కొత్త భవనంలోనూ పాత వాసనలే!

ABN , First Publish Date - 2023-09-20T01:42:19+05:30 IST

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్న మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ ఎందుకింత రహస్య ధోరణితో వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను...

కొత్త భవనంలోనూ పాత వాసనలే!

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్న మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ ఎందుకింత రహస్య ధోరణితో వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహించాలనుకున్నారో మంగళవారం ఆయన ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు స్పష్టంగా అర్థమైంది. కొద్ది రోజుల క్రితం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనే లేదు. నిజానికి మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై దృష్టి సారించిందని కొద్ది రోజులుగా ఉధృత ప్రచారం జరుగుతూ వచ్చింది. జమిలి ఎన్నికల గురించి అందరూ ఆలోచిస్తున్న వేళ మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో ప్రస్తావించకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ రహస్యంగా ఉంచి సమావేశాల రెండో రోజు అనుబంధ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఏమిటి? బిల్లుపై అందరి ఏకాభిప్రాయం కావాలనుకుంటున్న మోదీ ప్రభుత్వం కనీసం అఖిలపక్ష సమావేశంలోనైనా ఆ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?

నిజంగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం కోసం కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కానీ, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. శీతాకాల సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా మోదీ ప్రభుత్వానికి ఆ రెండింటికి సంబంధించిన ఘనత దక్కి ఉండేది. బహుశా ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనం పొందడం బిజెపి ఉద్దేశం కావచ్చు. లేకపోతే ఇంత హడావిడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. లేదా మరో రహస్య ఎజెండా ఈ ప్రభుత్వం ముందుండవచ్చు.

జనగణన, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ జరుగుతుందని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇంతవరకూ జనగణనను ఎందుకు ప్రారంభించలేదు? లభిస్తున్న సంకేతాలను బట్టి వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికల లోపు జనగణన చేయడం సాధ్యమయ్యే అవకాశాలు కనపడడం లేదు. భారత రిజిస్ట్రార్ జనరల్ మాటిమాటికీ జనగణనను వాయిదా వేస్తూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాస్తున్నారు. కేంద్రం కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో జనగణనకు కేటాయించిన నిధులను భారీగా తగ్గించి ఇప్పట్లో జనగణన చేసే ఉద్దేశం లేదని పరోక్షంగా ప్రకటించింది.

మరో వైపు జనగణన చేస్తే ఓబీసీల జనగణన చేయాల్సి ఉంటుందని భావించినందువల్లే బిజెపి ప్రభుత్వం కుల జనగణనను వ్యతిరేకిస్తోందని దేశ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులం ఆధారంగా జనగణన వల్ల సామాజిక, రాజకీయ భావోద్వేగాలు చెలరేగుతాయని, దాని వల్ల హిందూత్వ ఆధారిత జాతీయవాదాన్ని పెంచిపోషించాలనే బిజెపి ఎజెండా దెబ్బతింటుందని కొందరు సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. 1931లో జరిగిన కుల ఆధారిత జనగణనలో దేశంలో 52 శాతం ఓబీసీలు ఉన్నారని తేలింది. మండల్ కమిషన్ కూడా ఇదే శాతాన్ని నిర్ధారించింది. అప్పటి నుంచీ ఓబీసీలను లెక్కించే జనగణన దేశంలో జరగనే లేదు. దళితులు, ఆదివాసీల లెక్కతేలినా ఓబీసీలకు సంబంధించి జాతీయ స్థాయి డేటా ఎక్కడా లేదు. కుల జనగణన జరిగితే దేశంలో ముఖ్యంగా బిహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో సామాజిక న్యాయ రాజకీయాలకు తావిచ్చినట్లవుతుంది. వారి ఆర్థిక, విద్యాపరమైన సామాజిక వెనుకబాటుతనం, వివిధ రాష్ట్రాల్లో వారి జనాభా, న్యాయ వ్యవస్థ, విద్యారంగం, వివిధ ప్రభుత్వ సంస్థల్లో వారి వాటా గురించి చర్చ జరుగుతుంది.


బహుశా తమకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించడం వల్లనే కుల జనగణన జరగాలని ఇటీవల ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఇప్పటికే బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేను నిర్వహించింది. దీని వల్ల అణగారిన వర్గాలకు ప్రయోజనం జరుగుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఈ సర్వేను పాట్నా హైకోర్టు కూడా సమర్థించింది.

మహిళా రిజర్వేషన్ తెర ముందుకు వచ్చిన ప్రతిసారీ ఓబీసీల రిజర్వేషన్‌పై చర్చ తీవ్రతరమవుతుందని తెలిసినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ చర్చను పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. 1996లో దేవెగౌడ ప్రభుత్వ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అణగారిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఓబీసీ నేతలు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మాదిరే వెనుకబడిన కులాలకు చెందిన మహిళలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని అప్పుడు బిజెపి నేత ఉమాభారతి డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల మహిళలే అత్యధికంగా కష్టాల పాలవుతున్నారని గుర్తు చేశారు. ఈ బిల్లుపై దేవెగౌడ ప్రభుత్వం శరద్ పవార్, మమతా బెనర్జీ ప్రభృతులతో ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ కూడా ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. వాజపేయి హయాంలో కూడా ఓబీసీ నేతలు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల కేవలం అగ్రవర్ణాల మహిళలకే ప్రయోజనం జరుగుతుందని వాదించారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2010లో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది కాని లోక్‌సభలో ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును నాలుగేళ్ల వరకు యుపిఏ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టకపోవడానికి సంకీర్ణ ప్రభుత్వపు సమస్యలే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. మోదీకి ఇప్పుడు మెజారిటీ సమస్య లేదు కనుక పార్లమెంట్‌లో ఆమోదానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు.

అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీలకు సంబంధించి చర్చను మరోసారి రేకెత్తించే అవకాశాలున్నాయి. దీని వల్ల ప్రతిపక్ష కూటమిలో చీలిక తేవాలన్నదీ కూడా మోదీ ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. మమతా బెనర్జీ వంటి నేతలు కుల జనగణనను అంగీకరించడం లేదు. కుల జనగణనను అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే రోహిణీ కమిషన్ నివేదికను ఒక అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించినట్లు కనపడుతోంది. ఓబీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను బిజెపి తమ వైపునకు ఇప్పటికే తిప్పుకునేందుకు ఉత్తరాదిన చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ఓబీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని, రిజర్వేషన్లు కేవలం 10 ఓబీసీ వర్గాలకే ప్రయోజనం చేకూర్చాయని, 983 ఓబీసీ వర్గాలకు సున్నా నుంచి మూడు శాతం మేరకే ప్రయోజనం దక్కిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిణీ కమిషన్ నివేదిక ప్రతిపాదన ప్రకారం ఓబీసీల ఉపవర్గీకరణ జరిగితే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం ద్వారా వారిలో తమ బలం మరింత పెంచుకోవచ్చునని బిజెపి భావిస్తోంది.

ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే ముందు మోదీ ప్రభుత్వం జనగణన చేసినప్పటికీ కుల ఆధారిత జనగణన చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలోని 95 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 46 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని, పురుషుల కంటే ఎక్కువగా ఓటింగ్‌లో మహిళలే పాల్గొన్నారని గణాంక వివరాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలపై ‘ఇండియా టుడే– ఆక్సిస్ మై ఇండియా’ అధ్యయనం ప్రకారం, 46 శాతం మహిళా ఓటర్లు బిజెపి, మిత్రపక్షాలకు ఓటు వేయగా, యూపీఏకు 27 శాతం మహిళలు ఓట్లు వేశారని తేలింది. కనుక మహిళా రిజర్వేషన్ అమలులోకి రావడానికి మరి ఒకటి రెండేళ్లు పట్టినప్పటికీ దేశంలో మహిళల ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం దోహదం చేస్తుందని భావించవచ్చు.


దేశంలో ఎన్నికల వేడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కొత్త పార్లమెంట్ ప్రారంభమైన రోజే బిజెపి, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు ప్రారంభమయ్యాయి. భవనంతో పాటు భావనలు కూడా మారాలని, పాత వ్యవహారాలకు స్వస్తి చెప్పాలని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలకంటే అధికార పార్టీకే బాధ్యత ఎక్కువ ఉన్నదనడం అవాస్తవం కాదు. ప్రజాస్వామ్యానికి వేదిక అయిన పార్లమెంట్‌లో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నదో చెప్పకుండా రహస్యంగా ఉంచడం, రాత్రికి రాత్రి ఒక బిల్లును కేబినెట్‌లో ఆమోదించి తెల్లారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం, అన్ని నిర్ణయాలూ తానే ప్రకటించాలని ప్రధానమంత్రి ఆరాటపడడం ఆరోగ్యకరం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో గత ప్రభుత్వాలకు కూడా ఘనత ఇవ్వడంలో తప్పేముంది?

పార్లమెంట్ ప్రమాణాలు మెరుగుపడాలంటే నిర్ణయాలు పారదర్శకంగా, నలుగురితో చర్చించి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలను వివిధ మార్గాల ద్వారా అణిచివేయాలనుకోవడం కూడా మానుకోవాలి. జర్మనీలో పార్లమెంట్ భవనం రీచ్ స్టాగ్ హిట్లర్ జాతీయవాద ప్రభుత్వ చర్యలకు రబ్బర్ స్టాంప్‌గా, హిట్లర్ ప్రసంగాలకు వేదికగా ఉపయోగపడింది. మన అందమైన నూతన పార్లమెంట్ భవనానికి ఆ స్థితి పట్టదనే ఆశిద్దాం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-09-20T01:42:19+05:30 IST