సెంగోల్ : భ్రమలూ వాస్తవాలూ

ABN , First Publish Date - 2023-06-03T02:10:09+05:30 IST

కొత్త పార్లమెంటులో మే 28, 2023న జరిగిందేమిటి? చరిత్రను, ఒక ధర్మ సూత్రాన్ని ఎంత నిస్సిగ్గుగా వక్రీకరించవచ్చో రుజువు అవడమేనని నేను భావిస్తున్నాను.

సెంగోల్ : భ్రమలూ వాస్తవాలూ

కొత్త పార్లమెంటులో మే 28, 2023న జరిగిందేమిటి? చరిత్రను, ఒక ధర్మ సూత్రాన్ని ఎంత నిస్సిగ్గుగా వక్రీకరించవచ్చో రుజువు అవడమేనని నేను భావిస్తున్నాను. సెంగోల్ (ఉత్సవ రాజదండం)కు గౌరవనీయ ప్రధానమంత్రి, అధికార పక్షం వారి విస్మయకర వివరణలు వింటే ఎన్నడో పంచ భూతాల్లో కలిసిపోయిన తిరువళ్లువర్, ఇళంగో అడిగళ్, అవ్వయ్యార్, సంగం కవుల ఆత్మలు ఎంతగా క్షోభించివుంటాయో కదా. వారి వ్యాఖ్యానాల ప్రకారం సెంగోల్ అనేది ప్రాపంచిక అధికారానికి చిహ్నం. ఒక పూజారి లేదా ఒక మాజీ పాలకుడు ఒక కొత్త రాజన్యుడికి సెంగోల్‌ను అందివ్వడాన్ని అధికార బదిలీగా వారు అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో రాచరిక సంప్రదాయం! అధినేత అనుయాయులు బాకాలు ఊదారు. ఆస్థానికులు కీర్తి గానాలు చేశారు. పార్లమెంటు ఉభయ సభలకు నెలవు అయిన కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని ఒక పట్టాభిషేకంగా మార్చివేశారు! ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో ఇటవంటి వేడుక నిస్సందేహంగా అసంబద్ధమైనది. ఒక లౌకిక కార్యక్రమాన్ని మత విహితమైనదిగా చేసేందుకు శైవ అధీనామ్ (మఠాలు)ల అధిపతుల తోడ్పాటు తీసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో వీక్షించినవారు తప్పకుండా దానిని, జూలై 25, 2022న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంతో పోల్చుకుని ఉంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రజలు ‘ఎవరు ఎవరికి అధికారాన్ని బదిలీ చేస్తున్నారు?’ అని ఆశ్చర్యపోయివుంటారు.

క్రీస్తు పూర్వం 31లో తమిళ మహాకవి– తాత్త్వికుడు తిరువళ్లువర్ తన అజరామర మహాకావ్యం ‘తిరుక్కురళ్’ రాశారు. అందులోని సంపద అనే విభాగంలో రెండు అధ్యాయాలు: సెంగోన్మాయి (ధర్మబద్ధ రాజదండం); కొడుగ్నోమాయి (క్రూర రాజదండం). అందులోని ఒక ద్విపద: ‘వెలాంద్రి వెండ్రి తారువాత్తు మన్నవాన్ / కోల్ అడూమ్ కొడతు ఈనిన్’. కోల్ అంటే రాజదండం. ఈ ద్విపదకు అర్థమిది : ‘పాలకుడికి విజయాన్ని తీసుకువచ్చేది రాజదండమే కానీ బల్లెం కాదు’. అయితే ద్విపదలోని చివరి మూడు మాటలను చూడండి. రాజదండం వంగదు, వంగకూడదు. దానిని అటూ ఇటూ వంచకూడదు. అది సదా నిటారుగా నిలబడి ఉండాలి’. మరింత స్పష్టంగా చెప్పాలంటే ధర్మానికి నిబద్ధమయి ఉండాలి. ధర్మాచరణ అనేది పాలకుని విధ్యుక్త ధర్మం.

ఇదే భావన భారత ప్రధానమంత్రి పదవీ స్వీకారం చేసే సందర్భంగా ప్రమాణంలో కూడా ఉన్నది. ‘ప్రధానమంత్రిగా సమస్త ప్రజలకు రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా నిష్పాక్షికంగా, ఎలాంటి ద్వేష భావానికి తావులేకుండా సేవ చేస్తాను’. కోల్ అనేది సుస్పష్టంగా ధర్మబద్ధ పాలనకు చిహ్నం. వంగకుండా ఉన్నప్పుడే అది సెంగోల్ అవుతుంది, వంగితే అది క్రూర, అధర్మ పాలన అవుతుంది.

అధికారానికి కాకుండా, ధర్మబద్ధ పాలనకు సెంగోల్ పూచీ పడుతుంది. దానిని పట్టుకుని ఉన్న పాలకుడు ధర్మనిష్ఠతో పాలన చేస్తానని హామీ ఇస్తాడు. పాలకుడి నాలుగు సుగుణాలలో ఒకటిగా సెంగోల్‌ను తిరువళ్లువర్ పేర్కొన్నాడు. ‘దాతృత్వం, కరుణ, ధర్మబద్ధ పాలన, బలహీనుల (పేదల) సంరక్షణ ఉత్తమ పాలకుడి నాలుగు సుగుణాలు’ అని తిరుక్కురల్ ఉద్ఘాటించింది. సెంగోన్మాయికి విరుద్ధమైనది క్రూర, న్యాయవిరుద్ధ పాలన అని ‘కొడుంగోన్మాయి’ అనే అధ్యాయం అభివర్ణించింది.

చోళ చక్రవర్తి కరికాలన్ పాలనను సంగం కవి ఇలా ప్రశంసించాడు: ‘అర్నోడు పునర్ణండ తిమారి సెంగోల్’ (నైతిక విలువలకు నిబద్ధమైన వివేకవంతమైన పాలన). ఈ చక్రవర్తినే మరో సంగం కవి అన్నదాత అయిన రైతుకు ఎటువంటి దురవస్థ రాకుండా కాపాడిన పాలకుడు అని కొనియాడాడు. జైన మతస్థుడైన మహాకవి ఇళంగో అడిగళ్ ‘శిల్పదిగారం’ అనే మహాకావ్యాన్ని వెలయించాడు. ఆ కావ్యనాయిక కన్నగికి జరిగిన అన్యాయానికి కవి చాలా బాధపడతాడు. రాజు తన అధర్మ ప్రవర్తనతో సెంగోల్‌ను వంచి వేశాడని, ఇది అతని వినాశనానికి తప్పక కారణమవుతుందని’ అన్నాడు. కవి వాక్కు నిజమయింది. మహాభక్తురాలు. ప్రజల కవయిత్రి అయిన అవ్వయ్యార్ కూడా సెంగోల్‌ను ధర్మ దండంగా కీర్తించింది. అది నిటారుగా నిలబడి ఉన్నప్పుడే రాజు సమున్నతుడు అవుతాడని అవ్వయ్యార్ స్పష్టం చేసింది.

వంగిపోయిన సెంగోల్ న్యాయవిరుద్ధ, క్రూర పాలనకు దృష్టాంతం. సమాజంలోని ఏ వర్గం పట్ల పక్షపాతం చూపకూడదు. ఏ వర్గం పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు. ఒకరిపై ఒకరిని ఉసిగొల్పకూడదు. ఏ సామాజిక సముదాయం లేదా మతం లేదా భాష పట్ల ఎటువంటి ద్వేష భావం చూపకూడదు. ఎవరిపట్ల దుర్భావంతో వ్యవహరించకూడదు. వర్తమాన వ్యవహారాల పట్ల ఈ ధర్మ సూత్రాల స్ఫూర్తి ఏమిటి? మన ప్రజాస్వామిక జీవనంలో విద్వేష ప్రసంగాలకు, చట్టవిరుద్ధ నిఘాలకు లేదా లవ్ జిహాద్ లేదా బుల్‌డోజర్ న్యాయానికి తావుండకూడదు. ఇరుగు పొరుగు దేశాల ముస్లింల పట్ల, నేపాల్ క్రైస్తవులు, బౌద్ధుల పట్ల, శ్రీలంక తమిళుల పట్ల వివక్ష చూపే పౌరసత్వ సవరణ చట్టానికి స్థానముండకూడదు. రైతులను గుత్త వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేసే కొత్త సాగు చట్టాలను అనుమతించకూడదు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక ప్రాజెక్టును అధికార బలంతో సొంత రాష్ట్రానికి తరలించుకుపోయే చర్యలకు ఆస్కారముండకూడదు. ధర్మబద్ధ పాలకుని రాజకీయ పార్టీ మైనారిటీ మతాల అభ్యర్థులను ఎన్నికలలో పోటీకి నిలబెట్టేందుకు తిరస్కరించకూడదు (ఇటీవల కర్ణాటకలో జరిగింది ఇదే కాదూ?) న్యాయబద్ధ పాలకుని పోలీసులు న్యాయం కోసం ఒలింపిక్ క్రీడా పోటీల విజేతలు నిర్వహిస్తున్న నిరసన దీక్షను బలవంతంగా భగ్నం చేయకూడదు. ఇటువంటి చర్యలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనవి.

ఉత్సవ రాజదండాన్ని అధికారంతో సమం చేయడమంటే సెంగోల్ భావనను అపవిత్రం చేయడమే. లార్డ్ మౌంట్ బాటెన్, రాజాజీలను ఉదహరించడం చరిత్రను వక్రీకరించడం మాత్రమే కాదు, వాస్తవికవాది అయిన ఒక వైస్రాయ్‌ని, వివేకవంతుడు అయిన ఒక మేధావి– రాజనీతిజ్ఞుడిని అవమానపరచటమే. చెప్పని మాటలను వారికి ఆపాదించడం ఇంగిత జ్ఞానం లోపించినవారు మాత్రమే చేసే పని.

సెంగోల్‌ను, లోక్‌సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో ఒక ప్రత్యేక పీఠంపై ఉంచారు కదా. దానిని అక్కడే ఉంచండి. సభా కార్యక్రమాలకు అదొక మౌన సాక్షిగా ఉంటుంది. సభలో చర్చలు స్వేచ్ఛాయుతంగా జరిగితే; సభ్యుల వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోతే; విభేదించేందుకు, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటే; న్యాయ విరుద్ధమైన, రాజ్యాంగ విహితం కాని చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే స్వేచ్ఛ ఉంటే సెంగోల్ న్యాయబద్ధంగా నిలబడుతుంది. సెంగోల్, అది పూచీపడుతున్న సెంగోన్మయి (ధర్మబద్ధ పాలన) వర్ధిల్లగలవని ఆశిద్దాం.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2023-06-03T02:10:09+05:30 IST