Share News

నది భీమా మాట్లాడుతోంది, వినండి!

ABN , First Publish Date - 2023-12-11T02:56:19+05:30 IST

ప్రకృతికో భాష ఉంది. నదులు, కొండలు, కీకారణ్యాలు, జంతువులు, పక్షులు, సరీసృపాలు అన్నింటికీ ప్రకృతికి అనుసంధానమైన భాషలు ఉన్నాయి. మనుష్య జాతులకు భాషలున్నట్లే ప్రతీప్రాణికీ భాషలున్నాయి...

నది భీమా మాట్లాడుతోంది, వినండి!

ప్రకృతికో భాష ఉంది. నదులు, కొండలు, కీకారణ్యాలు, జంతువులు, పక్షులు, సరీసృపాలు అన్నింటికీ ప్రకృతికి అనుసంధానమైన భాషలు ఉన్నాయి. మనుష్య జాతులకు భాషలున్నట్లే ప్రతీప్రాణికీ భాషలున్నాయి. ప్రకృతిలో అనాదిగా ఒక భాగమై యితర జంతుజాలంతో సహజీవనం చేసే మానవులకు ఈ భాషలు తెలుసు. మనిషి నాగరికత పేరుతో నగరాలు నిర్మించుకుంటూ ధన సంపాదన వెంటపడి ప్రకృతిని కొల్ల గొట్టడం ప్రారంభించాడు. తోటి మనిషితో సహా ఎవరు అడ్డం వచ్చినా నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు. ఈ కర్కశ జీవన గమనంలో అతను ప్రకృతి భాషను పోగొట్టుకున్నాడు. పైగా అప్పుడప్పుడూ ప్రకృతిని జయించానని విర్రవీగి ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకృతితో యుద్ధం చేస్తున్నట్లు భ్రమిస్తూ జయించానని అనుకోవడం ఒక వికృతాలోచన. ప్రకృతి శోధనలో, కొత్త అంశాల ఆవిష్కరణలతో జ్ఞాన విజ్ఞాన పరిధులను మరింత విశాలం చేసుకుంటూ ప్రయాణించడమే మనిషి చెయ్యవలసిన పని. ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతిలోని రహస్యాలను వెలికితీయడమే అవసరం.

నది భీమా మాట్లాడుతోంది. ఒక నది మాట్లాడడం, చారిత్రక గాథని ఘట్టఘట్టాలుగా, ఉద్వేగభరితంగా వివరించడం, ఆలోచనాలోకంలోనే ఒక అద్భుతం. ఈ భావనే కవనసీమలో ఒక అపూర్వ విన్యాసం. కవి శ్రీరాంకి ప్రకృతి భాష తెలుసు. అతను నది భీమా చెప్పిన చారిత్రక గాథ విన్నాడు. దానిని తెలుగులోకి అనువదించి మనకు చెబుతున్నాడు. దీని పేరు ‘పద్దెనిమిది వందల పద్దెనిమిది’. ఇది లఘు ఐతిహాసిక లక్షణాలు కలిగిన కావ్యం.

సహజంగానే నదులు కుడి ఎడమల ఒడ్డులను ఒరుసు కుంటూ ప్రవహిస్తాయి. నది భీమా గంభీరంగా చరిత్ర గమనాన్ని గమనిస్తూ ప్రవహిస్తోంది. భీమా ప్రత్యేకత ఏమిటంటే - నది రెండు వొడ్డులూ రెండు భిన్నమైన చారిత్రక కాలాతీత సంఘ టనలను రికార్డు చేస్తూ ముందుకు పోతున్నది. కుడి ఒడ్డు మీద సమాజ అగ్రవర్ణాల నీతివంతుల కార్యకలాపాలు, పరిపాలకుల గొప్పదనం గురించిన ప్రచారహోరుతో నిండి ఉంటుంది. ఇదే అసలైన చరిత్రగా చెలామణి అవుతుంది. ఎడమ ఒడ్డు పైన సమాజ అగ్రవర్ణ సనాతనుల దుర్మార్గాలూ, పాలకులు, సామాన్య జనం, నిమ్న వర్గ జనాల గొంతుకలను అణచివేసే దృశ్యాలూ కనబడతాయి. ఈ నదీ ప్రవాహంలో హత్యల, ఆత్మహత్యల శవాలూ, కంకాళాలూ కొట్టుకుపోతూ ఉంటాయి. ఇవేగాక, కింది వర్గాల జనం పోరాటాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. నది భీమా ప్రత్యేకత ఏమిటంటే - చరిత్రకెక్కని వీటిపై వెలుతురు ప్రసారం చేస్తున్నది. కోరేగావ్‌ మహర్ల పోరాటం బహుళ కోణాల నుండి మానవాళి నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయి. ఈ ‘పద్దెనిమిది వందల పద్దెనిమిది’ కావ్యం చరిత్రని బోనులో నిల్చోపెడుతోంది. నిజాన్ని కక్కిస్తోంది.

‘‘గోవింద్‌ గోపాల్‌ మహర్‌ నా పేరు

భీమా కోరేగావ్‌ నేను పుట్టిన ఊరు

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను’’ అంటూ ప్రవాహం ప్రారంభమవుతుంది.

చరిత్ర టక్కరి, బహురూపి, ఊసరవెల్లి. స్వాతంత్య్రం వచ్చిన ప్పట్నుంచి మన దేశంలో ప్రజలులేని ప్రజాస్వామ్యం నడుస్తోంది. ప్రజలు లేని ప్రజాస్వామ్యమంటే కపటస్వామ్యం. మృగతృష్ణ స్వామ్యం. ఈ కపట స్వామ్యంలో పాలకుల ప్రతి చర్యకూ ప్రజల మద్దతు ఉన్నట్లు ప్రజాస్వామ్యం నడుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అసలు చరిత్ర సమాధిపై కపట స్వామ్య చరిత్రగా చెలామణి అవుతోంది.

చరిత్ర రాసినవాడు

అంతఃపురంలో వున్న రాణుల పాదాలకు

పారాణి పూస్తాడు

సామ్రాజ్యాలు చుట్టి వచ్చిన

రాజుగారి గుర్రపు డెక్కల కచేరీ చేస్తాడు

నేను భీమా నదిని, సత్యమే చెబుతున్నాను

మరాఠా పీష్వాలు దేశభక్తులు కాదు

ఆ చిత్పవన బ్రాహ్మణ యుద్ధం స్వాతంత్ర్యోద్యమం కాదు

చరిత్ర, సంపద శయ్యపై పడుకుని

నిరుపేద నేల చెలమల్లోకి తొంగి చూడలేదు

చరిత్ర నిర్లక్ష్యాన్ని రాసేందుకే ఒక్క వర్ణమాల చాలడంలేదు

చరిత్ర, చుక్కల్లేని ఆకాశమై విస్తరించింది

నిస్సార వృక్ష ఛాయగా పరుచుకున్నది

చరిత్రది, ఒఠ్ఠి బానిస పోలిక

పరాధీన సౌందర్యం

భారతదేశం కులాల, మతాల దేశం. అగ్ర, నిమ్న మెట్ల దేశం. పాలకులు అభివృద్ధి సాధనలో పైమెట్టు నుండీ ఇంకా పైపైకి చూస్తారు. కింది మెట్టు నుండి పైమెట్టు వైపు ప్రయాణించరు. పైవాళ్ళ బాగోగులు ముందు చూస్తారు. సమ్మెలు, ధర్నాలు చేస్తే కింది వాళ్ళ వంక కొంచెం చూస్తారు. కింది మెట్టు నుండి పైకి చూస్తూ ప్రయాణిస్తే నేల మీద ఎవరున్నారో తెలుస్తుంది. పైమెట్టు నుండి పైపైకి చూస్తూ ప్రయాణిస్తే ఆకాశం తప్ప నేల కనబడదు. ఆకాశంలో విశ్వామిత్ర స్వర్గం ఉంది. ఇదే త్రిశంకువాదం. దీని నుంచి పుట్టిందే మిధ్యావాదం. దీనికి పునాదిగా నేల ఉండదు. దీనినే అరచేతిలో స్వర్గం చూపించడం అంటారు. నేల మీది దళితుల వైపునుండి చరిత్ర రచన జరగాలి గదా!

‘‘రెండు వందల ఏళ్ళ శైథిల్యం తరువాత

నేనీరోజు మళ్ళీ రక్త స్నానం చేస్తున్నాను

నాకిప్పుడు ఏ స్థూపాన్ని చూసినా కోరేగావ్‌ గుర్తుకొస్తున్నది

స్తంభించిన కాల రహస్యం గుట్టు విప్పుతున్నాను -

తనని తాను పోగొట్టుకోవడం

మళ్ళీ పురుడు పోసుకోవడం

ఒక్క విప్లవానికే చెందిన రసవిద్య

నదీమ తల్లిని చెబుతున్నాను

మొప్పల అలికిడిలో పిడికిళ్ళ కేరింతలు విన్నాను

- రెండు వందల ఏళ్ళ కిందటి పీష్వాల మీద, అణచివేయడం మీద మహర్లు చేసిన పోరాటం ఒక మహత్తర యుద్ధంతో సమానం. ఇప్పుడు అది చరిత్రలోని ఒక సంఘటనగా మాత్రమే కనిపించవచ్చు. కానీ, ఆ యుద్ధ లక్షణాలతో నాటి నుండీ నేటి వరకు నిమ్న అగ్ర వర్గాల మధ్య పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో అంటరానితనం, దేవాలయ ప్రవేశ నిషిద్ధం మొదలైన అమానవీయ లక్షణాలపై సాంఘిక సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. అయినా మాన వత్వం, సమానత్వం అందని ద్రాక్షలుగా మిగిలిపోయాయి.


ఒకప్పుడు అంటరానితనం వంటి దుష్టాచారాలు బాహాటంగా కొనసాగేవి. స్వాతంత్ర్యానంతరం అవి ఆగిపోయినట్లు, చాలా మార్పు వచ్చినట్లు, సమాజం చాలా అభివృద్ధి సాధించినట్లు కనబడినా, మనువు ప్రవచించిన నియమాలు భౌతికంగా అదృశ్యమైనట్లు కనబడినా అగ్రవర్ణాల మనసుల్లోకి ప్రవేశించి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇప్పుడు అగ్రవర్ణాల, రాజకీయ నాయకుల మనసుల్లోని ఇటువంటి దుర్మార్గ లక్షణాలతో యుద్ధం చెయ్యవలసి ఉంటుంది. కొత్త మనో ప్రదేశంలో కొత్త యుద్ధం చెయ్యకతప్పదు.

1952 నుండి ఎన్నికల విధానం ప్రారంభమైంది. ఒకప్పటి అస్పృశ్యులు, ఎన్నికల మహిమతో స్పృశ్యులైనారు. ఒకప్పుడు ఊరిబైట వుంచినవారిని ఎదురెళ్ళి కౌగిలించుకుంటున్నారు. పాలకులు దళితుణ్ణి ఇవాళ మనిషిగా కాకుండా ఓటరుగా చూస్తున్నారు. వారి మనసులో మనువు సజీవంగా ఉన్నాడు. బహుపరాక్‌. భీమానది ఇంకా ఇలా అంటోంది.

ఇండియా!

నువు కేవలం

జలియన్వాలాబాగ్‌ దురాగతానివనుకుంటావ్‌

తిరగబడ్డ షాహీన్‌ బాగ్‌వి,

రైతుల మహా నాగలి యాత్రవి కూడా

కశ్మీర్‌ యాపిల్‌ పండువనుకుంటావ్‌

కశ్మీరియత్‌ హంతకురాలివి

పౌరసత్వ జాబితాలో గల్లంతైన చిరునామావి

నువు తల తెగిన బాబ్రీ 49 మసీదువే!

గోద్రా పట్టాలపై కాలిబూడిదైన రైలుపెట్టెవే!!

- అంటూ భీమానది చివరిగా ఒక హెచ్చరిక చేస్తున్నది. ఇవి తప్పనిసరిగా, ప్రతివారూ వినవలసిన వాక్యాలు -

‘‘నేను భీమా నదిని, ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను.

ఇండియా! సాయిబాబాని విడిచిపెట్టు,

నా ప్రియాతి ప్రియమైన కవి వరవర రావును కూడా

స్టాన్‌ స్వామి సమాధి వద్ద పుష్పగుచ్ఛం వుంచు-’’

- ఈ హెచ్చరిక ‘పద్దెనిమిదివందల పద్దెనిమిది’ కావ్యం సందేశం. ఈ సందేశం ఈ కావ్యానికి ప్రాణం. ఒక దీర్ఘ కవితలో, చివర్లో సందేశం ఉంటే అది కావ్యం అవుతుంది, లేకపోతే దీర్ఘ కవితగానే మిగులుతుంది. సందేశంలో ఆ కావ్య లక్షణం యిమిడి ఉంటుంది. అందువల్ల, ఈ కవితను నేను కావ్యంగా భావిస్తున్నాను. ఈ కావ్యాన్ని నేను చదివినప్పుడు - విశ్వకవి గుర్రం జాషువా గారి ‘గబ్బిలం’ గుర్తుకు వచ్చింది. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ‘గబ్బిలం’ ద్వారా చెప్పిం చారు. ఆ స్థాయిలో శ్రీరామ్‌ తాను చెప్పదలుచుకున్నది ‘నది భీమా’తో చెప్పించారు. ఇవి ప్రతీకాత్మక కవిత్వాలు. ఈ రీతి అపురూపం, అసాధారణం, అద్భుతం.

నగ్నముని

Updated Date - 2023-12-11T02:56:22+05:30 IST