పవన్‌కు కేసీఆర్‌ వల!

ABN , First Publish Date - 2023-02-19T00:51:43+05:30 IST

‘వినాశకాలే విపరీత బుద్ధి’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోకడలు ఈ నానుడిని గుర్తుచేస్తున్నాయి. ఆయన తన పతనాన్ని తానే వేగంగా ఆహ్వానిస్తున్నారు...

పవన్‌కు కేసీఆర్‌ వల!

‘వినాశకాలే విపరీత బుద్ధి’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోకడలు ఈ నానుడిని గుర్తుచేస్తున్నాయి. ఆయన తన పతనాన్ని తానే వేగంగా ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా శుక్రవారం పోలీసుల ద్వారా జగన్‌ ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను గమనిస్తే ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో మొదటి రెండు రోజులు చంద్రబాబు పర్యటన సాఫీగా సాగిపోయింది. చివరి రోజు అనపర్తి నియోజకవర్గంలో మాత్రం రాజమహేంద్రవరం పోలీసులు అనుమతులు లేవంటూ ఆటంకాలు సృష్టించారు. తొలుత అనుమతించిన అధికారులు తర్వాత ఎందుకు రద్దు చేశారో తెలియదు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పోలీసులే రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు కాలినడకన అనపర్తి చేరుకున్నారు. ప్రజలు పోటెత్తడం ద్వారా ఆయనకు సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. చివరి రోజున చంద్రబాబు ర్యాలీని అడ్డుకోవాలన్నది ఎవరి ఆలోచనో తెలియదు గానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం అప్రతిష్ఠపాలయ్యారు. తొలి రెండు రోజుల పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ చివరి రోజున ఆటంకాలు కల్పించడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు సభలకు జనం విరగబడి రావడానికి కారణాలు అన్వేషించి విరుగుడు చర్యలు తీసుకోవాల్సింది పోయి జగన్‌ అండ్‌ కో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చంద్రబాబు ర్యాలీలను అడ్డుకోవాలని అనుకోవడం అవివేకమే. ‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే’ అని అంటారు. జగన్‌రెడ్డి తీరు ఇందుకు తగ్గట్టుగానే ఉంది. తిరుగులేని జనాదరణతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. గొప్పగా పాలించకపోయినా అరాచక పాలనకు తెర తీసి ఉండకపోతే ఆయనకు ఎదురుండేది కాదు. అయితే ఆయన తన వికృత పోకడల ద్వారా తనకు ఓటేసిన వారే పశ్చాత్తాపం చెందేలా చేసుకున్నారు. చెత్త ముఖ్యమంత్రి అనే అవార్డు ఉండి ఉంటే అది జగన్మోహన్‌ రెడ్డికి మాత్రమే దక్కాలనడంలో అతిశయోక్తి లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సహకారం ఉండి కూడా ఆయన వికృత పోకడలనే ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాలలో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి నెలకొంది. చివరకు సొంత పార్టీలో కూడా అసమ్మతి బీజాలు నాటుకున్నాయి. ఎన్నికలకు ఇంకా పదిహేను మాసాల వ్యవధి ఉన్నప్పటికీ ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌ స్థానంలో ఎవరున్నా దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉండేవారు. అయితే జగన్‌రెడ్డి శైలి భిన్నమైనది కనుక ఆయన మరింత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఉనికిని కూడా ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. లోకేశ్‌ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు పర్యటనను కూడా అడ్డుకొనే దుస్సాహసానికి పూనుకుంది. తన ప్రభుత్వానికి మళ్లీ ఎందుకు ఓటేయాలంటే ఒక్క కారణం కూడా చెప్పలేని స్థితిలోకి తటస్థులను కూడా జగన్మోహన్‌ రెడ్డి నెట్టేశారు. ప్రజలను ప్రభావితం చేయగల అనేక శక్తులు, వ్యక్తులు ఇప్పటికీ వివిధ ముసుగులు వేసుకొని జగన్‌కు మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయితే తన చర్యల ద్వారా ఆయన ఆ శక్తులను కూడా ఆత్మరక్షణలోకి నెడుతున్నారు. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోవడాన్ని గమనిస్తున్న ఆయన అనుకూల శక్తుల్లో కలవరం మొదలైంది. దీంతో సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్‌ చేపడుతున్న బటన్‌ నొక్కే కార్యక్రమం వల్ల లబ్ధి పొందుతున్న వారు ఎలాగూ ఆయనకే ఓటు వేస్తారని వారు అనుకుంటున్నారు. దూరమైన మిగతా వర్గాల వల్ల జరగబోయే నష్టాన్ని భర్తీ చేయడం ఎలా? అన్న అంశంపై ఆ శక్తులు ఇప్పుడు దృష్టిసారించాయి.

కాపులే లక్ష్యంగా కేసీఆర్‌!

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో ఆదుకున్నట్టుగానే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్‌కు సాయపడటానికి కేసీఆర్‌ వ్యూహ రచన చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు పడవని తెలుసు కనుకే కాపు సామాజిక వర్గాన్ని చేరదీసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రణాళికను ఆయన రచించారు. రాజకీయంగా చంద్రబాబు అంటే కేసీఆర్‌కు గిట్టదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఆయనకు అధికారం దక్కకుండా చేయడం ఎలా? అన్నదానిపై కేసీఆర్‌ దృష్టి సారించారు. భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా కొంత కాలం క్రితం కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వద్దకు కేసీఆర్‌ దూతలు వచ్చారు. ఆయన నిరాకరించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను ఎంచుకున్నారు. ఈ దశలో తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం, దానికి ప్రజలు భారీగా తరలి రావడంతో కేసీఆర్‌ తన మెదడుకు పనిపెట్టారు. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకోవడంపై ఆయన ఇప్పుడు దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొనే ఆలోచనను విరమించుకొని భారత రాష్ట్ర సమితితో చేతులు కలిపితే భారీగా ఆర్థిక సహాయం చేస్తానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వద్దకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ‘‘వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదు, నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి’’ అని పవన్‌ వద్దకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది. కేసీఆర్‌కు ఇంత ధనం ఎలా సమకూరింది? ఆయన ఏయే రాష్ర్టాలలో ఆర్థిక సాయం చేయబోతున్నారన్నది మరో సందర్భంలో చెప్పుకొందాం. చంద్రబాబు నుంచి పవన్‌ కల్యాణ్‌ను దూరం చేయగలిగితే జగన్‌ అధికారానికి ఢోకా ఉండదని కేసీఆర్‌ బలంగా నమ్ముతున్నారు. అదే సమయంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య అవగాహన ఏర్పడితే దాని వల్ల తనకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా కేసీఆర్‌ దృష్టిసారించారు. కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలని అనుకోవడానికి ఇది కూడా కారణం. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉంటారని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నారట. ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం తనకు అండగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగితే ఆ వర్గం దూరమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయంగా కాపులను చేరదీయాలని నిర్ణయించుకున్నారట. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలో ఉంటున్న కాపులు కూడా ప్రస్తుతం జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో ఉన్నారు. ఇప్పుడు జాతీయ నాయకుడినని చెప్పుకొంటూ ఇకపై తాను దేశం కోసమే ఆలోచిస్తానంటున్న కేసీఆర్‌, మరోవైపు మరో రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం ఉనికిని తెలంగాణలో భరించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కనిపిస్తే కమ్మ సామాజిక వర్గం తనను వదిలేస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టల సిద్ధాంతాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఏదో ఒక విధంగా ఒప్పించి తనవైపు తిప్పుకోగలిగితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డికి మేలు చేసినట్టు అవుతుంది. దానితోపాటు తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం దూరమైనా కాపులతో ఆ నష్టాన్ని భర్తీచేసుకున్నట్టు అవుతుంది– అన్నది కేసీఆర్‌ వ్యూహంగా చెబుతున్నారు. కేసీఆర్‌ ప్రతిపాదనలకు పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. జనసేనను కలుపుకొని ఎంపిక చేసిన యాభై నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుతామని, కనీసం 30 స్థానాలు గెలుచుకోగలిగితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని పవన్‌ కల్యాణ్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల్లో తాను అమలుచేసిన వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. 2019 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డికి భారీగా ఆర్థిక సాయం చేయడంతో పాటు హైదరాబాద్‌ నుంచి చంద్రబాబుకు నిధులు అందకుండా పోలీసుల ద్వారా కేసీఆర్‌ కట్టడి చేశారు. ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌ నుంచి చంద్రబాబుకు నిధులు అందకుండా చేయబోతున్నారట. ఈ క్రమంలో హైదరాబాద్‌లో స్థిరపడిన కొంతమంది కాపు ప్రముఖులతో కూడా కేసీఆర్‌ మంతనాలు జరిపినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టకుండా పవన్‌ కల్యాణ్‌కు నచ్చజెప్పడానికి కొంత మంది కాపు ప్రముఖులను ఎంపిక చేసి కేసీఆర్‌ ప్రయోగిస్తున్నారు. కేసీఆర్‌ ప్రయోగిస్తున్నవారు పవన్‌ కల్యాణ్‌ను కలిసి బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు మానసికంగా సిద్ధపడిన పవన్‌ కల్యాణ్‌ ఈ కారణంగా ఒక దశలో డైలమాలో పడ్డారు. చంద్రబాబుతో చేతులు కలిపినా ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టవలసిందిగా కేసీఆర్‌ ప్రయోగించిన దూతలు పవన్‌ కల్యాణ్‌పై ఒత్తిడి పెంచారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇందుకు అంగీకరించదు కనుక పొత్తు ప్రతిపాదన ముందుకు సాగదన్నది కేసీఆర్‌ అండ్‌ కో వ్యూహంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు అన్నీ గమనించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసి హితబోధ చేసినట్టు తెలిసింది. చెప్పుడు మాటలు వింటే మొదటికే మోసం వస్తుందని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మెగాస్టార్‌, పవర్‌స్టార్లు కలసి కూడా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని ఆయన పవన్‌ కల్యాణ్‌కు గుర్తు చేశారు. ఆ తర్వాత జనసేనానికి క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ చేయబోయే ప్రయత్నాలు పవన్‌ కల్యాణ్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

బరిలోకి ముసుగు వీరులు!

ఈ విషయం అలా ఉంచితే తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు ఏర్పడకుండా అడ్డుకోవడం కోసం జగన్మోహన్‌ రెడ్డి తరఫున పనిచేస్తున్న ముసుగు వీరులు కూడా తాజాగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలన్నీ పవన్‌ కల్యాణ్‌కు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా జనసైనికులను రెచ్చగొట్టే బాధ్యతను ఈ ముసుగు వీరులు చేపట్టారు. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలూ పంచుకుంటాయా? పవన్‌ కల్యాణ్‌కు ముందుగా ఎందుకు ఇవ్వకూడదు? వంటి ప్రశ్నలను ఈ ముసుగు వీరులు జనంలోకి వదులుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీలకూ చెందిన కార్యకర్తల మధ్య విభేదాలు ఏర్పడి పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా చూడవచ్చునన్నది ముసుగు వీరుల వ్యూహం. ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా చేయగలిగితే జగన్మోహన్‌ రెడ్డి అధికారం పదిలంగా ఉంటుందన్నది స్లీపర్‌ సెల్స్‌ రూపంలో పనిచేస్తున్న వారి ఎత్తుగడ. పైకి కనిపించే జెండాలు కొన్నే అయినప్పటికీ వాటి వెనుక పనిచేసే వారికి ఎన్నో ఎజెండాలు ఉంటాయి. తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు వేలు పెట్టకూడదని అనుకునే కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మాత్రం శాసించాలనుకుంటున్నారు. రాష్ట్రం సర్వనాశనం అవడం కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడిన కొంతమంది ముసుగు వీరులు మాత్రం రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు, జగన్‌కు నష్టం జరగకూడదు అన్నట్టుగా పనిచేస్తున్నారు. అయితే ఇంటా బయటా ఎన్నో శక్తులు ఎన్నో రూపాల్లో వ్యూహాలు పన్నుతున్నప్పటికీ తాము కోల్పోతున్నది ఏమిటో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తొమ్మిదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిని అవమానంగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతుండగా కనీసం రోడ్లు కూడా సరిగా లేని దుస్థితిలో తాము ఉండిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ తీర్పు ఎలా ఉండాలో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన అవగాహనకు వచ్చారని రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్న ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభలకు జనం విరగబడి రావడం ఇందుకు సంకేతం అని ఆయన విశ్లేషించారు. అనపర్తికి వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకోవడానికి పోలీసు బలగాలను ప్రయోగించినప్పటికీ ప్రజా బలం ముందు తలవొంచక తప్పని పరిస్థితి ఎదురవడం శుభపరిణామం అని చెప్పవచ్చు. జగన్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. ‘ఒక్క చాన్స్‌’ అని ప్రాధేయపడినందుకు అవకాశం ఇచ్చిన పాపానికి తాము ఎంత నష్టపోయామో ప్రజలు గ్రహించారు. ఈ కారణంగానే ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా వ్యవధి ఉన్నప్పటికీ అధికార పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడానికి పలువురు పోటీ పడుతున్నారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్యులు సొంత సర్వేలు చేయించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తరఫున ప్రతి నెలా నిర్వహించే సర్వేలలో కూడా జగన్‌ గ్రాఫ్‌ పడిపోతూ వస్తోంది. అయినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గుర్తించడానికి జగన్‌రెడ్డి నిరాకరిస్తున్నారట. సంక్షేమ పథకాల లబ్ధిదారుల అండ ఉన్నందున ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే ‘జగనే మా భవిష్యత్తు’ అన్న స్టిక్కర్‌ను ఇంటింటికీ అంటించాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశిస్తున్నారు. ఒకప్పుడు ‘మిమ్మల్నే నమ్ముకున్నాను’ అని వేడుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు తననే నమ్ముకోమంటున్నారు. అయితే వైసీపీకి చెందిన ముఖ్యుల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే చంద్రబాబు నాయకత్వమే శరణ్యం అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ‘వాస్తవ పరిస్థితులను మా వాడికి చెప్పే పరిస్థితి లేదు– చెప్పినా వినే పరిస్థితీ లేదు–మా పనైపోయింది’ అని ఒక సీనియర్‌ శాసనసభ్యుడు ఆవేదన వ్యక్తంచేశారు. అనపర్తి వద్ద పోలీసులతో తలపడటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధపడ్డారంటేనే పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. ప్రజల్లో మార్పు వచ్చి ఉండకపోతే వారికంత ధైర్యం వచ్చేది కాదని వైసీపీకి చెందిన మరో ప్రముఖుడు విశ్లేషించారు. జగన్‌ వద్ద ముఖ్యులుగా చలామణి అవుతున్నవారు కూడా వచ్చే ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం రాకపోవచ్చు అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు అనుకూలంగా ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలించకపోవచ్చు. శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను కూడా జగన్‌రెడ్డి డమ్మీలుగా మార్చడం కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీకి నష్టం చేయబోతున్నది. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బు పంపిణీలో కూడా ప్రజా ప్రతినిధులకు సంబంధం లేకుండా చేయాలనుకోవడాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ఐప్యాక్‌ సంస్థ పర్యవేక్షణలో కొత్తగా నియమితులవుతున్న గృహసారథులే ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తారని శాసనసభ్యులకు ఇదివరకే స్పష్టంచేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు నిమిత్తమాత్రులుగా ఉంటారు. గ్రామాల్లో ఎవరికి ఎంత డబ్బు పంచాలన్నది శాసనసభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థికి కూడా చెప్పరట. దీంతో సొంత పార్టీ నేతల్లోనే అలజడి ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పార్టీ శ్రేణులకు సంబంధం లేకుండా చేయడం ఏమిటో? అని పలువురు శాసనసభ్యులు వాపోతున్నారు. ‘మా వాడు తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు’ అని ఈ సందర్భంగా ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రయత్నించే కొద్దీ ప్రతిఘటన పెరుగుతుంది. ఇవే పోకడలను కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. శుక్రవారం అనపర్తి వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతిఘటనను విస్మరించడానికి లేదు. ఈ పరిణామంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పోలీసులను ప్రతిఘటిస్తారు. పోలీసులపై అధికంగా ఆధారపడి రాజ్యం చేసే ప్రభుత్వం ఏదీ మనుగడ సాగించిన దాఖలాలు లేవు. అణచివేతకు పోలీసులను ఎంత ఎక్కువగా వినియోగిస్తే ప్రభుత్వాలపై వ్యతిరేకత అంతగా పెరుగుతుంది. అప్పుడు కేసీఆర్‌ వ్యూహాలు గానీ, ముసుగు వీరుల ప్రచారాలు గానీ, స్లీపర్‌ సెల్స్‌ కుట్రలు గానీ ఏవీ కూడా జగన్మోహన్‌ రెడ్డిని రక్షించలేవు!

ఆర్కే

Updated Date - 2023-02-19T00:51:46+05:30 IST