Share News

నమస్కారం!

ABN , First Publish Date - 2023-11-08T02:37:39+05:30 IST

గుండె బాగానే ఉంది గూడు కనబడటం లేదు డొక్క దాని కిందనే ఉంది ఆకలి తీరటం లేదు దేహముంది...

నమస్కారం!

గుండె బాగానే ఉంది

గూడు కనబడటం లేదు

డొక్క దాని కిందనే ఉంది

ఆకలి తీరటం లేదు

దేహముంది

ఈ రెండింటిని మోసుకొని తిరుగుతుంది నగ్నంగా –

ఎన్నో రంగాలు – ఎన్నెన్నో అంతరంగాలు

ప్రభుత్వాలూ – ప్రతిపక్షాలూ –

ఎన్నికలంటే

అదో అబద్ధపు రంగమనీ

ఎన్నికలంటే

అదో బూటకపు నాటకమనీ

తెలిసిపోయింది.

బారులో గోల లాగా

శాసన సభలో సభ్యుల అసభ్యత –

పనికి వచ్చే

చెట్టు గురించో

గుట్ట గురించో మాట్లాడితే సార్థకత –

బతుకు నిచ్చే

పంట గురించో

ప్రాజెక్టు గురించో చర్చిస్తే విధేయత –

నాయకుల నాటకరంగాలు –

అన్ని పార్టీల అంతరంగాలు –

స్వకుచమర్దనాలే!

మేమేమో చౌరస్తాలో దీనంగా

కూడు దొరక్క గూడు దొరక్క

చెక్కుడు సంచి దాచిపెట్టుకున్నట్టు

మా గుండెల్ని దాచి,

మా ప్రాణాలతో మేం చినుకు కింది గింజలా చిగురిస్తున్నాం!

ఇన్నాళ్ళూ

కళంకిత నాయకులు కాదనే నమ్మకంతో

ఓట్లేసి గెలిపించాం!

మహా నాయకులారా

మేం చేతులెత్తి విన్నవిస్తున్నాం!

రండి!

మా గుండెల్ని తాకండి!

మా గూళ్లను తడమండి!

మేం కూర్చున్న నేల

విసుర్రాయిలా తిరుగుతుంది

మా కళ్ళల్లో నీళ్లు

సుడిగుండంలా చుట్టుకుంటున్నాయి

మీరూ

మీ కుర్చీని ఒక్కసారి

చూసుకోండి!

మా ఓట్లతో అధికారం పొంది

మా చేతుల్తో చేసి,

మేం వేసిన కుర్చీలో కూర్చున్న

మిమ్మల్ని అడుగుతున్నాం!

మీరెవ్వరికైనా ఏరకంగానైనా

పాలకులుగా ఉండటానికి

అర్హతలున్నాయా అని

నిలదీస్తున్నాం!

జరుగబోయే ఎన్నికల్లో

గెలుపొంది

కుర్చీలో కూర్చోబోయేవాళ్ళని

శాసిస్తున్నాం!

మీరు కూర్చున్న,

కూర్చోబోయే గద్దెల మీద

ఏ రకంగా తిష్టవేస్తారని

ప్రశ్నిస్తున్నాం!

అర్థం కాని మా బుర్రలకు

అర్థమయేట్టు జవాబు చెప్పండి!

మీ కిదే మా నమస్కారం!

మీ కిదే మా తిరస్కారం!!

కందుకూరిశ్రీరాములు

Updated Date - 2023-11-08T02:37:44+05:30 IST