కళ్ళను చనుబాలతో కడగండి

ABN , First Publish Date - 2023-03-27T00:50:54+05:30 IST

చెట్టు మనిషిని చూసి వణకిపోతూ వుంది తమ కొమ్మనే గొడ్డలిలో దూర్చి తమ మొదలు నరికే భయానక దృశ్యాన్ని వూహించలేక. వంక బోర్లా తిరిగి పాకుతూ వుంది...

కళ్ళను చనుబాలతో కడగండి

చెట్టు

మనిషిని చూసి వణకిపోతూ వుంది -

తమ కొమ్మనే గొడ్డలిలో దూర్చి తమ మొదలు నరికే

భయానక దృశ్యాన్ని వూహించలేక.

వంక

బోర్లా తిరిగి పాకుతూ వుంది -

ఇసుక తిన్నెల వక్షాలను రాబందుల్లా పీక్కుతినే

రాక్షసహస్తాల దాడిని సహించలేక.

కొండలు

పగిలి పగిలి ఏడుస్తున్నాయి

కంకరగా మార్చి పచ్చదనాన్నంతా కప్పివేసే

మనిషి ఆశల బరువును మోసే శక్తి లేక.

మనిషి తిండి మారిపోయింది

తరతరాల అలవాట్లన్నీ కనుమరుగయ్యాయి..

రుచిమొగ్గలు ఎండిన నోరొకటి విస్తరిస్తూ వుంది

కడలిలా మారిన కడుపొకటి దానికి తోడయ్యింది.

కాయోకసరో నమిలేవాడు కాస్తా

వేర్లతో సహా చెట్టునే మేసేస్తున్నాడు

నీళ్లోతేమో పీల్చేవాడు కాస్తా

ఇసుకతో సహా ఏరునే తాగేస్తున్నాడు

తేనోబంకో తెచ్చుకు బతికేవాడు కాస్తా

రాళ్లుచెట్లతో సహా కొండనే నమిలేస్తున్నాడు

గింజలుకాయలతో పొట్ట నింపుకొనేవాడు కాస్తా

మట్టితో సహా నేలనే బొక్కలాడుతున్నాడు

మనిషికేదో అంతుబట్టని జబ్బొచ్చింది

ఔషధాలతో నయం చేయలేని జబ్బు

ఈ భూగోళాన్ని నోట్లో వేసి కరకర నమలుతూ

మరో భూగ్రహం కోసం విశ్వమంతా వెదకే

ఆకలి జబ్బు.

అమ్మానాన్నల్లారా!

ఉగ్గుపాలతో మీరేదో కలిపి తాగిస్తున్ళారు

అంతులేని ఆకలి జబ్బును పోసి పెంచుతున్నారు

దయచేసి మీ పోషణశైలి మార్చండి

చిన్నతనాన్నే కడుపుచుట్టూ నారతడప బిగించి కట్టండి

నోటినిండా రేగడిమట్టి కుక్కండి

కళ్ళకు ఆకుల గంతలు చుట్టి వదలండి.

ఔను...

ముందుగా - కళ్ళను చనుబాలతో

శుభ్రంగా కడగండి.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Updated Date - 2023-03-27T01:00:21+05:30 IST