బీరేన్‌ వీరంగం!

ABN , First Publish Date - 2023-09-08T00:52:35+05:30 IST

నెలల తరబడి రాష్ట్రాన్ని తగలబెట్టిన మణిపూర్‌ పాలకులు అక్కడ జరిగినది ఏమిటో బయటకు చెప్పినందుకు పాత్రికేయ ప్రముఖులపై కేసులు పెట్టారు..

బీరేన్‌ వీరంగం!

నెలల తరబడి రాష్ట్రాన్ని తగలబెట్టిన మణిపూర్‌ పాలకులు అక్కడ జరిగినది ఏమిటో బయటకు చెప్పినందుకు పాత్రికేయ ప్రముఖులపై కేసులు పెట్టారు. తాము మతకార్చిచ్చు రాజేయవచ్చు, ప్రజలు పరస్పరం నరుక్కొనేట్టు చేయవచ్చు కానీ, పాత్రికేయులు మాత్రం నిజనిర్ధారణ చేయకూడదు, నివేదికలు ప్రకటించకూడదు. మహిళలను నగ్నంగా ఊరేగించినవారి విషయంలో ఎంతోకాలంపాటు అమాయకత్వం నటించిన మణిపూర్‌ పాలకులకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల వెలువరించిన నివేదిక చూడగానే ఎక్కడలేని ఆగ్రహం కలిగింది. ఆ నివేదిక శాంతిబాట పడుతున్న రాష్ట్రాన్ని నిప్పులగుండం చేయడానికి ఉద్దేశించిందని ముందు ఓ సామాజిక కార్యకర్త కేసుపెడితే, ప్రభుత్వం వెంటనే జతచేరింది. నిజనిర్థారణ సంఘంలోని ముగ్గురు పాత్రికేయప్రముఖులపైనా, ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షురాలిపైన రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనాయి. విచిత్రమేమంటే, నెలలతరబడి జరుగుతున్న హింసమీద నోరువిప్పని ముఖ్యమంత్రి, ఈ నివేదికమీద మాత్రం అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఎడిటర్స్‌గిల్డ్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలూ చేశారు.

తన అసమర్థతవల్లనో, ఉద్దేశపూర్వకంగానో హింసను నివారించని బీరేన్‌సింగ్‌ ఆ నివేదికలోని అంశాలతో విభేదించడంలో ఆశ్చర్యమేమీలేదు. అవి అవాస్తవాలంటూ కుండబద్దలుకొట్టే, ఇవీ వాస్తవాలంటూ అనుకున్నవి చెప్పే హక్కు ఆయనకు ఉంది. కానీ, ఎడిటర్స్‌ గిల్డ్‌ తిరిగి నిప్పురాజేయడానికి ప్రయత్నిస్తున్నదని, తెగలమధ్య ఘర్షణలు పురిగొల్పేందుకు కంకణం కట్టుకుందన్న విమర్శలు అత్యంత దారుణమైనవి. ఎడిటర్స్‌ గిల్డ్‌నూ, సభ్యులనూ దేశవ్యతిరేకులుగా, ప్రజావ్యతిరేకులుగా, విషనాగులుగా అభివర్ణించడం, తనకు ముందే తెలిసివుంటే కమిటీని రాష్ట్రంలో అడుగుపెట్టనిచ్చేవాడిని కానని ప్రకటించడం ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి అనాల్సిన మాటలు కావు.


రాష్ట్రం తీవ్రకల్లోలం చవిచూస్తున్న కాలంలో, మణిపూర్‌ పాత్రికేయులు–వారు మీతీలు అయినా, ఆదివాసులైనా– తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవలసి వచ్చిందని, వారివారి సమాజాలు బలంగా నమ్ముతున్న వాదననే నివేదించాల్సి వచ్చిందని ఈ నిజనిర్థారణ సంఘం నివేదిక వ్యాఖ్యానించింది. ముఖ్యంగా, ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని సరిగా అంచనావేయడం పాత్రికేయులకు కష్టమైందని, వారి వార్తల్లో నిజానిజాలను సరిపోల్చుకోగలిగే అవకాశం సంపాదకులు, బ్యూరోచీఫ్‌లకు లేకపోయిందని నివేదిక ఆ వాతావరణాన్ని విశ్లేషించింది. ఈ స్థితిలో జాతుల పరంగా చీలిపోయిన మీడియా ఏకపక్ష కథనాలను ప్రచురించిందని, ప్రధానంగా మీతీమీడియా పలు అసత్యకథనాలను వండివార్చిందని అంటూ, అసోం రైఫిల్స్‌కు పక్షపాతం అంటగట్టే విషయంలో అది నిర్వహించిన పాత్రను, వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించింది. రాష్ట్రంలోని అధికారపక్షం నాయకులు కుకీ–జో ఆదివాసులను అక్రమవలసదారులుగా, విదేశీయులుగా వ్యాఖ్యానించడం, రాష్ట్రంలో ‘నాగా’యేతర ఆదివాసుల జనాభా అక్రమంగా పెరిగిందని అనడానికి ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవడం గురించి వివరించింది. మయన్మార్‌ సంక్షోభం ప్రభావంతో మణిపూర్‌కు వచ్చిన నాలుగువేలమంది ఆధారంగా మొత్తం కుకీ–జోలపై సాగిన దుష్ప్రచారం ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో వివరించింది.

రాష్ట్రంలో మీడియా మీతీమీడియాగా మారిపోయిందని, ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని, ప్రభుత్వ బలగాలు, సంస్థలు జాతులపరంగా చీలిపోయి ప్రవర్తించాయని నివేదిక తేల్చడం బీరేన్‌సింగ్‌కు నచ్చలేదు. ఈ నివేదికను అబద్ధాలపుట్టగా రుజువుచేసేందుకు ఆయన కొన్ని లెక్కలు వివరాలు చెప్పడం, అందులో భాగంగా ఆయన నోటివెంటే కొన్ని నిజాలు వెలుగుచూడటం మంచిదే. కానీ, నాలుగునెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదేమిటో దాచి ఉంచి, తెగలమధ్య వైషమ్యాలు పెంచిపోషించినవారు, ప్రభుత్వ పక్షపాతవైఖరి వల్లనే ఈ కష్టకాలంలో మీడియా తన విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని నివేదిక తేలిస్తే ఎదురుదాడి చేయడమేమిటి, కేసులు పెట్టడం ఏమిటి? ఐపీసీలోని చాలా సెక్షన్లతో పాటు, అవినీతి నిరోధకచట్టాన్ని, ఐటీ చట్టంలో సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన ఒక సెక్షన్‌ను సైతం పాత్రికేయులపై ప్రయోగించడం మీడియాను భయపెట్టడానికి ఉద్దేశించినవే. సుప్రీంకోర్టు అడ్డుపడటంతో వీరి అరెస్టులు తాత్కాలికంగా ఆగివుండవచ్చును గానీ, నిజాలు చెప్పిన నివేదికపై బీరేన్‌ విరుగుబాటు అధికార దుర్వినియోగమే.

Updated Date - 2023-09-08T00:52:35+05:30 IST