ఖమ్మం రైల్వేస్టేషన్‌కు మహర్దశ

ABN , First Publish Date - 2023-03-14T23:32:02+05:30 IST

ఖమ్మం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. ఇటీవలే ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్టేషన్‌ను సందర్శించారు

ఖమ్మం రైల్వేస్టేషన్‌కు మహర్దశ
మధిర రైల్వే స్టేషన్‌ను సందర్శించి పరిశీలిస్తున్న డీఆర్‌ఎం

ఖమ్మం మామిళ్లగూడెం/ మధిర, మార్చి 15: ఖమ్మం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. ఇటీవలే ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ పరిస్థితిపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అమృత్‌భారత్‌ పథకం కింద జిల్లా రైల్వేస్టేషన్‌కు రూ. ఏడు కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి పనులకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ (డీఆర్‌ఎం) అభయ్‌కుమార్‌ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్లాట్‌ ఫారం 1,2 విస్తరణ పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఎక్సకవేటర్‌ పనులతో పాటు మహిళల విశ్రాంతి గదులు, ప్రస్తుతం ఉన్న స్టేషన్‌ భవనం ఆధునికీకరణ, స్టేషన్‌ ముఖద్వారం తదితర ప్రతిపాదిత పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ ఆవరణంలో ప్లాట్‌పారాలపై ఖాళీ ప్రదేశాల్లో సుందరీకరణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్మించిన ఆఫీసర్స్‌ విశ్రాంతి భవనాన్ని డీఆర్‌ఎం ఏకే గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్‌ డీసీఎం బస్వరాజు, సీనియర్‌ డీఓఎం మనోజ్‌, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌, సీనియర్‌ డీఈఎన్‌, ఖమ్మం సీసీఐ జాఫర్‌, స్టేషన్‌ మేనేజర్‌ ప్రసాద్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌, ఐపీటీ శ్రీనివాసరెడ్డి, ఐవోడబ్ల్యూ ద్రోణాచార్య పాల్గొన్నారు.

మధిర రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

మధిర రైల్వే స్టేషన్‌ను డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌ గుప్తా మంగళవారం సందర్శించారు. స్టేషన్‌ ఆవరణను, పరిసరాలను తనిఖీ చేశారు. ఏపీలోని గంగినేని నుంచి ఎర్రుపాలెం వరకు మూడో లైన్‌ నిర్మాణం పనుల విషయమై వచ్చిన ఆయన అనంతరం మధిర చేరుకొని స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయనను బీజేపీ నాయకులు కలిశారు. పద్మావతి, కాచిగూడ, గౌతమి, సింహపురి రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, రామిశెట్టి నాగేశ్వరరావు, మర్శకట్ల స్వర్ణాకర్‌, కాసిన నాగభూషణం, కోనా నర్సింహారావు పాల్గొన్నారు. అలాగే దెందుకూరు గ్రామస్థులు డీఆర్‌ఎంను కలిసి దెందుకూరు నుంచి గోపారం వరకు ట్రాక్‌ రెండు వైపులా పొలాలు ఉన్నాయని, రైల్వే లైన్‌ పక్కగా రోడ్డు నిర్మించాలని కోరారు.

Updated Date - 2023-03-14T23:32:02+05:30 IST