భావస్వేచ్ఛకు బేడీలు

ABN , First Publish Date - 2023-10-04T01:20:18+05:30 IST

ఆన్‌లైన్‌ న్యూస్‌పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ మీద ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే దాడి చేశారు. ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాల్లో ఆ పోర్టల్‌లో పనిచేస్తున్న...

భావస్వేచ్ఛకు బేడీలు

ఆన్‌లైన్‌ న్యూస్‌పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ మీద ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే దాడి చేశారు. ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాల్లో ఆ పోర్టల్‌లో పనిచేస్తున్న పాత్రికేయులు, సిబ్బంది ఇళ్ళలో సోదాలు జరిగాయి. వారినుంచి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇత్యాది ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అనేకమంది పాత్రికేయులను కస్టడీలోకి తీసుకోవడంతో పాటు, పోర్టల్‌ సంపాదకుడు ప్రబీర్‌ పురకాయస్థ, సీనియర్‌ జర్నలిస్టు పరంజొయ్‌ గుహ ఠాకుర్తా తదితరులను ఉదయంనుంచి సాయంత్రం వరకూ పోలీసులు ప్రశ్నించారు. ఈ పోర్టల్‌ ద్వారా తమ అభిప్రాయాలను ప్రకటించే చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు, వ్యాఖ్యాతల ఇళ్ళలో కూడా సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ పాత్రికేయ సంఘాలు ఈ దాడులను ఖండించాయి. ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా నిరసన చేపట్టి, సంఘటిత పోరాటానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు ఈ మీడియా సంస్థ తమ ఆదాయవ్యయాలు, నిధుల సమీకరణ వివరాలు సమర్పించిన నేపథ్యంలో, మళ్ళీ ఇలా విరుచుకుపడటం మిగతా మీడియా సంస్థలను భయపెట్టడానికేనని పాత్రికేయులు విమర్శిస్తున్నారు.

ఊపా కేసుకు తోడు ఈ మధ్యనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) దాడులు చేసి, ఈ సంస్థ విదేశీవిరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) నిబంధనలను అతిక్రమించి, విదేశాలనుంచి డబ్బు సేకరించిందని కేసు పెట్టిన నేపథ్యంలో, ఈ సోదాలు జరిగినట్టు చెబుతున్నారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో కూడా తమకు తెలియచేయడం లేదని న్యూస్‌క్లిక్‌ పాత్రికేయులు వాపోతూంటే, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అంటున్నారు. నెవిల్లే రాయ్‌ సింఘమ్‌ అనే ఒక అమెరికన్‌ మిలియనీర్‌, చైనా అధికారిక మీడియాతో కలిసి పనిచేస్తూ, వివిధ అంశాలపై చైనా అభిప్రాయాలను ఇతర దేశాల్లో ప్రచారం చేసేందుకు సహకరిస్తుంటారని, ఆయన పోషిస్తున్న నెట్‌వర్క్‌లో న్యూస్‌క్లిక్‌ ఉన్నదని న్యూయార్క్‌ టైమ్స్‌లో ఆగస్టు 5న ప్రచురితమైన కథనాన్ని బీజేపీ నాయకులు ప్రచారంలో పెడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే లోక్‌సభలో ఈ కథనాన్ని చూపిస్తూ, ‘భారత వ్యతిరేక వాతావరణం’ సృష్టించడానికి చైనానుంచి ఈ పోర్టల్‌కు, రాహుల్‌గాంధీకీ డబ్బు ముడుతోందని ఆరోపించారు కూడా. ఈ కథనం ఆధారంగానే ఇప్పుడు న్యూస్‌క్లిక్‌ కథంతా కదులుతోందని కొందరు అంటారు.


తమనుంచి స్వాధీనం చేసుకొనే సమయానికి ల్యాప్‌టాప్‌లలో ఎంత సమాచారం ఉన్నదో తెలియచెప్పే ‘హ్యాష్‌ వాల్యూ’ని రికార్డు చేయకుండానే ఢిల్లీ పోలీసులు వాటిని పట్టుకుపోవడంతో, భవిష్యత్తులో తమకు వ్యతిరేకంగా చాలా కుట్రపూరిత ఆధారాలు వాటిలో నిక్షిప్తమయ్యే ప్రమాదం ఉన్నదని పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌లో న్యూస్‌క్లిక్‌ సీనియర్‌ పాత్రికేయులను గంటలపాటు లోతుగా ప్రశ్నించిన అంశాలు కూడా అనుమానాలు రేకెత్తించేవే. షాహీన్‌ బాగ్‌ ప్రతిఘటన, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన రైతు ఉద్యమం, కరోనా సంక్షోభం వంటి అంశాలపై వీరంతా వార్తలు, వ్యాఖ్యలు రాశారా, వ్యాఖ్యానాలు చేశారా అన్నది ఆ ప్రశ్నల సారాంశం. ఈ అంశాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ పోర్టల్‌ద్వారా పాత్రికేయులు, మేధావులు విమర్శించిన విషయం రహస్యమేమీ కాదు. దీనికితోడు, అదానీ సంస్థ అక్రమలావాదేవీలపై, మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలమీద ఠాకుర్తా వంటివారు ఘాటైన పరిశోధనాత్మక కథనాలు అనేకం రాశారు కూడా. ‘ప్రభుత్వానికి, దేశానికి’ ఇలా వ్యతిరేకంగా రాస్తున్నందుకు మీకు ఎక్కువమొత్తం ముడుతోందా? అని కూడా పోలీసులు న్యూస్‌క్లిక్‌ పాత్రికేయులను ప్రశ్నించారట. ప్రస్తుత పాలకుల భావజాలంతోనూ, విధానాలతోనూ ఏకీభావం ప్రకటించని ప్రజాసంఘాలైనా మీడియా సంస్థలైనా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలిసిందే. ది క్వింట్‌, దైనిక్‌ భాస్కర్‌, ది వైర్‌, చివరకు బీబీసీ వంటివి కూడా సోదాలు, దాడులకు గురికావాల్సివస్తున్న తరుణంలో, పత్రికాస్వేచ్ఛలో మనదేశం 161వస్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రజల్లో విశ్వాసం, గౌరవం ఉన్న పాత్రికేయులను, మేధావులను దేశవ్యతిరేక శక్తులుగా, విదేశీ ఏజెంట్లుగా చిత్రీకరించి వారి ఆలోచనలకు, వ్యాఖ్యలకు సమాజంలో ఏ మాత్రం విలువలేకుండా చేయాలన్న ప్రయత్నం విశేషంగా సాగుతోంది.

Updated Date - 2023-10-04T01:20:18+05:30 IST