‘‘ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు’’

ABN , First Publish Date - 2023-09-25T00:49:51+05:30 IST

2023 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ అవార్డును ప్రజాగాయకుడు, పాటల రచయిత, ప్రకృతి కవి జయరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో ‘వివిధ’ జరిపిన సంభాషణ ఇది...

‘‘ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు’’

2023 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ అవార్డును ప్రజాగాయకుడు, పాటల రచయిత, ప్రకృతి కవి జయరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో ‘వివిధ’ జరిపిన సంభాషణ ఇది:

కాళోజీ అవార్డు అందుకున్న అనుభూతి ఎలా ఉంది?

కాళోజీ తెలంగాణకు తండ్రి లాంటి వాడు. తన జీవిత కాలం మొత్తం ప్రశ్నించాడు. అసమానతల మీద నిలదీశాడు. పౌరహక్కుల కోసం ఉద్యమించాడు. దాదాపు నా జీవితం అదే అడుగుజాడల్లో కొనసాగుతున్నది. ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన స్నేహితుడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే నేను, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమ సమయంలో చాలా స్నేహంగా ఉండేవాళ్లం. అది గుర్తు చేసుకొనే కావచ్చు, ఆయన నాకు కాళోజీ అవార్డు ఇచ్చారు. అలాగని నాకు ప్రతిభలేదని కాదు. ఈ దేశంలో అత్యున్నత అవార్డులు పొందడానికి అవసరమైన అర్హతలు నాకున్నాయి. అంత జ్ఞానం ఉంది. సాహిత్యం ఉంది.

కాళోజీతో మీ పరిచయం గురించి చెప్పండి?

మాది ఉమ్మడి వరంగల్‌ జిల్లా, మహబూబాబాద్‌. ఆయనది కూడా వరంగల్‌ జిల్లానే. నేను యుక్తవయస్సులో విప్లవోద్యమాల్లో, స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లో బాగా పని చేశాను. ఆ రోజుల్లో కాళోజీ పౌరహక్కుల ఉద్యమాల్లో ఉన్నారు. వరంగల్‌లో డాక్టర్‌ రామనాథం హత్య, బాలగోపాల్‌ మీద దాడి... ఈ కాలంలో ఆయనను మా మీటింగులకు ఆహ్వానించటం, ఆయన వెనక తిరగటం జరిగింది. అప్పుడు కాచనపల్లి అమరవీరుల మీద నేను రాసిన పాటల ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా కాళోజీగారు వచ్చారు. ఆయన జీవితం, రచనల ప్రభావం నాపై మొదటినుంచీ ఉన్నది.

మీరు విప్లవ గాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు ప్రకృతి కవిగా పేరు తెచ్చుకున్నారు. ప్రకృతి ఇతివృత్తంగా ఐదేళ్ల క్రితం ‘అవని’ అనే పుస్తకం తీసుకువచ్చారు. ఈ ప్రయాణంలో మీ భావజాలం ఏ మార్పులకు లోనైంది?

ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. గాలి, నీరు, వెలుగు, వెన్నెల... వీటిని ప్రకృతి సమస్త జీవరాశికీ హెచ్చుతగ్గుల్లేకుండా సమానంగా పంచింది. కానీ ప్రకృతిలో ఉన్న ఈ సమానత్వ సారం మానవ జీవితం దగ్గరకి వచ్చేసరికి మాయమైపోయింది. మనుష్య ప్రపంచంలో ఒకడు అంటరానివాడుగా ఉన్నాడు. ఒకడు వెలివేయబడినవాడిగా ఉన్నాడు. భూమి కొంతమందికే వెళ్ళిపోయింది. కష్టపడేవారంతా వేరే వర్గంగా ఏర్పడ్డారు. ‘‘అన్నపు రాశులు ఒకవైపు, ఆకలి మంటలు ఒకవైపు’’ అంటాడు కాళోజీ. మా వరంగల్‌ జిల్లాలో దొరలకు వేల వేల ఎకరాలు ఉండేవి. ఊర్లకు ఊర్లు మొత్తం వెట్టి చాకిరీ చేసేవారు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమించారు. ఆ ఉద్యమాల ప్రభావం మా ఊర్లమీద బలంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి, నైజాం దిగిపోయినా ఈ దొరల ప్రాబల్యం అలాగే ఉండిపోయింది. అప్పుడు విప్లవోద్యమం మళ్లీ ఊపందుకుంది. ఆ ఉద్యమాల మధ్య పెరిగిన నేను వాటిలో భాగమయ్యాను. నా జీవితం తొలి భాగం అంతా విప్లవోద్యమాలతోనే కొనసాగింది. ఒక దశలో నేను కేన్సర్‌ పాలయ్యాను. అప్పుడు ప్రకృతి మీదకు నా దృష్టి మళ్ళింది. ప్రకృతి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నది అన్న ప్రశ్నతో అధ్యయనం మొదలుపెట్టాను. అదే సమయంలో నేను బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ని చదివాను, బుద్ధిజాన్ని చదివాను, ఈ అనుభవాలన్నీ ఏకమై ఒక దృక్పథం ఏర్పడింది. ప్రకృతిలోని అనేక ద్వంద్వాలు: ఒక రాత్రి - ఒక పగలు, ఒక జననం - ఒక మరణం, ఒక ఎత్తు - ఒక పల్లం... ఇవన్నీ ఎందుకు ఉన్నాయనే నా ఆలోచనాన్వేషణ ఫలితంగా ‘అవని’ పుస్తకం వచ్చింది.


ఈ అన్వేషణలో మీరు అందుకున్న సారాన్ని క్లుప్తంగా చెప్పగలరా?

దీనికి ‘అవని’ పుస్తకంలోంచే ఒక ఉదాహరణను తీసుకుంటాను. ఆకాశంలో చందమామ నెలవంకగా ఉన్న రోజున సముద్రంలోని తాబేళ్ళు ఒడ్డుకు వచ్చి ఒక దూరంలో గుడ్లు పెడతాయి. పెరుగుతున్న నెలవంకతోపాటే గుడ్లలో పిల్లలు పెరుగుతాయి, సముద్రంలో అలలూ పెరుగుతాయి. నిండుపున్నమి నాటికి బాగా పెరిగిన అలలు ఒడ్డు మీదకి పాకి ఆ గుడ్లను కొడతాయి. బిలబిలమని బైట పడే పిల్లల్ని అవే అలలు సముద్రంలోకి మోసుకుపోతాయి. ఆకాశంలో చందమామ, సముద్రంలో అలలు, భూమ్మీద జీవరాసి... ఇలా వీటిమధ్యే కాదు, గ్రహానికీ గ్రహానికీ మధ్య, తారలకు తారలకు మధ్య అనుబంధమై అనంత విశ్వాన్నీ నడిపించే ప్రేమతత్త్వం... ఇది నాకు అవగతమై నన్ను బాగా కదిలించింది. నా అన్వేషణలో నాకు అర్థమైన ఈ తాత్త్విక సారం నన్ను విశ్వమానవుడిగా నిలిపింది.

విప్లవోద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, పర్యావరణ ఉద్యమంలో మీరు ఉన్నారు. మరి సామాజిక ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి?

బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ దినచర్య పుస్తకం చదువుతుంటే ‘‘అరె! ఎక్కడో ఉన్న మార్క్స్‌ కోసం నేను తపించాను. మరి ఇక్కడ ఈ మహనీయుడు భూములు జాతీయం చేయాలని చెప్పాడు, ఎనిమిది గంటల పని విధానం కోసం కొట్లాడాడు, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజీలు తీసుకొచ్చాడు, ఆర్బీఐ లాంటి బ్యాంకింగ్‌ వ్యవస్థని సృష్టించాడు, భాక్రానంగల్‌ లాంటి ఆనకట్టల నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు, పురుషుల స్త్రీల సమాన హక్కుల కోసం హిందూ కోడ్‌ బిల్లు తీసుకొచ్చాడు, దేశానికి రాజ్యాంగమిచ్చాడు, ఇంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని సృష్టించిన మహానుభావుడి వైపు ఆలస్యంగా వచ్చానే!’’ అనిపించింది. అంబేడ్కర్‌ తాత్త్వికత చదివిన తర్వాత సామాజిక ఉద్యమాలవైపు వచ్చాను. ‘‘జగోరే జాగ్‌ అంబేద్కర్‌/ జగత్‌ జన నేత అంబేద్కర్‌/ భవితకు మార్గం అంబేద్కర్‌/ బడుగులకు ప్రాణం అంబేద్కర్‌...’’ అన్న నా పాట ప్రసిద్ధి పొందింది. అలాగే బడుగు బలహీన వర్గాలకు మొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహనీయుడు జ్యోతిబా పూలే. మహిళలకు మొదటిసారిగా అక్షర దానం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. వీరిపైనా అద్భుతమైన పాటలు రాశాను. నా జీవన విధానంలో ప్రకృతితోపాటు బుద్ధిజం ఎప్పుడైతే వచ్చిందో నా నైతిక ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది. బౌద్ధం మీద కూడా మంచి పాటలు రాశాను. సామాజిక ఉద్యమ పార్శ్వంలో ఈ పాటలే నన్ను నిలువెత్తున నిలబెట్టాయి.

ఉద్యమం సఫలమై, రాష్ట్రం సాకారమయ్యాక, ఇప్పుడు తెలంగాణలో పాట చేపట్టవలసిన కార్యక్షేత్రం మీ దృష్టిలో ఏమున్నది?

మేము ఏ ఆకాంక్షలతో ఐతే కొట్లాడినమో అది సాకారమైందా అనే దిశగా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని రంగాలలో చాలా అభివృద్ధి జరిగింది. నీటి పారుదల, వ్యవసాయ రంగమే తీసుకుంటే- ఒకప్పుడు చెరువులన్నీ ఎండిపోయి ఉండేవి. ఇప్పుడు చెరువులన్నీ నిండాయి, ఎప్పుడో కనపడటం మానేసిన గిజిగాడి గూళ్లు మళ్లీ చెరువులపై ప్రత్యక్షమయ్యాయి. అలాగే విద్యుత్‌ విషయంలోనూ అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బందులేమీ లేవు. ఈ రెండు రంగాలూ తీసుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ఇక విద్య, ఉపాధి వంటి రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అంటే పాట చేయాల్సిన పని ఇంకా ఉంది, చాలా ఉంది.

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన కవులు, రచయితలు?

నాకు కవులైనా రచయితలైనా అంతా గాయకులే. వారి పాటలే నాకు రచనలు. చదువుకునే రోజుల్లో గద్దరన్న ప్రభావం నాపై బాగా ఉండేది. విద్యార్థి నాయకుడిగా పని చేస్తున్న రోజుల్లో గద్దరన్న ‘లాల్‌ సలామ్‌...’, ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమవ్వో’ వంటి పాటలు, అదే రోజుల్లో గూడ అంజయ్య ‘ఊరు మనదిరా...’ వంటి పాటలు నన్నెంతో కదలించాయి, రగిలించాయి, నన్ను ఆర్టిస్టుగా మలచాయి. విప్లవో ద్యమంలోకి వెళ్లి అన్నలపై నేను రాసిన, ‘‘ఎవరోయి బిడ్డలు/ నింగిలో నెలవంకలు/ ఎవరోయి పిల్లలు అడవి మల్లెపువ్వులు/ వాళ్ల నడుముల్లో తూటాల దండలు/ వాళ్ల నడకల్లో ఎర్రాని జెండలు’’ వంటి పాటలన్నీ గద్దర న్న, గూడ అంజయ్యల పాటల ప్రభావంలో రాసినవే.

గద్దర్‌తో మీకున్న మంచి జ్ఞాపకం చెప్పండి?

తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న నేనూ కలిసి మణుగూరు నుంచి ఆదిలాబాద్‌ వరకు బహిరంగ సభల ద్వారా ప్రతి రోజూ లక్షల మందిని ప్రభావితం చేస్తూ పాదయాత్ర చేశాం. ఆ యాత్రలో మేము భూపాల పల్లికి వచ్చినప్పుడు అక్కడ కర్ఫ్యూ పెట్టారు. మిలిటరీ దిగింది. తెల్లగీత గీశారు. గీత దాటితే చంపేస్తామన్నారు. ఆ ఉద్రిక్త సమయంలో తెలంగాణ కోసం చావటానికైనా సిద్ధమని గద్దరన్న నేనూ కలిసి ఆ గీత దాటాం. ప్రజల కేరింతలతో మా వెంట నడిచారు. ఆ యాత్రలోనే మంచిర్యాల దాటి శ్రీరాంపూర్‌ ప్రాంతంలో ఒక రాత్రి పూట ధూంధాం కళాకారులమందరం కలిసి ప్రదర్శన ఇస్తున్నాం. అప్పటికే నాకు కేన్సర్‌ ఆపరేషన్‌ చేశారు. ఆ సభలో ఎలుగెత్తి పాట పాడుతున్నప్పుడు కడుపు దగ్గర ఇంకా పచ్చిగా ఉన్న కుట్లు తెగి రక్తం కారింది. నా తెలంగాణ కోసం రక్త తర్పణమనుకున్నాను. ుఽ

జయరాజు

Updated Date - 2023-09-25T00:49:51+05:30 IST