జ్వరమాని

ABN , First Publish Date - 2023-03-20T02:31:03+05:30 IST

అమ్మ కూతురుగా తిరిగి వస్తుందంటే నమ్మకం కలిగేది కాదు మాటువేసి అదనుచూసి పెద్దవయస్సు బొబ్బిలిలా మీదవిరుచుకు పడ్డప్పుడు...

జ్వరమాని

అమ్మ

కూతురుగా తిరిగి వస్తుందంటే

నమ్మకం కలిగేది కాదు

మాటువేసి అదనుచూసి

పెద్దవయస్సు బొబ్బిలిలా

మీదవిరుచుకు పడ్డప్పుడు

నీటిలో ముళ్లుల్లా

ఆరోగ్య సమస్యలు

అదాటుగా పంజావిసిరినప్పుడు

అప్పుడు తెలిసింది.

అరటి చెట్టు మొవ్వులోంచి

నవనవలాడుతూ బయటికి తొంగిచూసిన

లేలేత మారాకులా వుండే కూతురు

ఈరోజు

గాలిగుర్రాలమీద దౌడుతీసే

పెనుతుపాను గాలులకు

రెపరెపలాడే

రావి ఆకులా వొణికిపోయింది.

చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకుని

చిటిపొటి అడుగులు వేయించానేమో

ఇప్పుడు అడుగులు తడబడుతున్నవేళ

నా చేదండను తన చిన్ని అరచేత అదిమిపట్టి

పర్వాలేదు నాన్నా అంటుంది.

ఇన్నాళ్లు నా జీవితానికి

కొలమానం అయిన తనే

ఇప్పుడు ఇంతటి జ్వరతీవ్రతలోను

తాకితే వ్యాకోచించే పాదరసం లాంటి

ప్రేమజ్వరమాని అయింది

కన్నుతెరవని మగత నిద్రలో

నుదుటిమీద కప్పిన తడి వస్త్రాన్ని

ఏ అపరాత్రో తడిమిచూసుకుంటానా

అక్కడ వస్త్రానికి బదులు

వొక తమలపాకులాంటి శీతల హస్తం

తల్లిచేయైు ఆదుర్దా పడుతుంటుంది.

వొత్తిళ్ల పరీక్షలప్పుడు

నిద్రకాచిందో లేదో తెలియదు

ఇప్పుడు మాత్రం నిద్రను

కాఫీడికాక్షన్‌లా

తెల్లవార్లూ మరగకాస్తూనే వుంది

ఫోటోలోని చందమామ మోములాంటి

అమ్మమ్మను చూపిస్తూ

మారాము చేస్తుంటే గారాబుగా

గోరుముద్దలు తినిపించానేమో

అదేపనిగా ఇదే చివరిముద్ద అంటూ

తరగని తన ప్రేమను తినిపిస్తుంది.

కాస్త తేరుకున్నాక తేటపడ్డాక

కళ్లను రెండు వర్షామేఘాలుగా చేసుకుని

మళ్లీ వస్తాను జాగ్రత్త నాన్నా అంటూ

పయనమైనపుడు

అమ్మ

కూతురుగా తిరిగి వస్తుందని

గట్టినమ్మకం కలిగింది.

(నందినికి...)

శిఖామణి

98482 02526

Updated Date - 2023-03-20T02:31:03+05:30 IST