మెక్సికో సిటీ కో ప్రేమలేఖ

ABN , First Publish Date - 2023-03-27T01:00:06+05:30 IST

నగరం మాట్లాడుతుంది నడుస్తున్నంత సేపూ వెలుగునీడల ఛాయా వీధులై చెంపలపై తారాడుతూ నగరం గుసగుసలతో మాట్లాడుతుంది తలని రెండు చేతుల్లోకి తీసుకుని...

మెక్సికో సిటీ కో ప్రేమలేఖ

1

నగరం మాట్లాడుతుంది

నడుస్తున్నంత సేపూ

వెలుగునీడల ఛాయా వీధులై

చెంపలపై తారాడుతూ

నగరం గుసగుసలతో మాట్లాడుతుంది

తలని రెండు చేతుల్లోకి తీసుకుని

జుట్టులోకి ప్రేమగా వేళ్ళు జొనిపి

నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది

తన దేహం అణువణువునా వేనవేల స్మృతులై

పలకరిస్తుంది

నగరం ఒంటరిదీ

సమూహమూ

నగరం నిశ్చలమూ

నిరంతర చలనమూ

నగరమొక ముళ్లకంచే

గాఢ పరిష్వమ్గమూ

నగరాకాశంలో ప్రేమపతాకాలు

దేహంపై మొలిచిన భవంతుల శూలాలు

నగరం నడుము చుట్టూ నక్షత్రాల వడ్డాణాలు

వంటినిండా నిలువెత్తు కుడ్య చిత్రాలు

2

అతడు భూమి

ఆమె ఆకాశమూ, గాలీ, నీరూ, నిప్పూ

భూమిని ప్రేమించిన సముద్రపు నీటి చిత్రం

భూమిని అల్లుకున్న ప్రాణవాయువుల ఊపిరి

భూమిని కప్పుకున్న ఆకాశ వెచ్చదనం

భూమిని జ్వలించి దహించిన అగ్నిశిఖల తీవ్రత

నగరం ప్రేమికుల పురాగాథ

వారిద్దరి విడదీయరాని కౌగిలి

అంతులేని ప్రేమ తీవ్రత

విడిపోనివ్వక దహించే ప్రేమాగ్ని

కలిసున్నా సుడిగాలిలా చుట్టే విరహాగ్ని

అతడు

ఆమె తలలో విరబూసిన పువ్వు

ఆమెను దహించే చిరునవ్వు

ఆమెను హింసించిన దుర్భర క్షణాల కాలనాళిక

ఆమె ప్రేమించిన అలుపెరుగని కుంచె

నగరం వారి ఇంటినిండా మార్మోగే విషాద ప్రేమగాథ

వారిద్దరి ప్రేమసంతకాల చిహ్నమై

ఆకాశంలో విరిసిన సుత్తీకొడవలి

నగరం

3

నగరం మూలవాసులు అజ్టెక్‌ల చరిత్ర

పరాజితుల శవాల గుట్టలకు సజీవ మృతసాక్షి

నగరం

స్పెయిన్‌ ముష్కరుల వరుస దాడుల దెబ్బల్లో

కమిలిన దేహం

నగరమంతా

యుద్ధాల్లో ఛిద్రమైన అపురూప నాగరికతల అవశేషాలు

నగరం నడిబొడ్డున డప్పుల మోతలు

అలుపులేకుండా గజ్జెకట్టి ఆడే చరిత్ర స్వరాలు

అణచివేసినా తుడిచిపెట్టినా మార్మోగే అద్భుత జానపదాలు

దురాక్రమణదారుల దుర్మార్గాలకు బలైన రణనినాదాలు

జపాటిస్తాలై మార్మోగే పోరాట వారసత్వాలు

సాయంత్రాలను వెలిగించే

నక్షత్ర ప్రాణదీపాల నృత్యసమాహారాలు

అలుపెరుగని నిరంతర ఢంకారవాలు

ఆదిమ సమిష్టి జీవనానికి దిష్టి తగలకుండా వేస్తున్న

ఊదు పొగలు

నగరానికి కంచె కడుతున్న మూలవాసుల

సాంస్కృతిక సంబరాలు

నగరం వేనవేల ఆదివాసీల పాదధూళి

4

చిన్నాభిన్నమైన ఆదివాసీ సామూహిక జీవన శకలాల

పురాస్మృతులను అణువణువునా చిత్రించుకున్న

మహాకుడ్యం నగరం

యుద్ధాల్నీ త్యాగాలనీ సమాధుల్లో అమరులనీ

సమిష్టి జీవనాన్ని పదిలంగా నిక్షిప్తం చేసిన

ప్రేమికుని ప్రాకృత హస్తం నగరం

చిత్రకారుల కుంచెల పొత్తిళ్ళలో ఒదిగిన

ఛిద్రమైన సమిష్టి జీవన రక్తసిక్త ప్రేమకావ్యం

ఐదువందల ఏళ్ళ సౌకుమార్యపు పాలవాసన విరిసే

పచ్చిబాలింత

నగరం

5

అతడు ఒక పసిబాలుడు

ప్రియురాలు వెంటరాగా

ఒక చేత్తో కుంచెనూ

మరో చేత్తో నగరం చిటికెనవేలునూ పట్టుకుని

జన్మ పునర్జన్మల మధ్య

మరణ పునరుద్థానాల మధ్య

నడిచే భూమి

అతడు

బాధాగ్నినీ, బీభత్సాన్నీ, మహత్తర జీవనాకాంక్షనూ

వేనవేల రంగుల తోటలుగా విరబూసిన నగరం

అతని కుంచెలో

ఆలమైదా పార్కులో మహత్తర కుడ్యచిత్రమై

జోకాలో లో వేనవేల జండాల

మధ్యాహ్నపు ఊరేగింపై సాగుతుంది

నగరం నడిబొడ్డున

కలల్ని కవిత్వంగా యుద్ధరచన చేస్తున్న

హోచి మిన్‌

నగరం

వీరయోధుల మహస్వప్నం

తన కాలపు నదుల్లో

మనల్ని ముంచి తేలుస్తూ

ప్రతి ఉదయం ఆర్తిగా కౌగలించుకునే

నిర్విరామ నిరంతర

స్వప్నం

(మెక్సికో సిటీలో లక్ష్మణ్‌ ఏలే అన్న తో నడుస్తున్నప్పుడు)

నారాయణస్వామి వెంకటయోగి

సూచికలు:

అతడు - మెక్సికన్‌ మహా కుడ్య చిత్రకారుడు డీగో రివెరా

ఆమె - డీగో రివెరా ప్రియురాలు, భార్య, తానూ గొప్ప చిత్రకారిణి - ఫ్రిదా కాలో

జోకాలో - మెక్సికో సిటీ నగరం మధ్యలో ఉన్న ఒక చారిత్రిక సమావేశ స్థలం

హొచిమిన్‌ - వియత్నాం వీరయోధుడు - మెక్సికో సిటీ నగరం నడిబొడ్డున ఆయన స్మృత్యర్థం ఒక పార్క్‌, మధ్యలో ఆయన విగ్రహం ప్రతిష్టించారు

Updated Date - 2023-03-27T01:00:06+05:30 IST