ఒంటి చేతి చప్పట్లు!

ABN , First Publish Date - 2023-01-22T03:50:49+05:30 IST

వచ్చేఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటికి, తాము ఢిల్లీకి వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నమ్మబలికారు...

ఒంటి చేతి చప్పట్లు!

వచ్చేఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటికి, తాము ఢిల్లీకి వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నమ్మబలికారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి దానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ద్వారా బలప్రదర్శనకు పూనుకున్నారు. వ్యయప్రయాసలకోర్చి జన సమీకరణ కూడా భారీగానే చేశారు. జాతీయ రాజకీయాలలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం ఇదే మొదటిసారి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఎన్‌.టి.రామారావు యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చంద్రబాబు గతంలో కీలక పాత్ర పోషించి కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయించగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు స్వరాష్ట్రంలో ఓడిపోయిన చేదు అనుభవం ఉండనే ఉంది. ఇప్పుడు కేసీఆర్‌ వంతు వచ్చింది. కేవలం 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్న తెలంగాణకు చెందిన కేసీఆర్‌ జాతీయ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయగలరు? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం లభించడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నంత మాత్రాన జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించడం సాధ్యమా? నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడినపుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అంతకు చాలాముందు ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో వామపక్షాలు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అప్పటి జనసంఘ్‌.. ఒకే తాటిపైకి వచ్చాయి. యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా కాంగ్రెస్‌ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ కానీ, ఆయన చేస్తున్న ప్రయత్నాలలో కానీ కాంగ్రెస్‌–బీజేపీకి చోటు లేదు.

సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎంత బలహీనపడినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీని పూర్తిగా కొట్టిపడేయలేని పరిస్థితి! అతి పెద్ద ప్రాంతీయ పార్టీగానైనా అంగీకరించాల్సిందే. అయితే ప్రధాని నరేంద్ర మోదీని ఇంటికి పంపుతానని ప్రకటిస్తూనే కేసీఆర్‌ అండ్‌ కో కాంగ్రెస్‌ పార్టీని కలుపుకొని వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఎమర్జెన్సీ కారణంగా జనతా పార్టీ ప్రయోగం, బోఫోర్స్‌ వగైరా అంశాల కారణంగా నేషనల్‌ ఫ్రంట్‌ ప్రయోగాలు అప్పట్లో సక్సెస్‌ అయ్యాయి. ఆ కోణంలో చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై దేశ ప్రజలకు ఇంకా మొహం మొత్తలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 2024 ఎన్నికల్లో కూడా మోదీనే విజయం సాధించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పి వేధిస్తున్నారన్న విమర్శ మినహా నరేంద్ర మోదీ పాలన పోవాలన్న కసి ప్రజలలో ఏర్పడిన దాఖలాలు కూడా లేవు. మతతత్వం గురించి ప్రతిపక్షాలు, ఇతరులు ఎంత చెబుతున్నప్పటికీ ప్రజలకు ఎక్కడం లేదు. అదే సమయంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేగిస్తే ముఖ్యమంత్రి అవుదామని పలువురు భావిస్తున్నట్టే.. జాతీయ స్థాయిలో కూడా కాలం కలిసి వస్తే ప్రధానమంత్రి అవ్వాలని పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని, కుదిరితే ప్రధానమంత్రి అవ్వాలని అభిలషిస్తున్నారు. ఖమ్మం సభలో పాల్గొన్న ఆప్‌, ఎస్పీ, వామపక్షాల నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల తర్వాత తాము ఢిల్లీ గద్దెనెక్కుతామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు తాము ప్రకటించిన భారత రాష్ట్ర సమితి అన్ని రాష్ర్టాలలో పోటీ చేస్తుందని ఆయన చెబుతున్నారు. అలా అయితే ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అంగీకరిస్తుందా? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వైఖరేమిటి? వగైరా అస్పష్టం. దేశవ్యాప్తంగా బలహీన పడుతున్న వామపక్షాలు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పుణ్యమా అని కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాయి. తెలుగునాట కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటో తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం ఉనికి అంతంతమాత్రంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్ల ఉన్న సానుకూల వైఖరి కారణంగా ఆ పార్టీ నాయకులు ఉద్యమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తెలంగాణ విషయానికొస్తే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంటున్నట్టు వామపక్షాలు ప్రకటిస్తున్నాయి. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికని చెప్పి మరేదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం కమ్యూనిస్టులకు కొత్తకాదు. ఇదే కమ్యూనిస్టులు కేరళలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని మాత్రం చెప్పడం లేదు. ఆమ్‌ అద్మీ పార్టీ నేత కేజ్రీవాల్‌.. ఢిల్లీ, పంజాబ్‌లలో కేసీఆర్‌తో కలిసి పోటీ చేస్తామని చెప్పడం లేదు. కేసీఆర్‌ కూడా వచ్చే ఎన్నికలలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోబోతున్నది చెప్పలేకపోతున్నారు. ఖమ్మం సభలో మాత్రం తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా దళితబంధు అమలుచేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆ సభలో పాల్గొన్న కేజ్రీవాల్‌, అఖిలేష్‌ యాదవ్‌, విజయన్‌ ఏకీభవిస్తున్నారో లేదో తెలియదు. ఇక పెద్ద రాష్ర్టాలైన బిహార్‌, పశ్చిమబెంగాల్‌లలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ ఖమ్మం సభకు ఎందుకు రాలేదు? వారిని కేసీఆర్‌ ఆహ్వానించారా? లేదా? ఆహ్వానించినా వారు రావడానికి ఇష్టపడలేదా? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కేసీఆర్‌ తన సొంత పత్రికలో మాత్రం దేశమంతటా తన నాయకత్వం కోసం ప్రజలు అర్రులు చాస్తున్నట్టుగా రాయించుకుంటున్నారు. అదే నిజమైతే ఖమ్మం సభలో పాల్గొన్న కేజ్రీవాల్‌, అఖిలేష్‌ యాదవ్‌ తాము కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని ప్రకటించి ఉండాల్సింది. వారంతా తమ ప్రసంగాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారే గానీ, భారత రాష్ట్ర సమితి గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. ఉత్తరాదిన వివిధ రాష్ర్టాలకు విస్తరిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ తానే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ విషయానికి వస్తే, తాను మళ్లీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడానికి ఇంకా వ్యవధి ఉందన్నది ఆయన ఆలోచనగా చెబుతారు. ఇక ప్రత్యామ్నాయ రాజకీయాలకు తానే నాయకత్వం వహించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని కూడా కలుపుకొని వెళ్లాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయం ఎలా? అని ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా ఈ పాత్ర పోషించాలనుకున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు గమ్మునుంటున్నారు. తాను రాష్ర్టానికే పరిమితం అవుతానన్న సంకేతాలను ఆమె ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో జాతీయ రాజకీయాలలో కీలక భూమిక నిర్వహిస్తానని చెప్పుకొంటున్న కేసీఆర్‌ ఉత్తరాది రాష్ర్టాలలో తన పార్టీని ఎలా విస్తరించబోతున్నారో చెప్పడం లేదు. పలువురు మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్‌ అధికారులు భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నారని మాత్రం ఆయన ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, ఇంటింటికీ మంచి నీరు, దళితబంధు పథకం ఆయన ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. తెలంగాణలోనే దళితబంధు పథకం ముందుకు సాగడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ ఈ పథకం కోసం బడ్జెట్‌లో కేటాయించిన 17 వేల కోట్ల రూపాయలలో ఖర్చు చేసింది ఎంత అంటే చెప్పలేకపోతున్నారు. ఈ విధంగా కేసీఆర్‌ ముందు ఎన్నో పరిమితులు ఉన్నాయి. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా ఎన్ని విన్యాసాలు చేసినా అవి వృథా ప్రయాసే అవుతాయి.

అన్నీ గాల్లోనే..

వచ్చే ఎన్నికల్లో ఏయే రాష్ర్టాల్లో ఎన్నెన్ని సీట్లకు భారత రాష్ట్ర సమితి పోటీ చేయనున్నదో కూడా స్పష్టత లేదు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎన్ని పార్టీలు ఆమోదిస్తాయో తెలియదు. ఉత్తరాది నాయకులు దక్షిణాదికి చెందిన వారిని నాయకుడిగా అంగీకరించే పరిస్థితి ఉండదు. ప్రత్యేక కారణాల వల్ల తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఐదేళ్లు పూర్తి చేయగలిగారు. కేసీఆర్‌ చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌ తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో కొన్ని స్థానాలకు పోటీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తోట చంద్రశేఖర్‌, రావెల కిశోర్‌ వంటి విశ్వసనీయత కోల్పోయిన వారికి పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్పగించారు. స్వరాష్ట్రంలో చెల్లుబాటు కానివారిని చేర్చుకొని తనకు వజ్రాలు దొరికాయని కేసీఆర్‌ చెప్పుకొంటున్నారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఉన్న తోట చంద్రశేఖర్‌ ప్రభృతులపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. వివాదంలో ఉన్న ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్‌కు కట్టబెట్టారని బీజేపీ నేత రఘునందన్‌ తాజాగా ఆరోపించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు కూడా అక్కడ చోటు లభించడం లేదు. ఇక కేసీఆర్‌ ప్రారంభించిన సో కాల్డ్‌ జాతీయ పార్టీకి మాత్రం ఆదరణ ఎలా దొరుకుతుంది? మరోవైపు తమిళనాడులో అడుగుపెట్టే సాహసం కూడా కేసీఆర్‌ చేయలేరు. అలాగే ఒడిసాలో కూడా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బలంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయనను కదిలించలేకపోతున్నది. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ బలంగా ఉన్నాయి. పొరుగు రాష్ర్టాలలో పరిస్థితి ఇలా ఉంటే, ఉత్తరాది రాష్ర్టాలలో కేసీఆర్‌ పార్టీకి ఆదరణ లభిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. దళిత బంధు, ఉచిత విద్యుత్‌ అని ప్రకటించినంత మాత్రాన ఉత్తరాది ప్రజలు కేసీఆర్‌ జిందాబాద్‌ అంటారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఈ పరిస్థితులలో ఖమ్మంలో అన్ని వ్యయప్రయాసలకు ఓర్చి అంత భారీ సభ నిర్వహించడం వల్ల కేసీఆర్‌కు కలిగిన ప్రయోజనం ఏమిటో తెలియడం లేదు. జాతీయ రాజకీయాలలో ఎవరు చక్రం తిప్పాలనుకున్నా సంఖ్యాబలం ముఖ్యం. తెలంగాణ చిన్న రాష్ట్రం మాత్రమే కాదు, తెలంగాణలో కేసీఆర్‌ బలహీనపడ్డారు కూడా! నిన్నటివరకు తెలంగాణ రాష్ట్ర సమితిని నెత్తిన పెట్టుకున్న ఉత్తర తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ప్రకటించడం, జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్‌ హడావిడి చేయడాన్ని ఆ పార్టీ ముఖ్యులు కూడా హర్షించలేక పోతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉన్నందున ఆ పార్టీని నిలువరించడం కోసం జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌ హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. తాను ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రజలను నమ్మించడం ద్వారా ఈ ఏడాది చివరలో జరగనున్న ఎన్నికల్లో తన అధికారాన్ని పదిలం చేసుకోవాలన్నదే కేసీఆర్‌ వ్యూహంగా ప్రస్తుతం కనబడుతోంది.

ఆ రెండూ మారితేనే..

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఆ పార్టీకి ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడినప్పటికీ కేసీఆర్‌ను ఓడించి ఇంటికి పంపించాలంటే ఆ పార్టీకి ప్రస్తుత బలం సరిపోదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌–బీజేపీ మధ్య చీలిపోయే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి కేసీఆర్‌ సేఫ్‌ జోన్‌లోనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోని పక్షంలోనే కేసీఆర్‌ను ఓడించడం సాధ్యం అవుతుంది. భారతీయ జనతా పార్టీలో చేరికలు ఊపందుకుంటాయని ఆ పార్టీ నాయకులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ చేరికలు మాత్రం కనబడటంలేదు. కేసీఆర్‌తో విభేదిస్తున్నవారు కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలు చోటుచేసుకొని ఉండకపోతే ఆ పార్టీ ప్రత్యామ్నాయంగా బలపడేది. ప్రస్తుతం బీజేపీకి ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆ పార్టీ పద్ధతులు, అంతర్గత వ్యవస్థల గురించి అవగాహన లేనందున అందులో చేరడానికి పలువురు వెనుకాడుతున్నారు. పార్టీలో చేరదామనుకుంటున్న ముఖ్యులకు ఎన్నికల్లో టికెట్‌ ఇప్పిస్తామన్న భరోసా ఇవ్వగలిగిన నాయకుడు బీజేపీలో లేరు. అలాంటి హామీలు ఇచ్చే అధికారం రాష్ట్ర నాయకులకు ఉండదు కూడా! చేరికలకు ఇదే ప్రధాన ప్రతిబంధకంగా ఉంది. దక్షిణాదిలో ఉత్తరాది మోడల్‌ చెల్లుబాటు కాదని బీజేపీ పెద్దలు అంగీకరించలేకపోతున్నారు. మా పార్టీలో ఎవరూ ఎవరికీ హామీ ఇవ్వలేరని ఆ పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న నాయకులు చెబుతున్నారు. అలా అయితే తమ భవిష్యత్తుకు గ్యారెంటీ ఏమిటి? అని చేరాలనుకుంటున్న వారు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఈ సందిగ్ధ వాతావరణం తొలగిపోనంత వరకు తన అధికారం పోతుందని కేసీఆర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్‌లో ఉక్కపోతకు గురవుతున్న అనేక మంది ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఇల్లు చక్కదిద్దుకొని ఐక్యతా గీతం ఆలపించగలిగితే ఆ పార్టీ బలపడే అవకాశం లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ మరింత బలం పుంజుకోవాలంటే ఆ పార్టీ విధానాలను సవరించుకోవాలి. ఈ రెండు పార్టీలు ప్రస్తుత స్థాయిలోనే ఉంటే మాత్రం కేసీఆర్‌ రొట్టె విరిగి నేతిలో పడినట్టే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆంధ్రా మూలాలు ఉన్న ఓటర్లు ఇప్పుడు కీలకం అయ్యారు. వీరిలో అత్యధికులు 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినప్పటికీ ఆ తర్వాత దశలో తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడ్డారు. ఈ వర్గం ఓటర్లను ఆకర్షించడం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటివరకు ప్రత్యేక శ్రద్ధకనబరచలేదు. అదే సమయంలో వారికి ఏ భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు. నిజానికి హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల కంటే ఖమ్మం ప్రజలే భారతీయ జనతా పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ప్రభావం ఈ జిల్లాపై అధికంగా ఉంటుంది. ఖమ్మం ప్రజలతో పాటు హైదరాబాద్‌కు చెందిన సెటిలర్ల మద్దతు సాధించకుండా అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటే తప్పులో కాలేసినట్టే. ఏపీలో ఏ యాక్షన్‌కైనా తెలంగాణ సెటిలర్లలో రియాక్షన్‌ ఉంటుందని బీజేపీ పెద్దలు ముందుగా గుర్తించాలి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు బయటకు కనిపిస్తున్నట్టుగా బీజేపీలో లుకలుకలు బయటకు కనిపించడం లేదు అంతే. పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్న భ్రమల్లోకి వెళ్లిన పలువురు నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం గ్రూపులు కడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఢిల్లీ నుంచి దిగుమతి అవుతున్న నాయకులు ఈ అంశాలపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.

ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కలసివచ్చే అంశాలే. అయినా జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ హడావిడి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఎవరు నాయకత్వం వహిస్తారో స్పష్టత ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు నేల విడిచి సాము చేయడమే అవుతుంది. జాతీయ రాజకీయాల పేరిట కేసీఆర్‌ చేస్తున్న హడావిడి వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. గత అనుభవాలు ఈ విషయం రుజువు చేస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి బలం తెలంగాణలో ప్రస్తుతానికి 40 శాతంలోపే ఉంది. తాజా సర్వేల ప్రకారం 60 శాతానికి పైగా ప్రజలు కేసీఆర్‌ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ కారణంగా ముందుగా ఇల్లు చక్కదిద్దుకోవడంపై కేసీఆర్‌ దృష్టి పెడితే మంచిది. ఎన్నికలకు ఇంకో పది మాసాల వ్యవధి ఉన్నందున ఈలోపు చోటుచేసుకొనే పరిణామాలపై కేసీఆర్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలను సవరించుకునే పక్షంలో ఆ పార్టీ బలపడే అవకాశం ఉంది. ఖమ్మం సభలో ప్రసంగించిన వక్తలు ప్రధాని మోదీని విమర్శించినప్పటికీ ప్రజల్లో స్పందన కనిపించకపోవడం గమనార్హం. తెలంగాణ ప్రజలకు హిందీ భాషతో పరిచయం ఉన్నప్పటికీ కేజ్రీవాల్‌, అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు హిందీలో మాట్లాడినప్పుడు ప్రజలు అసహనాన్ని ప్రదర్శించడం కీలకం. ఈ అంశాలను పట్టించుకోకుండా తన నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని కేసీఆర్‌ కలలు కంటూ పోతే చివరకు పరాభవమే మిగులుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టి అధికారంలోకి రాగలిగిన కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసం ఉంటే ఉండవచ్చును గానీ అది అతివిశ్వాసంగా మారకూడదు!

ఆర్కే

Updated Date - 2023-01-22T07:51:12+05:30 IST