అపూర్వ జయభారతం

ABN , First Publish Date - 2023-10-10T01:13:25+05:30 IST

చైనావేదికగా పక్షం రోజుల పాటు సాగిన ఆసియా క్రీడల యుద్ధానికి తెరపడింది. నలభై దేశాల నుంచి దాదాపు 12వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగిన ఈ క్రీడామహోత్సవం ఆదివారంతో ముగిసింది...

అపూర్వ జయభారతం

చైనావేదికగా పక్షం రోజుల పాటు సాగిన ఆసియా క్రీడల యుద్ధానికి తెరపడింది. నలభై దేశాల నుంచి దాదాపు 12వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగిన ఈ క్రీడామహోత్సవం ఆదివారంతో ముగిసింది. కొవిడ్‌ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైనా, ఆతిథ్యం విషయంలో చైనా ఎక్కడా రాజీపడలేదు. ఆరంభోత్సవాలను, ముగింపు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది. అలాగే, ఎప్పటిలాగే ఈ క్రీడల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 200 స్వర్ణాలు, 111 రజతాలతో కలిపి మొత్తంగా 382 పతకాలతో చైనా క్రీడాకారులు తమకు తిరుగులేదని నిరూపించారు. 186 పతకాలతో జపాన్‌, 190 పతకాలతో దక్షిణ కొరియా రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి.

ఈసారి భారత క్రీడాకారులు తమ అమోఘమైన ప్రదర్శనతో, గతంలో ఎన్నడూ లేనంతగా 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి మొత్తంగా 107 పతకాలు కొల్లగొట్టారు. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచినా, ఆసియా క్రీడల చరిత్రలో ఇది మనకు రికార్డు. నాలుగేళ్ల క్రితం జకార్తలో జరిగిన క్రీడల్లో 70 పతకాలతో ఫర్వాలేదనిపించిన మన ఆటగాళ్లు ఈసారి కనీసం వంద లక్ష్యంతో హాంగ్జౌకు పయనమయ్యారు. చెప్పినదాని కన్నా ఎక్కువే సాధించారు. ఇది దేశ క్రీడారంగంలో అద్భుత పురోగమనం.

చైనాలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏడాది ఆలస్యంగా టోర్నమెంట్‌ జరిగినందున, ఆ సమయాన్ని మన క్రీడాకారులందరూ చక్కగా వినియోగించుకున్నారు. పట్టుదలగా శ్రమించి, ఫలితాన్ని రాబట్టారు. దాదాపు పోటీపడ్డ ప్రతి క్రీడాంశంలోనూ విజయాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రధానంగా షూటింగ్‌లో 29, అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 22 పతకాలు చేజిక్కించుకున్నారు. ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌ అయిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా బంగారాన్ని ఒడిసి పట్టుకోగా, కిషోర్‌కుమార్‌ ప్రతిభతో జావెలిన్‌ త్రోలో రజతం కూడా మనకే దక్కడం సంతోషకర పరిణామం. బ్యాడ్మింటన్‌ రాణి పీవీ సింధు, కుస్తీ వీరుడు బజ్‌రంగ్‌ పూనియా పతకం లేకుండా వెనుదిరగడం, బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఫైనల్‌దాకా వెళ్లలేకపోవడం ఒకింత నిరాశపరిచే అంశం. నిఖత్‌ సెమీఫైనల్లోనే ఓడి కంచు పతకానికి పరిమితమైంది. అయినా, పోటీల్లో తెలుగు క్రీడాకారులు స్వర్ణకాంతులు వెదజల్లడం సంతోషించదగ్గ పరిణామం. ఆర్చర్‌ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో కలిపి మూడు స్వర్ణాలతో కొత్త చరిత్రను లిఖిస్తే, యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఓ స్వర్ణం, మూడు వెండి పతకాలతో అబ్బురపరిచింది. టెన్నిస్‌ డబుల్స్‌లో సాకేత్‌ మైనేని, చెస్‌ టీమ్‌ ఈవెంట్లలో హంపి, హారిక, హరికృష్ణ, అర్జున్‌ రజతాలు అందుకున్నారు. సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టితో కలిసి డబుల్స్‌లో విజేతగా అవతరించడం భారత బ్యాడ్మింటన్‌లో మరపురాని ఘట్టం. ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడం ఇదే మొదటిసారి. జ్యోతి ఎర్రాజి 110 మీటర్ల హర్డిల్స్‌లో రజతం, నందిని అగసర ఏడు ఈవెంట్ల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో కాంస్యం సాధించడంతో యావత భారతావని మురిసిపోయింది. పేద కుటుంబాలలో జన్మించిన ఈ విజేతలు పట్టుదలగా పోరాడుతూ అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన వైనం స్ఫూర్తిమంతం. ఒకప్పుడు పొలాల్లో పరుగులు తీసిన పారుల్‌ చౌదరి, పాలు అమ్మిన నాన్న కష్టార్జితానికి ప్రతిఫలంగా బరిలోకి దిగిన ఆర్చర్‌ అంకిత భకత్‌, నాన్న కల నెరవేర్చడం కోసం అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టిన కేరళ అథ్లెట్‌ ఆన్సీ, అమ్మగా మారినా ఆటలో ఏ మాత్రం సత్తా తగ్గని దీపికా పళ్లికల్‌, సీమా పూనియా.. ఇలా ఈ ఆసియాడ్‌లో పోటీపడి పతకాలు సాధించిన ఒక్కొక్కరిది ఒక్కో స్ఫూర్తిగాథ.

గతంలో కన్నా ఎక్కువ పతకాలతో మనం అత్యుత్తమ ప్రదర్శన చేసినా, చిన్న దేశాలు ఈ క్రీడల్లో చూపిన సామర్ధ్యంతో పోలిస్తే భారత ఇంకా వెనుకంజలో ఉందనే చెప్పుకోవాలి. మెరికల్లాంటి అథ్లెట్లను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం లాంటి పథకాలు మన దేశంలో ఉన్నాయి. అయితే, ఆ పథకాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయన్నది ముఖ్యం. ఏదో ఒక క్రీడా సందర్భాన్ని పురస్కరించుకొని క్రీడాకారులకు శిక్షణ, సదుపాయాలను కల్పించడం కాకుండా దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. మరో ఏడాదిలో పారిస్‌ నగరం వేదికగా ఒలింపిక్స్‌ జరగబోతున్నాయి. ఇప్పుడు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని పారిస్‌ విశ్వక్రీడా ప్రాంగణంలో మరిన్ని అద్భుతాలు సృష్టించాలి.

Updated Date - 2023-10-10T01:13:25+05:30 IST