Share News

రాజకీయాల్లో ఇంగితజ్ఞానాన్ని పునరుద్ధరిద్దాం!

ABN , First Publish Date - 2023-11-19T01:52:12+05:30 IST

మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే హడావుడి, ఆర్భాటం, వేలం వెర్రి కలగలసిన కోలాహలం. మన ఎన్నికలు జాతరను తలపిస్తాయి. తరలివచ్చిన లేదా తరలించిన జనం...

రాజకీయాల్లో ఇంగితజ్ఞానాన్ని పునరుద్ధరిద్దాం!

మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే హడావుడి, ఆర్భాటం, వేలం వెర్రి కలగలసిన కోలాహలం. మన ఎన్నికలు జాతరను తలపిస్తాయి. తరలివచ్చిన లేదా తరలించిన జనం పెద్దసంఖ్యలో కనిపిస్తేనే మన దృష్టిలో రాజకీయ సభ. ఎక్కడ నలుగురు కలిసినా అదే సంభాషణ: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు?. ఎన్నికల్లో చేసే ఖర్చు, వెచ్చించే శక్తిసామర్థ్యాలు ఊహకు కూడా అందవు. మన తలసరి ఆదాయంతో పోల్చి చూసుకుంటే మనం ఎన్నికల్లో చేసే ఖర్చు అసాధారణం.

ఎన్నికల సమయం వచ్చిందంటే పార్టీల అభ్యర్థిత్వం కోసం పోటీ చెప్పనలవి కాదు. పార్టీ టికెట్‌ కోసం కుమ్ములాటలు, కప్పగంతులు ఔరా అనిపిస్తాయి. ప్రజలు, ప్రజాప్రయోజనాలు, విధానాల పట్ల కించిత్తు ఆసక్తి లేనివాళ్లు సైతం పార్టీ అభ్యర్థులు కావాలని తహతహలాడతారు. మల్లయుద్ధంలోలా తలపడతారు. వెర్రి బలప్రదర్శన చేస్తారు... ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు ఎర వేస్తుంటారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇంత వేలంవెర్రి పోటీ మరెక్కడా కనిపించదు.

ఈ పిచ్చి స్థానిక ఎన్నికల్లోనూ కనిపిస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు బలహీనమైనవి. అక్కడ డబ్బు, అధికారం ఉండదు, ఊరికే ఉత్సవ విగ్రహాలు. అయినా కూడా తగ్గేదే లేదని పదవి కోసం పోటాపోటీగా ఎగబడుతుంటారు. పరిమిత కార్యకలాపాలుండే సహకార సంఘాల్లో కూడా ఎన్నికలు అమీతుమీ అన్నట్లు జరుగుతుంటాయి. సర్వశక్తుల్నీ ఒడ్డుతారు.

1992లో భారతీయ సహకార బ్యాంకుల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల బృందంలో భాగంగా నేను నెదర్లాండ్స్‌ సందర్శించాను. అక్కడి సహకార రంగంలో సుప్రసిద్ధ రాబోబ్యాంక్‌ను అధ్యయనం చేయటానికి, పద్ధతుల్ని నేర్చుకోవటానికి ఉద్దేశించిన పర్యటన అది. ఆ సమయంలో రాబోబ్యాంక్‌ ఆస్తులు, డిపాజిట్లు భారత్‌లోని షెడ్యూల్డ్‌ బ్యాంకులన్నిటి మొత్తం కంటే ఎక్కువ. ఆ సంస్థ పరిధిలో 80కి పైగా స్థానిక బ్యాంకులున్నాయి. ఆ మాతృసంస్థల నుంచి ఏర్పడిన అత్యున్నత సంస్థ రాబోబ్యాంక్‌. భారీగా ఆస్తులు, సమాజంలో పలుకుబడి ఉన్నా, అక్కడి నాయకత్వ స్థానాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు అత్యుత్తమ నాయకుల్ని, అది కూడా తరచుగా ఏకాభిప్రాయంతో ఎన్నుకుంటారు. పదవికి ఎన్నికై నాయకత్వం చేపట్టాలని పేరు, సామర్థ్యం ఉన్న వారిని ఇతర సభ్యులు ఒప్పించాల్సి ఉంటుంది. ఒక స్థానిక బ్యాంకును నడపటం ఎంతో బరువైన బాధ్యతగా వారు భావిస్తారు. పదవికి ఎన్నికవటమంటే వ్యక్తిగత జీవితాల్ని, వృత్తి వ్యాపారాల్ని పణంగా పెట్టి ఎంతో సమయం, శక్తిసామర్థ్యాల్ని వెచ్చించాల్సి ఉంటుందని తటపటాయిస్తారు. హోదా, పలుకుబడి, వనరులు ఉన్న అధికార స్థానాల్ని స్వీకరించటం పట్ల విముఖత చూపే వారి తీరుకి, భారతదేశంలో మన ప్రవృత్తికి ఎంత తేడా! అధికారం, గుర్తింపు వస్తాయంటే, ఏమిటి, ఎందుకు అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రతి అవకాశానికీ ఎగబడటం మన సంస్కృతి.

రాబోబ్యాంక్‌ జాతీయ నాయకత్వ స్థానం ఖాళీ అయినప్పుడు, యాజమాన్య బోర్డులోని అత్యధిక సభ్యులు డచ్‌ ప్రభుత్వంలోని అధికార కూటమికి అనుబంధంగా ఉన్నవారు. ఒకే ఒక్కరు ప్రతిపక్ష కూటమికి చెందిన సభ్యుడు. అయితే ఆ సభ్యుడినే ఎన్నుకోవాలని వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు! భారతీయ సమాజంలో అలా జరగటం ఊహించగలమా? బోర్డు సభ్యులకు చాలా స్పష్టత ఉంది: రాజకీయ, సైద్ధాంతిక విషయాల్లో వాళ్లేమీ రాజీపడరు. గట్టిగా పోటీ పడతారు. ప్రతిపక్షానికి అధికారం రాకుండా శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక లావాదేవీలను ఆకళింపు చేసుకోవటం, బ్యాంకు నిర్వహణ, భవిష్యత్తుకు సన్నద్ధమవటం మొదలైన విషయాలకొస్తే ఆ ఒకే ఒక్క ప్రతిపక్ష నేత వారి అత్యుత్తమ ఎంపిక!

వ్యక్తిగత లాలస, కులం, ఆటవిక భావోద్వేగాలు, ఫ్యూడల్‌ పెత్తందారీ ధోరణుల నుంచి బయటపడి మన ప్రయోజనమేంటో మనకు అలా స్పష్టంగా అర్థమై ఎన్నికల్లో ఆ రీతిలో వ్యవహరించటానికి మనకు కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. కొన్నేళ్ల క్రితం నేను కర్ణాటకలోని ఒక పేద, మారుమూల గ్రామంలో ఉన్నాను. స్థానిక సర్పంచ్‌ వచ్చి తన కుమారుడు జీవితంలో స్థిరపడటానికి సహాయంగా లక్షన్నర రూపాయల అప్పు కావాలని అడిగారు. ఆయన గ్రామ సర్పంచ్‌గా గెలవటానికి 10 లక్షలు ఖర్చు పెట్టారని విన్నాను. ‘అంత స్తోమత లేనప్పుడు పిల్లల అవసరాల్ని కూడా ఆలోచించకుండా ఎందుకంత ఖర్చు పెట్టారు?’ అని అడిగా. ఆయన అద్భుతంగా, సమాజం కళ్లు తెరిపించేలా సమాధానమిచ్చారు. చేతుల్ని తల మీద పెట్టుకుని ‘ఉన్మాదం సార్‌, ఉన్మాదం!’ అన్నారు. ఉన్మాదం అనే సంస్కృత పదాన్ని కన్నడంలో రోజువారీ భాషలో ఉపయోగిస్తుంటారు. వెర్రి, పిచ్చి, మూర్ఖత్వం అని ఆ పదానికి అర్థం.

మనకు ఎన్నికలంటే సమర్థ పరిపాలన, మన ప్రయోజనాలేంటో అర్థం చేసుకోవటం కాదు. ఎన్నికలంటే మన దృష్టిలో చాలామట్టుకు నాకు వ్యక్తిగతంగా గుర్తింపు ఉందా, నా కులం, మతం, ఆటవిక భావోద్వేగాలు, ఫ్యూడల్‌ పెత్తనం. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే వ్యవస్థ వల్ల ఈ రకమైన సాంస్కృతిక ధోరణి మన సమాజంలో పాతుకుపోయింది. సమానావకాశాలు లేని సమాజం కావటంతో అనేకమందిలో అభద్రతాభావం నెలకొని ఉనికి, గుర్తింపు కోసం అర్రులు జాస్తుండటంతో సంకుచితత్వం మరింత పెరిగిపోయింది. రాజకీయ నాయకుల పట్ల మనలో చాలామందికి ద్వేషం ఉండొచ్చు, కానీ వారిలో చాలామంది అవినీతితో డబ్బు సంపాదించాలని రాజకీయాల్లోకి రాలేదన్నది నిజం. ఎన్నికల సమయంలో వాళ్లు చేసే ఖర్చు, మోహరించే సంస్థాగత బలం, ప్రదర్శించే సామర్థ్యాల్ని గనక పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా ఉపయోగిస్తే మరింత ఎక్కువ డబ్బు సంపాదించగలరు. అందుకు బోలెడన్ని మార్గాలున్నాయి.

మనకు రాజకీయ సంస్కరణలు అవసరమనేది నిర్వివాదాంశం. ఎన్నికల వ్యవస్థ, చట్టబద్ధపాలన, వికేంద్రీకరణ తప్పనిసరి. కానీ ఇదే సమయంలో రాజకీయాల పట్ల మోజును తగ్గించాలి. లక్ష్యాల్ని సాధించుకోవటానికి, గుర్తింపు పొందటానికి రాజకీయాలకు బయట మార్గాల్ని సృష్టించాలి. ఇందుకోసం మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. రాజకీయాధికారమంటే చట్టాలు, విధానాలు, వాటి అమలు తప్ప, జీవితం, సమాజంలోని అన్ని అంశాల్నీ నియంత్రించటం కాదని స్పష్టంగా గుర్తించాలి; అలాంటి వ్యవస్థను నిర్మించాలి. మనం రాజకీయాలకి ఇంగితజ్ఞానాన్ని, లక్ష్యాన్ని, సూత్రబద్ధతను పునరుద్ధరించటం ఈవేళ ఎంతో అవసరం.

u డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌

ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్‌.డి.ఆర్‌), లోక్‌సత్తా వ్యవస్థాపకులు

Updated Date - 2023-11-19T01:52:17+05:30 IST