‘‘సంస్కృతంలో లేని శాస్త్రం లేదు’’

ABN , First Publish Date - 2023-05-01T01:11:17+05:30 IST

ఇటీవల కీర్తిశేషులైన పండితులు, సంస్కృత వ్యాకరణవేత్త, నిఘంటు నిర్మాత రవ్వా శ్రీహరితో పిల్లలమర్రి రాములు నిర్వహించిన అముద్రిత ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలను ఇక్కడ ప్రచురిస్తున్నాం:

‘‘సంస్కృతంలో లేని శాస్త్రం లేదు’’

రవ్వా శ్రీహరి చివరి ఇంటర్వ్యూ

ఇటీవల కీర్తిశేషులైన పండితులు, సంస్కృత వ్యాకరణవేత్త, నిఘంటు నిర్మాత రవ్వా శ్రీహరితో పిల్లలమర్రి రాములు నిర్వహించిన అముద్రిత ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలను ఇక్కడ ప్రచురిస్తున్నాం:

సంస్కృత సాహిత్య పరిచయం ఏమాత్రం లేని కుటుంబం నుండి వచ్చిన మీరు, ఈ సంస్కృతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారు?

నా సంస్కృత అధ్యయనం కేవలం యాదృచ్ఛికం. నేను అంతకు ముందు భువనగిరిలో ఇంగ్లీష్‌ చదువే చదివేవాణ్ణి. అక్కడ ఐదవ తరగతి ముగించుకున్నాను. ఆ సెలవుల్లో మా ఇంటికి వెళ్లాను. అప్పుడు మా అమ్మగారు గర్భిణి. తరువాత కొద్దిరోజులకు ప్రసవమయ్యి ఒక ఆడబిడ్డెను కన్నది. కానీ, ఆ బిడ్డ చనిపోయింది. తరువాత సూతి రోగమొచ్చి ఆమే మరణిం చింది. అటువంటి పరిస్థితుల్లో నాకు ప్రతీ నెల డబ్బు పంపించి చదివించే స్తోమత మా నాన్న గారికి లేకుండె. నాకేమో ఏదో చదువుకోవాలని ఉంది. ఇంగ్లీషు చదువు చదవాలంటే దానికి డబ్బు కావాలి. అందువల్ల నేనేం చేసినానంటే, భువనగిరికి దగ్గరలోనే యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంవాళ్లు సురవరం ప్రతాపరెడ్డి, మందుగుల నర్సింహా రావు మొదలైనటువంటి వారి ప్రేరణ చేత అక్కడ సంస్కృత విద్యా పీఠాన్ని నెలకొల్పినారు. ఆ విద్యా పీఠంలో ఒక ఐదేళ్లు చదువుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ పరీక్షకు పోవచ్చు. అక్కడ చేరినటువంటి విద్యార్థులకు ఫీజు లేకుండా భోజనంపెట్టి, సంస్కృతం అధ్యాపనం చేస్తారు. అదొక సౌకర్యం ఉంది గనుక అందులో చేరాను. చేరిన తరువాత మూడు నెలలకు ఒక పరీక్ష జరిగింది. ఆ మూడు నెలల పరీక్షలో నేను జవాబులు చాలా బాగా చెప్పగలిగిన. అప్పుడు మౌఖిక పరీక్షలే. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు హైద్రాబాద్‌ నుండి వచ్చేవారు. వచ్చి మమ్మల్ని పరీక్షించేవారు. ఆ పరీక్షలో నేను బాగా చెప్పినాను. అమరకోశము, శబ్దాలు వంటివి ఆ మొదటి మూడునెలల్లో చెప్పినటువంటివి నేను బాగా చెప్పినాను. ఆయన నన్ను మెచ్చుకొని, ఇక నువ్వు ఇక్కడే చదువుకో అని నన్ను ప్రేరేపించి నారు. ఇదీ నా సంస్కృత అధ్యయనానికి ఒక ప్రాతిపదిక.

తర్వాత నేను డిగ్రీ చేరడాని కోసం హైదరాబాద్‌ వచ్చాను. సీతారాంబాగ్‌లో ‘వేదాంత వర్ధిని’ సంస్కృత కళాశాల అని తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాచీనమైన కళాశాల. శఠగోప రామానుజాచార్య స్వామి వారని ఆయన సర్వమూ త్యాగం చేసి ఆ పాఠశాలని నడిపించారు. అక్కడ చేరి రెండు నెలలు చదువుకున్నాను. ఆ రెండు నెలలు సాహిత్యమే చదివినాను. మాకు వ్యాకరణ అధ్యాపనం చేసే ఆచార్యులు స్వామివారికి (ప్రిన్సిపాల్‌ని మేము స్వామివారని పిలిచేవాళ్ళం) ‘‘ఈయన వ్యాకరణం బాగా నేర్చుకుంటున్నారండి, వ్యాకరణమే ఆప్షనల్‌గా తీసుకుంటే బాగుంటుంది, ఈ సాహిత్యమెందుకు, అది అందరు చదువుతున్నారు, శాస్త్రం ఎవ్వరూ చదువరు కనుక అతను వ్యాకరణం చదివితే బాగుంటుంది’’ అని చెప్పినారు. అప్పుడు నేను వ్యాకరణం తీసుకున్నాను.

ఆ రోజుల్లో సంస్కృత భాష అనేది బ్రాహ్మణులకు సంబంధించింది, ఈ నేపథ్యంలో బ్రాహ్మణేతరులైన మీతో ఎవరైనా బ్రాహ్మణులు స్పర్థ వహించారా?

నాకు మొట్టమొదట సంస్కృత అధ్యాపకులు కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వారు కేరళ నుండి వచ్చినారు. మద్రాసులో ఉన్న మైలాపూర్‌ సంస్కృత కళాశాలలో ‘శిరోమణి’ పాసయ్యారు. ఇక్కడ శాస్త్రుల విశ్వనాథ శర్మగారని, శివంపేట వాస్తవ్యులు, గొప్ప విద్వాంసుడు. వారు కూడా అక్కడ చదువుకున్నారు. వీరిద్దరూ అక్కడ సహాధ్యాయులు. ఆయనను సెలవుల్లో విశ్వనాథ శాస్త్రి ఇక్కడికి తీసుకొని వచ్చినారు. వచ్చాక లక్ష్మణశాస్త్రిగారికి, సురవరం ప్రతాపరెడ్డిగారికి పరిచయం చేస్తే, మీరు ఇక్కడే అధ్యాపకులుగా ఉండండి, మేం పాఠశాల పెడుతున్నాం అన్నారు. వారి దగ్గర నేను ‘రామ’ శబ్దం ప్రారంభించినాను. తరువాత నేను బాగా చదువుతూ ఉంటే, ఆయన తక్కిన విద్యార్థులందరి మీద కంటే (నేను బ్రాహ్మణేతరుణ్ణి అయినా) నా మీద ప్రేమ చూపించేవారు. నాతోపాటు ఐదారుగురు వచ్చినారు మా ఊరివాళ్లు. అయితే మూడు నెలల తరువాత పరీక్షలో నెగ్గకపోతే వాళ్లను ఇంటికి పంపించేసినారు. చివరికి నేనొక్కన్నే మిగిలినాన్నమాట. నేను అందరికంటే బాగా చదువుతుండడం వల్ల కేరళ సుబ్ర హ్మణ్యశాస్త్రి నన్ను బాగా ప్రోత్సహించినారు. విద్యార్థులు కూడా నన్ను ప్రేమించినారేగాని, నాన్‌ బ్రాహ్మిణ్‌ అనే తేడా చూపించ లేదు. విద్యా విషయకమైన స్పర్థ కొద్దిగా ఉండేది. కానీ, ఈ కుల విషయమైన స్పర్థ మాత్రం ఉండేది కాదు. భోజనాల సమయంలో మాత్రం మమ్మల్ని విడిగా కూర్చోబెట్టేవారు. అక్కడ బ్రాహ్మణులకు ఒకటి, అలాగే వైష్ణవులకు ఒకటి తినే స్థలాలు వేరుగా ఉండేవి. ఈ స్మార్తులను కూర్చోబెట్టిన దగ్గర, వారు తిన్న తరువాత మమ్మల్ని కూర్చోబెట్టి భోజనానికి లేపేవారు. నాకది పెద్దగా బాధ అనిపించకపోయేది. ఎందుకంటే వాళ్లు నన్ను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. బాగా చదువుతున్నానని ప్రోత్సహిస్తున్నారు. దీంతో వివక్ష అనే భావనకు తావు లేదని పించింది. అదొక ఆచారం. ఆ ఆచార పద్ధతి ప్రకారం మేం నడుస్తున్నామని మాకు అనిపించిందంతే.

ఆ భాషలోని జ్ఞానమంతా కూడా బ్రాహ్మణ సంస్కృతికి సంబంధించిందే. ఆ జ్ఞానాన్ని పేద ప్రజానీకం, ఉత్పత్తి కులాలు, అతిశూద్ర కులాలు చదువుకోవడంవల్ల ప్రయో జనమేమిటి?

సంస్కృతంలో లేని శాస్త్రం లేదు. పొలిటికల్‌ సైన్స్‌ నేర్చుకోవా లన్నా సంస్కృతంలో ఉంది. కాని సంస్కృతం అనేసరికి మన పాఠశాలల్లో, కళాశాలల్లో కావ్యాలు, నాటకాలు, ఏవో కొన్ని అలంకార శాస్త్ర గ్రంథాలు ఇవి మాత్రమే చెబుతారు. కాని ఇంకా మూడింతల సాహిత్యముంది. వైద్యశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగర్భ శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలున్నాయి. ‘సమరాంగణ సూత్రధార’ అనే భవనాలు కట్టించే శాస్త్రముంది. అయితే ఈ టెక్నికల్‌ నాలెడ్జ్‌ను పక్కకు పెట్టేశారు. దాని అధ్యయన, అధ్యాపనాలు లేనే లేవు. ఒకతను యూనివర్సిటిలో పాలిటిక్స్‌ చెబుతాడు. మన దేశంలో పొలిటికల్‌ సైన్స్‌ ఎట్లా ఉండేదనేది ఆయనకు తెలీదు. కాబట్టి అది చెప్పడు. అన్ని దేశాలలో ఎట్లా ఉండిందో అది చెబుతాడు. మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు మన దేశంలో పూర్వకాలంలో మెడిసిన్‌ ఎట్లుండిందో కనీసం పరిచయం చేయ ట్లేదు. సంస్కృతంలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. చివరికి చౌర్య శాస్త్రం కూడా ఉంది. మొన్న అడయార్‌ లైబ్రరీ నుంచి ‘ధర్మ చౌర్య రసాయనం’ అన్న గ్రంథాన్ని తెప్పించినాను. అలాగే నీతి శాస్త్రం ఉంది. అసలు ఎన్ని నీతి వాక్యాలు, ఎంత చక్కటివి ఉన్నాయి! ఇలాంటివి అందరు చదవదగినవి. నిరాదరణ చెయ్యడం వల్ల అది తప్పిపోయింది.

మీరు రూపొందించిన శ్రీహరి నిఘంటువు ఉద్దేశం ఏమిటి?

నేను ఈ నిజాం కళాశాలలో, సారస్వత పరిషత్తు కళా శాలలో తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు చెప్పేవాడిని. అప్పుడు కొన్ని పదాలకు అర్థాలు తెలియకపోతే సుర్యారాయాంధ్ర నిఘంటువు చూచేవాడిని. శబ్దరత్నాకరము చూచేవాడిని. అపుడే నాకు తెలియనటువంటి అర్థాలు, తెలియ నటువంటి పదాలు కనిపించకపోయేవి. ఆ పదాలన్నింటిని రాసుకోవడం మొదలుపెట్టాను. ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా వేల పదాల జాబితా తయారు చేసినాను. ఇవి అన్ని కలిపి ఒక నిఘంటువు వేస్తే బాగుంటుంది కదా అనే దృష్టి నాకు వచ్చింది. అలాగే జానపద సాహిత్యం మీద నా మిత్రులు చేసిన పరిశో ధనలు చదువుతుండేవాడ్ని. వాటిలో మంచి మంచి పదాలు, అచ్చ మైన తెలుగు వాసన ఉన్న పదాలు కనిపించేవి. అవి చూస్తే నిఘంటువులో ఉండకపోయేవి. అలా సూర్యరాయాంధ్ర నిఘం టువులో లేని పదాలు, అలాగే మనకు జానపద సాహిత్యంలో దొరికిన పదాలు... వీటన్నింటినీ కలిపి ఒక నిఘంటువుగా కూర్చినానన్నమాట. తెలంగాణ వ్యవహారంలో ఉన్న పదాలు మాండలికపదాలు కూడా అందులో చేర్చినాను. అన్నమయ్యలోని పదాలు అందులో చేర్చినాను. ఆ తరువాత అన్నమయ్యకే ప్రత్యే కించి ఒక నిఘంటువును రాశాను. అట్లే ఈ నల్లగొండ జిల్లా మాండలిక పదకోశాలు, అట్లే తెలంగాణ మాండలికాలు ప్రాచీన కావ్యాలలో ఏ రకంగా ఉపయోగించిన్రు అనేది కూడా చాలా విశిష్టమైన పరిశీలన. అంటే ఈ ప్రాచీన పదాలు, ఈ తెలం గాణ మాండలిక పదాలు ఏ సందర్భాల్లో వాడేదన్నదాన్ని బట్టి మనం ఆ రచయితల ప్రాంతాలను గుర్తించవచ్చు. పాల్కురికి సోమనాథుడు చాలాకాలం పాటు తెలంగాణ వాడు కాడు అనే చర్చ ఉండేది. అట్లే పోతనను గురించి కూడా తెలంగాణ వాడు కాదు, ఒంటిమిట్టవాడు అన్నప్పుడు, పోతన ఈ మాండలిక పద జాలాన్ని ఉపయోగించిన తీరును బట్టి ఆయన తెలంగాణ ప్రాంతం వాడేనన్నది గుర్తించగలిగాం.

పోతనను గురించి ‘తెలంగాణ మాండలికాలు - కావ్య ప్రయో గాలు’ అనే పుస్తకంలో ఇచ్చినాను. పోతన ‘ఉరుకు’ అంటాడు. ‘ఉరుకు’ తెలంగాణ పదము. ఆంధ్ర ప్రాంతంలో పరుగెత్తు. ఈ ‘పరుగెత్తు’ కంటే ‘ఉరుకు’ సులభం. మూడు అక్షరాలే ఉన్నాయి. అక్షరాలు పోనివ్వండి ఒక పదమైతే ఫరవాలేదు, ‘పరుగెత్తు’ రెండు పదాల సమ్మేళనం. పోతన మూడు నాలుగు చోట్లా ‘ఉరుకు’ అనే వాడినాడు. అట్లాగే పొద్దులు అంటారు. పొద్దులు అంటే ప్రసవ దినాలు. ప్రసవించే దినాలను పొద్దులు అంటారు (‘‘ఆమెకు ఇపుడు పొద్దులు’’). పోతన చాలా చోట్ల ‘పొద్దులు’ అని వాడతాడు. ‘‘నీళ్ళాడు పొద్దులయ్యే’’ అంటాడు. ఇలా ఎన్నో పదాలు నేను పోతనలో గమనించాను.

సంస్కృత సాహిత్యాన్ని జనంలోకి తీసుకెళ్ళడంలో మీ పరంపర నేడు ఎట్లా కొనసాగుతున్నది?

శాస్త్ర గ్రంథాలను కొంతమంది తెలుగులోకి తెచ్చే కృషి చేస్తున్నారు. చేసేవాళ్ళు ఉన్నారు. అయితే నాదేమో వ్యాకరణం గనక ఇది అందరికి కొంత అవసరం కూడా. వేదాంతం ఉందనుకోండి, అందులో కృషి చేసిన పండితులు ఉన్నారు. కాని వాళ్ళను అందరూ పట్టించుకోరు. కాని నేను చేసేది వ్యాకరణం అయ్యేసరికి అటు లిగ్వింస్టిక్స్‌ విద్యార్థులకూ, తెలుగు విద్యార్థులందరూ దీన్ని రిఫర్‌ చేసుకోవడానికి వీల వుతుంది. అలంకారశాస్త్రం పైన పుల్లెల శ్రీరామ చంద్రుడు చేసిన సేవ చాలా గొప్పది. సంస్కృతంలో ఉన్న అలంకార శాస్త్రాలు మనకు అవసరం. వాటన్నింటిని కూడా ఆయన అనువదించాడు. బేతవోలు రామబ్రహ్మంగారు సంస్కృత నాటకాలను వాటన్నింటిని కొన్ని వ్యాఖ్యానాలతో తెలుగులోకి తీసుకొని వచ్చినారు. కొందరు అలంకార శాస్త్ర గ్రంథాలు, కొందరు వేదాంత గ్రంథాలు ఈ విధంగా తెస్తూనే ఉన్నారు.

ఇన్నేళ్ల మీ సుదీర్ఘ ప్రయాణం మీరు ఏం అనుకున్నారో అదే పద్ధతుల్లో కొనసాగిందా?

నేను ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. అసలు నేను సంస్కృత లెక్చరర్‌ కావాల్సి ఉంటిని. కానీ తెలుగు శాఖలో సెలెక్టు అయి నాను. అప్పట్నించి చదువుకున్న సంస్కృతాన్ని వదలకూడదు, మరచిపోయేంతవరకు పోకూడదు అనేది ఒకటి నా మనసులో ఉన్నదన్నమాట. కనుక దాంట్లో కూడా కృషి చేస్తూనే ఉన్నాను. ఇటు తెలుగు అటు సంస్కృతం రెండు నా కళ్ళ మాదిరిగా చూచు కుంటూ రెండింటిలో వీలైనంత వరకు కృషి చేస్తూ వచ్చినాను. నిఘంటువుల మీద పని ఒక్కరూ చేసేది కాదు. ఆశేమో చాలా గొప్పగా ఉంది. అసలు ఇప్పుడున్న నిఘంటువుల్లో చేరని పదాలన్నీ చేర్చి తెల్లవారేవరకు ఓ నిఘంటువు ఏర్పరచాలన్న కోరిక ఉంది. కాని దానికి విడిగా ఒక సంస్థ ఉండి కృషి చేయాలి. ఆధునిక సాహిత్య పదాలన్నీ కూడా రావాలి. ఇంగ్లీషు భాషలో రూపొందే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీవాళ్లు ఎప్పుడొచ్చిన పదం అప్పుడు రిజిష్టరు చేస్తారు. చేసి సంవత్సరం కాగానే ‘ఈ సంవత్సరం చేరిన పదాలు ఇవి’ అని ఇస్తుంటారు. మనకు ఎక్కడిదా సృహ?!

తెలుగు అధ్యయనం గాని, సంస్కృత అధ్యయనం గాని భవిష్యత్‌ తరాలు ఎట్లా చేస్తే బాగుంటుంది?

మౌలికమైన సంస్కృతాన్ని తెలుగువాళ్లు నేర్చుకోవాలి. అందులో పెద్ద శాస్త్రాలవీ చదవాలని కాదు. దానివల్ల ఆధునిక తెలుగుకు ఏం చేయొచ్చనే ఆలోచనలు వస్తాయి. లింగ్విస్టిక్స్‌ శాఖ వైపు కూడా దృష్టి పెట్టి, చదువుకుంటే భాషా విషయకంగా ఇంకా కొత్త అంశాలెన్నో చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను పెద్దగా లింగ్విస్టిక్స్‌ చదువుకోలేదు. చదువుకొని ఉండి ఉంటే, తెలుగులో భాషా పరమైన పరిశోధనలు కూడా చేయగలిగి ఉండేవాణ్ణి. అలాగే ఇప్పటి తరం వారు వ్యుత్పత్తి కలగడానికి ప్రాచీన సాహిత్యాన్ని తప్పక చదువుకోవాలి. ఇప్పటి రచయితల్లో రచనో త్సాహము బాగానే ఉంది. కానీ, వివిధ శాఖలకు సంబం ధించిన సాహిత్యాన్ని కూడా వాళ్లు చదవాలి. దేన్ని వదిలిపెట్ట కూడదు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధాలు, వచన సాహిత్యాలను ఆధునిక సాహిత్యంతో కలిపి చదువుకుంటే వాళ్లకు కొత్త ఊహలు కూడా రావడానికి అవకాశం ఉంది.

Untitled-2.jpg

‘‘సంస్కృతం అనేసరికి మన పాఠశాలల్లో, కళాశాలల్లో కావ్యాలు, నాటకాలు, ఏవో కొన్ని అలంకార శాస్త్ర గ్రంథాలు ఇవి మాత్రమే చెబుతారు. కాని ఇంకా మూడింతల సాహిత్యముంది. వైద్య శాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలున్నాయి. అయితే ఈ టెక్నికల్‌ నాలెడ్జ్‌ను పక్కకు పెట్టేశారు. దాని అధ్యయన, అధ్యాపనాలు లేనే లేవు.’’

- రవ్వా శ్రీహరి

ఇంటర్వ్యూ పిల్లలమర్రి రాములు

- 92465 26627

Updated Date - 2023-05-01T01:12:42+05:30 IST