Share News

తల్లి జోల కంటే తడి గల పాట ఉంటుందా!

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:16 AM

Talli jōla kaṇṭē taḍi gala pāṭa uṇṭundā!

తల్లి జోల కంటే తడి గల పాట ఉంటుందా!

నా భార్య వయస్సు 70. ఇటీవల మా 11 నెలల ముని మనుమరాలిని నిద్రపుచ్చేందుకు ఆమె జోల పాట పాడారు. ఈరోజుల్లో ఎందరు తల్లులు శిశువులకు జోలపాట పాడుతు న్నారో తెలియదు. 60 నుంచి 80ఏళ్ళ మధ్య వయస్సుగల మహిళల తరం గడిచిపోతే ఈ మౌఖిక సాహిత్యం పూర్తిగా కనమరుగయిపోతుందేమో. అందుకే ఆమె స్మృతిపథంలో ఉన్నంతవరకు ఈ పాటను రాసుకున్నాను. మొదటి చరణం దైవ ప్రార్థనతో మొదలవుతుంది.

1) హాయి హాయి ఆపదలుగాయి

చిన్నవాండ్రను గాయి శ్రీరంగశాయి

2) హాయమ్మ ఓయమ్మ అక్కచెల్లెండ్లు

తొలి ఒక్క జన్మాన తోడికోడళ్ళు

3) జోలల్లు పాడితే బాలురకు నిద్రా

నాగస్వరం ఊదితే నాగులకు ఆటా

4) పాలుదాగేనాడు పారాడునాడు

పాపడీ బుద్ధుల్లు పంచదారల్లు

5) చిన్నది ఉయ్యాల చిలకల్ల పరువు

మహలక్ష్మి ఊచు మా పాప ఉయ్యాల

(ఇందులో నాల్గవ చరణం పసివాళ్ళలోని అమాయకత్వాన్ని, ఏవిధమైన కాలుష్యం అంటని పవిత్రతను తెలియజేస్తుంది కదా! ఐదవ చరణంలో పాప ఉయ్యాలను మహాలక్ష్మి ఊపుతుందట. ఎంత ఆధిక్యభావం ఆ తల్లిలో!)

6) ఎందుకూ ఏడ్చేవు? ఏల ఏడ్చేవు?

పసిబిడ్డను కాబట్టి పాలకేడ్చేను

7) ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లీ

ఏడిస్తే నీకండ్ల నీలాలు కారూ

8) నీలాలు కారితే నే చూడలేనూ

పాలైన కారవే బంగారు కనులా

9) అమ్మాయి కొట్టిన కొట్లు ఊరెల్లరట్లూ

అమ్మాయికి పెట్టరమ్మ ముత్యాల బొట్లు

10) రావెరావె పిట్ట రత్నాల పిట్టా

కౌగిలదేవే పిట్ట అమ్మాయిని గొట్టా

11) అమ్మాయిని కొట్టనూ కోలల్లు లేవూ

తేరమ్మ నెల్లూరు నల్ల చెరుకుట్లా

(అమ్మకు చిరుకోపం వచ్చిందేమో! కోల తెమ్మంటుంది. కాని అమ్మాయిని కొట్టడానికి ఆమె చేతులాడ్తాయా?)

12) చిలకల్లు చెలరేగి జోడి కొమ్మెక్కూ

అమ్మాయి చెలరేగి మామ భుజమెక్కూ

13) ఉయ్యాల కిందవే ఉచ్చ మడుగుల్లూ

పాయసమని తాగుదురు పాప మామల్లూ

14) జోల పాడేవారు జోకొట్టె వారూ

ఆలకించే వారు అమ్మి మామల్లూ

15) మామ బుజమెక్కి ఊపమని అడుగు

పాలుదాగే గిన్నెనడుగు పాడావునడుగు

(తండ్రి తరువాత తండ్రంతటి వాడు మేనమామ. అందుకే తండ్రి పోయినా మేనమామ ఉండాలంటారు. తన సోదరీ మణులకు సంతానం కలిగితే మేనమామ పొందే ఆనందం, గర్వం అనిర్వచనీయం. అలాంటి అమ్మాయి మామ భుజం మీద నాట్యమాడుతుంటే ఆ మామ ఆనందంతో పొంగి పోతాడు. అలాంటి మామకు అమ్మాయి ఉచ్చ మడుగులు కూడా పాయసంతో సమానమే. ఆ మామలు ఒకరికంటే ఎక్కువ ఉంటే ఆ పాపాయి సౌభాగ్యం అడగాలా! వారు జోలపాడతారు, జోకొడ్తారు. అది చూచి ఆ తల్లి మురిసి పోతుంది. అలాంటి పాప ఏమడుగుతుంది. పాలుదాగే వెండిగిన్నెను అడుగుతుంది. పాడి ఆవును అడుగుతుంది. ఇవ్వకుండా ఉండగలడా ఏ మేనమామ అయినా?)

16) చిలకాను నువ్వు బోయి

చిగురించి రాగా

వానవై కురవవే వరి చేల మీద

17) వరిచేలు వుండంగ

వనములుండంగ

కొట్టి మిట్టల మీద కురిసె వర్షమ్ము

(నిజంగా ఆ వానదేవుడు వరిచేల మీద కాకుండా మిట్టల మేద మాత్రమే కురిస్తే రైతు ఎంత సంతోషిస్తాడు!)

18) కోయిలా బిడ్డను కొనితెచ్చు కాకి

తిట్టకా కొట్టకా గోమునా పెంచు

(కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అధికమంటారు.)

19) చిన్నారి పొన్నారి చిలకవే నీవూ

చిగురుమామిడి కింద చిన్న కోయిలవూ

20) ఊరికీ ఉయ్యాలలమ్మ వచ్చిందీ

కొనవె కొడుకుల తల్లి కొనవె ఉయ్యాలా

21) ఉత్తముడు పేరేమి ఊరి పేరేమి?

సత్య పురుషుని గన్న తల్లి పేరేమి?

(ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య, సత్యపురుషుని గన్న తల్లి కౌసల్య. జోల పాటలలో మిగతా మౌఖిక సాహిత్యంలోవలెనే పురాణ గాథల పాటలు కూడా అనివార్యంగా ఉంటాయి.)

- ఇప్పుడు నాకు లభించిన చరణాలు అతికొద్ది మాత్రమే. తెలుగు నేలలో వందలాది జోల పాటలు కోకొల్లలుగా ఉండ వచ్చు. తరాలపాటు కోట్లమంది తల్లులు ఆశువుగా పాడిన జోల పాటలు అసంఖ్యాకంగా ఉంటాయి. తల్లి తన ప్రేమను రంగరించి పాడిన పాటలు ఆర్ద్రతతో నిండి ఉంటాయి. అవి హృదయాన్ని కదిలిస్తాయి. కన్నీళ్ళు తెప్పిస్తాయి. శిశువులనే కాక ఇతరులను కూడా శిశుప్రాయానికి తీసుకొనిపోయి హృదయాలలోనున్న మాలిన్యాన్ని కడిగివేస్తాయి.

మన జోల పాటల సాహిత్యాన్ని కాపాడుకొనేందుకు సాహిత్య పరిశోధకులు పూనుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించాలి. వయోధికులైన మహిళలను కలవాలి. కదిలించి పాడించాలి. ఆధునిక యంత్ర పరికరాల్లో నిక్షిప్తం చేయాలి. గ్రంథస్థం చేయాలి. చాలా కష్టసాధ్యమైన పనే. కానీ ఎవరైనా పూనుకుంటారని, అపూర్వమైన ఈ సాహిత్య సంపదను పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను.

ఎన్‌. సాంబశివరావు

Updated Date - Dec 18 , 2023 | 12:16 AM