ఒక ప్రేమ - ఆ ప్రేమికులు రాసిన రెండు నవలలు
ABN , Publish Date - Dec 25 , 2023 | 01:16 AM
రొమేనియాకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత పండితుడు మీర్చా ఎలియాడె, 1933లో రొమేనియా భాషలో రాసిన ‘మైత్రేయి’ నవల ‘బెంగాల్ నైట్స్’గా అనేక భాషల్లో అనువాదమయింది. దానికి ప్రతిక్రియగా...
రొమేనియాకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత పండితుడు మీర్చా ఎలియాడె, 1933లో రొమేనియా భాషలో రాసిన ‘మైత్రేయి’ నవల ‘బెంగాల్ నైట్స్’గా అనేక భాషల్లో అనువాదమయింది. దానికి ప్రతిక్రియగా 1974లో ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, సమాజ సేవకురాలు, టాగూర్‌కు ఆశ్రితురాలైన మైత్రేయి దేవి రాసిన ‘న హన్యతే’ బెంగాలీ నవల ‘ఇట్ డజ్ నాట్ డై’గా ఆమె అనువాదంతోనే 1976లో వచ్చింది. ఈ రెండు నవలలూ ఆంగ్లేయుల వలస పాలకుల సమయంలో, మీర్చా ఎలియాడె - మైత్రేయి దేవిల మధ్య మొలకెత్తిన ప్రేమ వృత్తాంత కథనాలు. ఇలా ప్రేమికుల జంట నుంచే వారి ప్రేమ కథనాలు నవలల్లా రావటం అరుదు.
మీర్చా, మైత్రేయిల మధ్య నడిచిన ప్రేమ కథకు నేపథ్యంలోకి వెళ్దాం: భారతీయ తత్వశాస్త్ర చరిత్ర మీద అయిదు ప్రామాణిక గ్రంథాలు రాసిన సురేంద్రనాథ్ దాస్‌గుప్తా దగ్గర తత్వశాస్త్రం, సంస్కృతం నేర్చుకుందుకు 1929లో 23ఏళ్ల మీర్చా ఎలియాడె కలకత్తా వచ్చాడు. కొన్నాళ్లకు దాస్‌గుప్తా ఆహ్వానం మేరకు అతని ఇంటిలోనే చేరాడు. చాలా తెలివైనదని, అప్పట్లోనే ఎంతో స్వేచ్ఛనిచ్చి ప్రేమగా పెంచుతున్నామని గొప్పగా అందరికీ చెప్పుకునే పదహారేళ్ల అతని కుమార్తె మైత్రేయి కూడా వారితోనే ఉంది. తండ్రి గ్రంథాలయంలో పుస్తకాల పట్టికీకరణలో మీర్చాకు సహాయం చేసేందుకే కాకుండా, అతనికి బెంగాలీ నేర్పేందుకు, అతని నుండీ ఫ్రెంచ్ నేర్చుకుందుకు మైత్రేయికి అతనితో ఏర్పడ్డ దగ్గరితనం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అది ఎన్నాళ్లో కొనసాగలేదు. ప్రేమ వ్యవహారం తెలుసుకున్న మైత్రేయి తండ్రి మీర్చాని ఇంటి నుండి వెళ్లగొట్టాడు. మీర్చా ఇక కలకత్తాలో ఉండలేక అక్కడ నుంచి హిమాలయాలకు, కొన్నాళ్లకు రొమేనియాకు చేరుకున్నాడు. కమ్యూనిస్ట్ వ్యతిరేక ఐరన్ గార్డ్ సంస్థకు మీర్చా వీరాభిమాని కావడం మూలంగా, 1945లో రొమేనియాలో కమ్యూనిస్ట్ పాలన మొదలయిన దగ్గర నుండీ, ప్రవాసంలోనే గడిపి, చివరికి చికాగోలోని డివినిటీ స్కూల్‌లో ఆచార్యుడుగా పనిచేస్తూ గడిపాడు. ఈలోగా అనేక గ్రంథాలు ఎక్కువగా యోగా, మతం, తత్వశాస్త్రం, విద్యా విషయకమైనవి రాసాడు. 1934లో నీనా మారెస్‌ని, ఆమె మరణించిన తరువాత 1948లో క్రిస్టినెల్ కొటెస్చూని వివాహం చేసుకున్నాడు. 1986లో చికాగో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం రొమేనియాలో అతను జన్మించిన బుఖారెస్ట్‌లో అతని శిలావిగ్రహం నెలకొల్పి, అక్కడి విశాలమార్గానికి, చదివిన పాఠశాలకు, ఆడిన ఫుట్‌బాల్ మైదానానికి సైతం అతని పేరు పెట్టారు.
భారతదేశంలో 1929-1931ల మధ్య మీర్చా గడిపిన జీవితం నేపథ్యంతో అతను రాసిన నవలే ‘బెంగాల్ నైట్స్’. సాహిత్య ప్రపంచంలో ఈ నవల ఒక్కటే అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ నవల నిజానికి, 1932 చివర్లో రొమేనియాలో జరిగిన నవలల పోటీ కోసం, రొమేనియా భాషలో ‘మైత్రేయి’ అన్న పేరుతోనే రాసాడు. అందులో నాయకుడు తనే అయినా, అలైన్ పేరుగల యువ ఫ్రెంచ్ ఇంజనీరుగా మార్చాడు. మైత్రేయి పేరు మాత్రం మార్చలేదు. ఆమె తండ్రి పేరుని నరేంద్ర సేన్‌గా మార్చాడు. నవలలో అలైన్ పాత్రకు ఆ బెంగాలీ కుటుంబంతో గడపడం ఒక వశీకరణలా పని చేసింది. మరీ ముఖ్యంగా సేన్ కుమార్తె పదహారేళ్ల మైత్రేయికి దగ్గర కావడం. తాను ఎదిగిన వాతావరణం, కట్టుబాట్లు, ఆలోచనలు అంతా వేరు కావడం మూలంగా, అలైన్‌కు కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. మైత్రేయి సంకేతాలైతే మరీనూ. మైత్రేయి తనను ప్రేమిస్తోందా ఆటలాడుతోందా? తనతో ఎందుకు అంతసేపు ఏకాంతంగా గడుపుతోంది? ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఆ ఇంటిలో వారనుకుంటున్నారా?- ఇలా ఎన్నో ప్రశ్నలు అతనిని వేధించేవి. మైత్రేయి ఎవరితో చనువుగా ఉన్నా అతనికి ఈర్ష్య కలిగేది. కావాలని కాకపోయినా అలైన్‌ని మైత్రేయి విసిగిస్తున్నట్టు ఉంటుంది. అది భరించలేక అసూయా అనుమానాలకు గురవుతుంటాడు. ఆ క్రమంలోనే వారు మరింత దగ్గరవుతూ ఉంటారు. ఒక్కోసారి అతనితో రాత్రులు కూడా గడిపే వరకూ అది వెళ్తుంది. ఇంతలో మైత్రేయి చెల్లెలు అసూయతో తల్లిదండ్రులకు వారిద్దరి వ్యవహారం గురించి చెబుతుంది. దాని మూలంగా మైత్రేయి తండ్రి అలైన్‌ని ఇంటినుండి వెళ్లగొడతాడు. మైత్రేయి సందేశాలనైనా పట్టించుకోకుండా అలైన్ జ్ఞాన సముపార్జన కోసం హిమాలయాల్లో గడిపేందుకువెళతాడు. తన మీద మైత్రేయి పట్టు తెంపుకుందుకు, తాను చేరిన గుహలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ తారసపడ్డ యూదు వనిత జెర్మీతో క్లుప్తంగా వ్యవహారం నడుపుతాడు. చివరకు అన్యమనస్కంగా విచారంగా భారతదేశం వదిలివెళ్తాడు. అయిదు రోజులన్నా ఆగమని మైత్రేయి ప్రాథేయపడ్డా పారిపోవడం, ఆమెని దగా చేసినట్టుగా అతనికి ఎక్కడా అనిపించదు. వివాహం, లైంగిక వ్యవహారం అతనికి తాత్కాలికాలు. మైత్రేయికి కాదు.
అప్పటి సంఘటనల్ని ఖచ్చితంగా నమోదు చేయాలన్న ఉద్దేశంతోగాక రొమేనియా జాతీయ నవలల పోటీలో గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మీర్చా ఆ నవల రాసాడు. అందులో గెలవడంతోపాటు ఆ నవల అందర్నీ ఆకర్షించి అమితంగా అమ్ముడు పోయింది. రొమేనియాలో ప్రచురణకర్తలు ఆ తరువాత అమ్మకాలు ఇంకా పెంచుకుందుకు ‘మైత్రేయి’ అనే నవల పేరుని ‘మైత్రేయి: యదార్థ కథ’గా మార్చారు. పరిమితంగా జరిగిన మురిపాలను అనావశ్యంగా లైంగిక కార్యాలుగా మార్చుతూ, రాత్రులు అతని పడకగదికి మైత్రేయి దిగంబరంగా వచ్చి గడిపినట్టుగా మీర్చా రాసాడు. కల్పనల్ని అనుభవాలతో కలిపాడు.
ఈ నవలను రొమేనియా పాఠశాలల పాఠ్య ప్రణాళికలో కూడా చేర్చారు. 1933 నుంచీ రొమేనియా ఆదరిస్తున్న నవల అది. రొమేనియా గొప్ప నటి మయ మొర్గెన్‌స్టెర్న్ మీర్చా నవల నాటకీకరణలో మైత్రేయిగా నటించింది. ఈ నవలకి రొమేనియాలో వచ్చిన ప్రజాదరణతో 1945లో ఇటాలియన్, 1948లో జర్మనీ, 1950లో ఫ్రెంచ్, 1952లో స్పానిష్ భాషలలో ‘బెంగాల్ నైట్స్’గా అనువాదమయింది. మైత్రేయికి నవలలోని విషయాల గురించి 1972 వరకూ తెలియలేదు.
మైత్రేయి విషయానికొస్తే- అర్ధాంతరంగా మీర్చాతో కథ ముగిసాక, కుంగిపోవడం నుంచి బయటపడటం కోసం, ఆమె చదువులో పడింది. ఇంకొకరితో ఉంటూ, తల్లిని కూడా దూరం చేసి బాధపెడుతున్న తండ్రి ఇంటి నుండి బయటపడాలన్న ఆలోచనలతోనే ఉంటుంది. తండ్రికి ఇల్లంతా న్యాయస్థానమే. ఇంట్లో అందరూ, అమ్మలా అతనికి అణిగి మణిగి బందీలా ఉండాలి. దాని నుండి బయటపడడానికి సరైన మార్గం పెళ్లి అని భావించి పెళ్లికి అంగీకరిస్తుంది మైత్రేయి. మలేరియావ్యాధికి వాడే ఔషధం ‘క్యునైన్’ వాడడంలో ప్రవీణుడైన డా. మన్మోహన్ సేన్‌తో మైత్రేయి వివాహం జరుగుతుంది. పెళ్ళప్పుడు ఆమె వయస్సు 20, అతని వయస్సు 34. పెళ్లయి, ఇద్దరు పిల్లలూ పెద్దయాక, అనేక సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేపడుతూ, ఎక్కువ సమయాన్ని వాటిల్లోనే గడిపింది. గురువు టాగూరు నీడలో అనేక పుస్తకాలను సైతం రాసే పనిలో పడింది. కులమతాల సామరస్యం కోసం ఒక సంస్థను 1964లో స్థాపించింది. భారతీయ స్త్రీ సమన్వయ సంస్థకు ఉపాధ్యక్షురాలిగా ఉంది. అనాథ బాలల కోసం ఖేల్‌ఘర్ సంస్థని స్థాపించి, టాగూర్ భావాలకు అనుగుణంగా దానిని నడిపింది. పదహారేళ్ల ప్రాయంలోనే ఆమె మొదటి కవితా సంకలనం రవీంద్రుని ముందుమాటతో వెలువడింది. 1938, 1939లో రవీంద్రుని చివరి దశలో కాలింపోంగ్ దగ్గరి ముంగ్‌పో లోని ఆమె ఇంటిలోనే సేదదీరాడు. తరువాత ఆ ఇల్లు రవీంద్ర సంగ్రహాలయంగా మారింది. పిల్లల పెళ్లిళ్లు, వారికి వారి కుటుంబాలు ఏర్పడిన తరువాత, 58ఏళ్ల వయస్సులో 1972లో మైత్రేయి తిరిగి కలకత్తాకి వస్తుంది.
మీర్చాతో ప్రేమ గురించి తన వైపు కథ ఏమిటో చెబుతూ మైత్రేయి రాసిన నవల ‘న హన్యతే’ ఇక్కడి నుండే మొదలెడుతుంది. నవలలో ఆమె పాత్ర పేరు అమృత. మీర్చా ఎలియాడె పేరును మీర్చా యూక్లిడెగా మార్చింది. అతనిని పిలిచే మీర్చా అనే పిలుపులో మాత్రం మార్పు లేదు. ఒకరోజు మీర్చా సమీప మిత్రుడు, స్వదేశీయుడైన సెర్గెయ్ అల్‌జార్జ్ దగ్గరకు పరిచయస్థులు ఆమెను తీసుకువెల్తారు. మీర్చా పుస్తకం ద్వారా రొమేనియాలో అందరికీ ఆమె తెలుసని, మతం మూలంగా మీర్చా, మైత్రేయిల పెళ్ళికి ఆమె కుటుంబం అడ్డుపడిందని అతను ప్రస్తావిస్తాడు. మైత్రేయి (అమృత) కోపంగా దానికి అభ్యంతరం చెబుతుంది. ‘‘మతాల అడ్డుగోడల మూలాన కాదు, మీర్చా అహంకారం మూలంగా,’’ అంటుంది. పుస్తకంలో మీర్చాతో ఆమె లైంగిక సంబంధం పెట్టుకుందన్న కల్పిత విషయం ఉందని తెలిసి నలభైఏళ్ల తరువాతయినా అమృత నమ్మలేకపోయింది, భరించలేకపోయింది. సెర్గెయ్ ద్వారా తెలుస్తున్న పుస్తకంలోని విషయాలు అమృతలో అలజడుల వలయాల్ని విస్తరిస్తూనే ఉన్నాయి. ఆమెలో 1972 సంవత్సరం 1930లో కరిగిపోతూనే ఉంది. మీర్చా నవల ఫ్రెంచ్ అనువాదం చదువుకున్నపుడు, ఆమె ఖంగుతింది. ఎంతగానో బాధపడింది. మీర్చాతో లైంగిక సంబంధం ప్రస్తావన తన సామాజిక గౌరవ మర్యాదలను భంగపరిచేదిగా భావించి ఆ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుంది. ‘‘నాకే సిగ్గులేదు! నేను ఇంకా అతని కోసం ఆలోచిస్తున్నాను. అతనొక ప్రావీణ్యమున్న యూరప్ వేటగాడు. అతను విసిరిన విషబాణాన్ని పీకి పారేసి, అతనిని మరచిపోతాను, మరచిపొతాను,’’ అని అనుకుంటుంది. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. మీర్చా రాసిన రొమేనియా మూల నవల ఆమె చూడనే లేదు. అందులో అంకితం కోసం వాడుకునే ఒకే ఒక్క పేజీలో మైత్రేయి నేర్పిన బెంగాలీ భాషలో రెండే రెండు చరణాలు, ఇంగ్లీషు లిపిలో ఇలా రాసుకున్నాడు మీర్చా: ‘‘నువ్వు ఏమనుకుంటున్నావు మైత్రేయి?/ ఏమనుకున్నా క్షమించగలవా?’’ ఈ పేజీ ఇతర భాషల అనువాదాల్లో లేనే లేదు. ఇది చదివి ఉంటే మైత్రేయి ప్రతిక్రియ ఎలా ఉండేదో?
మైత్రేయి తన ‘న హన్యతే’ నవలని ఒక కాలు 1972లో ఉంచుకొని, మరొక కాలు 1930లో పెట్టుకొని రాసింది. మీర్చా నవలలో అతను నమ్మించే ప్రయత్నం చేసిన లైంగిక సంబంధం పూర్తిగా నిరాధారం, అవాస్తవం అన్నది ఆమె నవలా కథనం. తూర్పు యూరప్ సభ్యత, తెల్లని వాడు, ఇంకా ఇతర లక్షణాల మూలంగా అతని ప్రేమలో పడినట్టే అందులో చెప్పుకుంటుంది. ఇద్దరి కథనాల్లోనూ, వారిద్దరూ విభేదించేది- వారిని వేరు చేసిన విషయాల్లోనూ, వారి మధ్య లైంగిక సంబంధాల విషయంలోను. ఒకరి పట్ల ఒకరికి ఒకేరకమైన సంవేదన ఉందని వారి నవలల్లో అంగీకరిస్తూనే ఉంటారు. మీర్చా నవలలోని అలైన్, మైత్రేయిల మధ్య జరిగిన వ్యవహారం, మైత్రేయి నవలలోని అమృత, మీర్చాల మధ్య వ్యవహారం భిన్నంగా ఉంటుంది. అయినా ఇద్దరి కథనాల్లో అలైన్ మైత్రేయిని, అమృత మీర్చాని ప్రేమించుకుంటున్నట్టే ఉంటారు.
మైత్రేయి మీర్చాని నలభై ఏళ్ల తరువాత కూడా మరచిపోదామనుకున్నా మరచిపోదు. సెర్గెయ్‌ని 1972లో కలిసాక, మీర్చానీ కలవాలనుకుంటుంది మైత్రేయి. అంతవరకూ చెప్పని ఈ ప్రేమ వ్యవహారాన్ని, స్నేహితుడిలా అర్థం చేసుకొనే భర్తకు సవివరంగా తెలియజేసి, అమెరికాలో ఉన్న మీర్చాని కలుసుకుంటుంది. రెండునెలల వ్యవధిలో వాళ్లిద్దరూ అనేకసార్లు కలుసుకుంటారు. ఆ సమయంలో మీర్చాని సూటిగానే అనేక ప్రశ్నలు అడుగుతుంది. ‘‘నీ నవలలో ఎందుకు నన్ను కళంకితను చేశావు. నిజం ఎందుకు రాయలేదు. కల్పన అందమైనది, సత్యం ఇంకా అందమైనది, కానీ అర్ధసత్యం ఘోరమైనది. ప్రపంచం ముందు నన్ను దిగంబరిని ఎలా చేయగలిగావు? నీ పుస్తకం అప్పుడే ఇరవయి ముద్రణలు పొందింది- ఇది ప్రేమనా? నిజం ఒక్కటే చాలదా? ఆర్థిక లాభం కోసమా?’’ అని అడుగుతుంది. దానికి జవాబుగా మీర్చా - ‘‘అందులో ప్రణయానికి నా ఊహని కల్పనని జోడించి ఎక్కువచేసి చూపించడం ప్రశంసగా భావించాను. నాకు ఎప్పుడూ నువ్వు నిగూఢమయి, తెలుసుకోవడం సాధ్యం కాక బహుశా అలా చేసానేమో. మార్మిక దేవత కాళీలా నిన్ను చేద్దామనుకున్నాను’’ అంటాడు. అతని పుస్తకానికి ఆంగ్ల అనువాదం తాను బ్రతికుండగా బయటకు రాకూడదన్న వాగ్దానం ఒక్కటే అతని నుండి పొందగలుగుతుంది. మైత్రేయి నవల ‘న హన్యతే’ 1974లో వచ్చింది. దానికి ఆమే చేసిన ఆంగ్లానువాదం ‘ఇట్ డస్ నాట్ డై’గా 1976లో చికాగో ప్రెస్ ప్రచురించింది, కానీ వెంటనే విడుదల కాలేదు.
ఇప్పుడు రొమేనియా విద్యార్థులకు మైత్రేయి ఒక ఆదర్శం. ఆమె ఆంతరంగిక అభిమానాల్ని మీర్చా తన నవలలో అతిక్రమించినా, ధైర్యంతో బయటకొచ్చి దానిని ఎదుర్కొన్న ధీశాలి. ఆ కారణంగా ఆమె పట్ల రొమేనియన్లకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీర్చా మరణాంతరం, అతని భార్య క్రిస్టినెల్, అతని పుస్తకాన్ని కలకత్తాలో 1988లో ‘బెంగాలీ నైట్స్’ పేరున చలనచిత్రంగా తీసుకుందుకు అనుమతించింది. ఆ చిత్రం భారతదేశంలో విడుదల కాకుండా మైత్రేయి చేసుకోగలిగింది. ఆమె పాత్ర పేరును అందులో గాయత్రిగా మార్పించగలిగింది. బాలీవుడ్ సినిమా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ వీరి ప్రణయ కథ ఆధారంగా తీసిందే.
మీర్చా 1986లో చికాగోలోను, మైత్రేయి 1989లో కలకత్తాలోను మరణించినా, ప్రేమ మరణించదని వారి వారి నవలల్లో రాసిపెట్టి మరీ వెళ్లారు. రచయితలిద్దరి ఒప్పందాన్ని మన్నిస్తూ, మీర్చా మరణించిన ఏడేళ్ల తరువాత, మైత్రేయి మరణించిన మూడేళ్ల తరువాత చికాగో విశ్వవిద్యాలయం అతని నవలను ‘బెంగాల్ నైట్స్’ పేరుతోను, ఆమె నవలను ‘ఇట్ డస్ నాట్ డై’ పేరుతోను ఒకేసారి విడుదల చేసింది.
ముకుంద రామారావు
99083 47273