‘వర్షాకాలం’ తర్వాతే అసలు యుద్ధం

ABN , First Publish Date - 2023-08-09T03:08:49+05:30 IST

ఆసేతు హిమాచలం వానలు, వరదలతో పాటు మణిపూర్‌లో జాతుల ఘర్షణలు, హర్యానాలో విద్వేష జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న విషమ పరిస్థితులలో...

‘వర్షాకాలం’ తర్వాతే అసలు యుద్ధం

ఆసేతు హిమాచలం వానలు, వరదలతో పాటు మణిపూర్‌లో జాతుల ఘర్షణలు, హర్యానాలో విద్వేష జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న విషమ పరిస్థితులలో జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. మణిపూర్‌లో హింసాకాండపై ప్రధానమంత్రి నోరు విప్పేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని ప్రతిపక్షాలు చెప్పుకున్నప్పటికీ ముఖ్యంగా తమను తాము సంఘటితం చేసుకునేందుకే అవి ఆ తీర్మానం ప్రవేశపెట్టాయని స్పష్టంగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని ఏ సభలోనూ సంఖ్యాబలంతో ఓడించలేమన్నది ప్రతిపక్షాలకు తెలియనిది కాదు. కాని తమ ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ అవకాశాన్ని అవి ఉపయోగించదలుచుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీలో పరిపాలనా సర్వీసులను కేంద్రం హస్తగతం చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లు చర్చకు రావడం కూడా ప్రతిపక్షాలు సంఘటితం అయ్యేందుకు వీలు కల్పించింది. ఉభయ సభల్లో ఏఏ పార్టీలు ఎటు వైపు మొగ్గుచూపుతున్నాయి, భవిష్యత్‌లో రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని ఆయా పార్టీలు అనుసరించిన వైఖరిని బట్టి అంచనా వేయవచ్చు. వర్షాకాల సమావేశాలకూ, డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాలకూ మధ్య అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్న రీత్యా ప్రస్తుత సమావేశాలు ముగిసిన వెంటనే ఇరు వర్గాలు ప్రజాక్షేత్రంలోనే తమ బలాబలాలను తేల్చుకునేందుకు సిద్ధం కావల్సి ఉన్నది.


పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో చేరిన ప్రతిపక్షాలన్నీ ఐక్యంగానే కనిపించడం ఒక కీలక పరిణామంగా భావించక తప్పదు. మణిపూర్ విషయంలోనూ, అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అవి సమైక్యంగానే వ్యవహరించాయి. విపక్షాలు గతంలో ఏనాడూ రాజ్యసభలో 85 మందికి పైగా సభ్యుల మద్దతును కూడగట్టుకోలేకపోయాయి. అయితే ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల సంఖ్యాబలం వందకు దాటింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు స్టే విధించడం ఒక ఆసక్తికర పరిణామం. జైలు శిక్ష విధించడం, లోక్‌సభలో అనర్హత వేటు పడడం, బంగళా ఖాళీ చేయించడం రాహుల్‌కు కొంత సానుభూతి కల్పించాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూడు విషయాల గురించి ఆయన జనంలో చెప్పుకుని సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేశారు. అనవసరంగా రాహుల్ పట్ల సానుభూతి పెంచేందుకు కారణమైందన్న విమర్శలను మోదీ బృందం స్వవర్గీయులనుంచే ఎదుర్కొంది. భారత జోడో యాత్ర, ఆయనకు సూరత్ కోర్టు శిక్ష విధించడం రెండూ రాహుల్‌కు ప్రజల్లోనూ, ప్రతిపక్ష కూటమిలోనూ కొంత ఆమోదయోగ్యత కల్పించాయనడంలో సందేహం లేదు. రాహుల్ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించాక ఆయన్ను తన ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తుందని, అది మోదీకి ఉపయోగపడుతుందని కొంతమంది భావించారు. అయితే రాహుల్ కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ అలాంటి పొరపాటు చేసే అవకాశం లేదు. ప్రతిపక్ష కూటమిలో లుకలుకలకు ఆస్కారమిచ్చే వాటికి కాంగ్రెస్ పాల్పడదు.

2019తో పోలిస్తే ప్రతిపక్షాలు ఐక్యం కావడం, అనైక్యతా స్వరాలు అంతగా వినిపించకపోవడం నరేంద్ర మోదీ బృందానికి కొంత ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఆయన ప్రతి సభలోనూ ప్రతిపక్షాల ఐక్యతపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రజలకు ఈ కూటమి అవినీతి, వారసత్వ పాలన, మైనారిటీల బుజ్జగింపు తెలుసునని, అందుకే వారిని వదల్చుకోవాలంటే క్విట్ ‘ఇండియా’ అంటారని ఆయన రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ప్రతిపక్షాలపై దాడి చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రతిపక్షాలను తుత్తునియలు చేసేందుకు ఆయన మరిన్ని తీవ్ర దాడులు చేస్తారనడంలో అనుమానం లేదు.

మరో వైపు నరేంద్రమోదీ ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ పార్టీలను సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశాల్లో దేశంలో అనేక పార్టీలను పోగు చేసి ఆయన ఆ పార్టీల ప్రతినిధులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇన్నాళ్లూ సమయం లేక, భద్రతా కారణాల వల్ల మాట్లాడలేదని, నిజానికి వారంతా తన మనసులోనే అనునిత్యం ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీలు అధికారంలో లేకపోయినా, పార్లమెంట్‌లో వాటికి సంఖ్యాబలం లేకపోయినా ఆ పార్టీల స్నేహాన్ని బీజేపీ వీడలేదని చెప్పారు. గతంలో బిహార్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే అధికారం అప్పజెప్పామని, తమ వారికి పదవులు కూడా కోరలేదని ఆయన గుర్తు చేశారు. వ్యక్తులకు వ్యతిరేకంగా ఎన్డీఏ వ్యవహరించదని, ఒక లక్ష్యం కోసం పనిచేస్తుందని చెప్పారు. గతంలో తానే ఎన్డీఏకు దూరంగా వెళ్లేలా చేసిన అకాలీదళ్, తెలుగుదేశం వంటి పార్టీలకు కూడా ఆయన స్నేహహస్తం అందిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన జనతాదళ్ (ఎస్) నేత దేవెగౌడతో మోదీ మంతనాలు జరిపారు. అంతే కాదు, దేశంలో కాంగ్రెస్‌తో నిమిత్తం లేని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులను కూడా ఆయన ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి తనతో చేతులు కలపలేకపోయిన పార్టీలను కూడా మోదీ సంతోషపెట్టే చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌లో కలిసిన ప్రతి ఎంపీతో ప్రేమగా మాట్లాడుతున్నారు. వారు కుటుంబ సభ్యులతో వస్తే సెల్ఫీలకు అవకాశం ఇస్తున్నారు.


2019తో పోలిస్తే 2024 ఎన్నికలు ఎంతో సంక్లిష్టంగా ఉంటాయని తెలిసినందువల్లే నరేంద్రమోదీ తనలో ఈ మార్పు తెచ్చుకున్నట్లు కనపడుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోతే ఏమి చేయాలన్న విషయంలో ఆయన సంసిద్ధమయినందుకే ఆయన ఈ రకంగా పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. మోదీ స్వభావం ఆయనకు మిత్రపక్షాలైన పార్టీలకు తెలియదా అన్నది వేరు సంగతి. అదే సమయంలో తాను పక్కన ఉంటే ప్రత్యర్థులను సులభంగా ఢీకొనగలమనే ధైర్యంతో కొన్ని పార్టీలు తన పట్ల సానుకూలంగా ఉన్నాయన్న విషయం కూడా ఆయనకు తెలియనిది కాదు. ఏమైనా రాజకీయాల్లో తక్షణ ప్రాధాన్యతలే వ్యూహాల్ని నిర్ణయిస్తాయని చెప్పక తప్పదు.

ఈ పరిణామాల రీత్యా 2024లోనైనా మోదీని గద్దెదించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. వర్తమాన భారత రాజకీయాల్లో మోదీ నిర్వహిస్తోన్న పాత్రను మనం పూర్తిగా అర్థం చేసుకోలేదని, మౌలిక స్థాయిలో మారుతున్న దేశ పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు ఇందుకు కారణమని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదురి అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను రాసిన ‘హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్’ అన్న పుస్తకం గురించి మాట్లాడుతూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నీరజ తన వృత్తి జీవితమంతా కాంగ్రెస్ రాజకీయాలతో సన్నిహితంగా గడిపారు. వీపీ సింగ్ మండలీకరణ ద్వారా ఓబీసీ సాధికారికతా క్రమం ప్రారంభించిన తర్వాత ఏ పార్టీ దాన్ని మార్చలేకపోయిందని, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు పాత్ర కల్పించింది వీపీ సింగేనని ఆమె అన్నారు. తద్వారా కాంగ్రెస్ తన జీవితకాలంలో స్వంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి కోల్పోయిందని నీరజా చౌదరి అభిప్రాయపడ్డారు. వీపీ సింగ్, వాజపేయి, నరసింహారావుల నుంచి నేర్చుకున్న విషయాలకు హిందూత్వ, జాతీయవాదం తదితర అంశాలను జోడించి మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారని ఆమె తెలిపారు. భారత రాజకీయాల్లో భావోద్వేగాల పాత్రను కూడా తక్కువ అంచనా వేయలేమని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నీవు ఊరికే ప్రధానమంత్రివి కాలేదు. ఐదు వేల మంది ప్రజలు చనిపోయినందుకే నీవు 414 సీట్లతో ప్రధానివయ్యావు. సిక్కుల ఖలిస్తాన్ డిమాండ్‌తో హిందువులు ఏకమయ్యారు’ అని రాజీవ్ గాంధీతో అరుణ్ నెహ్రూ అన్న విషయాన్ని ఆమె ఉటంకించారు.

పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని మణిపూర్ విషయంలోనో మరో విషయంలోనో ఆత్మరక్షణలో పడవేసినంత మాత్రాన ఇల్లలుకగానే పండగ చేసుకున్నట్లు ప్రతిపక్షాలు సంబరపడనక్కర్లేదు. అసలు యుద్ధం పార్లమెంట్ సమావేశాల తర్వాతే ప్రారంభమవుతుంది. రాష్ట్రాల వారీగా, అభ్యర్థుల వారీగా వ్యూహ రచన చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినకుండా మాత్రమే కాదు, తమ ఓట్లు చీలకుండా కూడా అవి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేస్తే సరిపోదు, ప్రతి సమావేశంలోనూ నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవల్సి ఉంటుంది.

ప్రతిపక్ష కూటమిలో అన్నిటికన్నా కాంగ్రెస్సే ఎక్కువగా అగ్ని పరీక్ష నెదుర్కుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందకంటే గత సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ కేవలం కాంగ్రెస్‌నే 175 సీట్లలో ఓడించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ 175 సీట్లలో ఎన్ని తిరిగి సాధించగలుగుతుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ తర్వాత సమాజ్‌వాది పార్టీని అత్యధికంగా 29 సీట్లలో ఓడించగా, ఆ తర్వాత 27 సీట్లలో బహుజన సమాజ్ పార్టీని బీజేపీ ఓడించింది. దీన్నిబట్టి ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దేశంలోని 226 సీట్లలో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో విజయం సాధించింది. వీటిలో అధిక సీట్లు ఉత్తరాదిలోనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి వ్యూహరచన ఏమిటి? అసలు మోదీ వద్ద ఏ ఆయుధాలున్నాయో, కొత్త ఆయుధాలు వేటిని ప్రయోగిస్తారో, తన మాయా యుద్ధాన్ని ఆయన ఎలా ప్రారంభిస్తారో అన్న విషయంపై విపక్షాల వారు జాగరూకులై ఉన్నారా? ముందున్నది ముసళ్ల పండగ!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-08-09T03:08:49+05:30 IST