అధివాస్తవిక పోకడలతో ఐదొందలేళ్ళనాటి మన కథ
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:19 AM
ఆంగ్ల సాహిత్యంలో ‘సర్రియలిజం’ అనగా ‘అధివాస్తవిక’ ధోరణి భావ వ్యక్తీకరణ ఒక ఉద్యమంగా 1910-20 దశకాలలో మొదలైంది. అయితే, ఫ్రెంచి రచయిత ఆండ్రీ బ్రెటొన్ 1924లో పారిస్ నగరంలో...
ఆంగ్ల సాహిత్యంలో ‘సర్రియలిజం’ అనగా ‘అధివాస్తవిక’ ధోరణి భావ వ్యక్తీకరణ ఒక ఉద్యమంగా 1910-20 దశకాలలో మొదలైంది. అయితే, ఫ్రెంచి రచయిత ఆండ్రీ బ్రెటొన్ 1924లో పారిస్ నగరంలో "The Manifesto of Surrealism'ను విడుదల చేయడం ద్వారా సాహిత్యంలోనూ, చిత్రకళలోనూ ఈ కొత్త తరహా భావవ్యక్తీకరణకు నామకరణం జరిగి ఒక ఉద్యమంగా ప్రపంచానికి తెలియజేయబడింది. చెప్పదలచిన సంగతిని సూటిగా చెప్పడానికి వీలుగా ఊహకు, వాస్తవానికి మధ్య తేడాను పూర్తిగా చెరిపేసి, వాస్తవం పక్కనే ఊహకు కూడా అందని అవాస్తవాన్ని సైతం ఉంచడానికి వెనుకాడకుండా, ఎంతటి అసహజత్వంతోనూ వైరుధ్యాలతోనూ కూడుకున్నప్పటికీ, సాధారణ సత్యాన్ని మించినదైన గొప్ప సత్యాన్ని ఆవిష్కరించి చూపాలన్న కోరికతో మొదలైన ఉద్యమం అధివాస్తవిక ఉద్యమం. ఒక గొప్ప సత్యాన్ని అందరికీ అర్థమయేలా చెప్పడానికి వేరే మార్గం లేనపుడు, అంతే గొప్ప అబద్ధంతో ఆ సత్యాన్ని చెప్పగలిగే వీలున్నపుడు, ఆ అబద్ధంతోనే ఆ సత్యాన్ని చెప్పడం అవసరం అంటుంది సర్రియలిజం. ఈ తరహా అయోమయంతో సాహి త్యంలో ఈ ఉద్యమం ఎక్కువ కాలం మన లేకపోయింది. 1940ల తర్వాత పలచబడింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ ఉద్యమం ప్రభావంతో వెలువడిన రచనలు ఒకరిద్దరివి తప్ప లేవు. అయితే ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన కవిగా భావించబడే కొఱవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంలో పైన చెప్పిన అధివాస్తవిక ధోరణిని తలపించే అంశాలతో చెప్పబడిన ఒక కథ ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘‘దైవం మీదే భారమంతా వేసి, మరి వేరే ఆలోచన లేకుండా, శ్రమించే మనిషికి అవసరమైన దైవ సహాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది’’ అన్న భావాన్ని పాఠకుడి మనసుకు హత్తుకునేలా చెప్పడానికి కల్పించిన కథ ఇది:
కం. నరుడు మగతనము నేర్పునఁ
బరఁగించెడు చోటఁ దోడుపడుదురు సురలున్
ధరగౌళికునకుఁ దోడ్పడ
గరుడఁడు జక్రంబు హరియు గలిగిన భంగిన్.
(సింహాసన ద్వాత్రింశిక, ద్వితీయాశ్వాసం, 111వ పద్యం)
ఒక మంచి పని చేయడానికి, ఇది సఫలం చెందుతుందా లేదా అని సందేహించాల్సిన పని లేదు. సఫలం చెందుతుందని నమ్మి శ్రమించడం మనిషి వంతు. మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగినపుడు తప్పనిసరిగా దైవ సహాయం దొరికి, వచ్చిన ఇబ్బంది తొలగిపోతుందని విజ్ఞులు చెప్పేమాట! పూర్వం గౌళికుడు అనే వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైనపుడు విష్ణు మూర్తి, గరుడుడు, సుదర్శన చక్రం సహాయంగా వెళ్ళి అతడిని ఆపదల నుండి గట్టెక్కించాయని చెప్పే ఒక కథను గురించిన ప్రస్తావనే పైపద్యం చివరి రెండు పాదాలలో చేయబడింది. ఆ కథ ఇది:
ప్రతాపవిషయం అనే పేరున్న రాజ్యానికి బృహ త్సేనుడు రాజు. శ్రీమహావిష్ణువుకు సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడిని భక్తితో నిత్యం ఆరాధించేవాడు. అతడి కుమార్తె సులోచన. ఆమె రూపలావణ్యాలను ప్రపంచం లోని ఏ సుందర వస్తువుతో పోల్చుదామన్నా కూడా, వాటిల్లో ఏదో ఒక వెలితి కనపడి పోలిక కష్టమయ్యేది. అంతటి సౌందర్యవతి! పుట్టిననాట నుండి బృహత్సేనుడు ఆమెను రాజసౌధం దాటి బయటకు అడుగుపెట్టనీయకపోవడం వలన లోకం పోకడ తెలియని అమాయక త్వంతో పెరిగి పెద్దయింది.
రోజులు గడుస్తూండగా ఒకనాడు యుక్తవయసులో ఉన్న సులోచన తమ రాజసౌధం మేడ మీద, చల్లని గాలిలో ఊసుబోక అటూఇటూ అడుగులు వేస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉండగా, కొన్నాళ్ళుగా ఈ మేడ మీది ఆమె దినచర్యను గమనించిన గౌళికుడు అనే పేరున్న ధీరవిటుడు మెరిసే ఉక్కుతో సుదర్శన చక్రాన్ని పోలిన చక్రాన్ని, మేలైన చెక్కతో అచ్చంగా గరుడుడిని పోలిన ఎగిరే యంత్రాన్ని నిర్మింపజేసుకుని, తాను విష్ణు మూర్తిగా అలంకరించుకుని, తిరునామాలు పెట్టుకుని, పసుపుబట్టలను కట్టుకుని, అన్ని హంగులతో గరుడుడిని ఎక్కి ఎగిరేలా చేసి, పవన పథంలో రయ్యిన ఎగురుతూ వచ్చి బాలామణి ముందు వాహనాన్ని దించి, తాను గరుడవాహనం దిగి ‘‘ఇదిగో నీకోసం నేనే విష్ణుమూర్తిని, వచ్చాను! లక్ష్మిలా నీవు కూడా నన్ను వరించు సులోచనా!’’ అంటాడు.
అనుకోని ఈ ఘటనకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరియైున సులోచన ఒకవైపు మనసులో సంతోషం ముప్పిరిగొనగా, మరొకవైపు స్త్రీ సహజమైన సిగ్గుతో అతడిని అక్కడే ఉంచి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రికి జరిగిన సంగతినంతా చెప్పగా, అతడు పరుగెత్తుకుంటూ వచ్చి గవాక్షంలోంచి లోపలికి చూసి ఆశ్చర్యపడుతూ ‘‘ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరే సమయం ఆసన్నమైనట్లుగా అనిపిస్తున్నది తల్లీ!’’ అంటూ ‘‘చల్లనికొండయైున హిమవంతుడికి గిరిజావల్లభుడైన శంకరుడు అల్లుడుగా దొరికిన విధంగా, ఈ రోజు నాకు ఈ నల్లనిదేవరయైున విష్ణుమూర్తి నీవలన అల్లుడైనాడు, కృతార్థుడను!’’ అని చెప్పి, ‘‘అమ్మా, ఇక మనసులో ఏ సందేహమూ లేకుండా అల్లుడైన విష్ణుమూర్తిని వరించి, ఆనందపరచ’’ మని కూతురిని గది లోపలికి పంపుతాడు. తండ్రి అనుమతి దొరక డంతో మనసులో ఇక ఏ సంకోచమూ లేనిదై సులోచన విష్ణుమూర్తి రూపంలో ఉన్న గౌళికుడిని వరిస్తుంది. ఇరువురూ స్వర్గ సుఖాలలో తేలియాడుతారు. ఈ విధంగా కొన్నేళ్ళు గడవగా, అచ్యుతుడు బృహత్సేనుడికి అల్లుడైనాడనే వార్త చుట్టుపట్ల అన్ని రాజ్యాలలోని ప్రజల నోళ్ళలో పడి దిశదిశలా వ్యాపించడంతో, ఆయా రాజ్యాల రాజులందరూ బృహత్సేనుడి అదృష్టానికి అసూయపడి, భీతి చెంది, రాజులమనే గర్వం మాని ప్రస్తుతానికి బృహత్సేనుడికి విధేయులమై ఉండడం మంచిదనే నిర్ణయానికి వచ్చి మంచి మంచి ఏనుగులను, గుర్రాలను మణిమాణిక్యాదులను కప్పంగా ఇచ్చి పంపించగా, వాటిని ఆనందంతో స్వీకరించిన బృహత్సేనుడు అలా చెల్లించని రాజుల భూములను ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకొని వారిని చికాకుపరచి అవమానించసాగాడు. అలా అవమానానికి గురైన రాజులందరూ కొన్నాళ్ళకు ఒకచోట కూడి నిదానంగా ఆలోచించి ‘‘చిన్నవో పెద్దవో రాజ్యాలకు మనమూ రాజులమే! అలా రాజులమైయుండి మగకూడు కుడవకుండా ఇలా అందరమూ ఒక్కడికి భయపడి బ్రతకడం మరణంతో సమానమైనదే కదా! ఆలోచిస్తే మానభంగమనే వ్రణం ప్రాణంతో ఉన్నంతకాలం మానిపోని బాధను పెడుతూ ఉంటుంది. దాని కంటె రణమరణము అప్పటికి దుఃఖాన్ని కలిగించినా ఆ క్షణం గడిచాక స్వర్గసుఖాన్ని ఇస్తుంది కదా!’’ అన్న అభిప్రాయానికి వస్తారు.
ఆ.వె. మానహాని యైున మనత్రోవ కంటెను
బ్రాణహీన మైన పదము లేదు
వీని చేత బాధ వెచ్చుట కంటెను
జక్రధరుని చేతఁ జచ్చుఁ టొప్పు.
(సింహాసన ద్వాత్రిశిక, ద్వితీయాశ్వాసం, 136వ పద్యం)
‘‘మానం పోగొట్టుకుని ఇప్పుడు మనం బ్రతుకు తున్న ఈ హీనమైన బ్రతుకు కంటె మరణం కలగడం వలన నష్టం లేదు. మానవమాత్రుడైన ఈ బృహత్సేనుడి చేతిలో బాధలు పడుతూ బ్రతికుండడం కంటె, చక్రధరుడైన విష్ణుమూర్తి చేతిలో మరణం ఎంతో మేలైనది కదా!’’ అని పై పద్యం భావం. ఎందుచేతనంటే, రావణుడు, కంసుడు మొదలైన ఎందరో వీరులను సంహరించిన హరి వాళ్ళను తనలోనే కలిపేసుకుని మోక్షాన్ని ప్రసాదించాడు కాబట్టి, ఆ నల్లనయ్య నిర్ణయాలన్నీ సమన్యాయంతో కూడుకుని ఉండి ఎక్కడ ఆయన కోపం ఉంటుందో ఆ వెంటనే ఒక వరం కూడా ఉండి ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి మరి వేరే ఆలోచన చేయకుండా బృహత్సేనుడి మీదికి దండు వెడలుదామని నిర్ణయించుకుని ప్రతాపవిషయమనే రాజ్యాన్ని అందరూ కలిసి ముట్టడిస్తారు.
సంగతి తెలిసిన బృహత్సేనుడు తన సైన్యంతో తానూ తగిన విధంగా బదులిస్తాడు. అయితే శత్రుసైన్యం సంఖ్య ముందు బృహత్సేనుడి బలం తేలిపోయి వారి ఆగ్రహ జ్వాలలో నిప్పుల్లో పడ్డ మిడతల్లా మాడిపోతారు. గత్యంతరం లేక బృహత్సేనుడు ఎలాగో రణభూమి నుండి తప్పించుకుని రాజసౌధం చేరి కూతురికి సంగతి చెప్పి, ఈ విపత్కర పరిస్థితిలో అల్లుడైన విష్ణుమూర్తి సహాయం సమకూరేలా చేయమంటాడు. ఆమె వెంటనే వెళ్ళి ‘‘మున్ను హిరణ్యకశ్యపుడి నుండి ప్రహ్లాదుడిని కాపాడినట్లుగాను, రక్షించ మని వేడుకున్న గజేంద్రుడిని మొసలి బారి నుండి రక్షించినట్లుగాను ఇప్పుడు ఇక్కట్లపాలై తన ప్రాణానికే ముప్పువాటిల్లిన స్థితిలో ఉన్న నీ భక్తుడైన నా తండ్రిని శత్రువుల బారి నుండి కాపాడి రక్షించవే!’’ అని దీనంగా భర్తను వేడుకుంటుంది. ఆ మాటలను విన్న గౌళికుడి పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. ఇప్పుడు వెనకాడితే నలుగురిలో నగుబాటు కాదా? అని మనసులో తలచి, ఏమైనాగానీ ముందుకు రణభూమిలోకి నడవాల్సిందే అని నిశ్చయించుకుంటాడు.
తే.గీ. నాఁటి సాహసమున నిట్టి బోటి గలిగె
నేఁటి తెంపున కొక వేల్పు
నిల్వఁబడఁడె
యనుచుఁ జక్రంబుగైకొని
యంత్రగరుడి
నెక్కి సూత్రంబుగదలించి
యెగసివచ్చె.
(సింహాసన ద్వాత్రింశిక, ద్వితీయాశ్వాసం, 143వ పద్యం)
‘‘ఆ రోజు ఆ సాహసం చేయబట్టి ఇంత అందమైన స్త్రీ భార్యగా దొరికింది. ఈ రోజు ఈ సాహసానికి మెచ్చి ఏ దేముడైనా తోడు నిలబడకుండా ఉంటాడా?’’ అని మనసులో అనుకుంటూ చేతిలోకి చక్రాన్ని ఆయుధంగా తీసుకుని, యంత్ర గరుడుడిని ఎక్కి ఎగురుకుంటూ సమర రంగానికి పయనమౌతాడు గౌళికుడు. ఇక్కడ గౌళికుడు ఈ సాహసానికి పూనుకోగా, అక్కడ దేవలోకంలో విష్ణుమూర్తి ఆలోచనలో పడతాడు. ‘‘ఇప్పుడు ఈ గౌళికుడు సమరంలో ఓడిపోవడం జరిగితే లోకం అంతా విష్ణుమూర్తి ఓడిపోయాడని అనుకుని నన్ను ఆటపట్టిస్తుంది. తన అల్లుడిని నేనే అని నమ్మియున్న బృహత్సేనుడు భంగపడతాడు. భక్తితో తమ ప్రాణాలను పణంగా పెట్టే వీరులందరూ వెర్రివాళ్ళైపోతారు. కనుక నేను వెళ్ళకపోవడం ఉచితం కాదు’’ అని నిర్ణయించుకుని చేత సుదర్శన చక్రాయుధం వెలుగులు చిమ్ముతూ తిరుగుతూ ఉండగా, నిజవాహనమైన గరుడుడిని ఎక్కి వచ్చి బృహత్సేనుడి సౌధంమీద మెరుపుతో వెలుగుతున్న నల్లని మేఘంలాగా దర్శనమిచ్చి, హుటాహుటిన సమర రంగానికి వెళ్ళి తృటిలో తన చక్రాహతితో వైరివీరులందరికీ వీరస్వర్గాన్ని ప్రసాదించి, గౌళికుడి పేరు మీదనే బృహత్సేనుడికి విజయాన్ని చేకూర్చిపెట్టి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాడు. ఇలా తన పేరుమీదుగా దక్కిన విజయాన్ని గౌళికుడు మామకు చూపి ‘‘నీ శత్రు రాజులందరినీ నేనే సంహరించాను. ఇప్పుడు వీరి సంపదలన్నీ కూడా నీవే అయ్యాయి కనుక నీవే ఏలుకొమ్మని’’ చెప్పి తన సౌధానికి వెళ్ళిపోయి భార్యతో సుఖాలలో మునిగి పోతాడు. అలా తెగించి ధైర్యం చేసిన ధీరుడైన గౌళికుడికి అచ్యుతుడు సహాయం చేయక తప్పినది కాదుకదా! అనే వ్యాఖ్యతో కథ ముగుస్తుంది.
ఇప్పుడు ఈ కథలోని ముఖ్యమైన అంశాలను మొదటి నుండి ఒక సారి పరిశీలిస్తే, ఆదిలోనే నకిలీ సుదర్శన చక్రంతోను, చెక్కయంత్రమైన గరుడుడి మీద విష్ణుమూర్తి వేషంలో వచ్చిన గౌళికుడిని సులోచన నిజమైన విష్ణుమూర్తిగా క్షణమైనా సందేహించకుండా చూసీచూడడంతోటే నమ్మడం మొదలుకొని... ఇందులో సన్నివేశాలన్నీ సహజత్వానికి విరుద్ధ మైన అంశాలుగానే కనపడతాయి. ఇవన్నీ అవాస్తవాల స్థాయిని దాటిన అధివాస్తవ ధోరణికి సంబంధించిన అంశాలని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనిలేదు.
మొదట్లోనే చెప్పినట్లుగా ‘‘ఏదైనా సాధించ డానికి ఏ సందేహమూ, సంకోచమూ లేకుండా తన వంతు కష్టాన్ని పడేవాడికి దేవుడు ఏ స్థాయి సహాయమైనా చేస్తాడు, అందిస్తాడు’’ అన్నది నిరూపించటం కథ ముఖ్యోద్దేశం. అయితే వాస్తవంలో ఇది ఎవరి పరిశీ లనకూ అందే సంగతి కాదు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను దాటి గట్టెక్కే క్రమంలో ఎవరెవరి అనుభవానికి సంబంధించి వారికి అర్థమయ్యే పద్ధతిలో తప్ప వేరు విధమైన నిరూపణకు ఇది లొంగే విషయం కాదు. ఆ నేపథ్యంలో, సామాన్యమైన కొన్ని వాస్తవిక అంశాలతోపాటుగా అసమాన్య మైన కొన్ని అధివాస్తవిక అంశాలను జోడించి కథను చెప్పాల్సిన అగత్యం ఈ కథను చెప్పడంలో కథకుడికి కలిగి ప్రయత్నపూర్వకంగానే ఈ పద్ధతిని అనుసరించడం జరిగిందని అర్థమవుతుంది. అలా కొఱవి గోపరాజు కాల మైన క్రీ.శ. పదహేనవ శతాబ్దం నాటికే ఆ కవి రచనయైున ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంలో తెలుగులో అధివాస్తవిక ధోరణిలో కథ సృజింప బడింది. ‘సింహాసన ద్వాత్రింశిక’ పూర్తిగా స్వతంత్రరచన కాదు. సంస్కృతం లోని ‘విక్రమార్క చరిత్రము’ కావ్యంలోని కథలకు మరికొన్ని కథలను జోడించి చేయబడిన రచన. అయితే ప్రస్తుతం చర్చించబడుతున్న గౌళికుడి కథకు సంస్కృత మూలమంటూ ఏదీ లేదు. కాబట్టి ఇది గోపరాజు స్వంత రచనగానే పరిగణించబడింది. అలా తెలుగులో అధివాస్త విక పోకడలున్న తొలి కథగా పరిగణించబడడానికి ఈ కథ అన్ని విధాలా అర్హమైనది అని భావిస్తాను.
భట్టు వెంకటరావు