పటికీ, సావార్కర్‌ తన రచనల్లో చేసిన ప్రస్తావనలు, ఉదహరించిన గ్రంథాలనే ఈయన తన ప్రతిపాదనల్లో ఉటంకించారని అంటారు. చరిత్రకారుడుగా ఆయన నిర్దిష్టమైన పరిశోధనలతో, చారిత్రక ఆధారాలతో కాక, ప్రభుత్వ మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించారని అర్థం. కమిటీలో ఉన్న మిగతావారు ఎవరెవరో, వారి భావజాలాలు ఎటువంటివో, వారంతా దేశం పేరు మార్చడం నుంచి దేశీయ రాజుల విజయాలను మాత్రమే కీర్తించడం వరకూ ఏకకంఠంతో ఎందుకు ప్రతిపాదించారో విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని పాఠాల్లో తీసివేయడంనుంచి చరిత్రను మార్చడం వరకూ ఒక విశేష ప్రయత్నమైతే ఏలినవారి ఎజెండాకు అనుగుణంగా సాగుతోంది.

Updated Date - 2023-10-28T04:30:13+05:30 IST