పెద్దలు ఎత్తుకునే సంబురాలు

ABN , First Publish Date - 2023-09-25T00:37:05+05:30 IST

వాళ్ళను ఎత్తుకుంటే ఆకాశం ఒదిగి కూర్చుంటుంది లాలిస్తే ప్రపంచం నిద్రపోతుంది వాళ్ళని వొడిసిపట్టడం సూదిని ముల్లె గట్టడం చేపపిల్లల్లా జారిపోతరు...

పెద్దలు ఎత్తుకునే సంబురాలు

వాళ్ళను ఎత్తుకుంటే

ఆకాశం ఒదిగి కూర్చుంటుంది

లాలిస్తే

ప్రపంచం నిద్రపోతుంది

వాళ్ళని వొడిసిపట్టడం

సూదిని ముల్లె గట్టడం

చేపపిల్లల్లా జారిపోతరు

తూనీగ లెక్క ఎగిరిపోతరు

బుజ్జి బుజ్జి పావురాళ్ళు

వాకిలంతా కలియతిరిగే

రంగు రంగుల కోడిపిల్లలు

పరుగెత్తే మొండిఘటాలు

తట్టుతాకి కూలబడు సంతోషాలు

చంక దిగి కదిలే

బుడి బుడి అడుగులు

కనువిందు పాదయాత్రలు

మాటలకు లొంగని చిట్టిపొట్టి మేధావులు

అద్దంలో చందమామకు దొరికిపోయే

నేలమీది నక్షత్రాలు

గింజలు ఉన్నట్టు మూసిన పిడికిళ్ళు

బుర్రుపిట్టలు బుజ్జి మేకలు

వలకు చిక్కుబడు నటనలు

పిల్లలు

పెద్దలు ముద్దాడు హరివిల్లులు

పెద్దలు

పిల్లల్ని ఎత్తుకుని

సెల్ఫీలు దిగే పూలమొక్కలు.

గజ్జెల రామకృష్ణ

89774 12795

Updated Date - 2023-09-25T00:37:05+05:30 IST