తిరిగి నిప్పుల్లోకి!

ABN , First Publish Date - 2023-10-06T02:09:27+05:30 IST

దశాబ్దాలుగా అఫ్ఘానిస్థాన్‌నుంచి వలసవచ్చినవారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్‌ ఇప్పుడు వారి ఉనికి తనకు ప్రమాదమని అనుకుంటోంది. పాకిస్థాన్‌ భూభాగంమీద జరుగుతున్న ఉగ్రవాదదాడుల్లో...

తిరిగి నిప్పుల్లోకి!

దశాబ్దాలుగా అఫ్ఘానిస్థాన్‌నుంచి వలసవచ్చినవారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్‌ ఇప్పుడు వారి ఉనికి తనకు ప్రమాదమని అనుకుంటోంది. పాకిస్థాన్‌ భూభాగంమీద జరుగుతున్న ఉగ్రవాదదాడుల్లో అఫ్ఘాన్‌వలసదారుల ప్రమేయం, సహకారం ఉందని నమ్ముతున్నందున, తమదేశంలో అక్రమంగా ఉంటున్న అఫ్ఘాన్‌వాసులంతా నవంబరు ఒకటిలోగా వెనక్కుపోవాలని, లేదంటే బలవంతంగా వెనక్కుపంపించాల్సి వస్తుందని పాకిస్థాన్‌ హెచ్చరించింది. గడువులోగా వెళ్ళనివారు శిక్షలకు గురికావాల్సివస్తుందని, వారి ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకుంటామని, అనధికారికంగా ఉంటున్నవారిని గుర్తించి వేటాడేందుకు సమస్త వ్యవస్థలు రంగంలోకి దిగుతాయని, వారి ఆచూకీ తెలియచెప్పే పాకిస్థాన్‌ పౌరులకు నగదుపురస్కారాలు ఇస్తామని కూడా పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. అఫ్ఘాన్‌ శరణార్థుల విషయంలో పాకిస్థాన్‌ ప్రవర్తన ఆమోదయోగ్యమైనది కాదని, తమకుతాముగా నిష్క్రమించేవరకూ పాకిస్థాన్‌ వారిని భరించాల్సిందేనని చేసిన ఈ ప్రకటన, ఉభయదేశాల మధ్యా సంబంధాలు మరింత దిగజారాయనడానికి నిదర్శనం.

పొరుగుదేశంనుంచి వస్తున్నవారిమీద మరింత నిఘాపెట్టడం, తిరిగిపంపడం వంటివి ఇటీవల పాకిస్థాన్ విస్తృతంగా చేపట్టినా, ఇలా వలసదారులపై ఒకేసారి విరుచుకుపడటం తాలిబాన్‌తో పాకిస్థాన్‌ దోస్తీ చెడిందనడానికి రుజువు. తమదేశంలో అనధికారికంగా ఉంటున్న అఫ్ఘాన్‌ వలసదారుల సంఖ్య విషయంలో పాకిస్థాన్‌కు స్పష్టమైన అంచనా ఏమీ లేదు. 17లక్షల మంది వరకూ ఉండవచ్చన్నది ఊహ. అఫ్ఘాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటూ, పాకిస్థాన్‌ తాలిబాన్‌ (టీటీపీ) ఆత్మాహుతిదాడులు అత్యధికంగా జరుగుతూ, గ్రామాలకు గ్రామాలు దానిగుప్పిట్లోకి పోతున్న పరిస్థితుల్లో ఖైబర్‌ ఫక్తున్ఖ్వా ప్రావిన్సు పాలకులు నియమించిన కమిటీ సూచనమేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చింది. మొత్తం అఫ్ఘాన్‌ వలసదారుల్లో సగానికిపైగా ఈ ప్రావిన్సులోనే ఉన్నారు. మిగతావారంతా ప్రధాన నగరాలతో సహా దేశమంతా వ్యాపించారు. అందువల్ల, లక్షలాదిమందిని అక్రమమో, సక్రమమో గుర్తించడం, వెనక్కుపంపడం పాకిస్థాన్‌కు అత్యంత క్లిష్టతరమైన, సమస్యాత్మక వ్యవహారం. తమకుతాముగా వెనక్కుపోనివారిని వెతికిపట్టుకోవడం, తరలించడం, నిర్బంధ శిబిరాల్లోనో, లేదా ప్రతిఘటన ఉన్నపక్షంలో జైళ్ళలోనో ఉంచి పోషించడం పాకిస్థాన్‌కు మరింత ఆర్థిక భారం.

దశాబ్దాలుగా ఉంటున్న లక్షలాదిమందికి తోడు, రెండేళ్ళక్రితం అఫ్ఘానిస్థాన్‌ తిరిగి తాలిబాన్‌వశమైనప్పుడు మరో 8లక్షలమంది పాకిస్థాన్‌ వచ్చిపడ్డారు. అక్రమంగా ప్రవేశించినవారిని అటుంచితే, వీసా గడువుతీరిన తరువాత వెనక్కుపోనివారి సంఖ్య చాలా పెద్దది. పేదలే కాదు, తాలిబాన్‌తో తమకు ప్రాణగండం ఉందన్న భయంతో పారిపోయివచ్చిన వారిలో మాజీ సైనికోద్యోగులు, హక్కుల కార్యకర్తలు, కళాకారులు, పాత్రికేయులు సహా అనేకరంగాలకు చెందినవారు వేలాదిగా ఉన్నారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తుంటే, అత్యధికులు ఆశ్రయం కోసం యుఎన్‌హెచ్‌సిఆర్‌కు దరఖాస్తుచేసి, సాంకేతికంగా దాని పర్యవేక్షణలో ఉంటున్నారు. ఈ స్థితిలో వారి జోలికిపోవడం ఒక అంతర్జాతీయ సమస్య అవుతుంది.

నాలుగుదశాబ్దాలుగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, స్వప్రయోజనాల కోసం అఫ్ఘానిస్థాన్‌నుంచి దేశంలోకి వలసలను యధేచ్ఛగా అనుమతించిన పాకిస్థాన్‌, ఇప్పుడు హఠాత్తుగా వారిని గెంటివేయడానికి చేస్తున్న ప్రయత్నం ఫలితానివ్వకపోగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను సృష్టించబోతున్నది. అల్లా దయవల్ల అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పడిందని కీర్తించి, అక్కడ చక్రం తిప్పాలని ఆశించి భంగపడిన పాకిస్థాన్‌, చివరకు ఉగ్రవాదులతో పోరాడలేక శరణార్థులపై విరుచుకుపడుతున్నది. అఫ్ఘాన్‌ తాలిబాన్‌ సహకారం లేకుండా పాకిస్థాన్‌మీద టీటీపీ భారీగా విరుచుకుపడే అవకాశాలు లేవన్నది నిజమే కానీ, ఆ ఉగ్రసంస్థను నియంత్రించాలంటే అఫ్ఘాన్‌ పాలకులమీద ఒత్తిడి తేవాలని, అందుకు శరణార్థులను ఆయుధంగా వాడలన్న వ్యూహం సరికాదు. ఎన్ని లక్షలమంది తరలివచ్చినా తాలిబాన్‌కు కానీ, ఉగ్రవాదులకు కానీ పోయేదేమీ ఉండదు. కానీ, తాలిబాన్‌నుంచి తప్పించుకువచ్చిన సామాన్యులను తిరిగి నిప్పుల్లోకి తోసివేయాలన్న ఈ నిర్ణయం కచ్చితంగా పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా అప్రదిష్ట తెస్తుంది.

Updated Date - 2023-10-06T02:09:27+05:30 IST