‘‘మరింతమంది తెలుగువారు ఇతర రాష్ట్రాల సదస్సుల్లో పాల్గొనాలి’’

ABN , First Publish Date - 2023-03-20T02:42:20+05:30 IST

ప్రముఖ రచయిత్రి సి. మృణాళిని ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలికి కన్వీనరుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆవిడకు అభినందనలతో వివిధ సాహిత్య వేదిక జరిపిన సంభాషణ ఇది...

‘‘మరింతమంది తెలుగువారు ఇతర రాష్ట్రాల సదస్సుల్లో పాల్గొనాలి’’

ప్రముఖ రచయిత్రి సి. మృణాళిని ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలికి కన్వీనరుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆవిడకు అభినందనలతో వివిధ సాహిత్య వేదిక జరిపిన సంభాషణ ఇది:

మీ పదవీ కాలంలో మీరు ప్రధానంగా చేపట్టదల్చుకున్న ప్రాజెక్ట్స్‌ ఏమిటి?

సాహిత్య అకాడెమీలో కార్యక్రమ నిర్వహణకు ఒక పద్ధతి ఉంటుంది. అకాడెమీ పనులలో ముఖ్యమైనవి అందరికీ తెలి సినవే. సాహిత్య సదస్సుల నిర్వహణ, పుస్తకాల ప్రచురణ. కనక ఏ కమిటీ కొత్తగా రూపొందినా ఈ రెండు పనులపై ముందు కొంచెం స్పష్టత ఉండాలి.

1. నా ఉద్దేశంలో కొత్త పుస్తకాలు ప్రచురించే ముందు గత కొన్నేళ్లుగా ప్రచురణ కావలసి వుండీ వివిధ కారణాల వల్ల కాలేకపోయిన పుస్తకాల ముద్రణ మొట్టమొదటి ప్రాధాన్యంగా భావిస్తున్నాను. నాలుగైదేళ్ల క్రిందే రచించి, సమీక్ష కూడ అయిన పుస్తకాలు సైతం ఇంకా ప్రచురణకు నోచుకోలేదు. ముందు ఆ బ్యాక్‌లాగ్‌ పని చూడాలి. ఆ తర్వాతే కొత్త పుస్త కాల ప్రచురణ చేపట్టాలి. అవి సమగ్రంగా ఉంటే ప్రచురిం చడం, లేకపోతే దిద్దే పనిని నిపుణులకో, అదే రచయితలకో అప్పగించడం చెయ్యాలి. ఏ రకంగానూ బాగాలేవనుకున్న రచనలు ఒకవేళ ఉంటే (ఉన్నాయని అనుకోను) వాటి ప్రచు రణ రద్దు చెయ్యాలి. అంతేకానీ, పనులు పేరబెట్టుకుంటూ పోతే కుదరదు.

2. సదస్సులు, సమావేశాల విషయానికి వస్తే, ఒకవైపు ఇంతవరకూ జరిగిన పద్ధతిలో కార్యక్రమాలు చేస్తూనే, తులనాత్మక సాహిత్య చర్చలనూ, యువతకు భాషాసాహిత్యాలపై అభిరుచి కలిగించే కార్యక్రమాలను రూపొందించాలని అనుకుం టున్నాను. తులనాత్మక అధ్యయనం అన్నది, అనేక భాషలున్న భారతదేశానికి ఎంత అవసరమో సాహిత్య అకాడెమీ సద స్సులకు హాజరైన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ విషయంలో మన తెలుగు విభాగం వెనకబడే ఉంది.

3. ఇతర భాషలతో పోల్చి చూస్తే, తెలుగు ప్రముఖులపై డాక్యుమెంటరీలు చాలా తక్కువ. రాబోయే అయిదేళ్లలో కొన్న యినా చెయ్యాలని అనుకుంటున్నాను. ఇది కాక ఒక్కొక్క సంవత్సరానికీ ప్రణాళికలు రూపొందిస్తున్నపుడు, సభ్యులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని బట్టి కొత్త పనులు చేపట్టవచ్చు.

ఈ పదవి చేపట్టిన మొదటి మహిళగా మీ నుంచి మహిళా సాహిత్యం విషయంలో ఎలాంటి కార్యక్రమాలను ఆశించవచ్చు?

ఇదివరకు సాహిత్య అకాడెమీలలో 10మంది సభ్యుల్లోనూ నామమాత్రంగా ఒకే మహిళ ఉండేవారు. ఈసారి నాతో సహా ముగ్గురం ఉన్నాం. కనక ప్రారంభం బాగానే జరిగింది.

ఇకపోతే, జాతీయ స్థాయిలో ‘అస్మిత’ పేరిట అన్ని బాష ల్లోనూ స్త్రీల రచనలతో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కాక కవి సంధి, కథాసంధి, త్రూ మై విండో కార్యక్రమాల్లో కూడ మహిళల సంఖ్య పెరగాలని అనుకుంటున్నాను. రచయితలు, కవులతో ముఖాముఖీలో రచయిత్రుల సంఖ్య పెరగాల్సివుంది. భారతీయ సాహిత్య నిర్మాతల్లో ఇప్పటి వరకూ ఎవరెవరివి వచ్చాయో చూసి, విస్మరించిన స్త్రీలు ఉంటే వెదకిపట్టుకుని, మోనోగ్రాఫ్‌లు రాయించాల్సి వుంటుంది.

కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఇతర భాషల్లో వస్తున్నట్టు తెలుగు సాహిత్యకారులపై మోనోగ్రాఫులు, డాక్యుమెంటరీలు తక్కువ వచ్చాయి. ఈ దిశగా ఏం చేస్తే బాగుంటుంది?

పైన చెప్పినట్టు, మోనోగ్రాఫుల్లో ఆడ, మగా తేడా లేకుండా కొద్దిమందికైనా అన్యాయం జరిగింది. ఎప్పుడో మోనోగ్రాఫులు రావాల్సిన సాహిత్యకారులకు ఇంకా రాకపోవడం ఆశ్చర్యమే. దానికి తెలుగు సంఘమే బాధ్యత వహించాలి. మేము చేసే ప్రతిపాదనలపైనే కేంద్ర సంఘం చర్యలు తీసుకుంటుంది కనక, ఇక్కడే సరైన ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందాలి.

డాక్యుమెంటరీల విషయంలో నేను చేసేది ఆరోపణలా కనిపించవచ్చునుగానీ ఒకటి నిజం. డాక్యుమెంటరీల బడ్జెట్‌, మామూలుగా డాక్యుమెంటరీలు తీసేవాళ్లతో పోల్చి చూస్తే కొంత తక్కువగా ఉండవచ్చు. కేంద్ర సాహిత్య అకాడెమీ 24 భాషల్లోనూ డాక్యుమెంటరీలకు బడ్జెట్‌ కేటాయించాలి కనక తక్కువే ఉంటుంది. మన దగ్గర తక్కువ నిధులతో నాణ్యమైన పనులుచేసే దర్శకులు/నిర్మాతలు లేరు. పొరుగుభాషల్లోనైతే అవార్డులు పొందిన దర్శకులు సైతం, తమంతటతాము తమ భాషలోని ఉత్తమ సాహిత్యకారుడి డాక్యుమెంటరీని పారితో షికం గురించి పట్టించుకోకుండా చేయడం చూస్తాం. ఆ భాషా నిర్మాతలకు, దర్శకులకు సాహిత్యంపై ఉన్న అభిరుచి అలాం టిది. మన దగ్గర కూడా ఎవరైనా మంచి దర్శకుడు ముందుకు వచ్చి, అలా చేయగలిగితే, నాణ్యమైన డాక్యుమెంటరీలు రూపొందవచ్చు. ఇటీవల యువతరంలో మంచి అభిరుచి, నైపుణ్యం కలిగిన డాక్యుమెంటరీ నిర్మాతలు కనిపిస్తున్నారు. వారి సేవలను వినియోగించుకోవచ్చునేమో చూడాలి.

తెలుగు సాహిత్య చరిత్రపై కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రాజెక్టు జరుగుతోంది. దాని గురించి చెప్పండి?

ఈ ప్రాజెక్టు ఇంకా రచన దశలోనే ఉన్నట్టుంది. నేనింకా ఆ పుస్తకాన్ని చూడలేదు. దానికి విడిగా సంపాదకవర్గం ఉంది. వారు తమ పనిని కొనసాగిస్తారు. దాన్ని సమగ్రంగా రూపొందిస్తారని భావిస్తున్నాను. ఇంకా ఎంత వ్యవధి వారికి అవసరమన్నది వారితో చర్చించాకే నిర్ణయిస్తాం.

సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పుస్తకాల స్టోర్ల ఏర్పాటుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా?

ఇదివరకు, అంటే డా. జివి సుబ్రహ్మణ్యంగారు సాహిత్య అకాడెమీ కన్వీనర్‌గా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నపుడు, సాహిత్య అకాడెమీతో చర్చించి, తెలుగు విశ్వవిద్యా లయం ముద్రణశాఖలో ప్రత్యేకమైన రాక్‌లు సాహిత్య అకా డెమీ ప్రచురణలకు కేటాయించాం (అప్పుడు నేను సలహా మండలి సభ్యురాలిగా ఉన్నాను). అది కొంతకాలం బాగానే నడిచింది. ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఎప్పుడో సాహిత్య అకాడెమీ ప్రచురణల ప్రదర్శన పెడితే తప్ప వారి పుస్తకాలు తెలుగు ప్రజలకు అందకపోవడం సరైనది కాదు. ముఖ్యంగా తులనాత్మక సాహిత్యంపై సదస్సులు నిర్వహించాలంటే ఇతర భాషల అనువాదాలు అందుబాటులో ఉండాలి. సాహిత్య అకాడెమీ పుస్తకాల స్టాల్స్‌ ఎప్పటికీ అందుబాటులో ఉండే విషయంలో కాస్త గట్టి ప్రయత్నమే చేయాల్సి వుంటుంది.

తెలుగులో అవార్డులు పొందిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించే పని ఎలా జరగబోతోంది?

అవి రావలసినంత త్వరగా రావడం లేదన్న మాట నిజం. ఆంగ్లం, హిందీలలో వచ్చినంత వేగంగా ఇతర భారతీయ భాషల్లోకి అనువాదాలు రావు. ఎక్కువమంది అనువాదకులు మన దగ్గర ఇంగ్లీషు, హిందీల ద్వారా అనువాదం చేస్తారు. అంటే తెలుగు రచన ఆ రెండిట్లో ఏదో ఒక భాషలోకి ముందు వెళ్లాలి. తర్వాత దాన్ని ఇతర భారతీయ భాషల్లోకి చెయ్యాలి. మలయాళం, తమిళం, కన్నడం వరకూ నేరుగా చేసేవాళ్లు ఒకరిద్దరు ఉన్నారు కానీ, ఎక్కువభాగం మూడో దశ రచనే అవుతుంది కనక టైం పడుతుంది.

జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్య ప్రచారం మరింత విస్తృతంగా ఎలా జరపవచ్చు?

తెలుగు సాహిత్య ప్రచారం జరగాలి అంటే మరింతమంది తెలుగువారు ఇతర రాష్ట్రాలలో జరిగే సదస్సుల్లో పాల్గొనాలి. ఇప్పటికే పాల్గొంటున్నారు. కానీ ఎక్కువమంది ఏం చేస్తున్నా రంటే, తమ కవితో, కథో, పత్ర సమర్పణో అయిపోయాక మిత్రులను కలవడానికో, ఊరు చూడ్డానికో వెళ్లిపోతారు. ఇతర బాషలవారి ప్రసంగాలు వినడం తమ పని కాదనుకుంటారు. అయితే వారివి కూడ విని, వారితో మన భాషలో ఉన్నవి చర్చించడం చేసినపుడు, మన భాషపై వారికి కుతూహలం కలుగుతుంది. ఇద్దరి మధ్యా ఆదాన్‌ ప్రదాన్‌లు జరుగుతాయి. ఇతర బాషావేత్తలతో పరిచయాలు పెంచుకోవడం అవసరం. ఇక్కడ మరోసమస్య. ఆ పరిచయాలను స్వలాభం కోసం వాడుకునే ప్రమాదం ఉంది. అలా కాక, తెలుగు సాహిత్యానికి ఉపకరించేలా మలుచుకోవడం ఇంకా అవసరం.

మరో ముఖ్యమైన విషయం- ఆంగ్లంలో తెలుగు రచయితల రీడర్స్‌ తీసుకురావడం. నేను క్రితం సారి జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఉన్నపుడు, ఈ విషయాన్ని ప్రతిపాదించాను. అంటే తెలుగు సాహిత్య దిగ్గజాల రచనల్లో, ఇతర బాషల వారికి ఆసక్తి కలిగించగల కొన్ని రచనలను ఎంపిక చేసి, ఇంగ్లీషులోకి అనువదింఫజేసి, ఒక సంకలనంగా తీసుకురా వడం. ఆ క్రమంలో నా సంపాదకత్వంలోనే ‘గురజాడ- ఎ రీడర్‌’ రూపొందించడం పూర్తయింది. అది ముద్రణలో ఉంది. ఇలా మరికొందరి మీద, రీడర్స్‌ రావాలి.

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు ప్రాంతీయ కార్యాల యాన్ని తెలుగు రాష్ర్టాల్లో ఆశించవచ్చా?

నాకు తెలిసినంతవరకూ లేదండీ. తెలుగుకు అంటూ విడిగా ప్రాంతీయ కార్యాలయం ఉండదు. నాలుగు దక్షిణభాషలకూ కలిపి, బెంగుళూరులో ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ విధాన నిర్ణయానికి (పాలసీకి) సంబంధించిన విషయం.

Updated Date - 2023-03-20T02:42:20+05:30 IST