ఎవ్వరినీ నొప్పించక...!

ABN , First Publish Date - 2023-09-13T03:44:33+05:30 IST

సంయుక్త ప్రకటన లేకుండా జీ20సదస్సు కనుక ముగిసివుంటే, ఆ వేదిక ఉనికే ఇకపై ప్రశ్నార్థకమైపోయేది అంటూ జర్మనీ రాయబారి ఓ వ్యాఖ్య చేశారు...

ఎవ్వరినీ నొప్పించక...!

సంయుక్త ప్రకటన లేకుండా జీ20సదస్సు కనుక ముగిసివుంటే, ఆ వేదిక ఉనికే ఇకపై ప్రశ్నార్థకమైపోయేది అంటూ జర్మనీ రాయబారి ఓ వ్యాఖ్య చేశారు. జీ20 తన సంయుక్త ప్రకటనలో రష్యాను తీవ్రపదజాలంతో తూర్పారబట్టాలని ఉక్రెయిన్‌ కోరుకోవడం సహజం కనుక, ఆ విషయంలో ఈ ప్రకటన తీవ్ర నిరాశకలిగించింది కనుక, ఉక్రెయిన్‌ ఆగ్రహంగా ప్రతిస్పందించింది. న్యూఢిల్లీ ప్రకటన ఇలా కనుక లేకపోతే, భారతదేశం నుంచి అధ్యక్షబాధ్యతలు స్వీకరిస్తున్న బ్రెజిల్‌కు ఇకపై అన్ని దేశాలనూ దారికితేవడం మరింత కష్టంకావచ్చు కూడా. గత ఏడాది బాలి సదస్సులో వెలువరించిన ప్రకటనతో పోల్చితే రష్యాను పల్లెత్తుమాట అనకుండా, చైనా మనసు నొప్పించకుండా ఏకాభిప్రాయ ప్రకటన విడుదల చేయించడం కచ్చితంగా భారత్‌ సాధించిన విజయమే.

‘బాలి వేరు, న్యూఢిల్లీ వేరు’ అని విదేశాంగమంత్రి జయశంకర్‌ ఓ మాటన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్నంత ఆ మోస్తరు తీవ్రపదజాలం కూడా ఇప్పుడు లేకపోవడం, రష్యా పేరెత్తకుండా మరీ జాగ్రత్తపడటం వల్ల ఈ ప్రకటన ప్రయోజనం ఏమిటని కొందరి విమర్శ. యుద్ధం గతంలో కంటే తీవ్రమై, ఇరుపక్షాలూ ప్రమాదకర ఆయుధాల వినియోగంతో మరింత వినాశకరంగా పరిణమిస్తున్నప్పుడు, దాని కేంద్రంగా కొత్త కొత్త ఆయుధబంధాలు ఏర్పడుతున్నప్పుడు అస్పష్టతలతో సాధించగలిగేదేమీలేదన్నది నిజం. యావత్‌ ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమిస్తున్న యుద్ధం విషయంలో రష్యా ఊసులేకుండా, 83 పేరాల ఏకాభిప్రాయ ప్రకటనలో ఒక పేరా మాత్రమే జరుగుతున్న యుద్ధానికి కేటాయించడం ఆశ్చర్యకరమైన విషయమే. తనను ఒక్కమాటా అననందుకు రష్యా, జీ20 కేవలం ఆర్థిక వేదికని రుజువైందంటూ చైనా మెచ్చుకోవడం చూసినప్పుడు, ఆ రెండు దేశాల అధినేతలు లేకుండానే వివాదం పరిష్కారమైనందుకు సంతోషించాలి.

వరుస ప్రకారం గత ఏడాది మనదేశంలోనూ, ఈ ఏడాది ఇండోనేషియాలోనూ జరగాల్సిన సదస్సును భారతదేశం తెలివిగా మార్పించిందని, ఢిల్లీ స్థానంలో ముందుగా బాలి వచ్చేట్టు ఇండోనేషియాపై ఒత్తిడి తెచ్చిందని విదేశీ మీడియా అంటోంది. యుద్ధం మొదలైన కొద్దినెలల్లోనే బాలి సదస్సు జరిగినందున అది యుద్ధవేడిమికి బలికాక తప్పలేదు. ఏడాదిన్నర తరువాత, యుద్ధం కొనసాగింపు అనివార్యమని, ఎవరిని నిందించినా లేకున్నా ప్రయోజనం శూన్యమని తేలిపోయిన తరువాత ఇప్పటి ప్రకటనలో ఆ తీవ్రత ఉండాల్సిన అవసరం కూడా లేదు. విభజనరేఖలు నిర్దిష్టంగా ఉన్నప్పుడు పేర్లతో పనిలేదు, హితవులు చాలు. ఇది భవిష్యత్తులో చర్చలకు వీలుకల్పిస్తుందా అన్నది వేరే విషయం. ఇండోనేషియాను ఒప్పించి, సార్వత్రక ఎన్నికలకు అతి చేరువలో ఈ అంతర్జాతీయ వేడుక నిర్వహించడం ద్వారా మోదీ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధిపొందిందన్న వ్యాఖ్యలు అటుంచితే, ఎవరినీ నొప్పించకుండా ఏకాభిప్రాయ ప్రకటన సాధించగలగడం కచ్చితంగా మన దౌత్యవిజయమే. మారిన పరిస్థితులతో పాటు, అమెరికా, యూరప్‌ ప్రాధాన్యతల్లో వచ్చినమార్పు కూడా ఇందుకు దోహదం చేసింది. కేవలం ఉక్రెయిన్‌ యుద్ధం, రష్యా ఆంక్షల చుట్టూ మాటపట్టింపుతో వ్యవహరిస్తే దక్షిణార్థగోళ దేశాలు దూరమవుతాయని అవి గ్రహించాయి. చైనాను నిలువరించే విషయంలోనూ, వ్యూహాత్మక భాగస్వామ్యంలోనూ, ఆయుధ కొనుగోళ్ళలోనూ అతి కీలకమైన, ఆప్తమిత్ర భారతదేశం అధ్యక్షస్థానంలో ఉన్నందున ఈ సదస్సు విఫలం కాకుండా అమెరికా చూసుకున్న మాటా నిజం.


ఆహారభద్రత, పర్యావరణం, రుణాల సంక్షోభం, బ్యాంకింగ్‌ సంస్కరణలు ఇత్యాది చాలా విషయాల్లో ఈ సదస్సు కూడా సాధించిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అనాదిగా జీ20మీద ఉన్న విమర్శే ఇది. లక్ష్యాలు బలహీనంగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు వాటినే కొత్తగా చెబుతున్నారని, ఇప్పటి సంయుక్త ప్రకటనలో కూడా పాతవాక్యాలే దర్శనమిస్తున్నాయన్న విమర్శ మరోమారు వినిపించింది అంతే. బాలి సదస్సులో తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ, మన అధ్యక్షతన ఆఫ్రికన్‌ యూనియన్‌ అధికారిక చేరికతో జీ20 ఇకపై జీ21గా మారబోతున్నందుకు సంతోషించాలి. అధ్యక్షస్థానం అందుకున్నప్పటినుంచి దేశవ్యాప్తంగా వేర్వేరు పట్టణాల్లో రెండువందలకు పైగా సమావేశాలు నిర్వహించి, చక్కని అతిథ్యంతో ఎంతో ఘనంగా దానిని ముగించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

Updated Date - 2023-09-13T03:44:33+05:30 IST