మోదీ ‘జమిలి’ సంకల్పం నెరవేరేనా?

ABN , First Publish Date - 2023-09-06T02:24:42+05:30 IST

కేంద్రంలో తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఒక విద్యార్థిని ‘నీవు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నావు’ అని అడిగారు...

మోదీ ‘జమిలి’ సంకల్పం నెరవేరేనా?

కేంద్రంలో తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఒక విద్యార్థిని ‘నీవు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నావు’ అని అడిగారు. ‘నేను మీలా ప్రధాని కావాలనుకుంటున్నాను..’ అని ఆ విద్యార్థి గడుసుగా జవాబిచ్చాడు. ‘నీకు 2024 వరకూ ఆ అవకాశం లేదులే’ అని మోదీ అతడికి సమాధానమిచ్చారు. కాని 2024లో కూడా మరొకరికి అవకాశం ఇవ్వకుండా తానే మూడోసారి ప్రధాని అవ్వాలనే అభీష్టాన్ని మోదీ ఇటీవల వ్యక్తం చేశారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని వదులుకోవడం ఎవరికైనా అంత ఇష్టం ఉండదని, తిమ్మిని బమ్మి చేసైనా అధికారంలో ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తారని మోదీ ఇటీవల చేపట్టిన చర్యలను చూస్తే అర్థమవుతోంది.

ఈ ప్రయత్నాల్లో భాగంగానే మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని ప్రకటించింది. వర్షాకాల సమావేశాలు పూర్తయి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. శీతాకాల సమావేశాలు జరిగేందుకు మరో నెలన్నర కంటే తక్కువ సమయమే ఉన్నది. మరెందుకు ఈ ప్రత్యేక సమావేశాలు? ఈ రెండు సమావేశాల్లో తీసుకోలేని అంత కొంపమునిగిపోయే నిర్ణయాలు ఈ సమావేశాల్లో ఏమున్నాయని తీసుకోవడానికి? ఈ సమావేశాల తర్వాత శీతాకాల సమావేశాలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? ఆ తర్వాత ముందస్తు ఎన్నికలే జరుగుతాయా? అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కారణాలను వివరించాల్సి ఉంటుంది. కాని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిపేందుకు కారణాలేమిటో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉభయ సభాపతులకైనా తెలిసినట్లు లేదు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ప్రధానమంత్రి చర్చించినట్లు ఎటువంటి సమాచారం లేదు. ముందస్తు ఎన్నికలు ఉండవని ప్రకటించిన సమాచార మంత్రి అనురాగ్ థాకూర్ కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఏమి చర్చిస్తారో చెప్పలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాబోయే అమృతకాలం సందర్భంగా జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ వంటి కీలకమైన నిర్ణయాల గురించి చర్చిస్తారని, కొన్ని ముఖ్యమైన బిల్లులు ఉంటాయని చెబుతున్నారు. ప్రజలనుంచి, ప్రజా ప్రతినిధులనుంచి కొద్ది రోజుల పాటు దాచవలసిన రహస్యాలేమున్నాయి వీటిలో? తాజాగా దేశం పేరునే భారత్‌గా మారుస్తారని మరో చర్చ పుట్టింది. ఏమైనా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎజెండానే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ విజయానికి దారితీయవచ్చునని బిజెపి వర్గాలు ఆశపడుతున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రకటించిన ఒకటి రెండురోజుల్లోనే మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ప్రకటించింది. నిజానికి 2019 ఎన్నికలకు ముందే జమిలి ఎన్నికలను ఆయుధంగా ప్రకటించి మోదీ ప్రభుత్వం ప్రజల ఆదరణను చూరగొనాలని వ్యూహం పన్నింది. 2018లో వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. వర్షాకాల సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయనగా లా కమిషన్ కూడా వివిధ పార్టీలతో జమిలి ఎన్నికలపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాక్షికంగానైనా జమిలి ఎన్నికలను నిర్వహించాలని మోదీ అప్పుడు కూడా భావించారు. నీతీ ఆయోగ్ ద్వారా కూడా ఈ ప్రతిపాదనను కదిలించారు. కాని బహుశా పుల్వామా, బాలాకోట్ సంఘటనలు సంభవించడంతో జమిలి ఎన్నికల అవసరం లేదని మోదీ ప్రభుత్వం అప్పుడు భావించి ఉంటుంది.


మళ్లీ ఇప్పుడు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రక ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమయే సరికి మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల ఎజెండాను తెరపైకి తీసుకువచ్చింది. బిజెపి వర్గాల ప్రకారం దేశంలో ఇప్పుడు మోదీకి పోటీగా ప్రతిపక్షం ఇంకా సమీకృతం కాలేదు. సమీకృతం అయినా మోదీకి పోటీగా ఒకే నాయకుడిని రంగంలోకి దించుతుందన్న నమ్మకం లేదు. ఒకేసారి ఎన్నికలు జరిపితే స్థానిక సమస్యలు మరుగునపడిపోయి, జాతీయ అంశాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగేందుకు జమిలి ఎన్నికలు ఆస్కారం కల్పిస్తాయని బిజెపి భావిస్తోంది. రెండవది, ఒకేసారి ఎన్నికలు జరిగితే బిజెపి పాలిత రాష్ట్రాల వైఫల్యం ప్రజలకు కనపడకుండా పోతుంది. మోదీ ఆధారిత ఎన్నికలు జరిగితే స్థానిక అంశాలు పక్కకు వెళ్లి ప్రజలు మోదీని చూసి ఓటు వేస్తారని ఆయన అభిమానులు కలలు కంటున్నారు. ఒకరకంగా దేశంలో పరోక్షంగా వ్యక్తి ప్రాధాన్యత గల అధ్యక్ష తరహా ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలు పూర్తిగా సంఘటితం కాకముందే దెబ్బకొట్టేందుకు మోదీ ఈ ఆయుధం ప్రయోగించాలని చూస్తున్నట్లు సమాచారం.

నిజానికి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు బిజెపి వద్ద బలమైన కారణాలు లేవు. అసలు లోక్‌సభ ఎన్నికలు ఒకసారి, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సార్లు జరిగితే ఏ అనర్థాలు జరుగుతాయో బిజెపి బలంగా చెప్పలేకపోతోంది. దేశమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోవడం, భద్రతా దళాలను నియమించాల్సి రావడం, ఎన్నికల ఖర్చును తగ్గించడం కోసం జమిలి ఎన్నికలను నిర్వహించాల్సిన అత్యంతావశ్యకత ఏమీ లేదు. నిజానికి దేశంలోఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు రూ. 8వేల కోట్లు ఖర్చవుతుందని ఒక నివేదిక తెలిపింది. అంటే ప్రతి ఓటర్‌పై కేవలం రూ. 27 మాత్రమే ఖర్చు అవుతుంది. భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా తక్కువ మొత్తం. అసలు ఖర్చు ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెట్టే నల్లధనం రూపంలో ఉంటుంది. ప్రభుత్వాలే ఈ నల్లధనం సంపాదించుకునేందుకు ప్రోద్బలం కలిగిస్తుంటాయి. దీన్ని అదుపు చేయనంత కాలం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగుపడదు. ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టడంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టడం ద్వారా దేశానికి మేలు చేయాలన్న ఆలోచన ఉంటుందా?

భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దేశ ప్రజల దృష్టిని సుస్థిరత పేరుతో ఒక వ్యక్తి కేంద్రీకృత అధికార వ్యవస్థ వైపు, ఒక భావజాలం వైపు మళ్లించే ఒక వ్యూహమే కాని అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదని మోదీ ప్రభుత్వానికి తెలియదనుకోలేం. స్వాతంత్ర్యం తర్వాత నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగాయి కాని అప్పటికి భారతదేశంలో ప్రజాస్వామ్యం కొత్తది. ప్రజాస్వామ్యం లోతుగా వేళ్లూనుకోని రోజులవి. ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని రాజకీయ, ప్రాంతీయ ఆకాంక్షలులేని రోజులవి. సంకీర్ణ రాజకీయాలు అప్పట్లో దేశంలో ప్రవేశించలేదు. కేవలం ఒకే ఒక పార్టీ, అదికూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్టీ మాత్రమే బరిలో ఉన్న రోజులవి. కనుక ప్రజలు అదే పార్టీకి అధికారం కట్టబెట్టారు. 1967లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. బహుళ పార్టీ, సమాఖ్య వ్యవస్థలు కొనసాగుతున్న కాలమిది. వైవిధ్యభరితమైన దేశంలో అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, ఎన్నో ఆలోచనా విధానాలు, ఎన్నో ఆకాంక్షలు ప్రబలుతున్న ఆధునిక భారతంలో ఒక భావజాలం, ఒక వ్యక్తి నాయకత్వం దేశమంతటా వ్యాపించడం కోసం ఒకే ఎన్నికలు జరపడం సాధ్యమవుతుందా అన్నది చర్చనీయాంశం.


జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావడానికి రాజ్యాంగ సవరణల కన్నా ప్రధానం రాజకీయ అడ్డంకులను అధిగమించడం. నిజానికి జమిలి ఎన్నికల ప్రతిపాదనను తొలిసారి తీసుకువచ్చినప్పుడే కాంగ్రెస్‌తో సహా అనేక ప్రాంతీయ పార్టీలు తిరస్కరించాయి. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పర్చిన కమిటీలో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీయే నిరాకరించిన నేపథ్యంలో కేవలం ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు తప్ప మరే పార్టీలూ ఆ కమిటీకి సహకరించే అవకాశాలు లేవు. కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంలలో ప్రభుత్వాల పదవీకాలం రెండు సంవత్సరాలనుంచీ 4 సంవత్సరాల వరకు ఉన్నది. వీటన్నిటినీ రద్దు చేయడం సాధ్యమా? ప్రతిపక్ష పార్టీల అంగీకారం లేకుండా బిజెపి దౌర్జన్యంగా వ్యవహరించగలదా? కనీసం యోగీ అదిత్యనాథ్ అయినా నాలుగేళ్ల ముందు శాసనసభను రద్దు చేసేందుకు అంగీకరిస్తారా? పోనీ ఒకేసారి ఎన్నికలు జరిగినా, కేంద్రంలో కానీ, అసెంబ్లీల్లో కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడవని, పూర్తి కాలం ప్రభుత్వాలు కొనసాగుతాయని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా?

జమిలి ఎన్నికల ద్వారా కేంద్రానికే పై చేయి కల్పించాలన్న ఆలోచన ప్రజాస్వామ్యానికి, ప్రాంతీయ ఆకాంక్షలకు, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే భావజాలం ఉండాలనుకోవడం నియంతృత్వానికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తుంటే, తమను ప్రజలు వ్యతిరేకిస్తారని, ప్రతిపక్షాలు సంఘటితం కావడం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయనే అభద్రతలో పడేవారే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయోగాలు చేసినా తాము గెలిపించినవారు తమ నమ్మకాన్ని వమ్ము చేశారని, నిరుద్యోగం, ఆకాశాన్నంటిన ధరలు, నల్లధనం, సామాజిక న్యాయం విషయంలో గత తొమ్మిదేళ్లలో ఏమీ జరగలేదని, వ్యవస్థలు మరింత కుప్పకూలాయని, అబద్ధాలనే సత్యాలుగా ప్రచారం చేస్తున్నారని ప్రజలు గ్రహిస్తే మాత్రం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఉండదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-09-06T02:24:42+05:30 IST