మాల్దీవుల్లో మార్పు

ABN , First Publish Date - 2023-10-05T02:51:37+05:30 IST

మాల్దీవుల కొత్త అధ్యక్షుడుగా మహ్మద్‌ ముయిజ్జూ ఎన్నికయ్యారు. విపక్ష ‘ప్రోగ్రసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌–పీపీఎం’ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచి, గెలిచిన ఈయన చైనా అనుకూలుడని అంటారు. ఐదేళ్ళక్రితం ఘనవిజయం సాధించి...

మాల్దీవుల్లో మార్పు

మాల్దీవుల కొత్త అధ్యక్షుడుగా మహ్మద్‌ ముయిజ్జూ ఎన్నికయ్యారు. విపక్ష ‘ప్రోగ్రసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌–పీపీఎం’ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచి, గెలిచిన ఈయన చైనా అనుకూలుడని అంటారు. ఐదేళ్ళక్రితం ఘనవిజయం సాధించి ఇప్పటివరకూ అధికారంలో ఉన్న భారత అనుకూల ఇబ్రాహీం సోలీ ఓటమికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సహజంగానే ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకత దోహదం చేశాయి. ప్రధానంగా పర్యాటకంమీద ఆధారపడిన దేశం కనుక కరోనా కష్టాలు కూడా ఆయన విజయాన్ని దెబ్బతీశాయి. దీనికితోడు, సార్వభౌమత్వ పరిరక్షణ పేరిట పీపీఎం ముందుకు తెచ్చిన భారత వ్యతిరేక ప్రచారం ప్రజలమీద ప్రభావం చూపింది. పీపీఎం అధినేత అయిన అబ్దుల్లా యమీన్‌ మాల్దీవుల అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత దేశంతో ఘర్షణాత్మక వైఖరే అనుసరించారు. చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, పెద్ద ఎత్తున రుణాలు అందుకోవడం, చైనా అక్కడ భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడంతో, చైనాకు సాగిలబడి యమీన్‌ ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలో ముంచిందన్న ప్రచారంతో సోలీ నాయకత్వంలోని ఎండీపీ అధికారంలోకి రాగలిగింది. 2018లో ఇబ్రాహీం సోలీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఏకైక దేశాధినేత భారత ప్రధాని నరేంద్రమోదీయే. సోలీ విజయం భారతదేశ పాలకులకు ఎంతో ఉపశమనం ఇచ్చిందనడానికి ఇది ఉదాహరణ. హిందూమహాసముద్రంలో అత్యంత కీలకమైన చోట కోల్పోయిన ప్రాభవం తిరిగి దక్కిందని సంతోషిస్తూ భారత్‌ వెంటనే ఒకటిన్నర బిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది కూడా. మరుసటి ఏడాది మోదీ తిరిగి ఎన్నికకాగానే ఆయన తొలి విదేశీపర్యటన కూడా మాల్దీవులకే. సోలీ అనుకూలత కారణంగా భారతదేశం మాల్దీవుల్లో చాలా ప్రాజెక్టులు నిర్మించింది, కరోనా కష్టకాలంలో ఆ దేశానికి సహాయపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో, మరీ ముఖ్యంగా, మహ్మద్‌ ముయిజ్జూ మాల్దీవుల్లో ఉన్న కొద్దిపాటి భారత సైనికులను కూడా దేశంనుంచి వెళ్ళగొడతానని ప్రకటించిన నేపథ్యంలో, ఆయన ఎన్నిక చైనా విజయంగానూ, భారత్‌ ఓటమిగానూ ప్రచారం కావడం సహజం.

ముయిజ్జూ గతంలో మంత్రిగా చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌–బిఆర్‌ఐ’లో మాల్దీవులను భాగస్వామ్యం చేసి, పెద్ద ఎత్తున నిర్మాణాలకు నాయకత్వం వహించినవాడు. చైనా మాల్దీవుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించినవాడు. అవినీతి ఆరోపణలమీద పదకొండేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్లా యమీన్‌ దేశాధ్యక్షుడు కాలేక తన స్థానంలో ఈయనను కూచోబెట్టినందున యమీన్‌ తరహాలోనే ఈయన కూడా భారత వ్యతిరేక వైఖరి కనబరచవచ్చు. చారిత్రక సాంస్కృతిక బంధాలు, భౌగోళిక సామీప్యం, భద్రతాపరమైన అవసరాల వల్ల మాల్దీవులతో భారతదేశ సంబంధాలు కీలకమైనవి. ఈ ప్రాంతంలో చైనా విస్తరణ, ఆధిపత్యాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా, చైనాకు ధీటుగా భారతదేశం సోలీ ఏలుబడికాలంలో మాల్దీవుల్లో పెట్టుబడులు పెట్టింది, సాన్నిహిత్యం పెంచుకుంది. అనేక మిగతా ప్రాజెక్టులతో పాటు, గ్రేటర్‌ మాలే ప్రాజెక్టుకు భారీ ఆర్థికసాయం అందించింది. ఇరుదేశాల మధ్య భద్రతకు సంబంధించిన సహకారం, తదనుగుణమైన వ్యవస్థల ఏర్పాటు కూడా విశేషంగా జరిగింది.


మాల్దీవుల కొత్త అధ్యక్షుడిని తొలిగా అభినందించినవారిలో మోదీ ఒకరు. ఎన్నికల ప్రచారంలో ముయిజ్జూ ఆయన పార్టీ చేసినంతగా భారత్‌ మీద స్వయంగా విమర్శలు చేయలేదని, అధికారం చేపట్టాక భారత్‌తో ఆచితూచి వ్యవహరించవచ్చునన్న అంచనాలూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిని, అప్పుల ఊబిలో ఉన్న దేశాన్ని తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనమీద ఉంది. పొరుగుదేశం శ్రీలంక ఎదుర్కొంటున్న దుస్థితి కళ్ళముందే కనిపిస్తున్నది కనుక, చైనా మెప్పుకోలు కోసం బలమైన భారత్‌ను ఆయన పూర్తిగా కాదనలేకపోవచ్చు. అధ్యక్షతరహా పాలన నుంచి దేశం తిరిగి పార్లమెంటరీ వ్యవస్థకు పోవాలా వద్దా అన్న అంశంపై త్వరలోనే మాల్దీవుల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఆయన జాగ్రత్తగా అడుగులువేయవచ్చు. అధికారంలో ఎవరు ఉన్నా, మాల్దీవులతో మనబంధం బలంగా కొనసాగాల్సిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం ముయిజ్జూ తీసుకోబోయే నిర్ణయాలు కొన్ని మనకు ఇబ్బంది కలిగించవచ్చు, ఆయనతో వ్యవహారం కష్టంగా కనిపించవచ్చు. ఘర్షణాత్మకవైఖరికి తావులేకుండా ద్వైపాక్షిక సంబంధాలు నెరపి, ఉభయదేశాల సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం ముఖ్యం.

Updated Date - 2023-10-05T02:51:37+05:30 IST